neహౖదరాబాద్‌ నడిబొడ్డునగల పబ్లిక్‌ గార్డెన్స్‌ సమీపంలోని చదువుల తల్లి ఒడి మన తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం డిసెంబర్‌ 10వ తేదీ సాయంత్రం సాహితీ ప్రముఖులతో, సాహిత్యాభిమానులతో, పండితులతో కళకళలాడిరది.

హరిత అసోసియేషన్‌, వేద సంస్కృతి పరిషత్‌, మూసీ సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక మాస పత్రికవారు సంయుక్తంగా ప్రఖ్యాత శాసన చారిత్రక పరిశోధకులు, తెలంగాణా ముద్దుబిడ్డ కీ.శే. బి.ఎన్‌. శాస్త్రి స్మారక పురస్కారాల ప్రధానోత్సవ వేడుక, ‘‘తెలుగు సాహిత్య ప్రక్రియలు కదంబం’’ అనే ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది.

టీచర్‌గా ఉద్యోగం చేస్తూ, మరోవైపు శిలా శాసనాల చారిత్రక పరిశోధనలపై దృష్టిపెట్టి గ్రామగ్రామం తిరిగి శాసనాలను వెలికితీసి వాటిలో దాగివున్న అనేక విషయాలను భారతిలాంటి పత్రికల్లో వ్యాసాలుగారాసిన బి.ఎన్‌. శాస్త్రి సాహితీ సేవ అసామాన్యమైనది వక్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి పాల్గొని బి.ఎన్‌. శాస్త్రి స్మారక పురస్కారాన్ని కాకతీయ విశ్వ విద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులకు అందజేశారు. పదివేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో ఘనంగా వారిని సత్కరించారు. అనంతరం ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డా॥ మసన చెన్నప్ప, ఆచార్య శలాక రఘునాథశర్మ, డా॥ కూరెళ్ల విఠలాచార్య, ఆచార్య ఎస్‌.వి. రామారావు, ఆచార్య వెలిదండ నిత్యానందరావు, డా॥ జె. భారతి మొదలైన 64మంది ప్రముఖ రచయితలను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. వీరందరూ ‘కదంబం తెలుగు సాహిత్య ప్రక్రియలు`రూపాలు’ గ్రంథంలో తమ అమూల్య వ్యాసాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా॥ కె.వి. రమణాచారి విచ్చేసి బి.ఎన్‌. శాస్త్రి ఎంతో విలువైన సాహిత్య, సాంస్కృతిక విషయాలను ఏ సౌకర్యాలులేని రోజుల్లోనే సేకరించి, పరిశోధనలు చేసి అందించారన్నారు. వారు స్థాపించిన మూసీ పత్రిక సాహిత్య విలువలతో కూడున్నదన్నారు. శాస్త్రిగారి ఆశయాల మేరకు ఎన్నో వొడుదొడుకులకోర్చి పత్రికను కొనసాగిస్తున్న వారి కుటుంబ సభ్యులను అభినందించారు. మూసీ పత్రిక సంపాదకులు డా॥ సాగి కమలాకర శర్మ లాభాపేక్షలేకుండా చేస్తున్న సాహిత్య సేవ సామాన్యమైనది కాదని, ఆ పత్రిక నిరాఘాటంగా రావడానికి తనవంతుగా ప్రభుత్వ పక్షాల ప్రకటన రూపంలో సహాయ సహకారాలు అందజేస్తానని సభికుల హర్షద్వానాల మధ్య తెలిపారు.

మూసీ పత్రిక సంపాదకులు డా॥ సాగి కమలాకరశర్మ మాట్టాడుతూ ఆర్థికంగా అత్యంత భారమైనా మూసీపత్రిక ఆగకుండా నడిపిస్తున్నామని, చిన్నచిన్న అవాంతరాలు వచ్చినప్పటికీ బి.ఎన్‌. శాస్త్రిగారి ఆశయాలమేర, వారి సంకల్ప బలంతో పత్రిక నిర్విఘ్నంగా కొనసాగుతూనే వుందన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు మూసీ పత్రికను పరిశోధనా మాసపత్రికగా గుర్తించాయని తెలుపుతూ ‘‘మూసీ మాసపత్రిక`సాహిత్య సేవ’’ అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి పి.హెచ్‌డి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించడం గర్వించదగినదని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు డా॥ రాళ్ళబండి కవితాప్రసాద్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి, వేద సంస్కృతి పరిషత్‌, మూసీ సంస్థలపక్షాల డా॥ సాగి కమలాకరశర్మ, హరిత అసోసియేషన్‌ పక్షాన మాదిరాజు మరినందన్‌రావులు తదితరులు పాల్గొన్నారు.

Other Updates