శ్రీ డా|| అయాచితం నటేశ్వరశర్మ
తెలంగాణ జనపదాలలో ‘దివిలె’ పండుగగా ప్రసిద్ధిగాంచిన దివ్వెల పండుగ దీపావళి. ఈ పండుగ వెలుగులకు నిధానం. జనుల జీవితాలలో నిరంతరం వెలుగులు కురవాలని ఆశించి జరుపుకునే ఈ పండుగకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది.
పూర్వం శ్రీకృష్ణుడు లోకకంటకుడైన నరకాసురుణ్ణి వధించి, లోకానికి పీడను తొలగించినందుకు జనులు తమ ఆనంద సూచకంగా ఈ పండుగను జరుపుకొన్నారు. అహంకారంతో బలి చక్రవర్తి యాగం చేసినప్పుడు అతని అహంకారాన్ని పోగొట్టడానికి విష్ణువు వామనావతారంతో అతణ్ణి పాతాళానికి అణచివేసిన దినంగా ఈ దీపావళి పండుగను నిర్వహించేవారు. శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించి, సీతాదేవితో రాజ్యంలో పట్టాభిషిక్తుడైన రోజు ఈ పండుగను జరుపుకొనేవారు. నరక బాధలేకుండా చేయమని యముణ్ణి గూర్చి ప్రార్థిస్తూ, దీపాలను వెలిగించే పండుగగా పాటించేవారు. విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడైన దినం ూడా ఇదే కావడం వల్ల, ఆ విధంగా ూడా ఈ పండుగను పాటించడం ఉండేది. ఇలా దీపావళి పండుగ ఎంతో చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది.
తెలంగాణ జనపదాలలో ఈ పండుగ ఐదు రోజులు జరుగుతుంది. ఆశ్వీయుజ మాసంలోని కృష్ణ త్రయోదశినాడు ధన త్రయోదశితో ప్రారంభమయ్యే ఈ దీపావళి పండుగ పరంపర కార్తీకశుద్ధ ద్వితీయనాడు యమద్వితీయతో ముగుస్తుంది.
ధనత్రయోదశి సంపదలకు మూల రూపిణి అయిన లక్ష్మీదేవిని కొలిచే పండుగ. దీనినే జనులు ధన్‌తేరస్ అని ూడా పిలుస్తారు. ఈ పవిత్ర దినాన బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరమంతా లక్ష్మీదేవి కటాక్షం లభించి, సంపదలు కురుస్తాయని విశ్వాసం. ఒక విధంగా ఈ పండుగ దీపావళికి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడం లాంటిది.
ఇక రెండవ దినమైన నరకచతుర్ధశినాడు ఉషఃకాలంలోనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగనస్నానాలు చేసి, ఇంటిలోని అక్కలూ, చెల్లెళ్లూ, ఆడపడుచుల ద్వారా మంగళహారతులను గైకొనడం ఆచారం. స్నానానికి ముందూ, స్నానానికి తరువాత ూడా ఈ మంగళహారతులను స్వీకరించే సంప్రదాయం ఉంది. సమస్త కుటుంబానికీ, క్షేమాన్నీ, భోగభాగ్యాలనూ ఆశించి ఆడపడుచులు ఇచ్చే మంగళహారతులు తమకు మంగళదాయకాలని అందరూ భావిస్తారు. మంగళహారతులు ఇచ్చిన పడుచులకు యధాశక్తిగా నూతన వస్త్రాలూ, నగలూ, డబ్బూ, కానుకలు ఇవ్వడం స్త్రీరక్షణను సూచిస్తుంది.
మూడవ దినమైన ప్రధాన పర్వదినం దీపావళి నాడు ఇళ్లూ, వాణిజ్య సముదాయాలూ మంగళతోరణాలు కట్టి ధనలక్ష్మీ పూజలను ఆచరించడం పరిపాటి. ఈ దినాన తమ ఇంటిలోని వెండి, బంగారు ఆభరణాలనూ, సంపదలను పూజించడం ద్వారా, అవి దినదిన ప్రవర్థమానం కావాలని ఆశించడం కనబడుతుంది. సాయంకాల వేళ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మహావైభవంగా పూజలు నిర్వహించడం, తీపి పదార్థాలను సేవించడం, దీపాలను వెలిగించి అభ్యుదయాన్నీ, మంగళాన్నీ ఆశించడం కనబడుతుంది. దీపావళినాడు రాత్రి అంతా వాణిజ్య సముదాయాలను తెరిచి ఉంచి, లక్ష్మీదేవి రాకకోసం నిరీక్షిస్తూ, జాగరణ చేయడం ఆనవాయితీ. టపాకాయల్ని కాలుస్తూ, తమ ఆనందాలను వ్యక్తం చేస్తారు.
దీపావళి మరుసటి రోజైన బలిపాడ్యమినాడు బలులతో ూడిన దీపాలు వెలిగిస్తారు. ఇలా చేస్తే పితృలోకాలలో ఉన్న తమ పూర్వీకులు, కీర్తి శేషులైనవారికి తృప్తి కలుగుతుందని జనుల విశ్వాసం. పితరులకు నరకబాధను తప్పించి, జ్యోతిర్మయలోకాలైన స్వర్గాదులను కలిగించాలని యముణ్ణి ప్రార్ధించడం ఇందులోని అంతరార్థం.
యమద్వితీయ నాడు అక్కలు గానీ, చెల్లెళ్లుగానీ తమ సోదరులను ఇంటికి పిలిచి షడ్రసోపేతంగా భోజనం పెట్టి, వారి ఆశీస్సులనూ, వారిచ్చే కానుకలనూ తీసుకోవడం సంప్రదాయం. దీనినే ‘భగినీ హస్త భోజనం’ అని ూడా అంటారు. తోడబుట్టిన వాళ్ల మధ్యన పరస్పరం ప్రేమలూ, సౌజన్యాలూ, వృద్ధి చెందాలనీ, ఒకరికొకరం అనే సద్భావన పెరగాలనీ కోరిచేసే పండుగ ఇది.
పాపాలను పోగొట్టుకోవడం ద్వారా నరకబాధలేకుండా, ఉత్తమ లోకాలకు వెళ్లాలని ఆశిస్తూ దీపాలతో జరుపుకునే ఈ దీపావళి పండుగ సకలజనావళికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం.