తెలంగాణలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బిహెచ్‌ఇఎల్ ఈ విషయంలో మరింత వేగం పెంచాలని సీఎం కోరారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, బిహెచ్‌ఇఎల్ చైర్మన్ అతుల్ సోబ్తి, జెన్కో సిఎండి డి. ప్రభాకరరావు, ట్రాన్స్ కో ఇడి అజయ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అజ్మీరా సీతారాం నాయక్, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులతో ఢిల్లీలో ముఖ్యమంత్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మణుగూరులో 1080 మెగావాట్ల బిటిపిఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్) ను కూడా చాలా వేగంగా నిర్మించాలని చెప్పారు. దామరచర్లలో నిర్మించతలపెట్టిన 4000 మెగా వాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం పనులను కూడా ప్రారంభించి 36 నెలల్లో పూర్తి చేయాలని సీఎం చెప్పారు. కొత్తగూడెం లోని 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కాలపరిమితి వచ్చే ఏడాది ముగుస్తున్నందున అక్కడ 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నెలకొల్పడానికి సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించలేదని సీఎం గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి అంతా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే జరగాలనే నియమం పెట్టుకుని త్రికరణ శుధ్ధితో అమలు చేస్తున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిహెచ్‌ఇఎల్, జెన్‌కోలు ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలే విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రైతులకు, పేదలకు రాయితీలు అందించవచ్చన్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృఢ సంకల్పంవైపు మరో ముందడుగు పడుతున్నది. థర్మల్, సోలార్‌తోపాటు జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచాలనే లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ జెన్‌కో చేస్తున్న ప్రయత్నం ఫలిస్తున్నది. ఈ ఏడాదినుంచే పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం పూర్తిసామర్థ్యంతో పనిచేయబోతున్నది. 120 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంటు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ వర్షాకాలంలోనే పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు చేరుకోగానే ఉత్పత్తి ప్రారంభించడానికి జెన్‌కో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ ప్లాంటును జాతికి అంకితం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో జెన్‌కో సీఎండీ డి. ప్రభాకరరావు సీనియర్ అధికారులతోకలిసి పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. తుదిదశకు చేరుకున్న పనులను పరిశీలించారు. మూడో యూనిట్ రన్నర్ బిగించే పనులకు పూజలు నిర్వహించారు. పులిచింతల జలవిద్యుత్ కేంద్రం పైలాన్ నమూనాను పరిశీలించారు. సీనియర్ అధికారులతో, వర్కింగ్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. 30 మెగావాట్ల మొదటి యూనిట్ ఇప్పటికే సిద్ధంగా ఉండగా మరో 30 మెగావాట్ల రెండో యూనిట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆగస్టు నెలాఖరుకు మూడవ యూనిట్, అక్టోబర్ నెలాఖరుకు నాలుగో యూనిట్ పనులు పూర్తవుతాయి. దీంతో ఈ యేడాదే పులిచింతల ప్రాజెక్టు నూటికి నూరుశాతం పూర్తి కావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరనున్నది.
పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 32 మీటర్ల మేర నీరు చేరుకున్నదని, 42.6 మీటర్ల మేర నీరు రాగానే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తీసుకోవలసిన ముందస్తు చర్యలు, జాగ్రత్తలను సూచించారు. అక్టోబర్ 30 నాటికి మొత్తం ప్రాజెక్టు నూటికి నూరుశాతం పూర్తి చేసేవిధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. అధికారుల వారీగా బాధ్యతలను వివరించారు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.
తెలంగాణ వచ్చేనాటికి పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు. అసలు ప్లాంట్ పనులు కూడా ప్రారంభించలేదు. 2006లో ఈ ప్రాజెక్టును నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ తెలంగాణ వచ్చేనాటికి ఏ పనీ ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటివారంలోనే జరిగిన సమీక్షలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పులిచింతల ప్రాజెక్టుకు అనుబంధంగా జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని జెన్‌కోను ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు మళ్లీ సవరించిన రేట్లతో డీపీఆర్ సిద్ధంచేసి రూ. 563 కోట్ల వ్యయంతో 2015లో పనులు ప్రారంభించారు. రెండేళ్ళ రికార్డు సమయంలోనే పనులన్నీ పూర్తిచేసి ప్లాంటును జాతికి అంకితం చేయడానికి జెన్‌కో సిద్ధం అయ్యింది. పులిచింతల ప్లాంటు ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగనుండడంతో తెలంగాణలో స్థాపిత జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2442 మెగావాట్లకు చేరుకోనుంది.
పులిచింతలలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి కూడా జెన్‌కో ఏర్పాట్లు చేస్తున్నది. 90 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణానది ఒడ్డున ఈ ప్లాంటు ఏర్పాటుచేస్తున్నారు. ఈ పనులను కూడా జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు పరిశీలించారు. మొదటి దశలో 7 మెగావాట్ల ప్లాంటును ప్రారంభించాలని నిర్ణయించామని, దీనికి టెండర్లు కూడా పిలిచామని ప్రభాకర్‌రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 5వేల మెగావాట్లకుపైగా సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్లు ప్రభాకరరావు చెప్పారు. థర్మల్, సోలార్, హైడల్‌రంగాల్లో సమాంతరంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి తెలంగాణ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎండీ ప్రభాకరరావు వెంట డైరెక్టర్ వెంకట్రాజం, ఓఎస్డీ దివాకర్, ట్రాన్స్‌కో జీఎం గటిక విజయ్‌కుమార్, సీనియర్ ఇంజినీర్లు నర్సింహారావు, సురేష్ తదితరులు ఉన్నారు.
సోలార్ విద్యుత్‌లో ముందడుగు
5వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే 1758 మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేవడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ పరిస్థితిపై ప్రగతిభవన్ లో జెన్ కో సీఎండీ ప్రభాకర రావు, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావులతో సీఎం సమావేశమయ్యారు. సోలార్ విద్యుత్ పురోగతిని జెన్ కో సీఎండీ సీఎంకు వివరించారు. ఇప్పటికే రెండు వేల మెగావాట్లకు ఒప్పందాలు జరిగి, పనులు జరుగుతున్నాయని, రెండేళ్లలో మరో మూడు వేల మెగావాట్లకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.
”2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో కేవలం ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త విధానం రూపొందించింది. ఉత్పత్తి, సరఫరాలో వికేంద్రీకరణ విధానం అవలంభిస్తున్నది. సబ్ స్టేషన్ల వారీగా లోడ్‌ను గుర్తించి, ఎక్కడికక్కడ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిచ్చింది. స్థానిక సబ్ స్టేషన్లతో సోలార్ ప్లాంట్లను అనుసంధానం చేసింది. దీనివల్ల గ్రిడ్ పై ప్రభావం ఉండదు. ఈ పాలసీ ద్వారా 5వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం ప్రణాళికలు రూపొందించింది. 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికే 1758 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో వచ్చింది. రాబోయే మూడేళ్ల కాలంలో 5 వేలకు పైగా మెగావాట్లు ఉత్పత్తి చేసి, దేశంలోనే ఎక్కువ మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలుస్తుంది” అని సీఎం వెల్లడించారు. థర్మల్, జల విద్యుత్ తో పాటు సాంప్రదాయేతర ఇంధన వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం కూడా చాలా కీలకం. ఈ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని సీఎం అన్నారు