ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించనున్నట్లు సిఎం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామని చెప్పారు.
వందల ఏళ్ల పాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి, ప్రతీ అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణాలుండాలని చెప్పారు. అత్యాధునికంగా, ఆధ్మాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్ లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని సిఎం అధికారులను కోరారు. దేశంలోని ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతుందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలని సిఎం ఆదేశించారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, దీనికోసం ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని చెప్పారు.
యాదాద్రి పునరుద్ధరణ పనులను సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రగతి భవన్‌లో విస్తతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆలయమున్న గుట్టపైభాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? టెంపుల్ సిటీపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకున్నారు. మాడవీధులు, ప్రాకారాలు కలుపుకుని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందని సిఎం వెల్లడించారు.
లక్ష్మీ నర్సింహస్వామి కొలువై ఉండే గుట్టపైభాగంలో ప్రధాన దేవాలయంతో పాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇ.వో. కార్యాలయం, వివిఐపి గెస్ట్ హౌజు (ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేధ్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్ల దారి, బస్టాప్, పోలీస్ ఔట్ పోస్టు, హెల్త్ సెంటర్లుండాలని నిర్ణయించారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. గుట్ట కింది భాగంలో గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నిత్యం ఈ చెరువుకు నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. గండి చెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలని చెప్పారు. గుట్ట కింద భాగం లోనే ఆలయ బస్టాండ్ నిర్మించాలని, అక్కడి నుంచి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకురావాలని చెప్పారు. గుట్టపైకి వెళ్లి, రావడానికి వేర్వేరు దారులు ఉపయోగించాలని చెప్పారు. గుట్ట కింద మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఆశ్రమం నిర్మించాలని నిశ్చయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగు రోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. యాదాద్రి నుంచి తుర్కపల్లికి నాలుగు లేన్ల రోడ్లు వేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్ఠంగా జరగాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని కోరారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ యాగం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించ నున్నట్లు చెప్పారు. భక్తులు బస చేయడానికి వీలుగా టెంపుల్ సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని చెప్పారు. టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజి లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. యాదాద్రిలోని ప్రతీ బ్లాకుకు దేవుళ్ల, దేవతల పేర్లు పెడతామని సిఎం చెప్పారు. యాదాద్రి టెంపుల్ సిటీ అంతా ప్రకతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా ఉద్యానవనాలు, ఫౌంటేన్లు నిర్మించాలని చెప్పారు.
చెరువులన్నీ నిండి కళకళలాడాలి
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు తెలంగాణ వ్యవసాయానికి శతాబ్దాల తరబడి ముఖ్య నీటి వనరుగా ఉన్నాయని, మిషన్ కాకతీయతో మళ్లీ చెరువులకు పునర్వైభవం రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరే విధంగా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెరువులన్నీ నిండి కళకళ లాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లని సీఎం అన్నారు.చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు.
”ఒకప్పుడు తెలంగాణలో చిన్ననీటి వనరుల వ్యవస్థ ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు అద్భుతంగా పండేవి. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగతా చెరువులకు నీరందేది. చెరువులకు నీళ్లు పారేందుకు సహజసిద్ధమైన కాలువలు ఉండేవి. జాలువారు నీళ్లతో చెరువులు నిండేది. 1974లోనే అప్పటి బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టిఎంసిల నీళ్ల కేటాయింపు ఉంది. రాను రాను చెరువులు నాశనం అయ్యాయి. తెలంగాణ బతుకు నాశనం అయింది. పంటలకు నీరివ్వడానికి తెలంగాణ రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్లు వేసుకున్నారు. అయినా పంటలు సరిగా పండలేదు. వ్యవసాయం దెబ్బతిన్నది” అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
”తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకున్నాం. చెరువులను బాగు చేసుకున్నాం. ఆ చెరువులు నీటితో కళకళలాడితేనే మిషన్ కాకతీయకు సార్థకత. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లతో చెరువులు నింపాలి. వర్షం నీళ్లు కూడా చెరువులకు చేరేలా చేయాలి. పడబాటు నీళ్లు కూడా కిందనున్న చెరువులకు నేరుగా పోవాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల్లో 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరు అందిస్తే, దాని ద్వారా మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్ కెనాల్స్ సిద్ధం చేయాలి. ఒకప్పుడు జాలువారు
ఉండేది. బోర్లు ఎక్కువ వేయడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఇప్పుడు జాలువారు లేదు. చెరువులు నిండితే, మళ్లీ భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్లీ జాలువారును చూడవచ్చు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు అందుతుంది. దీనికోసం అవసరమైన ఫీడర్ కెనాల్స్ వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇంజనీరింగ్ అధికారులతో వర్క్ షాపు నిర్వహించి, దీని కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ఈ సీజన్లోనే పనులు ప్రారంభం కావాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
”చెరువులను పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రంలో ఐబి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా పెద్ద సంఖ్యలో చెక్ డ్యాములు నిర్మిస్తున్నాం. చెరువుల్లో, చెక్ డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని సరిగ్గా లెక్క తీయాలి. అన్ని చిన్ననీటి వనరులను నీటితో కళకళ లాడేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. దీనికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గ్రామాల అభివృద్ధికి ‘నరేగా’ నిధులు
మహాత్మా గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (స్మశానవాటికలు) నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. ‘నరేగా’ నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపి, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృ ద్ధి నిధులు కూడా ఉపయోగించుకుని గ్రామాల్లో అభివద్ధి చర్యలు చేపట్టాలని సిఎం చెప్పారు. నరేగా పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తుందో, అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని, ఈ నిధులను గ్రామాల అభివద్ధికి వినియోగించాలని చెప్పారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, స్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సష్టించడానికి ఉపయోగించాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీ రాజ్ – గ్రామీణాభివద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.
”తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలి. వీటికి నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులు వాడాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని రక్షించడం లాంటి బాధ్యతలు గ్రామ పంచాయతీలు చేపట్టాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
”రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఖచ్చితంగా ఆరునెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి. దాతల నుంచి స్వీకరించాలి. వైకుంఠధామం నరేగా నిధులతో నిర్మించాలి. 3వేల లోపు జనాభా కలిగిన 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున, 3వేలకు పైగా జనాభా కలిగిన 1300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 12,712 గ్రామాల్లో 14,012 వైకుంఠధామాలు నిర్మించాలి” అని చెప్పారు.
”గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం గ్రామ పంచాయతీల బాధ్యత. శిథిలాలు తొలగించాలి. పాడుపడిన, వాడనిబావులను పూడ్చేయాలి. మురికి చెట్లను తొలగించాలి. కూలిన ఇండ్ల శిథిలాలు తొలగించాలి” అని సిఎం చెప్పారు.
” రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలి. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి, పనులు ప్రారంభించాలి” అని సిఎం చెప్పారు.
నరేగాతో పాటు వివిధ రకాలుగా సమకూరిన నిధులతో గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిధులు దుర్వినియోగం కావద్దని, ప్రతీ పైసా సద్వినియోగం కావాలని అన్నారు. పనులు నామమాత్రంగా చేసి, నిధులు కాజేసే పద్ధతి పోవాలన్నారు. దీనికోసం ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్నపనులను అధికారులు 20 బందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు
3 యూనిట్లుగా మహానగరం
హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెల్లడించారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని సమస్యలుత్పన్నమవుతాయి, అలాంటి సమస్యలను ముందుగానే అంచనా వేసి, పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి. హైదరాబాద్ వైపే అందరూ ఆకర్షితులు కాకుండా, ప్రత్యామ్నాయంగా చుట్టు పక్కల పట్టణాలను కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా అభివద్ధి చేసే వ్యూహం (కౌంటర్ మాగ్నెట్) రూపొందించాల న్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్‌లో రాష్ట్ర మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ నగర సమగ్రాభివద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను కేవలం హెచ్‌ఎండిఏ పై మాత్రమే పెట్టకుండా, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నగరాభివద్ధికి జిహెచ్ ఎంసి నిధులపైనే ఆధారపడకుండా ఇతరత్రా నిధులు కూడా సమకూరుస్తా మని చెప్పారు.
హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లు సన్నద్ధం చేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.”హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఉపాధి,
ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్య పూర్వక జీవనం, మంచి పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలి రావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. హోటల్, నిర్మాణ రంగంలో కూడా ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది. ఈ కారణాల వల్ల ప్రతీ ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్ కు జత కలుస్తున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు.
ఉద్యోగ, వ్యాపారాల రీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతీ ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు వచ్చిపోతున్నారు. ఇదంతా ఆర్థికాభివద్ధికి దోహదపడే అంశం. చాలా సంతోషకరమైన విషయం కూడా. కానీ, పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే మాత్రం నగర జీవితం నరకప్రాయంగా మారక తప్పదు” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
”హైదరాబాద్ నగరం నిర్మించేటప్పుడు కులీ కుతుబ్ షా ఒక మాట చెప్పారు. నేను నగరాన్ని కాదు, జన్నత్ (స్వర్గం) నిర్మిస్తున్నా అన్నారు. నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేది. హైదరాబాద్ నగరమంటేనే ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. మూసీ నదిని మురికి ప్రాయం చేశారు. నగరంలో కాలుష్యం పెరిగిపోతున్నది. ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయింది. రానున్న కాలంలో జనాభా మరింత పెరిగి, పరిస్థితి చేయిదాటిపోతుంది. జీవనం దుర్భరంగా మారుతుంది. కాబట్టి మనమంతా ఇప్పుడే మేల్కొనాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి, దానికి తగినట్లు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి, అమలు చేయాలి” అని ముఖ్యమంత్రి అన్నారు. ”హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? జనాభా ఎంత ఉంది? రోడ్లెలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సీవరేజి పరిస్థితి ఏమిటి? గ్రీన్ కవర్ పరిస్థితి ఏమిటి? వాహనాలు ఎన్ని ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటి? అనే దానిపై నిర్ధారణకు రావాలి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. దానికి తగినట్లు ఏమి చేయాలనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
”హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉంది. హెచ్‌ఎండిఏ పరిధిలోని భూభాగం చాలా పెద్దగా ఉండడంతో మొత్తం భూభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఓపెన్ ప్లేసులుగా పరిగణించి, మిగతా చోట్ల ఇష్టారీతిన భవనాలకు, నిర్మాణాలకు అనుమతులిస్తారు. దీంతో ప్రధాన నగరంలో పచ్చదనం కరువవుతున్నది. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగితే నగరంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి అనుమతుల విషయంలో నియంత్రణ ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. లక్షా 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
”హైదరాబాద్ నగరాన్ని మూడు భాగాలుగా విభజించి, ప్రణాళిక రూపొందించాలి. ఓఆర్‌ఆర్ లోపలున్న నగరం… ఓఆర్‌ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగు రిడ్డు వరకుండే నగరం… ఆర్‌ఆర్‌ఆర్ అవతల మరో ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం… ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఎక్కడ ఏమి చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీ… ఇలా దేనికి అది ప్రత్యేకంగా ఉండేలా ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. ఏ భూభాగాన్ని ఎందుకోసం కేటాయించామో అందుకే వినియోగించాలి. మాస్టర్ ప్లాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో
ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి మంత్రివర్గం అనుమతిని తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం” అని ముఖ్యమంత్రి అన్నారు.