ఆయుర్వేద వైద్యశాస్త్రంలోని ఎనిమిది అంగాలలో శస్త్రవైద్యమొకటి. దీనికి శల్యచికిత్స అనికూడ పేరు. ఈ శస్త్రవైద్యాన్ని ముఖ్యంగా వివరించిన గ్రంథం సుశ్రుతసంహిత. మొదట్లో బాగా ప్రచారంలోను ఆచరణలోను నున్న ఈ శల్యచికిత్స క్రమక్రమంగా వ్యవహారంలో మందగించింది. దానికి జైన బౌద్ధమతాల అహింసావాదం కారణమని కొందరు పరిశోధకుల అభిప్రాయం.
tsmagazine

-డాక్టర్‌ భాగవతము రామారావు
సుమారు రెండున్నర మూడువేల యేండ్ల క్రితం శస్త్రచికిత్స ఏ విధంగా చేసేవారని తలచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆనాటి కాల పరిస్థితుల్లో తమకు అందుబాటులోనున్న జంతువులు, వృక్షాలు ఇతర వనరులను ఉపయోగించి చికిత్స నిర్వహించేవారు. మూలికలు మొదలైనవాటి ఉపయోగం అందరెరిగినదే. శస్త్ర వైద్యంలో కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు. ఈనాటి ఆధునిక శస్త్రవైద్యులు గాయాలు మొదలైన వాటికి కుట్లు వేయవలసినపుడు ఏవో దారాలతో వేసి గాయం మానిన తర్వాత కుట్లు విప్పుతారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యులు ఇదేవిధంగా చేసేవారు. కానీ శరీరంలోపలి పేగులు మొదలైన వాటికి వేసిన కుట్లు విప్పటం ఉండదు. ఆధునిక శస్త్రవైద్యులు ఇట్టి వాటికి గొఱ్ఱెల పేగులు మొదలైన వాటితో చేసిన దారాలు వాడుతారు. అవి జీర్ణమై శరీరంలో కలిసిపోతాయి.

ఇప్పుడెన్నో కొత్తకొత్త పద్ధతులు కూడా వచ్చినవి. దీనికి ప్రాచీన శస్త్రవైద్యుల ఒక పద్దతి గండు చీమలను వాడడం. పేగులు లేక ఏదైనా శరీరంలోపలి అవయవానికి కుట్లు వేయవలసినప్పుడు దారాలకు బదులుగా గండు చీమలను వాడేవారు. నల్లటి పెద్ద గండుచీమల పట్టు ఉడుము పట్టు వలె వదలించలేనంత గట్టిగా ఉంటుంది. పల్లెటూళ్లలోని కొందరికైనా ఈ అనుభవం జరిగి ఉంటుంది. అవయవంలో కుట్లు వేయవలసిన రెండు అంచులను దగ్గరికి తెచ్చి గండు చీమను పట్టించి దాని కాయం విరిచే వారు. అతుక్కున్న భాగం కుట్లు వేసినట్లు గట్టిగా నుండి శరీరంలో జీర్ణమై కలిసిపోయేది.

పరిస్రావిణ్య ప్యేవమేవ శల్యముద్సృ త్యాంతస్రావాన్‌ సంశోధ్య
తచ్ఛిద్రమాంత్రం సమాధాయ కాలపిపీలికాభిర్దంశయేత్‌. దష్టే చ తాసాం
కాయమపహర్నే న్న శిరాంసి.
-సుశ్రుతసంహిత, చికిత్సితస్థానం, 14-17

పరిస్రావ్యుదరమునందు గూడ నిట్లే కడుపును కోసి ప్రేవులలోని శల్యము
(ప్రేవును జీల్చిన కఠిన వస్తువు)ను దీసివేసి ప్రేవునబడిన రంధ్రములను
బాగుగా శోధించి ఆయా రంధ్ర భాగములందు గండుచీమల
(కండచీమల)ను కరిపించి రంధ్రములను మూసుకొనునట్లు చేసి వాని

దిగువ భాగములను ధ్రుంచివేసి బుఱ్ఱలను మాత్రముంచి వేసి పైన
కడుపును గుట్టవలెను. (కృష్ణపిపీలికలచే గరిపించుట కందు తేనెను
కొంచెము బూసినచో బట్టును. అట్లు చీమలను బట్టించుటకు
వీలుకలుగనిచో స్నాయువులతో టాకాలను బెట్టుట కూడా చేయవచ్చును)
(వావిళ్ళ వారి ప్రచురణనుండి)

ప్రాచీనకాలంలో శస్త్ర చికిత్స బాణాలు మున్నగునవి గుచ్చుకొన్నప్పుడు వాటిని తీసి గాయాలను మాన్పటం కొరకు ఎక్కువగా వాడబడేది. శరీరభాగం కానీ ఏ వస్తువైనా శరీరంలో చేరితే అది శల్యమనబడుతుంది. ముల్లు మొదలుకొని బాణాలు మొదలైనవన్నీ శల్యములే. ఇప్పటి వాడుకలో ఫారిన్‌బాడి అన్న మాట. అందుకే శస్త్ర చికిత్స శల్య చికిత్స పర్యాయపదాలుగా వాడబడుతున్నవి. ఎముకల్లో లేక వేరే ఎక్కడైనా బాణం మొదలైన శల్యాలు గుచ్చుకొని పీకటం సాధ్యం కానప్పుడు శల్యం చివర తాడు బిగించి కట్టి దాని ఇంకొక కొనను గుఱ్ఱపు లగాంకు గాని బాగా వంచిన మామిడి వంటి కొమ్మకు గాని కట్టేవారు. తర్వాత గుఱ్ఱాన్ని అదలించడం, కొమ్మను వదలి పెట్టటం చేస్తే ఆ దూకుడుకు బాణం పైకి వచ్చేది.

అస్థివివరప్రవిష్టమస్థివిదష్టం వావగృహ్య పాదాభ్యాం యంత్రేణాహరేత్‌
అశక్యమేవం వా బలవద్భి: సుపరిగృహీతస్య యంత్రేణ గ్రాహయిత్వా
శల్యవారంగం ప్రవిభుజ్య ధనుర్గుణైర్బద్ధైకతశ్చాస్య
పంచాంగ్యాముపసంయుత ప్యాశ్వస్య వక్త్రకవికే బధ్నీయాత్‌, అథైనం
కశయా తాడయేద్యథోన్నామయన్‌ శిరో వేగేన శల్యముద్ధరతి, దృఢాం వా
వృక్షశాఖామవనమ్య తస్యాం పూర్వ వద్బద్ధ్వోద్ధరేత్‌.
– సుశ్రుతసంహిత, సూత్రస్థానం, 27-14

దానంగూడ శల్యము రానియెడల శస్త్రాదిస్వరూపముగల శల్యముయొక్క
కొనను వంచి వింటి నారియొక్క అగ్రమున కట్టి పంచాంగియను
బంధ విశేషమునందు గట్టబడిన
గుఱ్ఱముయొక్క మూతి కళ్ళెమునందు
వింటి యొక్క రెండవ కొనను కట్టవలెను. పిదప నా యశ్వంబు శిరంబు
నెత్తునపుడు అతిశీఘ్రముగ శల్యము నేరీతి నూడదీయునో ఆ రీతిని
గుఱ్ఱమును కొరడాతో కొట్టవలెను. లేక పూర్వోక్తప్రకారముగా శల్యమును
వింటి త్రాటింగట్టి చెట్టు యొక్క కొమ్మను వంచి దానంగట్టి బిఱ్ఱుగ విడిచి
శల్యము నాకర్షించవలెను. ఇచట పంచాంగి బంధమనగా నాలుగు కాళ్ళు
మూతి ఈ ఐదింటిని ఒకటితో నొకటి సంబద్ధముగ చేర్చి త్రాట గట్టుట
యని తెలియదగినది. (వావిళ్ళ వారి ప్రచురణ నుండి)

ఇట్టి ఉపాయాలెన్నో పూర్వకాలంలో వాడబడేవి. వీటితోబాటు జలగలతో చెడు రక్తాన్ని తీయడం, క్షారాలతో ధూమాలతో రోగాల మాన్పడం శస్త్ర చికిత్సలో భాగాలే. వీటిలో చాలా విధానాలు వ్యవహారంలో లుప్తం కావడం మన దురదృష్టం.

ఇట్టి పరిస్థితులలో మధ్యయుగంలో నొక శల్యచికిత్సకుడు తెలంగాణలో నున్నట్లు క్రీస్తుశకం 1034 నాటి శాసనం ద్వారా తెలిసిరావటం గర్వించదగిన విషయం. అతని పేరు అగ్గలయ్య. ఇతడు జైనమతానుయాయి. ఇతని గురించి శాసనం పేర్కొన్న వివరాలు.

శాసనశాస్త్రబృహస్పతి, కాకతీయుల చరిత్రకు అపారమైన అంశాలను వెలుగులోనికి తెచ్చిన కీర్తిశేషులు పుచ్చా పరబ్రహ్మశాస్త్రిగారే అగ్గలయ్యకు ఆవిష్కర్తలు. నేను భారతీయ వైద్యచరిత్ర సంస్థలో పని చేస్తున్నపుడు శాసనాలలోని వైద్యఆరోగ్య విషయాలను సేకరించవలెననే సంకల్పం కలిగింది. అన్ని శాసనాల గ్రంథాలను కొనే వీలు లేక వారంలో మూడు నాలుగు రోజులు రోజుకు ఒకటిరెండు గంటలు శాస్త్రిగారి అవ్యాజమైన వాత్సల్యంతో వారి ముందే కూర్చొని సుమారు నలుబదికి పైగా గ్రంథాలను పరిశీలించి వైద్యఆరోగ్య విషయాలను సేకరించటం ప్రకటించటం జరిగింది. ఆ రోజులలోనే అగ్గలయ్యను పేర్కొనే ఈ శాసనం బయట పడగా శాస్త్రిగారు నాకు దానిని గురించి తెలిపినారు. అందులో శస్త్రే శాస్త్రే చ కుశలః అనే మాటకు కొందరు వైద్యులు సైన్యంతో యుద్ధానికి వెళ్ళినట్లు శాసనాధారాలున్నవని అందువలన యుద్ధవిద్యలోను ఇతర మాటలను బట్టి వైద్యంలోను నిపుణుడని శాస్రిగారన్నారు. సైన్యం వెంట వెళ్ళిన వైద్యులు గాయపడిన సైనికులకు చికిత్స చేసేవారే కాని అందరు పోరాడే వారనే వీలు లేదు. వైద్యరత్నాకర నరవైద్య మొదలగు బిరుదులను బట్టి ఇక్కడ శస్త్రే అనగా శల్యచికిత్సానిపుణుడనటమే ఉచితమని నేను సూచించగా శాస్త్రిగారు అంగీకరించినారు.

ఈ విషయం వైద్యచరిత్రకు చాలా విలువైనది. ఆ శాసనం అప్పటికింకా పరిశీలనదశలో నుండి ప్రకటింపబడనందున నేను దానిని గురించి వ్రాసే వీలు లేదు. అందుకని వెంటబడి శాస్త్రిగారిని ఒప్పించి ఆ శాసనంపై వ్యాసం వ్రాయించి నా మాటలు కొన్ని చేర్చి నేను సంపాదకుడిగా నున్న బులెటిన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హిస్టరీ ఆఫ్‌ మెడిసిన్‌లో 1977లో మొదటిసారిగా శాసనపాఠంతో బాటు ప్రకటించటం జరిగింది.

అగ్గలయ్య జైనుడు. మంత్రితో సమానమైన హోదాతో చాళుక్య రెండవ జయసింహుని కాలంలో (1015-1042) నున్న వాడు. ఇతనికి వైద్యరత్నాకర ప్రాణాచార్య నరవైద్య అనే బిరుదులున్నట్లు పేర్కొనబడింది. రెండు జైనబసదులను నిర్మించినాడు. ఉమాతంత్రం సంగ్రహపరిచ్ఛేదం మొదలైనవాటిలో నిష్ణాతుడు. ఆలేరు దగ్గరి ముప్ప(చ్చ)నపల్లిని రెండు జైనబసదుల నిర్వహణకొరకు దానమిచ్చినాడు. అందులో నొక బసదికి అగ్గలయ్య బిరుదుతో వైద్యరత్నాకర జినాలయం అని పేరు. నరవైద్యుడైన అగ్గలయ్య ఇతర వైద్యులకు సాధ్యంకాని ఎన్నో రోగాలను కుదిర్చినాడు.

ఈ శాసనమును బట్టి జైనులు అహింసా వృత్తిని అవలంబించినా కొందరు అనుకుంటున్నట్లు శస్త్రచికిత్సను వ్యతిరేకించకపోగా రోగనివారణకు శస్త్రవైద్యాన్ని కూడ ఆచరించే వారని, తెలంగాణలో శస్త్రవైద్యం కూడ ఆచరణలో నుండేదని తెలియరావటం ముదావహం.

శాసనపాఠం

1. ఓ ని(ర్దాహా)య సతాం హితాయ విదుషాం (రోగాభిభూ)
2. తాత్మనా మారోగ్యాయ నృణాం సుఖాయ సుహృదాం తు
3. ష్టై గురూణాం సదా రక్షాయై జినశాసనస్య భిష
4. జాం శాస్త్రక్రియా సంశయాద్యుచ్ఛేదాయ చ ప
5. ద్మభూస్స(స)హజ: శ్రీవైద్యరత్నాకర: (ఓ)
6. ఆయుర్వేదవిదాం సదా పటుధియాం యే శాస్త్ర
7. కర్మక్రమే ప్రౌఢా (:) శ్రీజగదేకమల్ల
8. నృపతే.. య్యే శాస్త్రపారంగతాస్తేషాం
9. సంసది శస్త్రశాస్త్రకుశల:శ్రీ
10. వైద్యరత్నాకర: జేతా
11. వ(..ల)రగలో బు
12. ధనిధిశ్శస్త్రేణ శాస్త్రేణ వ
13. యద్యత్ర శాస్త్రాదిషు కర్మ
14. కరోతి లోక: త్వం తు ప్రవేత్సి నరవై
15. ద్యకం అగ్గలార్య(0)దివ్రం (తీవ్రం) తథాపది
16. దథాపి సుఖం విధాతుం సింహస్య తస్య చ
17. తథా మహి(మా)గణస్య అశక్యవ్యాధే(ర)
18. పి పరైర్భిషగ్భిర్వ్యాధి (ప్రకర్షే) తదు
19. పక్రమే చ. తమగ్గలార్యం పునరూమ
20. దక్షం నిరూ(దక్షం) కథయంతి దిక్షు
21. ఉమాతంత్రమాద్యం.. సంగ్రహపరిచ్ఛేద
22. క్రియాకౌశలోద్దామ ప్రథితశస్త్రశాస్త్ర
23. విషయప్రాగ(ణ్య)మరూర్జితప్ర(దం)
24. (కర్మిగ) చక్రవర్తి జయసింగ

Other Updates