తెలంగాణ చదువుల కల్పవృక్షానికి నూరేళ్ళ పండుగ జరుగుతోంది. ఏడవ నిజాం హయాంలో మొలకెత్తిన ఈ జ్ఞాన తరువు కాలక్రమేణా దశదిశల్లో విస్తరించింది. తన చల్లని నీడలో చైతన్యపు కాంతుల్ని పండించింది. దేశాన్ని నడిపించిన విధాన నిర్ణేతలు, అక్షర జగత్తులో మెరిసిపోయిన రచయితలు, భారత బంగరు భవితవ్యానికి బాటలు వేసిన శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయులు ఇట్లా ఎందరికో మార్గదర్శకత్వాన్ని అందించింది.
డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
‘ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులము మేము’ అని చెప్పడానికి నేటికీ గర్వకారణంగా భావించేవారు ఎందరెందరో ఉన్నారు. గతంలో ఈ చదువుల నెలవులో విద్యార్థులు ఎన్నెన్నో ఉన్నత స్థానాల్ని అలంకరించారు. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్‌పాటిల్, మాజీ కేంద్ర హోంమంత్రి శంకర్‌రావు చవాన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్, కేంద్రంలో పలు కేబినెట్ శాఖలు నిర్వహించిన ఎస్. జైపాల్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి-ఇంకా ఎంతోమంది రాజకీయవేత్తలు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్షా భోగ్లే, ఇంకా పలువురు క్రీడా కారులు; క్రీడారంగ మేధావులు; రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వేణుగోపాల్‌రెడ్డిలాంటి ఆర్థికశాస్త్రవేత్తలు; భారత తొలి వ్యోమగామి రాకేశ్‌శర్మవంటి సాహసికులు- మరెందరో-అత్యంత సుప్రసిద్ధులు ఉస్మానియా విశ్వవిద్యాలయం (అ)పూర్వ విద్యార్థులు. ఇంకా ఈ ప్రతిభా పరంపర కొన సాగుతూనే ఉంది. అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ వంటి వారు ఇందుకు చక్కని ప్రతినిధులు! బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలీఘడ్ ముస్లిం యూని వర్సిటీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, జాదవ్‌పూర్ యూనివర్సిటీ-ఇవీ దేశంలోని పెద్ద విశ్వవిద్యాలయాలుగా చెప్పేవి. ఈ వరుసలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తప్ప కుండా స్థానం ఉంటుంది. తెలంగాణకు మాత్రమే కాదు, యావద్భారత దేశానికి పది దశాబ్దాలుగా ఉన్నత విద్యనందిస్తున్న జ్ఞాన వటవృక్షం ఉస్మా నియా యూనివర్సిటీ, దేశంలోనే ఏడవ అత్యంత పురాతన విశ్వవిద్యాలయం. దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన మూడవ విశ్వవిద్యాలయం. యావత్ హైదరాబాద్ సంస్థాన యువతరం ఉన్నత విద్యావకాశాల కోసం పరితపిస్తున్న వేళ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉదయించింది. వంద సంత్సరాల తెలంగాణ చరిత్రకు గంభీర సాక్ష్యమైన ఈ విద్యా సంస్థ ప్రారంభ నేపథ్యం ఆసక్తికరం.
హైదరాబాద్ సంస్థాన చరిత్రలో సర్ సాలార్ జంగ్ సమర్థవంతుడైన పాలనాధికారిగా గుర్తింపును పొందారు. ఆయన హయాంలోనే ఆధునిక విద్యా పవనాలు హైదరాబాద్‌ను ఆవరించాయి. బహుశా ఆయనే కనుక మరింతకాలంపాటు పాలనను కొనసాగించి ఉంటే, ఉన్నత విద్యారంగానికి అప్పుడే బలమైన పునాదులు పడేవి. ఆయన తరువాత కాలంలో ఉన్నత విద్యేకాదు- విద్యారంగం అన్ని దశల్లోనూ కుంటుపడి పోయింది. అయితే, 20వ శతాబ్ది తొలి దశకం నాటికి ఇతర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేసి వచ్చిన స్థానికులు ఇక్కడి ఉన్నత విద్యారంగంలోని లోపాల్ని గుర్తించారు. హైదరాబాద్ విద్యా మహాసభ అనే వేదిక ఏర్పాటైంది. ఆ వేదికలో వెలువరించిన అభిప్రాయాలకు గుర్తింపు లభించేది. ‘హైదరాబాద్ విద్యా మహాసభ’ నిజాం సంస్థానంలో చక్కని విశ్వవిద్యాలయ స్థాపనకోసం సర్కారుకు విజ్ఞప్తి చేసింది.
నాటి హోంశాఖ కార్యదర్శి సర్ అక్బర్‌హైదరీ. ఆయన పాలనాదక్షుడు, మేధావి, అన్నింటికిమించి దార్శనికుడు. ఉన్నత విద్యావసరాలకోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆవశ్యకతను ఆయన చక్కగా గుర్తించారు. ఈ విషయంలో ప్రత్యేకమైన చొరవను చూపించారు. 1917లో ఏప్రిల్ 26నాడు ఒక ‘ఫర్మానా’ జారీ అయింది. ఈ ఫర్మానా ద్వారా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 1918లో యూనివర్సిటీ ప్రారంభమైంది. మన దేశ ఉన్నత విద్యారంగ చరిత్రలో వందల కొద్ది మైలురాళ్ళను సృష్టించింది! స్థాపించిన వెనువెంటనే జాతీయస్థాయి గుర్తింపును సాధించింది. ‘ప్రాచీన ఆధునిక వైజ్ఞానిక సమ్మేళనంగా; భౌతిక-ఆధ్యాత్మిక, బౌద్ధిక స్ఫూర్తితో కూడిన బోధనలు చేస్తూ విజ్ఞాన వ్యాప్తికి సాధనమవుతూ అత్యున్నత శ్రేణి పరిశోధనలకు నిలయంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదుగుదలను సాధించాలని నాటి మేధావులు సంకల్పం చెప్పుకున్నారు.
మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన వెంటనే ప్రారంభమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రపంచశాంతికి అవసరమైన మానవీయ దృక్పథాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో తనదైన భూమికను పోషించింది.
ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్
ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మాణం విషయంలో చూపించిన శ్రద్ధను చాలా మంది మొన్నటితరం మేథావులు గుర్తు చేసుకునేవారు. చరిత్ర గ్రంథాలలోనూ ఈ మేరకు ఆధారాలున్నాయి. ఎర్రటి ఎండలో స్వయంగా నిలబడి విశ్వవిద్యాలయ భవన నిర్మాణాల్ని ఆయన పర్యవేక్షించారని చెప్పు కుంటారు. ఆర్ట్స్ కళాశాలను దేశంలోనే అత్యంత అద్భుతమైన రూపంతో తీర్చిదిద్దే క్రమంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ శ్రద్ధ ప్రస్ఫుటమవుతోంది. విశ్వవిద్యాలయం స్థాపించిన కాలంలో వివిధ ప్రదేశాలలో తరగతులు కొనసాగేవి. అయితే, కళాశాల సముదాయం ఒకేచోట ఉండాలని నిజాం నవాబు నిర్ణయించారు. విశాలమైన ప్రాంగణంలో ఈ భవనాలన్నీ తీర్చిదిద్దినట్టు ఉండాలనుకున్నారు. 1934వ సంవత్సరంలో యూనివర్సిటీ ప్రస్తుత ప్రాంగణంలోకి మారింది. తొలుత ఆర్ట్స్ కళాశాల, తరువాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ తదితర విభాగాల భవనాల నిర్మాణం పూర్తి అయింది. నిజాం పరిపాలన ముగిసిన తరువాత మరెన్నో ఆధునిక భవనాల నిర్మాణం జరిగింది. 1963లో ప్రస్తుత గ్రంథాలయ భవనం, న్యాయ కళాశాల, పరిపాలనా భవనం నిర్మాణమయ్యాయి. దేశంలోని అతిపెద్ద గ్రంథాలయాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ ఒకటి. 1925లో స్నాతకోత్సర విద్య, 1938లో పిహెచ్‌డి పరిశోధనలు ఆరంభమయ్యాయి. తొలుత అగ్రికల్చర్ (వ్యవసాయం), వెటర్నరి (పశువైద్యశాస్త్రం) విభాగాలు కూడా యూనివర్సిటీలో భాగంగా ఉండేవి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర గురించి అధ్యయనం చేసినవారు ఈ విద్యాసంస్థ గమనంలో నాలుగు దశల్ని గుర్తిస్తారు. అందులో తొలిదశ 1918-1947. ఇదొక చారిత్రాత్మక దశ. ఆ సమయంలోనే సంస్థ తన బాలారిష్టాల్ని దాటుకుంటున్నది. ఇదే సమయంలో మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉన్నత విద్యావంతుల్లో వినూత్న ఆలోచనలు ఉత్తుంగతరంగాలుగా ఎగిసివస్తున్నాయి. తొలుత ‘వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. మరో ఎనిమిది సంవత్సరాల్లో కమ్యూనిస్టు సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి నిజాం కళాశాల పూర్వ విద్యార్థి. విశ్వవిద్యాలయ ఆరంభంలోనే నిజాం నవాబు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నాటికి దేశంలోని విశ్వవిద్యాలయాలలో ఇంగ్లీషు మాత్రమే బోధనా మాధ్యమం. అయితే ఉస్మాన్ అలీఖాన్‌కు ఉర్దూపట్ల అభిమానం. ఆయన ఉర్దూను బోధనా భాషగా నిర్ణయించారు. అప్పటికి వైద్యం, ఇంజినీరింగ్, న్యాయశాస్త్రంవంటి అంశాల్లో ఇంగ్లీషులోనే గ్రంథాలున్నాయి. నిజాం నవాబు ఈ గ్రంథాలను ఉర్దూలోకి అనువదింపజేశారు. శరవేగంతో సమర్థవంతంగా అనువాదాలు అవసరమవుతాయి కనుక లక్నో వంటి సుదూర ప్రాంతాలనుండి కూడా అనువాదకుల్ని ఆహ్వా నించారు. ఉర్దూలో ఉన్నత బోధనా ప్రయోగం విజయవంతం కాలేదన్నది విద్యావేత్తల అభిప్రాయం. అయితే నిజాం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మనస్ఫూర్తిగా ప్రశంసించారు. ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్యాభ్యాసం ఆహ్వానించదగిన నిర్ణయమని విశ్వకవి వ్యాఖ్యానించారు. నిజాం నవాబు పాలన ముగిసిన తరువాత బోధనా మాధ్యమం ఇంగ్లీషులోకి మారింది. ఉర్దూ, వైద్య విద్య, ఇంజినీరింగ్, రసాయన శాస్త్రం, సివిల్ ఇంజినీరింగ్, న్యాయశాస్త్రం ఇట్లా పలు అంశాలు తొలి రోజుల్లోనే ప్రారంభమయ్యాయి. అటు తరువాత రోజుల్లో తెలుగు విభాగం ఆరంభమైంది. నవ్య కవిత్వకర్తల్లో ప్రముఖులైన ఆచార్య రాయప్రోలు సుబ్బారావు తెలుగు విభాగం తొలి అధ్యక్షులు.
భాష విషయంలో 1950లలో ఉస్మానియా యూనివర్సిటీ మరొక సవాల్‌ను ఎదుర్కొన్నది. యూనివర్సిటీని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. నెహ్రూ కూడా ఇందుకు సమ్మతించినట్టు చెబుతారు. ఇది హైదరాబాద్‌లోని విద్యావేత్తలు, ప్రజా నాయకులకు వేదనను కలిగించింది. తమ
ఉన్నత విద్యానిలయం వైవిధ్యభరితమైన విజ్ఞాన వ్యాప్తికి సంకేతం కావాలి తప్ప, ఏదో ఒక భాషకోసం ఉండరాదని వారు ఆందోళన చేపట్టారు. దేవులపల్లి రామానుజరావు ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి పెద్దలు ఆందోళనకు ఆశీస్సులు అందించారు. వాస్తవ పరిస్థితిని నెహ్రూ కూడా అర్థం చేసుకున్నారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
వందేమాతర ఉద్యమం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1938 నవంబర్-డిసెం బర్ మాసాల్లో వెల్లువెత్తిన వందేమాతర ఉద్యమం ఆధునిక హైదరాబాద్ చరిత్రలో ఉల్లేఖనీయమైనది. విశ్వవిద్యాలయం స్థాపించిన తరువాత జరిగిన తొలి విద్యార్థి ఉద్యమం కూడా ఇదే. ఆ ఏడాది నవంబర్ 28నాడు విద్యార్థులు వందేమాతరం గీతాన్ని పాడరాదని విశ్వవిద్యాలయం నోటీసు జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలని విద్యార్థులు వైస్‌ఛాన్సలర్‌ను అభ్యర్థిం చారు. ఈ అభ్యర్థనను తిరస్కరించడమేకాదు, 29 నవంబర్ నాడు విద్యార్థుల్ని యూనివర్సిటీనుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థులు నిరసనగా ఉద్యమాన్ని ప్రారంభించారు. నవంబర్ 29నుండి డిసెంబర్ 10 వరకు సమ్మె కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న 350 మందితోపాటు ఔరంగబాదు, గుల్బర్గా, మహబూబ్‌నగర్ విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో ఆయా విద్యా సంస్థలనుండి సస్పెండ్ అయ్యారు. వీరి చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. వీరిని చేర్చుకునేందుకు ఆంధ్ర-బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలు నిరాకరించాయి. హైదరాబాద్ ప్రముఖులు విద్యార్థులకు సంపూర్ణంగా అండదండలు అందించారు. నాగ్‌పూర్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ కె.టి. కేదార్ విద్యార్థుల్ని చేర్చుకోడానికి సుముఖత వ్యక్తం చేశారు. దీనితో ఇక్కడి విద్యార్థులు నాగ్‌పూర్, జబల్‌పూర్‌లలో తమ చదువులు పూర్తి చేసుకున్నారు.
నాడు వందేమాతర ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం బహిష్కరణకు గురి అయిన కొంతమంది రాష్ట్ర-జాతీయ రాజకీయాల్లో రాణించారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, హయగ్రీవాచారి, దేవులపల్లి వేంకటేశ్వరరావు, అచ్యుతరెడ్డి వంటివారు వారిలో ప్రముఖులు. హైదరాబాద్ సంస్థానంలో విద్యార్థులు నిర్వహించిన వందేమాతర ఉద్యమం ఆనాడు జాతీయస్థాయి నాయకుల్ని, మేధావులను ఆకర్షించింది.
పలు విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లు
ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆచార్య జి. రాంరెడ్డి అటు తరువాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతోపాటు ‘ఇగ్నో’ (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) వి.సి. అయ్యారు. యు.జి.సి. సారథిగానూ ఉన్నారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి కూడా రెండు యూనివర్సిటీలకు (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యా లయం) వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఉస్మానియా యూని వర్సిటీ చరిత్ర ఆచార్యులు వైకుంఠం కాకతీయ వర్సిటీ వి.సి. అయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం వి.సి. బాధ్యతలు నిర్వహించిన వారిలో పలువురు (పేర్వారం జగన్నాధం, ఎన్. గోపి, జి.వి. సుబ్రహ్మణ్యం, ఆవుల మంజు లత, ఎల్లూరి శివారెడ్డి, ఎస్వీ సత్యనారాయణ) ఉస్మానియా తెలుగు విభాగం పూర్వ విద్యార్థులు. ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన రవ్వా శ్రీహరి అదివరకు ఉస్మానియా తెలుగు విభాగంలో ఆచార్యులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇంకా పలువురు ఉస్మానియా విద్యావేత్తలు ఉన్నత విద్యారంగంలో వివిధ ఉన్నత స్థాయిలో రాణించారు.
విశ్వవిద్యాలయాన్ని పరిస్థితులకు, అవసరాలకు అను గుణంగా విస్తరించాలని 1960లలోనే నిర్ణయించారు. ఇది ఎంతో ముందుచూపుతో కూడిన నిర్ణయం. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెండవ పెద్ద పట్టణం వరంగల్‌లో స్నాతకోత్సవ కేంద్రం (పి.జి. సెంటర్) ప్రారంభమైంది. ఆచార్య బి.రామ రాజు, ఆచార్య సత్యనారాయణ సింగ్‌వంటి విద్యావేత్తలు ఇక్కడ సేవలు అందించారు. ఈ స్నాతకోత్సవ కేంద్రమే 1967లో కాకతీయ విశ్వవిద్యాలయంగా మారింది. భిక్‌నూర్ (నిజామా బాద్ జిల్లా – ప్రస్తుతం కామారెడ్డి జిల్లా) గోదావరి ఖని, కొత్తగూడెం తదితర పట్టణాలలో ప్రత్యేక అంశాలపై బోధనకోసం స్నాతకోత్సవ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఎందరో స్థానికులు చదువుకునే వెసులుబాటు కలిగింది. మహబూబ్‌నగర్, నల్లగొండల్లో ప్రారంభమైన స్నాతకోత్తర కేంద్రాలు తెలంగాణ విశ్వవిద్యాలయంతోపాటు (నిజామా బాద్) పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలుగా రూపొందాయి. ఇట్లా చిన్న మొక్కగా వందేళ్ళ క్రితం ప్రారంభమైన విశ్వవిద్యాలయం శాఖోపశాఖలతో తెలంగాణ అంతటా విద్యావృక్షమైంది. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటూ కొత్త చిగురు వేస్తోంది.
ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపికను చేపట్టిన తొలి విశ్వవిద్యాలయాలలో ఉస్మానియా ఒకటి. 1970ల ఆరంభం లోనే ప్రవేశ పరీక్ష విధానానికి అంకురార్పణ జరిగింది. ఆయా అంశాలపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన ప్రతిభావంతులైన విద్యార్థులు యూనివర్సిటీలో చేరేందుకు ప్రవేశపరీక్ష విధానం దోహదం చేసింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధనతోపాటు పరిశోధన ల్లోనూ తొలినుండే ముందున్నది. గతంలో, ఇప్పుడూ ఎన్నో విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. సైన్స్, టెక్నాలజీ వంటి విభాగాల్లో జరిగిన, జరుగుతున్న పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సాధించాయి, సాధిస్తున్నాయి. విద్యార్థులకు వందల సంఖ్యలో ఫెలోషిప్‌లు లభిస్తున్నాయి. అధ్యాపకులు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలకు ఎంపిక అవుతున్నారు, పరిశోధనా ప్రాజెక్టులు సాధిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో సామాజిక చైతన్యం నిరంతరం వెల్లివిరుస్తూ ఉంటుంది. సామాజిక శాస్త్రవేత్తలందరూ అంగీకరించిన సత్యమిది. వందల సంవత్సరాలపాటు భూస్వామ్య, రాచరిక సంస్కృతిలో కొనసాగిన తెలంగాణ ప్రాంతంలో ఇంతటి చైతన్యం రూపుదిద్దుకున్నదంటే అందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన కారణం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్ళిన తరువాత తాము సాధించిన చైతన్య స్ఫూర్తిని ప్రజానీకంలో వ్యాప్తి చేశారు. విస్తృత ప్రజా సమూహాలకు వారి వారి విధ్యుక్త బాధ్యతలు, సహజమైన హక్కుల్ని తెలియజేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమైనది, నిరుపమానమైది, చరిత్రలో విశిష్టమైన అధ్యాయంగా రచించ వలసినది కూడా.కొన్ని సంస్థలకు ఘనమైన గతమే ఉంటుంది. మరి కొన్నింటికి వర్తమాన వైభవమే చెప్పుకొనదగినది అవుతుంది. ఉస్మానియా విశ్వ విద్యాలయానికి మాత్రం ఘనమైన గతంతో పాటు మహత్తరమైన వైభవమూ ఉంది. వీటి పునాదులపై బంగారు భవితవ్యం కూడా ఉంటుంది. భారతీయ ఆధునిక విద్యా చరిత్రలో అత్యంత విలక్షణమైన సంస్థగా ఎదిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవాలు నిర్వహించు కుంటున్న ప్రస్తుత శుభతరుణం – తెలంగాణ వాసులందరికీ గర్వకారణమైన సమయం.
వైస్ ఛాన్సలర్లు వీరే
హబీబుర్ రహమాన్ 1918-1919
నవాబ్ వహీ ఉద్దౌలా 1920-1935
నవాబ్ మహదీ యార్ జంగ్ నవాబ్ 1936-1943
నవాబ్ అజంజంగ్ బహదూర్ 1943-1945
నవాబ్ అబీవర్ యార్‌జంగ్ బహదూర్ 1945-1946
డాక్టర్ వలీ మహమ్మద్ 1946-1947
డాక్టర్ రిజీ ఉద్దీన్ సిద్దిఖీ 1947-1948
నవాబ్ అలీవర్ జంగ్ బహదూర్ 1948-1952
ఆచార్య సూరి భగవంతం 1952-1957
ఆచార్య డి.ఎస్.రెడ్డి 1957-1969
ఆచార్య రావాడ సత్యనారాయణ 1969-1972
నూకల నరోత్తంరెడ్డి 1972-1975
జస్టిస్ పి. జగన్‌మోహన్‌రెడ్డి 1975-1977
ఆచార్య జి. రాంరెడ్డి 1977-1982
సయ్యద్ గుషమ్ అలీ 1982-1985
ఆచార్య టి. నవనీతరావు 1985-1991
ఆచార్య ఎం. మల్లారెడ్డి 1991-1995
ఆచార్య వి. రామకృష్ణయ్య 1996-1999
ఆచార్య డి.సి. రెడ్డి 1999-2002
ఆచార్య జె. అనంతస్వామి 2002-2004
ఆచార్య మహమ్మద్ సులేమాన్ సిద్ధిఖీ 2005-2008
ఆచార్య టి. తిరుపతిరావు 2008-2011
ఆచార్య ఎస్. సత్యనారాయణ 2011-2014
ఆచార్య రామచంద్రం – 2016 నుంచి
10 దేశానికి పది దశాబ్దాలుగా ఉన్నత విద్యనందిస్తున్న జ్ఞాన వటవృక్షం ఉస్మానియా యూనివర్సిటీ.
7 ఏడవ అత్యంత పురాతన విశ్వవిద్యాలయం.
3 దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన మూడవ విశ్వవిద్యాలయం.
1917లో ఏప్రిల్ 26నాడు ఒక ‘ఫర్మానా’ జారీ అయింది.
1918లో యూనివర్సిటీ ప్రారంభమైంది.
1925లో స్నాతకోత్సర విద్య ప్రారంభం.
1934వ సంవత్సరంలో యూనివర్సిటీ ప్రస్తుత ప్రాంగణంలోకి మారింది.
1938లో పిహెచ్‌డి పరిశోధనలు ఆరంభమయ్యాయి.
1977లో దూరవిద్యాకేంద్రం ప్రారంభమైంది.
యూనివర్సిటీలో వివిధ అధ్యయన కేంద్రాలు
1948-68 వరకు కొనసాగిన రెండవ దశలోనే విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ కాలం ఉంది. ఇది వరకే చెప్పినట్టు ఆంగ్ల మాధ్యమం ఆరంభమైంది. సూరి భగవంతం వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఈ రోజుల్లోనే వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. ఉన్నత విద్య సంపన్న వర్గాలకే పరిమితంకాకుండా సామాన్య యువతకు కూడా అందుబాటులోకి వచ్చిన కాలం అది. ప్రసిద్ధ రచయిత నవీన్ రచించిన ‘అంపశయ్య’ నవలలో ఆనాటి ఉస్మానియా యూనివర్సిటీ దృశ్యాన్ని గుర్తించవచ్చు. హిందీ, పొలిటికల్ సైన్స్, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, స్టాటిస్టిక్స్, జెనిటిక్స్, జియో ఫిజిక్స్ – ఇట్లాఎన్నో విభాగాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఉస్మానియా విశ్వ విద్యాలయ అనుబంధ కళాశాలల్లో పటిష్టమైన వ్యవస్థలు ఉండేవి. నిజాం కాలేజీ, ఉమెన్స్ కళాశాలతోపాటు సిద్ధిపేట, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి పట్టణాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నత విద్యలకు, చైతన్యాంకురాలు మొలకెత్తే క్రమానికి ప్రేరణగా నిలిచాయి.
తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయమే చిరునామా అన్న సంగతి తెలిసిందే. విశ్వవిద్యాలయ ప్రాంగణం బయట మాత్రమే కాదు, ప్రాంగణంలోనూ అన్యప్రాంత ఆచార్యుల ఆధిక్యతలు, ఇతర ప్రాంతాలనుండి చదువుల కోసం చేరినవారు తమపై చూపించే వివక్షావైఖరులు-ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల్ని ఆలోచింపజేశాయి. నాడు ఉద్యమంలో పాల్గొని అమరులైన వారున్నారు. నెత్తుటి గాయాల జ్ఞాపకాలతో ఉన్నవారున్నారు. ఇప్పటికీ తెలంగాణ నలుమూలల్లో ఆనాటి ఉస్మానియా పోరాటవీరులు కనబడతారు. కొద్దిమంది మాత్రం రాజకీయ రంగంలో కొనసాగారు.
1970-1993 మధ్య కాలం విశ్వవిద్యాలయ గమనంలో మూడవ దశ. ఆధునిక విద్యారంగంలో పొడసూపుతున్న కొత్త వైఖరులకు అనుగుణంగా విశ్వవిద్యాలయం తననుతాను వేదంగ తీర్చిదిద్దుకుంటూ వచ్చింది. ఇదే సమయంలో ప్లాటినం జూబ్లీ (వజ్రోత్సవం) జరిగింది. ఈ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి అంతర్జాతీయస్థాయి గుర్తింపు లభించింది. బయో కెమిస్ట్రీ, మైక్రోబయోలజీ వంటి అత్యాధునిక రంగాల్లో అధ్యయన పరిశోధనలు ముమ్మరమయ్యాయి. ఇంకా భారతీయ సమాజంలో కంప్యూటర్‌లు పెద్దగా ప్రవేశించని కాలంలోనే యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటైంది.
హ్యూమానిటీస్, ఆర్ట్స్, సైన్స్, సామాజిక శాస్త్రాలు, లా, ఇంజినీరింగ్, టెక్నాలజీ, కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఓరియంటల్ విజ్ఞానం-ఇట్లా అనేక అంశాల్లో సౌఖ్యమైన ఉన్నత విద్యలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా అందుతున్నాయి. నేరుగా కళాశాలల్లో చేరి చదువుకోలేని వారికోసం 1977లో దూరవిద్యాకేంద్రం ప్రారంభమైంది. ఇప్పుడది ఆచార్య జి. రాంరెడ్డి దూరవిద్యాకేంద్రంగా వేలాదిమందికి ఉన్నత విద్యను అందిస్తోంది. కళాశాలల అధ్యాపకుల కోసం, వారి పునశ్చరణ తరగతుల నిమిత్తం 1987లో అకడమిక్ స్టాఫ్ కళాశాల ఏర్పాటైంది. ఇంకా నిజామియా అబ్జర్వేటరీ వంటివి ఆయా రంగాలలో శిఖరస్థాయిలో నిలిచాయి.
ప్రపంచ ప్రఖ్యాతిపొందిన ఎంతోమంది ఆచార్యులు విశ్వవిద్యాలయంలో బోధన-పరిశోధనలు కొనసాగించారు. వారిలో కె. కుమార్ ఆంగ్ల విభాగంలో పనిచేశారు. అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉండేవారు. ఆయన అటు తరువాతకాలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎందరెందరో జాతీయస్థాయి మేధావులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్
రీసెర్చి అండ్ ట్రైనింగ్ యూనిట్ ఫర్
నావగేషనల్ ఎలక్ట్రానిక్స్
సెంటర్ ఫర్ ఏరియా స్టడీస్
ఆడియో విజువల్ రీసెర్చి సెంటర్
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్