hospitalతెలంగాణ సీఎం కేసీఆర్‌ నిరంతర మేధో మథనం కార్యరూపం దాల్చ నుంది. వైద్యశాలల వ్యవస్థీకరణకు నడుం బిగించింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. వేటికవే వేర్వేరుగా నడుస్తున్న వివిధ వైద్య విభాగాల మధ్య సమన్వయం సాధించే దిశగా ఆలోచిస్తున్నది. టీచింగ్‌ వైద్యకళాశాలల పరిధిలోకి జిల్లాలోని 50 కి.మీ. దూరంలో ఉన్న మొత్తం ఆసుపత్రుల్ని తేవాలని భావిస్తున్నది. ఇందుకు మోడల్‌గా వరంగల్‌లోని టీచింగ్‌, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఎంజిఎంని తీసుకోవాలని చూస్తున్నది. వరంగల్‌ ఎంజిఎం వైద్యశాలలో ఆ జిల్లా కలెక్టర్‌ కరుణ, డాక్టర్లు, జిల్లా అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి జరిపిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూత్రప్రాయ ఆలోచన జరిగింది.

పాత చింతకాయ పచ్చడిలా, చాలా కాలంగా వేర్వేరు తలలుగా, వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ గొడుగు కింద పని చేస్తున్న దవాఖానాల మధ్య సమన్వయం కుదరడంలేదు. ఆయా విభాగాల అధిపతుల నుంచి ప్రాథమిక స్థాయి వైద్యశాలల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. దీన్నుంచి వైద్యశాఖని గట్టెక్కించడమే గాక, ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడుతున్న పేదలందరికీ సకాలంలో సరైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ద్వారా ఉమ్మడి ఖర్చులు తగ్గుతాయి. పరికరాల కొనుగోలు, సదుపాయాలు, పరీక్షలు, మందులు వంటి వాటి విషయంలోనూ సమన్వయం సాధ్యమవుతుంది. అందుకని టీచింగ్‌ ఆసుపత్రుల పరిధిలోకి, జిల్లాలోని కనీసం సమీప ఆసుపత్రుల్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి సమన్వయం చేయడం ద్వారా ఆయా ఒకటి, రెండు ఆసుపత్రుల మీద పడుతున్న భారాన్ని తగ్గించడమేగాక, పెద్దగా పనిలేకుండా పోతున్న మిగతా వైద్యశాలలకు కూడా పని కల్పించవచ్చు. అలాగే రోగులు చిన్నా, పెద్ద సమస్యలకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలలకు చేరుకునే లోగా కొన్ని సందర్భాలలో ప్రాణనష్టం కూడా జరుగుతున్నది. వీటిని నివారించడానికి స్థానికంగా వైద్యశాలల్లో సరైన సదుపాయాలు కల్పించి, అభివృద్ధి పరచి, మంచి వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలవుతుంది. ఆ విధంగా అన్ని దవాఖానాలను పూర్తి స్థాయి సదుపాయాలతో, ఖరీదైన వైద్యాన్ని సమీపంలోకి తెచ్చి చికిత్స చేయడానికి వీలవుతుందని వైద్యశాఖ భావిస్తున్నది.

సమన్వయం ఇలా
ఉదాహరణకు వరంగల్‌ ఎంజిఎం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం వంటి నాలుగైదు జిల్లాలకు అత్యాధునిక, అత్యవసర, సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తున్నది. దీంతో ఆ ఆసుపత్రులపై భారం పడుతున్నది. అయితే, తాజా ఆలోచనల మేరకు… ఎంజిఎం కిందకు జిల్లాలోని ఏరియా, జిల్లా ఆసుపత్రులను తీసుకవస్తారు. దీంతో ఎంజిఎంకి 50 కి.మీ. దూరంలో ఉన్న ములుగు, 35 కి.మీ. దూరంలో ఉన్న నర్సంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఎంజిఎం పరిధిలోకి వస్తాయి. ఆ సామాజిక కేంద్రాల పరిధిలో 18 కి.మీ. నుంచి 36కి.మీ. దూరంలో ఉన్న గణపురం, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, పస్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 25కి.మీ. లోపు దూరంలో 31 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ఈ మొత్తం ఆరోగ్య కేంద్రాలు 24వేల గృహాలను 97 వేల జనాభాని సంభాలిస్తున్నాయి. ఇవన్నీ ఒకే గొడుగు కిందకు తేవడం, సమన్వయం చేయడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. అంటే డిఎం అండ్‌ హెచ్‌ ఓ పరిధిలోని పిహెచ్‌సిలు, డిసిహెచ్‌ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఎంజిఎం లాంటి టీచింగ్‌ ఆసుపత్రులు అన్నీ సమన్వయం అవుతాయి. ఈ ముగ్గురు అధికారులు మొత్తం ఆసుపత్రుల పరిపాలనా వ్యవహారాలను చూసే విధంగా చేస్తారు.

భారం ఇలా తగ్గుతుంది
ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగైదు జిల్లాలతోపాటు ఎమర్జెన్సీ, యాక్సిడెంట్‌ వంటి కేసులతోపాటు దీర్ఘ కాలిక, ప్రాణాంతక, స్వల్ప కాలిక అన్ని రకాల రోగులు నేరుగా ఆధునిక వైద్య సదుపాయాలున్న ఎంజిఎం లాంటి సూపర్‌ స్పెషాలిటీ, టీచింగ్‌ ఆసుపత్రులకే వస్తున్నారు. దీంతో పని భారం మొత్తం ఎంజిఎం లాంటి దవాఖానాల మీద పడుతున్నది. తాజా ఆలోచన ప్రకారం ఆయా దవాఖానాలను సమన్వయం చేయడం వల్ల, ఎంజిఎం నుంచి సబ్‌ సెంటర్‌ వరకు చైన్‌ సిస్టంలో లింక్‌ ఉంటుంది. స్థానికంగా సబ్‌ సెంటర్లో నయం కాని రోగులు, ఆ పైన పిహెచ్‌సికి, అక్కడ సాధ్యం కాకపోతేనే, సిహెచ్‌సిలకు, అక్కడా నయం కాకపోతే ఎంజిఎం లాంటి ఆసుపత్రికి రోగులను తరలిస్తారు. దీంతో క్రమేణా రోగులు కూడా ఈ అంచెల పద్ధతికి అలవాటు పడతారు.

మిగతా ఆసుపత్రులకు పని…
నేరుగా ఒకటి, రెండు ఆసుపత్రులకు పని భారం ఉండగా, మరికొన్ని ఆసుపత్రులకి అంతగా పని ఉండటం లేదు. అందుకని ఈ సమన్వయం ద్వారా అన్ని ఆసుపత్రులలో పని పెరుగుతుంది. ఆయా డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండటం వల్ల రోగులు, రోగులు వస్తుండటం వల్ల సిబ్బంది పనితీరు మెరుగవుతుంది.

అన్ని దవాఖానాల ఆధునీకరణ అభివృద్ధి
తద్వారా అన్ని దవాఖానాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. సబ్‌ సెంటర్‌ నుంచి టీచింగ్‌ హాస్పిటల్‌ వరకు స్థాయిని బట్టి పరికరాలు, వసతులు, డాక్టర్లు, సిబ్బంది, సదుపాయాల కల్పన చేయడానికి వీలవుతుంది.

తగ్గనున్న ఖర్చులు
ఇప్పుడు ఏ శాఖకు ఆ శాఖల వారీగా పని చేయడం వల్ల కొంత ఇమ్మడి ఖర్చులు తప్పడం లేదు. తాజా సమన్వయం ద్వారా ఆ ఖర్చులను తగ్గించవచ్చు. లేదా లేకుండా చేయవచ్చు. ఎక్కడికక్కడ పరికరాలు, సిబ్బంది, ఆధునీకరణ వంటి అన్ని అంశాల్లోనూ ఓ పరిమితి, పద్ధతుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. బడ్జెట్‌ను కూడా సాధ్యమైన మేరకు మదింపు, అదుపు చేసుకునే వీలు కూడా ఉంటుంది.

సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ తో మరింత మెరుగైన వైద్యం
ఎక్కడికక్కడ రోగుల వ్యాధి తీవ్రతలను బట్టి విభజన, పని విభజన జరుగుతుంది. దీంతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ మీద భారం తగ్గించవచ్చు. మంచాల, మందుల కొరత, వెంటిలేటర్లు దొరకకపోవడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్లలో సదుపాయాలు పెంచుతున్నప్పటికీ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. మరోవైపు కింది స్థాయి ఆసుపత్రులలో కొన్ని చోట్ల ఖాళీగా బెడ్లుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ఇది ఒక మార్గంగా భావిస్తున్నది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.

మెడల్‌గా వరంగల్‌ ఎంజిఎం
ప్రస్తుతం వైద్యశాఖలో హైదరాబాదోలోని నిమ్స్‌, ఎంజిఎంలు మంచి వైద్య సేవలను అందిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఎంజిఎంని తాజా సమన్వయానికి మోడల్‌గా తీసుకుని, తర్వాత ఈ ప్రయోగాన్ని విజయవంతంగా మిగతా జిల్లాలకు విస్తరించాలని భావిస్తున్నారు తెలంగాణ వైద్య మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి. టీచింగ్‌ ఆసుపత్రులుగా ఉన్న ఎంజిఎంని, మిగతా ఆసుపత్రులను కూడా ఆధునీకరించి, మంచి సదుపాయాలు కల్పించి, ఈ మోడల్‌ని అమలు చేయాలన్నది సంకల్పం. ఈ విషయాలపై వరంగల్‌ ఎంజిఎం హాస్పిటల్లో జరిగిన సమీక్ష అర్థవంతంగా ముగిసింది. ఈ సమీక్షలో పాల్గొన్న అధికా రులు, డాక్టర్లు కూడా వివిధ విభాగాల సమన్వయానికే మొగ్గు చూపడం శుభసూచకం.

సీఎం కే.సీ.ఆర్‌ ఆలోచనల మేరకు వైద్యశాఖ పని చేయాలనీ, ప్రజా వైద్యం మీద దృష్టి పెట్టాలని వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు మంత్రి లక్ష్మారెడ్డి.

Other Updates