టి. ఉడయవర్లు
పురాణాలలో చతురాసనుడు, దశకంఠుని గురించి చదివాము. సహస్రాక్షుడు, సహస్రనామాల దేవుని గురించి విన్నాము. కానీ వేయి గొంతులు ఒకే గొంతులో పలికించేవారి గురించి ఎక్కడా చదివినట్టు లేదు.
చతుషష్టికళలలో ఒకటైన స్వరవంచనలో శక్తివంచనలేకుండా కృషి చేసిన ప్రతిభావంతుడు-నేరెళ్ళ వేణుమాధవ్. ఈయన భారతీయ కళాసృజనకు ఖండఖండాలలో ఖ్యాతి సమకూర్చి ధ్వన్యనుకరణ సామ్రాజ్యానికి ఏకచ్ఛత్రాధి పత్యం వహించాడు.
త్రేతాయుగంలో రామబాణం తగిలిన బంగారు లేడి రూపంలోని మారీచుడు ‘హా లక్ష్మణా’ అంటూ శ్రీరాముని గొంతు అనుకరించినట్టు రామాయణం చెబుతున్నది.
అట్లాగే రామాయణం బాలకాండలో అహల్య వృత్తాంతంలో ఇంద్రుడు ‘కోడి’లా కూసినట్టు పేర్కొనడం జరిగింది. మహాభారతంలో భీముడు ద్రౌపదిలా అనుకరించి కీచకుణ్ణి పీచమడచిన గాథ లోకవిదితం. ఇట్లా చూస్తే-మన ప్రాచీన సాహిత్యంలో అక్కడక్కడ ధ్వన్యనుకరణ చేసినవారి దృష్టాంతాలు దొరకకపోవు.
అయితే ధ్వన్యనుకరణను కోతికష్టాల స్థాయినుంచి ఒక శాస్త్రంగా గుర్తింపు తేవడానికి అవిరళ కృషి చేసి, దానికి విశ్వవిద్యాలయ స్థాయిలో సిలబస్ వ్రాసి నృత్యానికి, గానానికి, నాటకానికి సమానమైన ప్రతిపత్తి కల్పిస్తూ ఒక వంక, ఆ కళ తామరతంపరలా ఎదగడానికి శిష్యకోటిని ప్రభావితం చేస్తూ మరోవంక తన జీవితాంతం పాటుపడిన మేటి కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్.
ప్రపంచం మొత్తంమీద అరుదైన వేయిగొంతుల వేణుమాధవ్ గొంతు ఆయన ఎనభై ఐదవయేట 2018 జూన్ 19న మూగబోయింది. ప్రభుత్వ లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడం తెలుగువారి స్వాభిమానానికి సంకేతం. ధ్వన్యనుకరణ విద్య వేణుమాధవ్‌కు జన్మతః అబ్బింది. బంగారానికి సుగంధాన్ని అద్దినట్టుగా 1917నుంచీ ఎప్పటికప్పుడు నిరంతర సాధనతో, సృజనాత్మకశక్తితో ఈ కళకు ప్రపంచవ్యాప్తంగా పెద్దపీట వేయించాడు. కేవలం ధ్వనులు, మాటలే కాకుండా స్త్రీ, పురుష గాయకులు పాడిన పాటలు పాడడం కేవలం వేణుమాధవ్‌కే స్వంతం. అందుకే దేశంలో ఆయనను ఆహ్వానించని పట్టణంలేదు. సత్కరించని సంస్థలేదు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, పశ్చిమజర్మనీ, ఆస్ట్రేలియా, లెబనాన్, మలేషియా, ఫిజీ, దక్షిణాఫ్రికా, మారిషస్ ఇత్యాది మూడు పదులపై దేశాలు మూడుసార్లు పర్యటించి ఆయాచోట్ల ఆబాలగోపాలాన్ని రంజింపజేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలను, పలుకుబడిని, ఉచ్ఛారణను ఔపోసనం పట్టి ఏ అంశం కోరితే దాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించే సమయస్ఫూర్తి, విద్వత్తు ఆయనకు ఉండడం ఒక కారణం. వినిపించిన గొంతు వినిపించకుండా వందలాది మంది ప్రముఖుల ధ్వన్యనుకరణ చేసే సామర్థ్యం ఆయనలో ఉండడం మరొక కారణం. కేవలం వ్యక్తులు, పశుపక్ష్యాదులను అనుకరించడానికే పరిమితం కాకుండా షేక్స్‌పియర్ నాటకాలలోని పలు సన్నివేశాలు, ‘బెన్‌హార్’, ‘టెన్‌కమాండ్‌మెంట్స్’, ‘మెకనాస్‌గోల్డ్’ ఇత్యాది చిత్రాలలోని టైటిల్ మ్యూజిక్‌నుంచి ఏ అంశంమైనా అనుకరించే వాగ్విలాసంవల్ల వేణుమాధవ్ ఏ దేశంలోనైనా రాణించాడు. అందుకే ఆయన ఐక్యరాజ్యసమితిలో ధ్వన్యనుకరణ చేసిన తొలి కళాకారుడైనాడు. 1932 డిసెంబర్ 28వ తేదీన నేరెళ్ళ శ్రీహరి శ్రీలక్ష్మి దంపతులకు జన్మించిన వేణుమాధవ్‌పై తండ్రి ప్రభావం ఎక్కువ. నిజానికి అనుకరణ కళలో తండ్రే ఆయన తొలిగురువు. ఎప్పుడైతే చదువు ప్రారంభించి రెండో, మూడో తరగతిలోకి వచ్చాడో అప్పుడే సినిమాలు చూడాలనే చాపల్యానికి లోనయ్యాడు. ప్రసిద్ధ నటుడు చిత్తూరు వి. నాగయ్య సినిమాలు చూసి ఆయనలాగ పాడడం, ఆయనలాగా మాట్లాడడం ప్రారంభించాడు. నాగయ్య నటించిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన చిత్రాలలో ఎక్కడ ఏ సన్నివేశం అడిగితే అది ఆసాంతం సంభాషణలు, నేపథ్య సంగీతంతో సహా అపూర్వంగా అనుకరించే నైపుణ్యం సాధించాడు. తన ఈ కృషిని పలువురు మంత్రులవద్ద ప్రదర్శించి, వారి ప్రశంసల వర్షంతో తడిసిపోయేవాడు.
ఒక ప్రక్క చదువు కొనసాగిస్తూనే ఈ నూతన కళకు వేణుమాధవ్ పాదులు వేశాడు. వాక్షుద్ధితో రససిద్ధిని కలిగించే వేణుమాధవ్ ప్రదర్శనల్లో సంక్షిప్తత ఉండేది. సరసముండేది, సమయస్ఫూర్తి ఉండేది, సృజన ఉండేది, ఎంతో కృషి ఉండేది, ‘ఈజ్’ ఉండేది. అందుకే ఆయనను ధ్వన్యనుకరణ సమ్రాట్, ధ్వన్యను కరణ చక్రవర్తి, కళాసరస్వతి, మిమిక్రీ సమ్రాట్, చుపేరుస్తుం, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ నిధి, కళాప్రవీణ, స్వర్‌కే రాజా ఇత్యాది బిరుదులను దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ప్రదానం చేయగా, కేంద్ర ప్రభుత్వం 2001లో ఆయనకు ‘పద్మశ్రీ’ ఇచ్చి గౌరవించింది. అంతకుముందే మిమిక్రీ కళకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడుగా నామినేట్ చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి సత్కరించాయి. బహుశా దేశం మొత్తంమీద ఏ కళాకారుడు అందుకోనన్ని సత్కారాలు, ప్రశంసలు వేణుమాధవ్ అందుకున్నారు.
దీనికంతటికి పిన్న వయస్సులో ఆయన ఈ కళలో చేసిన సాధనే ప్రధాన కారణం. నాగయ్య ప్రభావం ఒకవంక ఉన్నప్పటికీ దానికే పరిమితం కాకుండా ‘చంద్రహాస’ లాంటి సినిమా చూసి దుష్టబుద్ధి పాత్రను, గగ్గయ్య శిశుపాలుడుగా ‘కులమా, గోత్రమా, ఊరా, పేరా’ అయన పద్యాలు, సూరిబాబు పద్యాలు తు.చ. తప్పకుండా అనుకరించేవాడు. ఎన్.ఎస్. కృష్ణన్, టి.ఏ. మధురం హాస్యమంటే పరవశం చెందేవాడు. ఆ రోజుల్లో చిత్తూరు వి. నాగయ్య వేణుమాధవ్‌ను ఆవహించిన ఫలితంగా అనుకరణ కళను ఆయన సానపట్టి కె.ఎల్. సైగల్, ఘంటసాల, హమూద్, ముఖేష్, పి.బి. శ్రీనివాస్, సౌందర్యరాజన్, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరాలను, పి. భానుమతి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, నూర్జహాన్, సూరయ గొంతులను సాధనచేసి శ్రోతలను తన్మయుల చేశారు.
ఇక తెలుగు నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, సీయస్‌ఆర్, గుమ్మడి, జగ్గయ్య, రేలంగి, రాజబాబు, కస్తూరి శివరావు, కాంతారావు, రాజనాల, పద్మనాభం, రావుగోపాలరావు, ఇత్యాదులందరినీ అవలీలగా ఒక సంఘటన చెప్పి అనుకరించేవారు.
అంతేకాదు విశ్వనాథ సత్యనారాయణ, దాశరథి, సి. నారాయణరెడ్డి, కాళోజీ, కాటూరి, జాషువా, హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయవంటి కవుల గొంతులను వినిపించేవారు. గాంధీ, నెహ్రూ, కెనడీ, పటేల్, సుభాష్, లాల్‌బహదూర్ శాస్త్రి, రాజాజీ, జయప్రకాష్, మొరార్జీ, ఇందిరాగాంధీ, చరణ్‌సింగ్, కృష్ణమీనన్, సంజీవరెడ్డి, సంజీవయ్య, రాజీవ్‌గాంధీలాంటి జాతీయనాయకుల కంఠాలు ఉత్కంఠ రేకెత్తిస్తూ వినిపించేవారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, ఈలపాట రఘురామయ్య, అబ్బూరి వరప్రసాద్‌రావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, కన్నాంబ, రామతిలకంలాంటి అనేకమంది రంగస్థల నటుల అనుకరించి మనముందు నిలిపేవారు.
ఇక హిందీ చిత్రసీమలో పృథ్వీరాజ్‌కపూర్ మొదలు రాజ్‌కపూర్, సుమరాజ్‌మోది, బాలరాజ్ సహాని, మొహమూద్, జానీవాకర్, దిలీప్‌కుమార్, దేవానంద్, అశోక్‌కుమార్, ప్రాణ్, సునీల్‌దత్, కిషోర్‌కుమార్, నర్గీస్, శతృఘ్నసిన్హా, రాజేష్‌ఖన్నా, అమితాబచ్చన్ మొదలగు నటులందరి సంభాషణా వైచిత్రిని అనుకరించే వారు. హాలీవుడ్‌కు చెందిన సీన్‌కాన, షార్లట, హెస్టన్, యుల్‌బ్రివర్, రాబర్ట్ మిచిమ్, లారెన్స్, ఒలీవియర్, రిచర్డ్‌బర్టన్, పాల్మునీ, జాన్‌పాల్ సేథీ, గ్రెగరీపెక్, లూయీకాల్హారిన్, డేనిక్, మార్లిన్ బ్రాండ్, స్టీపాన్‌బాయ్, లారెల్, హార్దీ, విక్టర్ మేచుర్, పీటర్ వుటోల్, జేవ్స్‌ు మేసనో ప్రభృతుల గొంతులు సమ్మోహనంగా అనుకరించి శ్రోతల విస్మయపరిచేవాడు.
తనకు తెలియని భాషలోనైనా సరే-ఆ భాషలో ధ్వనించే విధంగా, ఒక్కసారి వినిపిస్తే, ఏవ్యక్తి గొంతునైనా, ఏ ధ్వనినైనా – ఇట్టే అనుకరించే పరిపూర్ణత, సునిశిత పరిశీలనా దృష్టి వేణుమాధవ్ ప్రత్యేకత.
1947నుంచి మిమిక్రీ ప్రదర్శనలిస్తూ ఆబాలగోపాలాన్ని అలరించిన వేణుమాధవ్ పద్దెనిమిది సంవత్సరాలపాటు ఉపాధ్యాయుడుగా పనిచేసి, రాజీనామాచేసి తన పూర్తికాలాన్ని ఈ కళ ప్రచారాని వినియోగించాడు.
కళాకారుడన్నవాడు అహంకారాన్ని దరిదాపులకు రానీయకుండా జాగ్రత్త పడాలని వేణుమాధవ్ శిష్యులకు పదేపదే చెప్పేవాడు. అనుకరణచేసే కళాకారుడు ప్రసిద్ధ కవులను, రచయితలను, విమర్శకులను, కళాకారులను, రాజకీయ నాయకులను బాగా పరిశీలించాలని చెప్పేవాడు. వారి పుస్తకాలను చదవాలనీ, వారి ఉపన్యాసాలు వినాలనీ, వారి అలవాట్లను, పద్ధతులను పట్టుకుని కళాకారుల కల్పన జోడించి చెప్పగలిగే సామర్థ్యం పెంచుకోవాలని సూచించేవారు. పట్టుదల, ఏకాగ్రత, అనుభవం, సమయస్ఫూర్తివల్ల ఈ విద్యను సాధించవచ్చునని, అయితే నిరంతర సాధన, నిష్ఠ అత్యంత అవసరమనేవారు. ఈ లక్షణాలన్నీ వేణుమాధవ్‌లో మూర్తీభవించి ఉన్నందునే ఆయన తారాస్థాయికి చేరారు. తాను బతికినంతకాలం ఇలా కళాకారుడుగానే బతకాలనీ, ఈ కళను చిరస్థాయిగా నిలపడానికి వందలాదిమంది శిష్యులను తయారు చేశాడు. మిమిక్రీని ఒక పాఠ్యాంశంగా రూపొందించి బోధనాంశంగా ఈ కళను తీర్చిదిద్దారు.
ఇవ్వాళ వేణుమాధవ్ శిష్యులు, ప్రశిష్యులు వేలాదిమంది తయారయ్యారు. కానీ వేణుమాధవ్‌తో సరితూగగల కళాకారుడు మాత్రం మరొకరు లేరు. తాను నేర్చుకున్నది చిటిడెంత, నేర్చుకోవలసింది ఆకాశమంత అని ఆయన ఎంతో వినమ్రంగా విన్నవించేవారు. అయినా భారత పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నమాట-‘ఓ ఇటీజ్ వండర్‌ఫుల్. దిసీజ్ ఏ రేర్ అండ్ డిఫికల్ట్ ఆర్ట్ అండ్ యూహావ్ మాస్టర్డ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ’ ప్రత్యక్షర సత్యం.