ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులను చేపట్టినపుడు ఆయా ప్రాంతాలలో నివాసమేర్పరుచుకున్న ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అలాగని ప్రభుత్వం అటువంటి పథకాలు అమలు చేయక పోతే, లక్షలాది ప్రజలకు అందే ప్రయోజనాలు అందకుండా పోతా యి. భారీ ప్రాజెక్టుల విషయంలో కలిగే కష్టాలు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మరింత ఎక్కువే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణాలకు అవసరమైన భూములను అందజేయడానికి వచ్చిన రైతులకు వందనాలు తెలపాలి. ఆయా బ్యారేజీల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై, భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు డిసెంబర్ 15న రాష్ట్ర అసెంబ్లీ హాలులో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రైతులకు అందించే నష్టపరిహారాన్ని, ఏ మాత్రం ఆలస్యం జరుగకుండా, భూముల రిజిస్ట్రేషన్ సందర్భంలోనే అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టా భూములకు ఇచ్చినట్టుగానే, అసైన్డ్ భూములకు కూడా నష్టపరిహారాన్ని అందజేయాలని అన్నారు. 31 జిల్లాలున్న ఈ రాష్ట్రంలో 15 జిల్లాల రైతాంగానికి ఈ ప్రాజెక్టు ప్రయోజనం కలిగిస్తుంది. కాబట్టి సంబంధిత రైతులకు సరైన విధంగా అవగాహన కల్పించవలసిన అవసరం వుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయా బ్యారేజీల నిర్మాణాలకోసం భూములిస్తున్న రైతుల త్యాగం వెలకట్టలేనిదని మంత్రి తెలిపారు. భూములు కోల్పోయే రైతులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని, సున్నితంగా పరిష్కరించి, రైతులపట్ల సానుభూతిగా వ్యవహరించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నిరంతరం సమాచారం సేకరించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారంటే, దీన్ని ఎంత ప్రాధాన్యతాంశంగా భావిస్తున్నారో అర్థం చేసుకుని పనిచేయాలని అధికారులకు తెలిపారు. అందుకే నీటిపారుదల, రెవిన్యూశాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుని, నిర్ణీత వ్యవధిలో భూసేకరణను పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వంతోపాటు కాంట్రాక్టు సంస్థల ప్రతిష్ఠకు సంబంధించిన అంశం, అయినందున, భూసేకరణ పూర్తయిన చోట నిర్మాణ పనులను వెంబడే చేపట్టాలని ఆయా కాంట్రాక్టు సంస్థలకు మంత్రి సూచించారు.
బ్యారేజీల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకకోసం ఆయా బ్యారేజీల సైట్ దగ్గర ఇసుక తవ్వకానికి అనుమతులు జారీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. వివిధ బ్యారేజీలకు చెందిన డ్రాయింగులు, డిజైన్లను త్వరితగతిన పూర్తిచేసి కాంట్రాక్టు సంస్థలకు ఇవ్వవలసిందిగా, నీటిపారుదల అధికారులను, జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనుల విధానాన్ని సమీక్షిస్తూ వుండాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌రావు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల కలెక్టర్లు మురళి, అలుగువర్షిణి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీఈలు ఎన్. వెంకటేశ్వర్లు, హరిరాం, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్‌ఈలు, ఈఈలు, రెవిన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.