వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చినట్లే వ్యవసాయానుబంధ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. వ్యవసాయానుబంధ వృత్తులకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడందారా వృత్తులను ఆధారం చేసుకొని జీవించే ఎంతోమంది సామాన్యులకు మేలు కలుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చట్టం తీసుకురావాలని కోరారు.
న్యూఢిల్లీలో ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కేసీఆర్ దాదాపు గంటా 20 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. ‘వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి ప్రస్తుతం మినహాయింపు అమల్లో వుంది. అదేవిధంగా వ్యవసాయానుబంధ వృత్తులు కూడా అనేక గ్రామాల్లో ఉ న్నాయి. వాటిని ఆధారం చేసుకుని ఎంతోమంది బీసీలు బతుకుతున్నారు. గొర్రెల కాపరులు, మత్స్యకారులు, నేత కార్మికులు, రజక, నాయీ బ్రాహ్మణ వృత్తిదారులు… ఇలా చాలామంది వివిధ వృత్తులు నిర్వహిస్తున్నారు. ఎంతో కష్టంతోకూడుకున్న పనులు చేస్తున్నారు. కళాత్మక వృత్తులు నిర్వహిస్తున్నారు. వారికొచ్చే ఆదాయానికి పన్ను విధించడం సమంజసం కాదు. ఆదాయపన్ను మినహాయింపు ద్వారా వృత్తులపై ఆధారపడి బతికే వారికి ఎంతో చేయూత లభిస్తుంది. ఆయా కులవృత్తులపై ఆధారపడిన వారికే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుంది. మా తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకానికి, చేపల పెంపకానికి, ఇతర కుల వృత్తులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నాం. బడ్జెట్లో చాలా నిధులు కేటాయించుకున్నాం. భవిష్యత్తులో కులవృత్తుల ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వారు ఆర్థికంగా బాగుపడతారు. అలాంటి కష్టజీవులపై పన్నులు విధించడం సమంజసం కాదు’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
‘ఒకే దేశం.. ఒకే పన్ను’ నినాదంతో జీఎస్టీ బిల్లు తెచ్చారు. మేము కూడా ఆమోదించాము. దీనివల్ల రాష్ట్రాలకు నష్టం జరుగకుండా చూడాలి. రాష్ట్ర ఆదాయంపై వ్యతిరేక ప్రభావం లేకుండా చూడాలి. రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరంగా ఉండవద్దు. ఇందుకోసం మరింత స్పష్టత ఇవ్వాలి. రాష్ట్రాలకు నష్టం జరుగకుండా జీఎస్టీని అమలు చేయడం ద్వారా దేశానికి మేలు జరుగుతుంది’ అని సీఎం ప్రధానికి వివరించారు.
1 ‘కోటా’ పెంపును ఆమోదించండి
‘దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సామాజిక పరిస్థితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగమే చెప్పింది. వారి జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కూడా 50 శాతం మించే ఉన్నాయి. ఓబీసీలు ఎక్కువున్న రాష్ట్రాలు కూడా సామాజిక, విద్యాపరంగా వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. వారిలో పేదలే ఎక్కువ. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఎన్నో కుటుంబాలు, కులాలున్నాయి. వారికి అవసరమైన ప్రోత్సాహం అందించడానికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశాం. దానికి కేంద్రం ఆమోదం కావాలి. అలాగే రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థల్లో, నియామకాల్లో ఎవరికెంత రిజర్వేషన్ ఇవ్వాలనే విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలి’ అని ముఖ్యమంత్రి కోరారు.
2 ఎస్సీ వర్గీకరణ కావాలి
‘తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కావాలని ఎంతో కాలంగా డిమాడ్ ఉంది. ఆ డిమాండ్‌కు ప్రజల మద్ధతు కూడా ఉంది. వారి డిమాండ్‌లో న్యాయం ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం వెంటనే స్పందించాలి. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి’ అని ముఖ్య మంత్రి విన్నవించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని, రాష్ట్రానికి రావాల్సిన రూ. 1400 కోట్ల కాంపా నిధులను విడుదల చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు విడుదల చేయాలని, సెక్రటేరియట్ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ప్రధానమంత్రిని సీఎం కేసీఆర్ కోరారు.
ముఖ్యమంత్రి లేవనెత్తిన ప్రతీ అంశంపట్ల సానుకూలంగా స్పందించిన ప్రధానమంత్రి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి సుహృద్భావ వాతావరణంలో, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్చలు సాగాయి. ప్రధానమంత్రితో జరిగిన సమావేశం ఫలప్రదంగా సాగిందని సీఎం అభిప్రాయపడ్డారు.
3 భూసేకరణ చట్టానికి ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టాన్ని ఆమోదించాలని కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకరప్రసాద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ చట్టంవల్ల భూ నిర్వాసితులకు ఎక్కువ ప్రయోజనం తక్కువ సమయంలో కలుగుతుందని ప్రాజెక్టు నిర్మాణం కూడా వేగవంతమువుతుందని సీఎం కేంద్రమంత్రికి వివరించారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి తన న్యాయమంత్రిత్వశాఖ తరఫున క్లియర్ చేశారు. తన మంత్రిత్వశాఖ తరఫున కూడా తగిన సహకారం అందిస్తామని చెప్పారు. అప్పటికప్పుడే ఆమోదముద్ర కూడా వేశారు. ఉమ్మడి హైకోర్టును విభజించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరారు. దీనికి కూడా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.