రాష్ట్రంలో గొర్రెల పెంపకం చేపట్టే 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యాదవ, కుర్మ వ్యక్తికీ గొర్రెల యూనిట్ మంజూరు చేయాలని, ఈ వర్షాకాలంలో తొలకరి జల్లులు పడిన వెంటనే గొర్రె పిల్లలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో యాదవ, కుర్మ కుటుంబాలు నాలుగు లక్షల వరకు ఉంటాయని, మరో 50 వేల కుటుంబాలు ఎక్కువయినా సరే అందరికీ గొర్రెల యూనిట్లు కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. గొర్రెల పెంపకం కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండాలని చెప్పారు. కఠిన నిబంధనల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరదని, వీలైనంత ఎక్కువ మంది లబ్ధి పొందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చెప్పారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 75 శాతం సబ్సిడీపై అడిగిన గొల్ల, కుర్మలందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టే గొర్రెల పెంపకం కార్యక్రమానికి మార్గదర్శకాలు రూపొందించడానికి ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఏప్రిల్ 6న సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, గొర్రెలు, మాంసం అభివృద్ధి సంస్థ ఎండి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చేపట్టే గొర్రెల పెంపకానికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేశారు. సరళమైన, పారదర్శకమైన నిబంధనలు రూపొందించారు.
గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే గొల్ల, కుర్మ కుటుంబానికి చెందిన 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరినీ సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలి. ఒక కుటుంబంలో ఎందరినైనా సభ్యులుగా చేర్పించవచ్చు. అవసరమైన చోట అవసరమైనన్ని కొత్త సొసైటీలు కూడా ఏర్పాటు చేస్తారు. సొసైటీల్లో చేరిన వారందరికీ గొర్రెల యూనిట్ అందిస్తారు. ఇప్పటికే గొర్లు ఉన్న వారికి కూడా మళ్లీ గొర్రెల యూనిట్ మంజూరు చేస్తారు. కుటుంబంలో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా సరే, ఆ కుటుంబంలోని ఉద్యోగి సోదరుడు లేదా తండ్రి గొర్రెల పెంపకం చేపట్టదలిస్తే అతడికి కూడా గొర్రెల యూనిట్ అందిస్తారు
ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొటేలు ఉంటాయి. ఒక్కో యూనిట్ కు లక్షా 25 వేల రూపాయల వ్యయం అవుతుంది. బ్యాంకులతో సంబంధం లేకుండానే పథకం అమలు చేయాలి. ఇందులో 25 శాతం (రూ.31,250) లబ్ధిదారుడు తన వాటా ధనంగా చెల్లించాలి. 75 శాతం (రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది
గొర్రెల పెంపక కార్యక్రమానికి నిధుల కొరత లేదు. ఎస్.సి.డి.సి. ద్వారా దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది
రాష్ట్రంలో గొల్ల, కుర్మ కుటుంబాలు నాలుగు లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇంతకు మించి ఉన్నప్పటికీ అందరికీ పథకం వర్తింప చేస్తారు. మొదటి ఏడాది సగం మందికి, వచ్చే ఏడాది మిగతా సగం మందికి యూనిట్లు మంజూరు చేస్తారు. మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రాజకీయాలతో, పైరవీలతో సంబంధం లేకుండా ఉండడం కోసం లాటరీ పద్ధతిని అవలంభిస్తారు. ఒక గ్రామంలో 60 మంది సొసైటీ సభ్యులుంటే, వారిలో మొదటి విడత 30 మంది ఎంపిక, సొసైటీ సభ్యుల సమక్షంలోనే లాటరీ తీస్తారు. లబ్ధిదారుల ఎంపికలో గానీ, గొర్రెల కొనుగోలులో గానీ గతంలో అనేక అవ కతవకలు జరిగాయి. పైరవీలకు పెద్ద పీట వేశారు. ఇప్పుడు అలా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసు కుంటారు. ఎక్కడ ఏమాత్రం అవినీతి జరిగినా సం బందీకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంది
రాష్ట్ర స్థాయిలో గొర్రెలు, మాంసం అభివృద్ధి సంస్థ ఎండి లక్ష్మారెడ్డి కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో పశుసంవర్థక శాఖ అధికారులు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మండల స్థాయిలో ఎమ్మార్వో, ఎంపిడివో, పశువుల వైద్యుడితో కూడిన త్రిసభ్య బృందం క్షేత్రస్థాయిలో పథకాన్ని నిర్వహిస్తుంది. సొసైటీల్లో కొత్త సభ్యులను చేర్పించడానికి త్వరలోనే వారోత్సవం నిర్వహిస్తారు. అధికారులే గ్రామాలకు వెళ్లి గొల్ల, కుర్మ కుటుంబాలకు చెందిన వారిని సొసైటీల్లో సభ్యులుగా చేర్పిస్తారు. ఇప్పటికే ఉన్న గొర్ల సంఖ్యను నిర్థారిస్తారు
పంపిణీ చేసే గొర్రెలను ఖచ్చితంగా పక్క రాష్ట్రం నుంచే కొనాలి. తెలంగాణలో గొర్రెలను కొనవద్దు. ఈ విష యంలో ప్రభుత్వం అత్యంత ఖచ్చితంగా వ్యవహరి స్తుంది. అధికారులు పక్క రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేయాలి. గొర్రెల రవాణా, వాటి బీమా ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతీ గొర్రెకు బీమా కల్పిస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వాటికే కాకుండా ఇప్పటికే గొల్ల, కుర్మల దగ్గరున్న గొర్రెలకు కూడా బీమా కల్పిస్తారు
వర్షాకాలంలో తొలకరి కురిసిన తర్వాత గొర్రెలు గ్రామాలకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తారు. అడవిలో మేకలకే తప్ప గొర్రెలకు నిషేధం లేదు. అడవిలో గొర్రెలను గడ్డి తినడానికి అనుమతించాలని అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 67.50 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. 25 లక్షల వరకు వ్యవసాయానికి ఉపయోగపడని భూమి (గుట్టలు, రాళ్లతో కూడినది) ఉంది. యాదవుల దగ్గర కూడా వ్యక్తిగతమైనది మరో 15 లక్షల వరకు భూమి ఉంది. మొత్తంగా గొర్రెల మేతకు ఉపయోగపడే భూమి కోటి ఎకరాల వరకు ఉంది. ఈ భూమిలో గొర్రెలకు బలవర్థకమైన గడ్డి రకం స్టైలో గ్రాస్ పెంచుతారు. మామిడితో పాటు ఇతర పండ్ల తోటల మధ్య కూడా గొర్రెలను మేపించడం, మంద పెట్టించడం అటు రైతులకు ఇటు గొర్రెల పెంపకం దారులకు పరస్పర లాభదాయకంగా ఉంటుంది. గొర్రెలు పండ్ల తోటలను పాడు చెయ్యవు. వాటి మధ్యలో గడ్డి మాత్రమే తింటాయి. గొర్రెలు తినే గడ్డి వల్ల, గొర్రెల ఎరువు వల్ల పండ్ల తోటలున్న భూములు సారవంతమవుతాయి. పెద్ద ఎత్తున సేంద్రీయ ఎరువు లభిస్తుంది. ఇది రైతులకు ఉపయోగం. ఈ విషయాన్ని అటు రైతులకు, ఇటు గొర్రెల పెంపకం దారులకు అధికారులు విడమరిచి చెప్పి పండ్ల తోటల్లో కూడా మేత మేసే అవకాశం కల్పిస్తారు
గొర్రెలు అనారోగ్యానికి గురికాకుండా, అనారోగ్యం పాలైన వాటికి మంచి వైద్యం అందించే విధంగా పశువైద్యాన్ని మెరుగుపరుస్తారు. గొర్రెలను కొనుగోలు చేసే సందర్భంలోనే వాటి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు. గొర్రెలకు నట్టల మందు ఏడాదికి మూడు సార్లు ఇస్తారు. ఇతర వ్యాక్సిన్లు కూడా కొరత లేకుండా సరఫరా చేస్తారు. గొర్రెల మంద వద్దకే వైద్యం అందుబాటులోకి వచ్చే ఏర్పాటు చేస్తారు. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేస్తారు. ప్రతీ మండలంలో పశువైద్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. ప్రస్తుతమున్న 881 మంది పశువైద్యులకు తోడు కొత్తగా 309 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సహాయక సిబ్బంది నియామకం కూడా జరుగుతున్నది. రాబోయే రెండేళ్లలోనే రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో గొర్రెలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి, దానికనుగుణంగా పశు వైద్యాన్ని బలోపేతం చేయడం చేస్తారు. గొర్రెల ఆరోగ్యం కాపాడడానికి ప్రాధాన్యం ఇస్తారు
గొర్రెల మార్కెటింగ్ కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రతీ రెండు మూడు మండలాలకొకటి చొప్పున గొర్ల అంగడి (సంత) నిర్వహిస్తారు
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకంలో ప్రావీణ్యం, అనుభవం కలిగిన గొల్ల, కుర్మలున్నారు. వారికే అవసరమైన చేయూత అందివ్వడం ద్వారా గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడతారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన మాంసాన్ని అందించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా మాంసం ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది. గొల్ల, కుర్మలు ఆర్థికంగా బాగుపడతారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది.