జర్మనీ ఆహార, వ్యవసాయశాఖ పార్లమెంట్ స్టేట్ సెక్రటరీ (సహాయ మంత్రి) మైఖేల్ స్టబ్జెన్ ఆధ్వర్యంలో ఆదేశ ఉన్నతస్థాయి అధికారుల ప్రతినిధుల బృందం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరి యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావుతో పాటు రిజిష్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ముఖాముఖి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బోధన, పరిశోధన, విస్తరణలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతోన్న కార్యక్రమాలను ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు వారికి వివరించారు.
గడచిన అయిదేశ్ళలో రాష్ట్ర వ్యవసాయరంగంలో ఎదురైన అనేక సవాళ్ళను సమర్ధవంతంగా పరిష్కరించి వరితో పాటు అనేక పంటలలో ఉత్పాదకతను, ఉత్పత్తిని గననీయంగా పెంచగలిగామన్నారు. నీటి ఆదా పద్ధతులను అభివృద్ధిపరచి వరిపంటలో మంచి ఫలితాలను సాధించగలిగామన్నారు. వివిధ పంటలలో నీటి యాజమాన్య పద్దతులపై పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. సమీకృత వ్యవసాయ సాగు పద్ధతులతో ఉత్పాదకతను పెంపొందించ గలిగామని వివరించారు. ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకుని పరిశోధనా కార్యక్రమాలను రీ ఓరియంట్ చేసుకున్నామని తెలిపారు.
పరిమిత వనరులతో ఎక్కువ దిగుబడులను సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. వనరుల సమర్థ వినియోగానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించుకుని అమలు జరుపుతున్నామని వివరించారు. ఇండో-జర్మన్ ప్రాజెక్టు అమలు వల్ల తమ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని తెలిపారు.
ఈ సందర్భంగా జర్మనీ ఆహార, వ్యవసాయశాఖ పార్లమెంట్ స్టేట్ సెక్రటరీ (సహాయ మంత్రి) మైఖేల్ స్టబ్జెన్ మాట్లాడుతూ ఇండో-జర్మన్ విత్తన ప్రాజెక్టులో జరుగుతున్న కార్యక్రమాలను అభినందించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న పథకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. తాను భారతదేశ పర్యటనకు రావాలని నిర్ణయించుకున్న తరువాత తెలంగాణను సందర్శించవలసిందిగా తమ రాయబార కార్యాలయం సూచించిందన్నారు. వ్యవసాయ రంగంలో సమాఖ్య స్పూర్తితో ఇక్కడ అమలవుతోన్న కార్యక్రమాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతోన్న కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధుల బృందం అభినందించింది.
అంతకుముందు ఆడిటోరియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను జర్మనీ పార్లమెంటు స్టేట్ సెక్రటరీతోపాటు ప్రతినిధుల బృందం ఆసక్తిగా పరిశీలించింది. ఈ సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ మీనా కుమారి, డాక్టర్ విష్ణువర్దన్ రెడ్డి, డాక్టర్ సదాశివరావు, డాక్టర్ వీరాంజనేయులు, కంప్ట్రోలర్ రమేష్‌తో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.