tsmagazineకేసీఆర్‌ కిట్స్‌ పథకం అమలు చేయడంవల్ల, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చడంవల్ల ప్రజలకు ప్రజావైద్యంపై ఎంతో నమ్మకం కుదిరిందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో ఇకపై వైద్య ఆరోగ్యశాఖకు మరిన్ని నిధులు కూడా అవసరం అవుతాయన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా అంచనాకు వచ్చి బడ్జెట్‌లో నిధులకోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 2018-19 బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు ఎక్కువ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని, ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పేద ప్రజలకు అత్యవసరమయిన వైద్యం, విద్య కోసమే అధిక నిధులు కేటాయిస్తాయమని ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెక్లెస్‌రోడ్‌లో 102 వాహనాలను ప్రారంభించారు. అనంతరం గజ్వేల్‌ నియోజకవర్గం లోని తూప్రాన్‌లో 50 పడకల ఆసుపత్రిని పరిశీ లించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ వాకాటి కరుణ, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్‌, సిద్ధిపేట కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం మాట్లాడారు.

”గతంలో ప్రజా వైద్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డబ్బులున్న వారు తమకు నచ్చిన పెద్దాసు పత్రుల్లో వైద్యం చేయించుకోగలరు. కానీ పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే పెద్ద దిక్కు. కాబట్టి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని, వారికి మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అన్నిరకాల వైద్యశాలల్లో సదుపాయాలు పెంచింది. 108, 102, 104 సర్వీసులను ఎంతో మెరుగుపర్చింది. కేసీఆర్‌ కిట్స్‌ లాంటి గొప్ప పథకాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ చిత్తశుద్ధికి తోడు వైద్య అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపట్ల నమ్మకం పెరిగింది. ప్రభుత్వం వైద్యశాలలకు వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రజల నమ్మకం నిలబెట్టేలా వైద్య ఆరోగ్యశాఖ భవిష్యత్తు కార్యాచరణ ఉండాలి. ఇప్పుడు వున్న పరిస్థితి మరింత మెరుగుపడాలే తప్ప తగ్గొద్దు. ప్రజావైద్యాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది.”

”వచ్చే ఏడాది బడ్జెట్‌లోనూ వైద్య ఆరోగ్యశాఖ నిధులు పెంచుతాం. రైతులకు సాగునీరు అందించ డంకోసం ప్రస్తుతం ఎక్కువ వ్యయంచేసి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. సాగునీటిరంగం తరువాత ప్రభుత్వానికి వున్న ప్రాధాన్యత రంగాలు వైద్యం, విద్యనే. భవిష్యత్తులో ఈ రెండు రంగాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తాం. పేదవారికి మెరుగైన వైద్యం, మంచి చదువు అందించడానికి మించిన ప్రాధాన్యం మరొకటి వుండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి ప్రణాళిక రచించాలి. అందుకనుగుణంగా ప్రభుత్వం నిధుల కేటాయింపు చేస్తుంది. వైద్యశాలల నిర్వహణను వికేంద్రీకరణం చేయడంవల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల సూపరిం టెండెంట్లకే నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి, అందుకోసం నేరుగా వారికే నిధులు ఖర్చుపెట్టే అవకాశం ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Other Updates