కేసీఆర్ కిట్స్ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై సీఎం సంతకం చేశారు. ప్రగతిభవన్‌లో వైద్య,ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారి, కమిషనర్ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, హెల్త్ అండ్ ఫామిలీ వెల్‌ఫేర్ డైరెక్టర్ లలితకుమారి, మెడికల్ సర్వీసెస్ ఎండి వేణుగోపాలరావు తదితరులు పాల్గొ న్నారు. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజలకు ఎంతో నమ్మకం ఏర్పడిందని, ప్రభుత్వ వైద్యులపై గౌరవం పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవ డానికి వైద్యఆరోగ్య శాఖ మరింత క్రియాశీలకంగా పనిచేయాలని వైద్యులకు పిలుపునిచ్చారు. వైద్య శాఖకు ప్రభుత్వం అవసరమైన చేయూతనిస్తుందని సీఎం ప్రకటించారు. రాబోయే కాలంలో తెలంగాణలో ప్రజావైద్యం ఎలా ఉండాలనే విషయంలో అధికారులు హెల్త్ మ్యాప్ రూపొందించాలని సీఎం కోరారు.
”కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిభారం పెరిగింది. పి.హెచ్.సి. నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ప్రతీ చోటా పేషంట్ల సంఖ్య పెరుగుతున్నది. కేటాయించిన బెడ్లకన్నా ఎక్కువ సంఖ్యలో పేషెంట్లు వస్తున్నా సరే, పేదలకు వైద్య సేవలు అందించాలనే మంచి
ఉద్దేశ్యంతో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. చాలా మంది ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు.వారి సేవలు శ్లాఘనీయం. ప్రజలు వైద్యుల సేవలను కొనియాడు తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనితీరు మారింది. వైద్యులకు, సిబ్బందికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి” అని ముఖ్యమంత్రి అన్నారు.
”కేసీఆర్ కిట్స్ బహుళ ప్రయోజనాలు అందిస్తున్నది. పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులకే రావడం వల్ల అనవసర ఆపరేషన్ల గండం నుంచి బయటపడుతున్నారు. నిరంతరం ఆసుపత్రికి వచ్చి చెక్ చేసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఫలితంగా ఆరోగ్యవంతమైన మరో తరం (జనరేషన్) వస్తున్నది. పేదలకు ప్రసూతి సందర్భంగా అయ్యే ఖర్చు తప్పడమే కాకుండా, తిరిగి ప్రభుత్వమే రూ.15వేల దాకా ప్రోత్సాహకం అందిస్తున్నది. పేదలు ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. గర్భవతులు ముందే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవడం, ప్రసూతి చేయించుకోవడంవల్ల మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసీఆర్ కిట్స్ వల్ల పెరిగిన పేషెంట్ల రద్దీకి తగినట్లుగా వసతులు కూడా పెంచాలి. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోవాలి. వైద్యఆరోగ్య శాఖకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలి” అని సీఎం చెప్పారు.
”ఆదిలాబాద్ తో పాటు ఇతర ఏజన్సీలలో ప్రతీ ఏడాది వర్షాకాలంలో అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలి అనేక మంది చనిపోయేవారు. కానీ ఈసారి వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమాల వల్ల అంటు వ్యాధులు, జ్వరాలు బాగా తగ్గాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు వచ్చినా తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉంది. ఇది వైద్యుల పనితీరుకు నిదర్శనం. ఇలాంటి విజయాలెన్నో తెలంగాణ వైద్యులు సాధించారు” అని సీఎం ప్రశంసించారు.
వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి సీఎం తీసుకున్న నిర్ణయాలు:
ఎక్కువ పనిభారాన్ని మోస్తూ, పేదలకు వైద్యం అందిస్తున్న వైద్యులను ప్రోత్సహించడానికి నగదు ప్రోత్సాహకం అందించే ఫైలుపై సీఎం సంతకం చేశారు
అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏండ్లకు పెంచే అవకాశాలు పరిశీలించాలి
ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేటతో పాటు కొత్తగా ఏర్పడే నల్లగొండ, సూర్యాపేట లోని సెమీ అటానమస్ హోదా కలిగిన మెడికల్ కాలేజీల్లో టీచింగ్ డాక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచే ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారు
నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో మెడికల్ కాలేజీల స్థాపనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో వసతులు కల్పించాలి
అర్హులైన వైద్యులకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటవెంటనే పదోన్నతులు కల్పించాలి
ఏజన్సీ, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు స్థానికంగానే ఉండాలనే నిబంధనను సడలించాలి. వారు సమీప పట్టణాల్లో ఉండేందుకు అనుమతించాలి
పాడుపడిన, శిథిలమైన ఆసుపత్రి భవనాల స్థానంలో దశల వారీగా కొత్త భవనాలు నిర్మించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలి.
ఆసుపత్రి భవనంతో పాటు డాక్టర్లు, సిబ్బంది నివాసం ఉండడానికి క్వార్టర్లు కూడా నిర్మించాలి
పెద్దాసుపత్రుల వద్ద పేషెంట్ల బంధువుల కోసం షెల్టర్లు నిర్మించాలి. వాటిలో కనీస వసతులు కల్పించాలి
నగరంలో పెరుగుతున్న జనాభా, వచ్చిపోయే జనాభాను పరిగణనలోకి తీసుకుని నిమ్స్ తరహాలో హైదరాబాద్ ఓఆర్‌ఆర్ వెంట మరో రెండు పెద్దాసుపత్రులు నిర్మించాలి. వరంగల్ దారిలోని బీబీనగర్ లో ఎయిమ్స్ వస్తున్నందున, అటువైపు కాకుండా మిగతా రెండు ప్రాంతాల్లో వీటి కోసం స్థలం సేకరించాలి. ఈ ఆసుపత్రుల్లో భాగంగానే ప్రసూతి వైద్యశాలలు నిర్మించాలి
ప్రభుత్వ ఆసుపత్రులు, భవనాలు, స్థలాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా రూపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్యఆరోగ్య శాఖ పథకాలను అధ్యయనం చేసి, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధానం అమలు చేయాలి
రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రులకు ప్రభుత్వం కొత్తగా 4,540 పోస్టులు మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుత వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా 3,900 పోస్టులు అవసరం కాగా, అప్ గ్రేడ్ చేసిన 13 ఏరియా ఆసుపత్రుల్లో మరో 640 పోస్టులు అవసరమని అధికారులు సీఎంకు నివేదించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని పెంచాల్సి ఉన్నందున వెంటనే ఈ నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.