గత సంవత్సరం మణిపాల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యారి తనకు పరీక్షలంటే విపరీతమైన భయమేస్తోందని, అసలు పరీక్షలు దగ్గర పడుతుంటే నిద్ర పట్టడం లేదని, ఆకలి వేయటం లేదని, ఒళ్లంతా ఒకటే వణుకు వస్తోంది. ఏం చెయ్యాలో తెలియటం లేదని చెప్పాడు. ఈ పరీక్షలను తన తెలివి తేటలను తిట్టుకున్నాడు.
నిజానికి చిన్నప్పటి నుంచి అతనికి అన్నిట్లో 90 శాతం మార్కులే ఉన్నాయి. ఇంటర్‌లో, బీ టెక్‌లో కూడా మంచి మార్కులు వచ్చాయి. రెండో సంవత్సరంలో మాత్రం భయం వేస్తోంది. ఎందుకంటే ‘ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్’. ఒక్కోసారి ‘ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవుతే ఏమవుతుంది. అమ్మో అందరూ ఏమనుకుంటారు.. నేను ఈ కోర్సు కోసం పెట్టిన డబ్బు, శ్రమ అన్నీ వృథా కదా!’ అనే బాధతో గింగిరాలు తిరిగిపోయాడు. తర్వాత కౌన్సిలింగ్ సమయంలో ధైర్యం తెచ్చ్చుకొని పరీక్షలు రాశాడు. అన్నిట్లో తను అనుకున్న మార్కులు సాధించాడు.
గతంలో ఒక్క మార్కు తక్కువ వచ్చిందని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను చూశాం. మన సమాజంలో వైఫల్యాలను అనేది ఒక పెద్ద ప్రళయంలా చూస్తాం. దాదాపు దానిని చావు బతుకుల సమస్యగానే పరిగణిస్తాం. ఫెయిల్ కావడం, ఓడిపోవడం, అనుకున్నవన్నీ జరగక పోవడం జీవితంలో సర్వసామాన్యమనే విషయాన్ని ప్రజలు అంగీకరించక పోవడం జీవితం పట్ల నెగెటీవ్ దృక్పథాన్ని తెలియజేస్తుంది.
కానీ, ఈ విషయంలో అమెరికా లాంటి దేశాల్లో చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారని చెప్పవచ్చు. అక్కడ పిల్లలు, వ్యక్తులు ప్రేమలోనైనా చదువులోనైనా అనుకున్న ఫలితాలు రాకుంటే.. చాలా తేలికగా తీసుకుంటారు. అంతేకాని అక్కడే ఇరుక్కుపోయి జీవితాలను పాడు చేసుకొనే లక్షణాలు కనపడవు. ఒకవేళ ఒక సైనికుడు యుద్ధంలో బుల్లెట్ దెబ్బతిని చావు అంచుదాకా ప్రయాణించి బయటకు వచ్చినా వానిని గౌరవంతో చూస్తారు. ఓహో నువ్వు బాగా పోరాడావు. నిజంగా గొప్ప సైనికుడివి అని పొగుడుతారు. అంతేకాని యుద్ధంలో ఓడిపోయావని, అంతకు ముందు చేసిన కృషి, ప్రతిభను మరిచిపోరు. మనం అలాంటి దృక్పథం అలవరచుకోవాలి.
వైఫల్యాలను ఆ సంఘటనకే, ఆ సమయానికే పరిమితం చెయ్యగలిగే అలవాటును చేసుకోవాలి. ఒకసారి ఫెయిల్ అయితే ‘జీవితాంతం మనం ఫెయిల్ అవుతాము ఇహ! మళ్ళీ మనం అనుకున్న సక్సెస్ రాదు’ అనే భయం చట్రంలో ఇరుక్కొని పోతాం, దానికి సంబంధించిన మాటలే మాట్లాడుతాం!
ఈ మధ్య 40 సంవత్సరాల వ్యక్తి ఒకరు నా దగ్గరికి వచ్చాడు. మంచి చదువు. మంచి కంపెనీలో ఉద్యోగం.. మంచి కుటుంబం ఉన్నాయని, అనుకోకుండా తనకు నచ్చిన వ్యక్తితో ఏదో పొరపొచ్చాలు వచ్చాయని, తన జీవితంలో అన్ని పోగొట్టుకున్నానని, చదువు, డబ్బు వున్నా.. తనకు సక్సెస్ రాలేదని, ఏదైనా వుందంటే అది వైఫల్యం మాత్రమే. అని అంటూ, ‘ఒక్కటి నేర్చుకున్నాను, వైఫల్యం ఎదురైతే ఎలా వుండాలో నేర్చుకున్నాను.’ అని చెప్పాడు.
నిజానికి ఇది గొప్ప లక్షణం.. వైఫల్యాలను అధిగమించి ముందుకు సాగడం ఇప్పుడు సమాజానికి కావలసిన అద్భుతమైన పరిజ్ఞానం. అందుకే అతనితో ‘వైఫల్యాలను అధిగమించడం ఎలా?’ అనే అంశంపై పాఠం చెప్పించాను. చాలా బాగా చెప్పాడు. అప్పటి నుండి అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మనకు వైఫల్యాలనును గౌరవంగా చూడడం రాదు. మన గురించి మనం ఎక్కడ తప్పు చేశాం, ఎందుకు చేశాం, ఏ లక్షణం మనం నేర్చుకోవాలి, ఏ లక్షణం వల్ల మనకు అనుకున్న ఫలితం రాలేదు అనే అంశాలను ఎప్పుడు నిజాయితీగా నేర్చుకుంటామో, అప్పుడు మనం గొప్పగా మారడానికి అవకాశం దొరకుతుంది.
ఈ ప్రపంచంలో వైఫల్యాలను ఎదుర్కోని వారు ఎవరూ లేరు. దాని నుంచి నిరంతరం స్పూర్తిని పొందిన వారే వుంటారు. అబ్దుల్ కలామ్ అంతటి వ్యక్తి ‘ఫెయిల్యూర్ స్టోరీ’ చదవండి. మీకు ఏం చెయ్యకూడదో ఎలా ఉండకూడదో తెలుస్తుంది. మనం వైఫల్యాలను అంగీకరిస్తూ విజయం కోసం ప్రయత్నిద్దాం. అప్పుడు విజయం నీ వెంటే వస్తుంది.
చాలా మంది వ్యక్తులు వైఫల్యాలను చవిచూసిన తర్వాత నిరంతర శ్రమ వలన.. ఉన్న తక్కువ స్థాయి సామర్థ్యంతోనైనా సరే పోరాడి విజయం సాధించారు. ఉదాహరణకు అమితాబ్ బచ్చన్‌కు 1988 నుంచి కొంత కాలం వరకు సినిమాలు లేవు. డబ్బంతా పోయింది. తన పిల్లలు జీవితంలో ఇంకా స్థిరపడలేదు, సినిమాల్లో ఎవరూ అవకాశాలు ఇవ్వటం లేదు. ఆస్తంతా పోయింది. అప్పుడు మళ్ళీ పోరాటం ప్రారంభించాడు. 10 సంవత్సరాల్లో మళ్లీ సినిమా అవకాశాలు వచ్చాయి. తన కోసమే కథలు రాసే విధంగా పరిశ్రమను ప్రభావితం చేయగలిగాడు. వైఫల్యాలు ఎదురైనప్పుడు విజయం సాధించేందుకు ఏ లక్షణాలను పెంపొందించుకోవాలో తెలుసుకుంటూ ఉండాలి. లేదంటే అది చేప పిల్లలాగా పైకి బాగానే కనబడుతుంది. నీళ్ళు కిందికి వచ్చాయన్న సంగతి తెలియనీయదు. ఏదో ఒక రోజు మనల్ని మొత్తం ముంచేస్తుంది. కాబట్టి పైకి కనబడేదానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకూడదు. తెలంగాణలో ఒక సామెత ఉంది. ‘ఊపర్ షేర్వాణి.. అందర్ పరేషాని’ అని అలా ఉండనీయకుండా.. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అంటే చాలా మంది యువతి యువకులకు ‘నేను చాలా తక్కువ స్థాయి వ్యక్తిని, నాకు ఏం చేతకాదు, నేను అంతమందితో పోటీని ఎదుర్కొనలేను’ అని తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళను చెయ్యాల్సినంత పని చేయకుండా ఆపుతుంది. కాబట్టి వాళ్ల గురించి వాళ్ళు తెలుసుకోవల్సింది ఏమిటంటే.. నువ్వెవరివో, ఎలాంటి వాడివో విజయం సాధించడానికి నువ్వేమి చెయ్యగలవో.. అది చెయ్యి చాలు. విజయం నీతోనే సాధ్యం అవుతుంది.
పోరాటం జీవిత లక్ష్యం. చచ్చిపోయిన చేపలు మాత్రమే ప్రవాహంలో కొట్టుకొని పోతాయి. జీవించిన చేపలు ప్రవాహానికి ఎదురు ఈదుతాయి. అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తాయి.. అలాగే చరిత్రలో అబ్రహం లింకన్ 12 సార్లు రకరకాల రంగాల్లో వైఫల్యం చెందాడు. చివరకు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత ప్రతిభావంతుడో, ప్రభావశీలుడో చూడండి.. గతంలో ఇండియన్ క్రికెట్ టీమ్‌లో గంగూలిని బాగా ఆడటం లేదని తీసివేశారు. ఆయన మళ్ళీ ఆటను బాగా ప్రాక్టీస్ చేసి.. మళ్లీ జట్టులోకి వచ్చాడు. వీళ్లందరూ వైఫల్యాలను అధిగమించి, శ్రమించి మళ్లీ విజయం సాధించగలిగారు. అందుకే పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు వైఫల్యాలను అధిగమిస్తూ ముందుకు సాగాలి. అప్పుడు విజయం మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
విజయం సాధించాలంటే..
శ్రీ విజయం కోసం శ్రమిస్తున్నప్పుడు మనం ఏం చెయ్యలేమో (లేదా! దేంట్లో బలహీనంగా ఉన్నామో) అది మనం చెయ్యగలిగే పనికి అడ్డం పడకుండా చూసుకోవాలి.
ఉదా|| పోటీ పరీక్ష సిలబస్‌లో హిస్టరి సరిగ్గా రాదు. కాని కరెంట్ అఫెయిర్స్ బాగా వస్తుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాడ్ బాగా వస్తుంది. హిస్టరీ సరిగ్గా రాదు ఎలా! ఏం చెయ్యాలి.. అది రాకుంటే ఇది వచ్చినా వేస్ట్ కదా? అని ఆలోచించవద్దు.. చదవాల్సిన విషయం పూర్తిగా చదివి రాని విషయాలు ఏమిటో తెలుసుకొని ఏం చేస్తే.. హిస్టరీ నేర్చుకోవచ్చో! తెలుసుకొని దానికోసం శ్రమించాలి.
శ్రీ పోటీ పరీక్షలో నువ్వెంత నిజాయితీగా చదువుతున్నావో అదే నీకు సహాయం చేస్తుంది. రాని సబ్జెక్ట్‌ను నిపుణుల సహాయంతో నేర్చుకో. రాకున్నా వచ్చినట్టు మభ్యపెట్టుకోవద్దు.
శ్రీ నీకు పరీక్షల్లో మంచి మార్కులు రాకుంటె, పేపర్ టఫ్‌గా ఉంది, సెలబస్ మారిపోయింది. అని సాకులు చెప్పడం కాకుండా ‘నేనింకా ప్రిపేర్ కావాలి. నేను ఇంకా చదువుతాను’ అని సంకల్పించుకోవాలి.
శ్రీ విజయానికి దారులు వెతుకు.. సాకులు కాదు.