ప్రపంచ చిత్రకళారంగంలో తెలుగునేలకు వెయ్యేండ్ల పై చిలుకు చరిత్ర ఉన్నా, అజంత చిత్రకళ, దక్కన్ చిత్రకళ ఇక్కడి చిత్రకారుల నైపుణ్యానికి మచ్చుతునకలైనా, సమకాలీన ధోరణుల ప్రతిబింబించే-ఆధునిక చిత్రకళ వికాసం హైదరాబాద్ ప్రాంతంలో జరిగింది మాత్రం, సుమారు వందేండ్ల క్రితమే.ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో 1900 సంవత్సరంలో పెయింటింగ్‌లో డిప్లొమా పూర్తిచేసి, ఆధునిక చిత్రకళ అధ్యయనానికి యూరప్‌వెళ్లి అక్కడ ఉన్న చిత్రకారుల చెంత శిక్షణపొంది 1914లో హైదరాబాద్ వచ్చి స్థిరపడిన రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్ ఇక్కడ ఆధునిక చిత్రకళ ఆవిర్భావానికి కారకుడైనాడనవచ్చు. ప్రపంచ ప్రసిద్ధమైన సాలార్‌జంగ్ మ్యూజియం క్యూరేటర్‌గా ఉండి ఆయన ఎన్నో అమూల్య చిత్రాలను సేకరించడంలో, అపురూప యూరోపియన్ చిత్రాల ప్రతులు రూపొందించడంలో, సృజనాత్మక చిత్రాలు స్వయంగా గీస్తూ, తన కుమారుడు సుకుమార్ దేవాస్కర్ గీయడానికి ప్రేరేపించిన రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్, సుకుమార్ దేవ్‌స్కర్-ఇరువురు హైదరాబాద్‌లో ఆధునిక చిత్రకళకు దారులు తెరిచిన వైతాళికులుగా అభివర్ణించవచ్చు. పైగా సుకుమార్ దేవ్‌స్కర్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్‌కు రెండవ ప్రిన్సిపాల్‌గా ఉండి ఎందరో తన శిష్యులను సృజనాత్మకమైన ఆధునిక చిత్రకారులను రూపొందించారు.
రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్
రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్ పూర్వీకులు మధ్యప్రదేశ్‌కు చెందిన మహారాష్ట్రీయ బ్రాహ్మణులు. రామకృష్ణ దేవ్‌స్కర్ పాఠశాల చదువంతా అహ్మద్‌నగర్‌లో సాగింది. ఆ తర్వాత ఆయన ముంబై వెళ్లి సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో పెయింటింగ్ విభాగంలో డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం ఆధునిక చిత్రకళ అధ్యయనానికి యూరప్ వెళ్లారు. అక్కడ చిత్రకళలో తమ ముద్ర వేసిన ఉన్నత చిత్రకారుల చెంత శిక్షణ పొందారు. పది, పదిహేను సంవత్సరాలు అక్కడే ఉండి నిరంతర సాధనచేసి తాను ఒక గొప్ప చిత్రకారుడుగా రూపొందాడు. ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రముఖ చిత్రకారుడు-శశిహేష్ కుటుంబానికి చెందిన బెంగాలీ యువతి ముక్తాహేష్‌ను ఆయన పరిణయమాడారు. వారికి ఆరుగురు పిల్లలు కలిగారు. వారిలో ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె.
రామకృష్ణ వినాయక్ దేవస్కర్ అక్కడ ఉండిపోవడం ఇష్టంలేక, భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుని కళలకు, కళాకారులకు నిలయమైన హైదరాబాద్‌కు వచ్చారు. ప్రతాపగిరి కోఠిలో ఉండేవారు. పెయింటింగ్ స్టూడియో, ఫొటో స్టూడియో పెట్టాడు. కళలంటే అభిమానించే రాజా ధన్‌రాజ్‌గిర్‌ను కలుసుకున్నాడు. రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్ వేసే చిత్రాలకు ధన్‌రాజ్‌గిరి ముగ్ధుడైనాడు. వారివద్దకు నిజాం కుటుంబీకులు కూడా వచ్చేవారు. అట్లా వారి చిత్రాలు గీసే అవకాశం కూడా ఆయనకు లభించింది. దనరాజ్‌గిరి ఒక రోజు నవాబ్ సాలార్‌జంగ్ బహద్దూర్ అనే పేరుతో నలుగురికీ తెలిసిన మూడో సాలార్‌జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్‌ను పరిచయం చేశారు. అది వారి జీవితకాల బంధమైపోయింది. రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్‌లోని కళాభిజ్ఞతను మెచ్చిన సాలార్‌జంగ్ ఆయనకు ప్రియమిత్రడయ్యాడు. తాను నెలకొల్ప సంకల్పించిన మ్యూజియంకు రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్‌ను చిత్రాల సేకరణకు పురికొల్పాడు. ఇక ఇరువురు కలిసి లేదా తానొక్కడే ప్రపంచవ్యాప్తంగా దేశదేశాలు తిరిగి ఈనాటి సాలార్‌జంగ్ మ్యూజియంకు కావలసిన అమూల్య కళాఖండాలను సేకరించారు. ఈయనే మ్యూజియంకు తొలి క్యూరేటర్ కూడా.
కళాత్మక దృష్టితో తాను సేకరించిన కళాఖండాలను ప్రజలకోసం ప్రదర్శించాలనే కోరిక తీరకుండానే మూడో సాలార్‌జంగ్ కన్నుమూశాడు. ఆయన నివాస మందిరం-దివాన్ దేవిడిలో వెనకటి హైదరాబాద్ పితృత్వం ఈనాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘సాలార్‌జంగ్ మ్యూజియం’ను 1951 డిసెంబర్ 16న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేత ప్రారంభించారు. తిరిగి 1968 జూలై 24న ప్రస్తుతం మ్యూజియం ఉన్న చోట అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ కొత్త భవనాలు ప్రారంభించారు. ఈ మ్యూజియంలోని వస్తు సముదాయాన్ని జాతీయం చేస్తూ భారత ప్రభుత్వం 1958 డిసెంబర్ 2న జాతీయ ప్రాధాన్యంగల సంస్థగా గుర్తించింది. ప్రపంచాన్ని వెర్రెక్కించే కళాఖండాలుగల ఈ మ్యూజియం నిర్వహణ వ్యవహారాలు చూడడానికి రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ పార్లమెంటు 1961లో ఒక శాసనం చేసింది.
1951లో సాలార్‌జంగ్ మ్యూజియం ప్రారంభించినా, అప్పటికి ఎన్నో సంవత్సరాలు ముందుగానే రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్ నేతృత్వంలో కళాఖండాలు సేకరించడం ప్రారంభించారు. ఇవ్వాళ్ళ సాలార్‌జంగ్ మ్యూజియంను కళలకు కాణాచిగా అభివర్ణిస్తున్నారంటే, దీని వెనక దేవస్కర్ శ్రమ ఎంతో చెప్పకనే తెలుస్తున్నది. ఆయన వీనస్‌లాంటి సుప్రసిద్ధ చిత్రకారులు అనేక అపురూప చిత్రాల ప్రతులు సిద్ధం చేయడంతోపాటుగా ఎందరో రాజులు, రాణులు, ఎన్నో చిత్రాలను నిరంతరం వేశాడు. వ్యక్తుల తైలవర్ణచిత్రాలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. మ్యూజియంలో సాలార్‌జంగ్ చిత్రాన్ని వేసిందీ ఆయనే. ప్రకృతి చిత్రాలు ఇతర చిత్రాలు కూడా అవసరానికి ఆయన ఎన్నో గీశాడు. తొలినాళ్ళలో మరాఠీ నాటక కంపెనీలకు తెరలు చిత్రించడంలోని మెళకువలు ఆయన వాడే వర్ణాలు, గౌస్ గీతలు, అనుభూతుల వ్యక్తీకరణలో వెల్లడయ్యేవి. ఆయన తుదిశ్వాస విడిచేదాకా సాలార్‌జంగ్ మ్యూజియం వెలసిన చోటగల క్వార్టర్స్‌లోనే కాపురముండేవారు. ఆయన తన ఎనభై తొమ్మిదేళ్ళ ప్రాయంలో 1958లో కన్నుమూశారు. వారు గీసిన చిత్రాలు కేవలం సాలార్‌జంగ్ మ్యూజియంలోనేకాకుండా చౌమొహల్లా ప్యాలెస్, కొందరి నిజాం కుటుంబీకుల చెంత, ముంబై, లండన్, యూరప్ దేశాల్లోని మరికొందరి కళాభిమానుల చెంత ఉన్నాయి.
సుకుమార్ దేవ్‌స్కర్
సుకుమార్ దేవ్‌స్కర్ 1912 ఫిబ్రవరి 12న పారిస్‌లో పుట్టాడు. తండ్రి రామకృష్ణ దేవ్‌స్కర్ హైదరాబాదుకు వచ్చి స్థిరపడడంతో ఆయన సెయింట్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్ తన కుమారుడు తనను మించిన చిత్రకారుడిని చేయాలనే కాంక్షతో శాంతినికేతనం పంపించాడు. గురుదేవులు-రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రధానంగా నందన్‌లాల్ బోస్ శిక్షణలో పెయింటింగ్- మ్యూజిక్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తర్వాత యూరప్‌వెళ్ళి దాదాపు పదకొండేండ్లపాటు జర్మనీ తదితర దేశాల్లో ఉండి ఫ్రాన్స్, ఇటలీ, రోమ్, లండన్ చిత్రకళారీతుల్లో తలపండిన ఆధునిక చిత్రకారులవద్ద చిత్రకళ అధ్యయనం చేశాడు. తనకంటూ ఒకానొక ‘సుకుమార శైలి’ని రూపొందించు కున్నాడు. తన ఇరవై ఎనిమిదోయేట తిరిగి సుకుమార్ భారత దేశానికి వచ్చాడు. హైదరాబాద్‌లో తన తండ్రి రామకృష్ణ వామన్ దేవ్‌స్కర్‌తోకూడి ఎన్నో చిత్రాలు గీశాడు. ఈయన వేసిన దర్షార్ చిత్రాలు ఇప్పటికీ జూబ్లీహాల్‌లో ఉన్నాయి. ఇంకా వీరు నిత్య జీవిత సంఘటనలపై వేసిన అనేక చిత్రాలు ప్రభుత్వ మ్యూజియంలు, కళాభిమానులైనవారి వద్ద ఉన్నాయి. జానపద, పౌరాణిక, సామాజిక అంశాలు తీసుకుని సుకుమార్ బోలెడు చిత్రాలు గీశాడు. కుడ్య చిత్రాలు వేయడంలోనూ ఈయన అసాధ్యుడు.
సుకుమార్ తండ్రివలె బెంగాలీ అమ్మాయి రయోలాకుందును వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు. పెద్ద కుమారుడు పానీయ్ ఐపీయస్ అధికారిగా, పెద్ద కూతురు కవిత జేఎన్టీయూలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. రెండో కుమారుడు వీరచక్ర విక్రం లెఫ్ట్‌నెంట్ కర్నల్‌గా వీరమరణం పొందాడు. రెండో కూతురు రిషిక రాష్ట్రస్థాయి క్రీడాకారిణి, మూడో కూతురు సుజాత టేబుల్ టెన్నిస్‌లో జాతీయస్థాయి క్రీడాకారిణి.
సుకుమార్ తండ్రిలాగే వ్యక్తుల చిత్రాలు గీయడంలో ఆరితేరిన ఆధునిక చిత్రకారుడు. ఆయన స్వీయ చిత్రం, కూతురు చిత్రం గీసిన తీరు ఆయన పనితనానికి పరాకాష్ఠ. రోజువారి జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను తీసుకుని ఆయన అనేక చిత్రాలు అపురూపంగా వేశాడు. తన చిత్రాల ప్రదర్శనలేకాకుండా సమకాలీన చిత్రకారులు, తన శిష్యులువేసిన చిత్రాల సంచార ప్రదర్శనలు ఏర్పాటు చేసి కళాకారులను ఎంతగానో ప్రోత్సహించేవాడు. కేవలం తైలవర్ణ చిత్రాలేకాకుండా, నీటివర్ణ చిత్రాలు సైతం ఆయన వేసేవాడు. జర్మనీలో (1932), స్పెయిన్‌లో (1933), సుకుమార్ నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలు ఆదునిక భావాలుగల చిత్రకారుడుగా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌కు సయ్యద్ అహ్మద్ తొలి ప్రిన్సిపాల్. రెండో ప్రిన్సిపాల్ విదేశాల్లో ఆధునిక చిత్రకళ అధ్యయనం చేసి వచ్చిన సృజనాత్మక యువ చిత్రకారుడు-సుకుమార్ దేవ్‌స్కర్. ఈయన ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడే ఆ లలితకళల కళాశాలలో వాస్తుశిల్పం డిప్లొమాకూడా ప్రవేశపెట్టారు.
క్రికెట్ ఆటంటే సుకుమార్‌కు ఎంతో ఇష్టం. 1952 అక్టోబర్ 2న తన సలభయ్యో ఏటనే సుకుమార్ క్రికెట్ ఆట ఆడుతూనే ఆకస్మికంగా కన్ను మూశారు. ఆరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కు క్రికెట్ మ్యాచ్ ‘నువ్వా.. నేనా” అన్నంత పోటాపోటీగా జరుగుతున్నది. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌ను గెలిపిం చడానికి స్వయంగా ప్రిన్సిపాల్ సుకుమార్ దేవ్‌స్కర్ బ్యాటింగ్‌లోకి దిగాడు. బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. అదేమి దురదృష్టమోగాని బ్యాటింగ్ చేసిన సుకుమార్ ఆ గ్రౌండ్‌లోనే ఆకస్మికంగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. అక్కడే ఆ రోజు చిత్రకారులు- వాసుదేవ కపట్రాల్, అంజయ్య, ఎం.ఎస్. దాతర్ తదితరులు ఉండి తమ గురువు తుదిశ్వాస విడవడంచూసి ఎంతగానో కలత చెందారు.
సుకుమార్ దేవ్‌స్కర్ కళలను అభిమానించే ధనరాజ్‌గిరి ప్యాలెస్‌లో, జ్ఞాన్‌బాగ్‌లో నివాసముండేవారు. తన శిష్యులను ఎంతో ఇష్టంతో కష్టమైన రీతులను బోధించేవారు. వారివద్ద శిక్షణ పొందిన ప్రముఖ చిత్రకారులలో సయ్యద్‌బిన్ మహ్మద్, కొండపల్లి శేషగిరిరావు, గోపాల్‌రాజ్ భుటా ప్రభృతులు ఆ తర్వాతికాలంలో మార్గనిర్దేశకులయ్యారు.
టి. ఉడయవర్లు