పెట్టుబడి ఖర్చులు తగ్గి, ఉత్పాదకత పెరిగి, మంచి ధరలను పొందినప్పుడే రైతులు వ్యవసాయ రంగంలో లాభాలను అర్జిస్తారని, ఆ దిశగా శాస్రవేత్తలు, ప్రభుత్వాలు కలసికట్టుగాకృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఇక్రిశాట్‌లో జరిగిన ఇక్రిశాట్ ఐహబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గారు మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా రైతులు రుణాల కోసం బ్యాంకులు, ప్రవేటు వ్యాపారులపైన ఆధారపడటం బాధాకరం అన్నారు. ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే రుణాలను పెంచడం కాదు అసలు రుణాలు లేకుండా స్వంత పెట్టుబడులతో సేద్యం చేసి లాభాలను బ్యాంకులలో డిపాజిట్ చేసుకునే విధంగా వ్యవసాయ రంగం అబివృద్ది చెందాలన్నారు.
పాశ్చాత్య దేశాలలో వేల ఎకరాలను యంత్రాలతో ఒకే కుటుంబం సాగు చేస్తుందని, తద్వారా భారీ లాభాలు అర్జిస్తున్నారన్నారు. మన దేశంలో చిన్న కమతాలు ఉండటం ప్రతి రైతు సరాసరిన 2.5 ఎకరాలు మాత్రమే సేద్యం చేయడంతో ఖర్చులు భారీగా ఉండి వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదన్నారు. సంప్రదాయ వ్యవసాయానికి శాస్రవేత్తలు నూతన సాంకేతిక పద్ధతులను జోడిస్తే మన దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు.
దేశంలోనే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ, స్వయంగా రైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటంతో రైతు కష్టాలను దూరం చేయడానికి అనేక పథకాలను, భారీ సబ్సిడీలను రాష్ట్రంలో అమలు పరుస్తున్నారన్నారు. ఎరువులను, విత్తనాలను సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు, భారీ సబ్సీడితో వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందిస్తున్నామన్నారు. డ్రిప్, స్ప్రింకర్లకు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రెండు వేల కోట్లు కేటాయించామని, దీనిలో రైతులకు 100 శాతం ఇతర సన్నకారు రైతులకు 90 శాతం, మిగతా వారికి 80 శాతం చొప్పున సబ్సిడి కల్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 సంవత్సరాలలోనే 75 శాతం సబ్సిడితో 1000 ఎకరాలలో పాలీహౌస్‌లను నిర్మించామన్నారు.
వ్యవసాయంలో లాభాలు రావాలంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున రావల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భద్రాచలం కొత్తగూడేం జిల్లాలో కొత్త పామాయిల్ యూనిట్ ను నెలకొల్పాక రికవరి శాతం పెరిగి రైతులకు పామాయిల్ గెలల ధర టన్నుకు రూ. 6,200 నుంచి 10,000 లకు పెరిగిందన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి, ఆప్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ఐటి శాఖ సెక్రెటరి, జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కమీషనర్ జగన్ మోహన్, వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, డేవిడ్ బర్గెన్ సన్,శాస్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.