జి. యాదగిరి
పూర్వం తెలంగాణలో యక్షగానాలు (వీధి భాగవతాలు), తోలుబొమ్మలాటలు, పగటి వేషాలు, చిందు ఆటలు, ఒగ్గు కథలు ఇంకా అనేక జానపద కళారూపాలు ప్రజలకు వినోద విజ్ఞాన దాయకాలు. క్రమ క్రమంగా సినిమాలు, టీవీలు జన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత ప్రపంచీకరణ ప్రభావంతో జానపద కళలన్నీ కనుమరుగయ్యాయి. జానపద కళాకారులు బ్రతుకు తెరువు కరువై వీధిన పడ్డారు. అలాంటి వారిలో, తన వంద సంవత్సరాల జీవితంలో 67 సంవత్సరాలు యక్షగాన కళకే అంకితం చేసిన అరుదైన కళాకారుడు వైద్యం గోపాల్ ఒకరు.
వైద్యం గోపాల్ మహబూబ్‌నగర్ జిల్లా పూర్వ కల్వకుర్తి తాలూకా పోల్కంపల్లి గ్రామంలో వెంకటయ్య, లచ్చినర్సమ్మ దంపతులకు కీలక నామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమి మూల నక్షత్రం (1890సం.)లో జన్మించాడు. వెంకటయ్య ఆయుర్వేదం చేయడం మూలాన వైద్యం యింటి పేరయింది. ఆయన రాగి, వెండి, తగరం మొదలగు లోహాలను పుటం పెట్టి మందులు తయారు చేసేవాడు. వ్యవసాయం, బ్రాహ్మణికం కూడా చేసేవాడు.
గోపాల్ బాల్యమంతా ఒడిదొడుకుల మయం. బాల్యంలోనే తండ్రి గతించడంతో స్వగ్రామంలో ఉండలేక తల్లి లచ్చి నర్సమ్మ జీవనోపాధి వెతుకుతూ జూపల్లి, ఎల్లమ్మ రంగాపురం గ్రామాలకు చేరుకున్నది. తల్లితోపాటు గోపాల్ కూలినాలి చేస్తూ చదువుపై మక్కువతో అయిదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. అంతలోనే ”మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందాన తల్లి కూడా కన్నుమూసింది. కూలిపనే అతనికి అన్ని విధాల ఓదార్చే అదరువయింది. పనిచేసే సందర్భాల్లో శ్రమాపనోదం కొరకు పల్లీయులు పాడే పాటలే అతణ్ణి గాయకునిగా, క్రమంగా కళాకారునిగా మలిచాయి. తనకున్న కొద్ది పాటి జ్ఞానంతో రామాయణం, భారతం, భాగవతం, నీతి శాస్త్రాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ కర్ణ పేయంగా ఆలపించే స్థాయికి చేరాడు. ఆ క్రమంలో యక్షగానాలు అతణ్ణి ఆకర్షించాయి.
నాడు యక్షగానాల్లో బోగం (కళావంతులు, దేవదాసీలు) మహిళలు స్త్రీ పాత్రలు ధరించి ప్రదర్శించడం వలన తెలంగాణలో వాటిని ”బోగం ఆటలు” అనేవారు. భాగవత ఘట్టాలను బాల్యంలోనే ఒంట బట్టించుకున్న గోపాల్ యక్షగాన ప్రదర్శనల్లో తనదైన ముద్ర వేసిండు. ఈ కళను ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లా నల్లగొండ ప్రాంతాల్లో కూడా బహుళ ప్రదర్శనలు జరిపిండు. గోపాల్ ప్రదర్శనలకు జనం తండోపతండాలుగా వచ్చి తిలకించేవారు. యక్షగాన ప్రదర్శనల తోనే తృప్తి పడని గోపాల్ ఎందరో శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిండు. మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లమ్మ రంగాపురంలో పన్నెండు సంవత్సరాలు, తెల్కపల్లిలో పదిహేను సంవత్సరాలు, గౌరారంలో ఎనిమిది సంవత్సరాల పాటు ప్రదర్శనలిస్తూ, యక్షగాన అభినివేశపరులకు శిక్షణయిస్తూ, మొకురాల, రఘుపతిపేట, అమ్రాబాద్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ప్రాంత గ్రామాల్లో కూడా ప్రదర్శనలిచ్చాడు. ప్రసిద్ధ తెలంగాణ వాగ్గేయ కారుడు గొరటి వెంకన్న స్వగ్రామం గౌరారంలో గోపాల్ యక్షగాన మేళం ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇప్పించాడు. బాల్యంలో గొరటి వెంకన్న ఆ యక్షగానాలు చూసి, జానపద కళల్లో తాను రాణించడానికి గోపాలే స్ఫూర్తి, అతనే నాకు గురుతుల్యుడని ప్రశంసిస్తుంటాడు.
గోపాల్ తన శరీర సౌష్ఠవానికి, స్త్రీ సహజమైన గళ మార్దవానికి స్త్రీ పాత్రలు సరిగ్గా నప్పుతాయని భక్త ప్రహ్లాదలో లీలావతి, అహల్యలో అహల్య, తారాచంద్ర విలాసంలో తార, జలక్రీడలలో దేవకి, గరుడాచలంలో చెంచులక్ష్మి, చంద్రహాసంలో విషకన్య, ఉషా పరిణయంలో ఉష, నలదమయంతిలో దమయంతి, హరిశ్చంద్రలో చంద్రమతి, కాళిందీ విలాసంలో కాళింది, శశిరేఖా పరిణయంలో సుభద్ర, రామ నాటకం, లంకాదహనాల్లో సీత, తులాభారంలో సత్యభామవేషాలు కట్టేవాడు. ఇలా ఏండ్ల తరబడి స్త్రీ పాత్ర వేషధారణ ఆయన శరీరంలో జీర్ణించుకుపోయి, నిత్య జీవితంలో ఆయన అవయవ చాలనాలు స్త్రీలను తలపింపజేసేవి. కళాకారుల తల్లీనత అంటే ఇదేనేమో?
నాడు యక్షగాన ప్రదర్శనలు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు సాగేవి. ఆహార్యానికి హరిదళం (అర్దళం), తాళకం, కృష్ణ పాత్రకు నీలి, మీసాలకు బొగ్గు ఉపయోగించేవారు. రంగు రంగుల వరఖ్‌తో చేసిన కిరీటాలు, భుజకిరీటాలు సరే. ప్రదర్శనలో రాగాలు కాంభోజి, యదుకుల కాంభోజీ, శ్రీరాగం, ఘంటారాగం, తాళాల్లో ఏక తాళం ఆట తాళం, ఆది తాళం, జుల్వతాళం, జంపెతాళం, రూపక తాళం వాడుకునే వారు. మద్దెల, తాళాలు విరామం లేకుండా ఏకబిగిన మ్రోగుతూనే వుండేవి. రంగానికి ఇరువైపులా దివిటీలు వెలుగుతుండేవి. గానానికి, మద్దెల ధ్వనికి అనుగుణంగా పాత్ర ధారుల నాట్యం ఉద్ధతంగా వుండేది. ఒక్కఆటకు పారితోషికంగా ఇరవై, ముప్పయి రూపాయలు, బత్యం కింద అయిదుశేర్ల బియ్యం, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, ఆట ముగిసిన తర్వాత ఉదయం వేషాలతోనే ఊరిలో తిరుగుతూ, పాడుతూ దాతలను యాచించేవారు.
జీవితంలో ముప్పావు భాగం యక్షగాన కళకే అంకితం చేసినా స్వచ్ఛంద సంస్థల నుండీ, కళా సమాజాల నుండీ, ప్రభుత్వం నుండీ గోపాల్‌కు ఎటువంటి గుర్తింపుగానీ, అవార్డులు గానీ సన్మానాలుగానీ లభించలేదు. ఇది ఆయన అభిమానులను బాధకు గురిచేసింది. అయితే గోపాల్ ఇవన్నీ పట్టించుకోకుండా యక్షగాన కళను బతికించడం కోసమే పరితపించాడు. వందలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను అలరింపజేసిన గోపాల్‌కు తీపి గురుతుగా చూసి మురిసి పోవడానికి, మనుమలకు, మనుమరాండ్రకు చూపి తన ప్రతిభను చాటుకోవడానికి ఒక్క ఫోటో కూడా లేకపోవడం చింతించాల్సిందే.
వృద్ధాప్య భారం పైన పడి, యక్షగానాలకు జనంలో ఆదరణలేకపోవడంతో తన భార్య లక్ష్మమ్మతో ఎల్లమ్మ రంగాపురంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుటుంబ పోషణార్థం ఉల్లిగడ్డలు, చిరుతిండి బండారాలు అమ్ముకునేవాడు. చాలాకాలం తర్వాత తనకు, తన భార్యకు వచ్చే వృద్ధాప్య ఫించను రెండు వందల రూపాయలతో భారంగా నిరాడంబరంగా జీవితం వెళ్లదీశాడు. పిల్లలందరికీ వివాహాలు చేశాడు. గోపాల్ నూరేండ్ల వయసులో కూడా తన పనులు తానూ చేసుకునేవాడు. రెండు కిలో మీటర్ల దూరంలో వున్న పొలం దగ్గరి నుండి వంటచెరకు కట్టెమోపును తెచ్చుకునేవాడు. చేతికర్ర సాయంలేకుండా గ్రామంలోని రచ్చబండ దగ్గరికి చేరి, కళ్ళద్దాలు లేకుండా దిన పత్రిక చదువుతూ, అందరితో కలుపుగోలుగా ముచ్చటిస్తూ, మధ్యమధ్య యక్షగానం పాటలు రాగ యుక్తంగా, చిరువణకు కంఠధ్వనితో ఆలపించి అందరినీ ఆనంద పెట్టేవాడు.
పద్దెనిమిది సంవత్సరాల వయస్సు మొదలుకొని అరువై ఏడు సంవత్సరాల వయస్సు వరకు యక్షగాన ప్రదర్శనలకే జీవితాన్ని అంకితం చేసిన, చిత్తశుద్ధి కలిగిన అద్భుత తెలంగాణ కళాకారుడు గోపాల్ నూట ఒకటి సంవత్సరాల శతాధిక ప్రాయంలో 13 అక్టోబర్ 2010 నాడు సార్థక జీవిగా లోకం నుండి నిష్క్రమించాడు. తెలంగాణ కళాకారుల చరిత్రలో గోపాల్‌కు స్థానం కల్పించడం సముచితంగా వుంటుంది.