artఅద్భుత కళానైపుణ్యం ప్రదర్శించిన కళాకారులు

వ్యర్థం అనుకుని పక్కనపెట్టే వస్తువులను తీసుకుని వాటన్నిటిని ఒక చోట చేర్చి వాటికి చక్కని ఆకృతులను కల్పించి జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దే శిల్పుల కళానైపుణ్యం ఎనలేనిది. అటువంటి చక్కని కార్యక్రమం ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, శిల్పుల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతి ఆవరణలో జరిగింది. సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ జ్యోతి వెలిగించి వర్క్‌ షాపును ప్రారంభించారు. తెలంగాణ శిల్పుల సమాఖ్య ఆధ్వర్యంలో 21మంది లోహశిల్పి కళాకారుల బృందం ‘లోహ శిల్ప కార్యశాల’ పేరిట జరిగిన వర్క్‌షాపులో పాల్గొని ఇనుము, మొదలైన లోహాల వ్యర్థాలతో అద్భుతంగా గుదిగుచ్చి ‘ఔరా’ అన్న విధంగా చక్కని రూపాలకు ఆకృతినిచ్చి అందరి ప్రశంసలందుకున్నారు.

తెలంగాణ శిల్పుల సమాఖ్య అధ్యక్షుడు పి.వై. రాజు, సంపత్‌రెడ్డి నేతృత్వంలోని బృదం 5 రోజులపాటు శ్రమించి తయారుచేసిన వరంగల్‌ తోరణం, చార్మినార్‌, పెద్ద బతుకమ్మ, బోనంతో మహిళలు, పోతరాజు, ఒగ్గుడోలు వాయిస్తున్న కళాకారుడు, తెలంగాణ చిత్రపటం, హరితహారం చెట్టు, కృష్ణ జింక, బతుకమ్మ ఆడుతున్న మహిళలు మొదలైన ఆకృతులను కళ్ళకు కట్టినట్టు చక్కగా మలిచారు. వీటికోసం వాడిన వ్యర్థపదార్థాలైన సైకిల్‌ మోటార్‌ చైను, గ్యాస్‌ సిలిండర్‌, ఇంజన్‌, నట్లు, బోల్టులు, ఇనుప చువ్వలు, తీగలు, ఇలా మొత్తం ఇనుపలోహ వ్యర్థ పదార్థాలే వాడి అందమైన బొమ్మలను తయారు చేయడం శిల్ప కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా వున్నాయని చూసినవారంతా కొనియాడుతున్నారు.

ఈ కార్యక్రమం ముగింపు సమావేశానికి మంత్రివర్యులు అజ్మీరా చందూలాల్‌ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను అభినందించారు. మామిడి హరికృష్ణ, తెలంగాణ శిల్పుల సమాఖ్య పక్షాన పి.వై.రాజు, సంపత్‌రెడ్డి, హైదరాబాద్‌ ఆర్ట్‌ అసోసియేషన్‌ పక్షాన ఏ.వి. రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాకారులకు ఒక్కొక్కరికి 25వేల పారితోషికం, ప్రశంసాపత్రం అందజేశారు.

-వద్దిరాజు జనార్ధనరావు

Other Updates