wellness-centreఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్యచికిత్సలు, మందులు – ప్రతి జిల్లాకో వెల్‌ నెస్‌ సెంటర్‌తో విస్తరణ

రోగంతో ఎవరైనా చనిపోవచ్చు కానీ, వైద్యం అందక ఎవరూ మరణించే పరిస్థితులు ఉండొద్దన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ లక్ష్యాలకనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ పని చేస్తున్నది. ఇప్పటికే వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, అధిక నిధులు ఇస్తూ, ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టం చేస్తున్నారు. కేసీఆర్‌ ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి. ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం ద్వారా గతంలో కంటే 20శాతం ఓపీ పెరిగింది. కార్పొరేట్‌కి తీసిపోని విధంగా ఒకే చోట రోగ నిర్ధారణ పరీక్షలు, జిల్లాకో డయాలసిస్‌, క్యాన్సర్‌ సెంటర్లు, ఐసియూలు ఏర్పాటు చేస్తూ, వసతుల పెంపు, ఆధునీకరణ, కొత్త భవనాలు ఇలా వైద్య రంగం గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతున్నది.

ఇప్పటి దాకా కొంత లోటుగా కనిపిస్తున్న ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్‌ స్కీం మీద ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ ఎస్‌) తరహాలో, కొన్ని మెరుగులు దిద్ది, తెలంగాణ రాష్ట్రం కూడా తమ ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నది. సీజీహెచ్‌ఎస్‌ లో లేని కొన్ని ప్రత్యేక వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. తమిళనాడు మినహా దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా, కంటి, పంటి వైద్య సేవలను, కార్పొరేట్‌ తరహాలో రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలను అందిస్తున్నది. వెల్‌నెస్‌ సెంటర్ల పేరుతో ఓపీ, రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, మందులు పూర్తి ఉచితంగా ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అందిస్తున్నది. ఖైరతాబాద్‌లోని ఏరియా హాస్పిటల్‌లో రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్‌ని డిసెంబర్‌ 17వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కాగా, త్వరలో వనస్థలిపురం, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఈసిఐఎల్‌, మలక్‌పేట తదితర ప్రాంతాల్లోనూ వెల్‌నెస్‌ సెంటర్లని ప్రారంభించనున్నారు. తర్వలోనే వీటిని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నది వైద్య ఆరోగ్యశాఖ.

13.40లక్షల ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు వైద్యం

ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఇజెహెచ్‌ఎస్‌) ద్వారా మొత్తం 13.40లక్షల ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు 8,73,253 మంది, పెన్షనర్ల కుటుంబ సభ్యులు 2,71,072 మంది, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు 20,424 మంది ఉన్నారు. అయితే అక్రెడిటేషన్‌ లేని జర్నలిస్టుల కుటుంబ సభ్యులు మరో 80వేల వరకు ఉండే అవకాశం ఉంది.

13 సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో ఒప్పందం

హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లోని ఎంజిఎం, ఆదిలాబాద్‌ రిమ్స్‌ వంటి హాస్పిటల్స్‌ మాత్రమే గాక, ప్రైవేట్‌ రంగంలోని 13 సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కూడా వైద్యం అందేవిధంగా చర్యలు చేపట్టింది. కార్పొరేట్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

అన్ని రకాల వైద్య చికిత్సలు వెల్‌నెస్‌ సెంటర్ల ప్రత్యేకతలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్య చికిత్సలు వెల్‌ నెస్‌ సెంటర్లలో ఉంటాయి. మెడికల్‌, సర్జికల్‌తో కలిపి, వివిధ రకాల వైద్య విభాగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అల్లోపతితో పాటు, హోమియో, ఆయుర్వేద, యోగ, యునానీ వైద్య సదుపాయలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు, జర్నలిస్టులు, వాళ్ళ కుటుంబాలకు ఏ వైద్యం అవసరమైతే ఆ వైద్యం చేయించుకునే వీలు కల్పించారు.

ఉ.8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు…

వెల్‌ నెస్‌ సెంటర్‌ ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్లు ఓపీ సేవలు అందిస్తారు.

ఒకే చోట అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు

అలాగే ఈ వెల్‌నెస్‌ సెంటర్లలో అన్ని ల్యాబరేటరీ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. మూత్ర, మల, తెమడ, రక్త వంటి పరీక్షలతోపాటుగా, డిజిటల్‌ ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌, ఈసిజీ పరీక్షలు ఇక్కడే చేస్తారు. అలాగే థైరాయిడ్‌ వంటి పరీక్షలను కూడా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ అత్యాధునిక పరికరాలతో, కార్పొరేట్‌ స్థాయి రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతాయి.

డాక్టర్లు, సిబ్బంది

ఒక్కో విభాగంలో ఇద్దరు జనరల్‌ ఫిజీషియన్స్‌, స్త్రీ వ్యాధుల నిపుణులు ఉంటారు. అలాగే ఒక డెంటల్‌ డాక్టర్‌ ఉంటారు. నలుగురు స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ఒక ఫిజియో థెరపిస్ట్‌, ఇద్దరు ఫార్మాసిస్టులు, ఈసిజి, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ఇతర టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది ఉంటారు.

ఉచితంగా పరీక్షలు, చికిత్స, మందులు

ఓపీ సహా రోగ నిర్ధారణ పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తారు. ఓపీలో చూసిన తర్వాత అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు జరుపుతారు. ఆ తర్వాత మందులు ఉచితంగా ఇస్తారు. ఒకవేళ మందులు అందుబాటులో లేకపోతే, బయట నుంచి తెప్పించి మందులు అందచేస్తారు. ఇవన్నీ ఉచితంగానే నిర్వహిస్తారు. నిమ్స్‌ తరహా టారిఫ్‌తో ఈ మందులు సరఫరా నిర్వహిస్తారు.

కంటి, పంటి పరీక్షలు

ఇప్పటి దాకా ఉద్యోగుల హెల్త్‌ స్కీంలో దేశంలో ఎక్కడా కంటి (అప్తమాలజీ), పంటి (డెంటల్‌) పరీక్షలు నిర్వహించడంలేదు. అయితే, వెల్‌నెస్‌ సెంటర్లలో మాత్రం ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాలకు కంటి, పంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందచేస్తారు.

ఫిజియో థెరపీ

వెల్‌నెస్‌ సెంటర్లలో ఫిజియో థెరపీ ప్రత్యేకత. వివిధ సమస్యలతో బాధపడే వాళ్ళు, ప్రత్యేకంగా ఆర్థో, న్యూరో, పెరాలసిస్‌ వంటి సమస్యలతో బాధపడేవాళ్ళకి ఫిజియో థెరపీ అందుబాటులో ఉంటుంది. రిటైర్డ్‌ ఉద్యోగులు, జర్నలిస్టులకి ఈ సదుపాయం అత్యంత ఆవశ్యం.

ఎమర్జెన్సీ సర్వీసులు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లోనే…

ఓపీ సేవలను ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో, అదీ గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లో అందిస్తున్నప్పటికీ, ఎమర్జెన్సీ సేవలు మాత్రం ప్రైవేట్‌ కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లోనే అందించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే పలు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ తో ఒక ఒప్పందం కుదిరింది. ఆ మేరకు ముందుగా వెల్‌నెస్‌ సెంటర్లలో సేవలు అందిస్తూనే, ప్రభుత్వ రంగంలో వీలు కానీ, అత్యవసర సేవలకు మాత్రం ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాలు కార్పొరేట్‌ వైద్యాన్ని పొందవచ్చు.

డ్రెస్‌ కోడ్‌…కార్పొరేట్‌ లుక్‌

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ తరహాలో డ్రెస్‌ కోడ్‌ని ఇక్కడ పాటించనున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి రెండు రకాల డ్రెసెస్‌ అందిస్తున్నారు. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగుల బట్టలను సిబ్బందికి వినియోగించనున్నారు. అలాగే డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా ఆప్రాన్స్‌ని సిద్ధం చేశారు. హాస్పిటల్‌ మొత్తం కార్పొరేట్‌ లుక్‌ వచ్చే విధంగా నిర్మాణం పూర్తి చేశారు.

ఆన్‌ లైన్‌ హెల్త్‌ రికార్డ్‌

ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాల హెల్త్‌ వివరాలను రికార్డు చేయాలని సంకల్పించారు. ఒకసారి వెల్‌నెస్‌ సెంటర్లకి వచ్చిన ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాలకు సంబంధించిన వ్యాధులు, ఇచ్చిన మందులు, చేసిన చికిత్స వంటి వివరాలు నమోదు చేసి, రికార్డు చేస్తారు. ఇందువల్ల ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు చికిత్సను ఎక్కడి నుంచైనా చేయించుకునే వీలు కలుగుతుంది. ఇదంతా ఆన్‌లైన్‌ చేయడం ద్వారా, వేర్వేరు చోట్లకు ఉద్యోగులు, జర్నలిస్టులకు బదిలీలు ఉంటాయి. అలాగే, వేర్వేరు చోట్ల పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో సమీప వెల్‌నెస్‌ సెంటర్ల వద్ద చికిత్స చేయించుకోవచ్చు. హెల్త్‌ రికార్డు అత్యవసర పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటుంది.

అపూర్వ స్పందన-ఏర్పాట్లపై ఉద్యోగులు, జర్నలిస్టుల సంతృప్తి

ప్రస్తుతం ఖైరతాబాద్‌ ఏరియా హాస్పిటల్‌లో ఉద్యోగులు, జర్నలిస్టుల వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాట్లపై ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆయా సంఘాల ముఖ్యులు వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాట్లను పరిశీలిం చారు. వైద్య సేవలను ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం సిఇఓ డాక్టర్‌ కల్వకుంట్ల పద్మని అడిగి తెలుసుకున్నారు. అయితే, ఈజెహెచ్‌ ఎస్‌ స్కీంకి అపూర్వ స్పందన లభిస్తున్నది. ప్రతి రోజూ వందకు పైగా పేషంట్లు సెంటర్‌లో వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు.

ముందుగా ఖైరతాబాద్‌, త్వరలో వనస్థలిపురంలో

కొద్ది రోజులుగా ఖైరతాబాద్‌ ఏరియా హాస్పిటల్‌లో వెల్‌ నెస్‌ సెంటర్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అదే పనిగా ఉద్యోగులు, జర్నలిస్టుల స్కీంపై కసరత్తు చేశారు. ఈ పథకం కోసం అనుభవం ఉన్న ఇఎస్‌ ఐ జాయింట్‌ డైరెక్టర్‌ కల్వకుంట్ల పద్మని ప్రత్యేకంగా నియమించారు. సీఎం కేసీఆర్‌ సైతం ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన అనుమతులు ఇప్పించారు.

జిల్లాలకు విస్తరణ

మొదట హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ 50 పడకల ఏరియా వైద్యశాలలో ప్రారంభిస్తున్న వెల్‌నెస్‌ సెంటర్‌ తర్వాత త్వరలో వనస్థలిపురం, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఈసిఐఎల్‌, మలక్‌పేట తదితర ప్రాంతాల్లోనూ వెల్‌నెస్‌ సెంటర్లని ప్రారంభించను న్నారు. వీటిని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నది వైద్య ఆరోగ్యశాఖ. తద్వారా జిల్లాల పరిధిలోని ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాల వారికి జిల్లాల్లోనే మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబాలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతుంది.

Other Updates