‘జై కిసాన్ జై తెలంగాణ’ అనే మకుటంతో కొన్నిమాసాల క్రితం ఈ శీర్షికలో మేము రాసిన సంపాదకీయం అక్షరసత్యమని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అగ్రికల్చర్ లీడర్ షిప్ పురస్కారం లభించడం ఆయన కృషికి మరింత గుర్తింపు నిచ్చింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ నాయకత్వంలోని కమిటీ ఈ పురస్కారానికి మన ముఖ్యమంత్రిని ఎంపిక చేసింది. భారత వ్యవసాయ, ఆహార మండలి అందజేస్తున్న ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 5న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగే ప్రపంచ వ్యవసాయ నాయకత్వ శిఖరాగ్ర సదస్సులో కె.సి.ఆర్ కు బహూకరించ నున్నారు. నిజంగా ఇది రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకం.
తెలంగాణలో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలు, వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఈ పురస్కారానికి ఎంపికచేశారు.
తెలంగాణ రాష్ట్రం అవతరించింది మొదలు రాష్ట్రంలో వివిధవర్గాల ప్రజలు, ముఖ్యంగా వరుస నష్టాలతో అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగాన్ని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలను రూపొందించి అమలు చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొలిపింది. వీటిలో తొలివిడతగా రైతాంగాన్ని అప్పుల ఊబినుంచి బయట పడవేయడానికి 17,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీచేసి లక్షలాది మంది రైతులను ఆదుకొంది.
రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం దండుగ కారాదని, లాభసాటిగా , పండుగగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకల చర్యలు చేపట్టింది. సాగునీరు, విద్యుత్, పెట్టుబడి ప్రభుత్వమే సమకూరుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఎకరాకు 8,000 రూపాయల పెట్టుబడిని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలలో జమచేయ నుంది. ప్రతి నీటి చుక్కా సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందించడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తోంది. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం లభించి, అవి ఇప్పుడు జలకళతో కళకళ లాడుతున్నాయి. భూగర్భజలమట్టం కూడా పెరిగి బోరుబావుల్లో సమద్ధిగా నీరు లభిస్తోంది, దీనికితోడు రైతులకు ఉచితంగా , నిరంతరాయంగా 24 గంటలు విద్యుత్ సరఫరాచేసే కార్యక్రమానికి అప్పుడే మూడు జిల్లాలలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే వేసంగి పంటకాలం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోని రైతులకు ఇక పూర్తికాలం ఉచిత విద్యుత్ సరఫరా కానుంది.
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటుధర, ఉత్పత్తుల నిల్వకు గిడ్డంగుల సౌకర్యం, భూసార పరీక్షలు, ఎరువులు, మంచి విత్తనాలు సకాలంలో సమకూర్చడం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను, యంత్రాలను అందించడం, పాలీహౌజ్, గ్రీన్ హౌజ్ , సూక్ష్మ సేద్యం విధానాలకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం, వ్యవసాయాధికారులను రైతులకు అందుబాటులో వుంచడం వంటి పలు చర్యలతో ప్రభుత్వం నేడు తెలంగాణలో రైతన్నలకు ఉపిరులూదింది. సమగ్ర రైతు సర్వే, రైతు సమాఖ్యల ఏర్పాటు, రైతులకు లాభం చేకూర్చేలా క్రాప్ కాలనీలు, భూముల సర్వే, రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన వంటి మరెన్నో విప్లవాత్మక చర్యలకు ప్రభుత్వం తెరలేపింది. అందుకే జాతీయస్థాయిలో మన ముఖ్యమంత్రికి ఈ అరుదైన గౌరవం, గుర్తింపు దక్కింది.