magaవిసుగు, విరామం లేకుండా వ్యాపారాత్మక ధోరణికి దూరంగా, వైవిధ్యభరితమైన విశిష్ట చిత్రాలు గీస్తున్న నిరంతర చిత్రకారుడు మధు శ్రీనివాస రావు దాతర్‌. వీరు యం.యస్‌. దాతర్‌గా చిత్రకళాలోకంలో సుపరిచితుడు. తన యనభయ్యవయేట కూడా ఎవరూ వేయని ఫక్కీలో పసందైన చిత్రాలను, పండితులనే కాదు పామరులను సైతం రంజింపజేసే చిత్రాలను వేస్తున్నారు.

ఎంతటి ఊహనైనా వాస్తవరూపం ఆధారంగా వేయాలనేది ఆయన పద్ధతి. ”నాదేశం, నా ప్రజలు, నా సంస్కృతి నా చిత్రాల వస్తువు” అని ఆయన అంటారు. డేవిడ్‌ స్మిత్‌ నేతృత్వంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ‘దృష్టి భ్రమ’ అనే అంశంపై పి.హెచ్‌.డి. పూర్తి చేసిన యం.యస్‌. దాతర్‌ హైదరాబాద్‌ నగరంలో యస్‌.వి. దాతర్‌ – ఇందిరా దాతర్‌లకు 1938 ఏప్రిల్‌ 6న జన్మించారు. తొలిరోజులలో పింగాణి, మృణ్మయ కళలో శిక్షణ పొందారు. ఆయన తండ్రి ఆచార్య యస్‌.వి.దాతర్‌ చెంత హైదరాబాద్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌లో 1950-51లో చదివిన ఫలితంగా వారి ప్రభావమే వీరిపై ఎక్కువ.

ఆ తర్వాత 1956లో ప్రభుత్వ లలిత కళలు, వాస్తుశిల్ప కళాశాల నుంచి బి.ఎఫ్‌.ఎ. చదివి, అదే కళాశాల నుంచి 1958లో మూర్తి చిత్రణలో ఎం.ఎఫ్‌.ఎ. పూర్తి చేసినా, లండన్‌లోని రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ నుంచి ఎఫ్‌.ఆర్‌.ఏ.ఎఫ్‌.ఎ. ఫెలోషిప్‌ను సాధించినా, ఈనాటికీ ‘కళా సాధనే’ ఆయన విజయ రహస్యం.నిత్య జీవితంలో తారసపడే పలు సంఘటనలే వాస్తవ రీతిలో, కళాత్మకంగా తీర్చిదిద్దడలో చేయి తిరిగిన దాతర్‌ అంగడి, అతడు, ఆమె, ఆ వీధిలో లాంటి చిత్రాలు వేసి ఎన్నెన్నో వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు. సమష్టి చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొన్నారు.

అయితే 1984 నుంచి దక్కన్‌ శిల్పాకృతులను నీటిరంగులతో చిత్రించి ఆయన తన ప్రత్యేకతను చాటారు. భౌగోళిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి, ఎన్నో రాతి ప్రాంతాలు సందర్శించి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన వంద పై చిలుకు చిత్రాలు వేశారు. వాటిలో ముప్పై వర్ణచిత్రాలు జియలాజికల్‌ సొసైటీవారే సేకరించారు. ఆ చిత్రాలు తిలకిస్తే శిలలను దాతర్‌ పరిశీలించిన విధానం, వాటి అమరిక, రంగుల మేళవింపు, ఇంపు – ఆకర్షణీయమైంది. జంటనగరాల చుట్టు ప్రక్కల ప్రదేశాలలోనేకాకుండా, తుంగభద్రతీరంలో, ఇతర చోట్లలో ఆయన చూసిన శిలాకృతుల స్కెచ్‌ లేకుండా – వర్షం ముందు ఎలా ఉంటా యో, ఆ తర్వాత ఎలా ఉంటాయో, ఒక్కోసారి సూర్యకిరణాలు సోకినప్పుడు, సోకనప్పుడు కన్పించే తీరుతెన్నులను వివిధ వర్ణాలలో, ప్రమాణాలలో చూడముచ్చటగా చిత్రించారు. కొన్ని శిలాకృతులు చెట్లు చేమలవల్ల, గడ్డిగాదం వల్ల, మేఘాలు, పక్షుల వల్ల రెట్టించిన అందంతో దృశ్య కళారీతిలో ఉన్నాయి.

ఆ తర్వాత కాలంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వారి కోరికపై ఆయన గ్రీకురీతిలో (స్క్రాప్‌ టెక్నిక్‌తో) గీసిన చిత్రాలు ఆయన ముద్రతో మనోహరంగా ఉన్నాయి. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అల్బర్ట్‌ డ్యూరర్‌ ఈ రీతి చిత్రాలకు దేశికుడు. చూడడానికి గ్రాఫిక్‌లాగా కనిపిస్తుంది కాని మూసలేకుండా గీసే చిత్రమిది. ఇది వ్యాపారాత్మక కళ కూడా కాదు. తొలుత కాగితం నునుపు చేసి, దానిపై మైనం పొరవేసి, తర్వాత రెండు – మూడు వర్ణాలు మాత్రమే దానిపై పూసి, అది ఆరిన తర్వాత ప్రత్యేకంగా రూపొందించుకున్న కలంలో ఆపై రంగును గీకివేస్తూ, చిత్ర స్వరూపాన్ని ఆవిష్కరించే కళ ఇది. ఎంతో ఓపిక, పనితనం ఈ రీతి చిత్రం రూపొందించడానికి అవసరం. ఈ పద్ధతిలో దాతర్‌ గీసిన అశ్విని పూర్ణిమ చిత్రం, స్వగృహ చిత్రం అపురూపమైనవి. ముఖ్యంగా ప్రాచీన కట్టడాలు ఈ రీతిలో ఎంతో సహజంగా కన్పిస్తాయి. దాతర్‌ గీసిన ఈ రాతి చిత్రాలు పదహారింటిని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సేకరించడం విశేషం. ఇంకా ఈ తరహా చిత్రాలను రూపుదిద్దడంలోనే ఆయన సాధన సాగుతున్నది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యాలయం నిమిత్తమే ఆసియా ఖండపు పండుగలపై ఆయన ఒక ప్రాజెక్టు చేయవలసి ఉంది. సాధ్యమైనంత త్వరగా ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేసే ప్రయత్నంలో దాతర్‌ ప్రస్తుతం ఉన్నారు.

లోగడ ఆయన వివిధ అంశాలపై గీసిన చిత్రావళితో అమెరికన్‌ సాంస్కృతిక కేంద్రం వీరి వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు 1963, 1966, 1969లలో హైదరాబాద్‌లో, న్యూఢిల్లీలో, 1964, 1966, 1967లలో, ముంబైలో 1964, 1965, 1970లో ఏర్పాటు చేసింది.

ఇవి కాకుండా వీరు ప్రధానంగా ఇండియన్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ సొసైటీ (న్యూ ఢిల్లీ), అకాడెమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌ (కలకత్తా), హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అర్టిస్ట్స్‌ (హైదరాబాద్‌) లలిత కళా అకాడెమీ (న్యూ ఢిల్లీ) వారు వివిధ సందర్భాలలో నిర్వహించిన కళా ప్రదర్శనలలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ నిర్వహించిన అఖిల భారత చిత్రకళా పొటీలలో 1952, 1954, 1956, 1958, 1974లలో అవార్డులు పొందారు.

ఇవే కాకుండా 1968, 1970, 1976, 1979లలో అఖిల భారత గ్రాఫిక్‌ ఆర్ట్‌ ప్రదర్శన పోటీలలోను బహుమతులు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడెమీ వారి బహుమతులు కూడా వీరి చిత్రాలకు 1964, 1968, 1970, 1972లలో వచ్చాయి. 1960, 1962, 1964, 1965, 1968లలో ఇంటర్నే షనల్‌ క్రాఫ్ట్స్‌ హాజరైనవారు లండన్‌, అమెరికా, జపాన్‌, కెనడా, హెడెల్‌బర్గ్‌, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, హాలెండ్‌, ఇటలీలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలలో వీరు రూపొందించిన పింగాణి, మృణ్మయ కళా ఖండాలకు అవార్డులు గెలుచుకున్నారు.

వీరు రూపొందించిన పలు చిత్రాలు, మృణ్మయ, పింగాణి కళాఖండాలు హైదరాబాద్‌ లోనే కాకుండా మద్రాసు, ముంబై, న్యూఢిల్లీ, కలకత్తా, బెంగుళూరు, చండీఘర్‌లాంటి దేశీయ నగరాల్లోని మ్యూజియంలు, ఆర్ట్స్‌ అకాడెమీలు, ఆర్ట్స్‌ కళాశాలలు, పరిశ్రమలతో పాటుగా, అమెరికా, లండన్‌, బెల్జియం, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, హాలెండ్‌, ఇటలీ, హెడిల్‌ బర్గ్‌, జపాన్‌, దేశాలలోని సంస్థలు, కళాహృదయులు సేకరించారు.

వీరు చిత్రకారుడుగానే కాకుండా, చిత్రకళ బోధించే ఆచార్యుడుగా, పరీక్షకుడుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయంలోనే కాకుండా కొల్హాపూర్‌ విశ్వవిద్యాలయం, నాగపూర్‌ విశ్వవిద్యాలయం, అస్సాం, గుల్బర్గా, బెంగుళూరు, ధార్వాడ, ఔరంగాబాద్‌, మరట్వాడలోని విశ్వవిద్యాలయాల తాలూకు బి.ఎఫ్‌.ఏ. ఎం.ఎఫ్‌.ఏ., పిహెచ్‌డి విద్యార్థులకు పరీక్షకుడుగా, విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. వీరు 1972 – 1981 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లలిత కళా అకాడెమీలో క్షేత్ర అధికారిగా, 1982-1986 వరకు కార్యనిర్వాహక అధికారిగా పనిచేశారు. లలిత కళా అకాడెమి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమైన తర్వాత గ్రాఫిక్‌ ఆర్ట్‌ కేంద్రంలో పనిచేసి 1996 ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేశారు. అయినా కూడా ఈనాటిదాకా వారు విడువకుండా చిత్రకళా సాధన చేస్తూనే ఉన్నారు.

టి. ఉడయవర్లు

Other Updates