గత వైభవాలకు తార్కాణంగా భారతదేశ చరిత్రకు సాక్షీభూతంగా, నేటికీ ఎన్నెన్నో కోటలు దేశమంతా మనకు కానవస్తాయి. అలాంటి కోటలను మనం చూసినప్పుడు నాటి చక్రవర్తుల పరిపాలన మన కళ్ళ ముందు కదలాడుతుంది. నాటి రాజుల వైభోగం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
కరీంనగర్ పట్టణానికి ఆగ్నేయంగా కేశవపట్నం మండలంలోగల గ్రామం మొలంగూర్. ఈ గ్రామం కరీంనగర్‌కు 30 కి.మీ. వంరగల్‌కు 40 కి.మీ. దూరంలో వుంది. మధ్య యుగంలో ఇది ఎలగందుల, ఓరుగల్లు కోటను కలిపే మార్గానికి మధ్యలో ఉండటంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఇక్కడ కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని అధికారులలో ఒకడైన వొరగిరి మొగ్గరాజు నిర్మించిన శత్రు దుర్భేద్యమైన కోట ఉంది.
ఈ దుర్గానికి పడమటి వైపు నున్నని బండరాయి, ఉత్తరం వైపు కోటపైకి ఎక్కడానికి వీలులేని నిలువైన బండరాళ్ళు, దక్షిణ దిశ వైపు కోట ఉన్న కొండకు సమాంతరంగా మరొక ఎత్తయిన కొండ వుండి ఎటువైపు నుండి కూడా కోటలోనికి శత్రువు ప్రవేశించడానికి ఏమాత్రం వీలు లేకుండా శత్రుదుర్భేద్యంగా ఈ కోట నిర్మించబడింది.
కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల, రామగిరి, జగిత్యాల మొదలైన కోటల వలె ఈ మొలంగూరు కోట కూడా ఓరుగ్లును, గోలకొండను పాలించిన రాజుల పాలనలో ఉండిపోయింది. ఆ రాజు ఈ దుర్భేద్యమైన కోటను తమ అవసరాలకు అనుగుణంగా ఎన్నో విధాలుగా ఉపయోగించుకునేవారు.
రెండు గుట్టల నడుమ కోటకు తూర్పు పడమరల్లో రెండు బలిష్ఠమయిన ప్రవేశ ద్వారాలున్నాయి. కొండపైకి వెళ్ళడానికి కొంతదూరం వరకు రాతి మెట్లు ఉన్నా ఆపై చాలా క్లిష్టమైన, దుర్లభమైన మార్గం ఎవరూ ఎక్కడానికి వీలు లేకుండా ఉంది. కొండపైకి వెళ్ళే మార్గం చూస్తే ఆ కాలంలో ప్రజలు, స్థానికులు ముఖ్యంగా రాజు కోటపైకి ఎలా ఎక్కగలిగారన్న అనుమానం మనకు కుగుతుంది. స్థానికులు మాత్రం కొండపైన నెలకొని ఉన్న ఆంజనేయ స్వామి దర్శనానికి చాలా అరుదుగా గుంపుగా వెళ్తారు. వారి తోడ్పాటులేనిదే కోట అగ్ర భాగానికి చేరుకోవడం ఎవరికైనా కష్టతరం.
కోట పైభాగంలో చుట్టూ రాతి ప్రాకారం, అక్కడక్కడా బురుజులు, మర ఫిరంగులు మొదలైనవన్నీ శిథిలావస్థలో మనకు కనిపిస్తాయి. పై భాగంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాయాన్ని కూడా మనం చూడవచ్చు. పై భాగంలో విశాలమైన మైదానం చెట్లు చేమలతో నిండి ఉన్నది. రెండు బండరాళ్ళ వంపుతో సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు ఒకటి వుంది. కోటలోని ప్రజలు, సైనికులు నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ కోనేరులో అన్ని కాలాల్లోనూ నీరు పుష్కంగా లభించేదట.
మొలంగూరు గ్రామం పూర్వపు పేరు ముదగర్ అని తెలుస్తుంది. కానీ కొండక్రింది భాగాన ‘మంగ్ షా వలి’ సమాధి ఉండటంతో ఈ ఊరు కొంతకాం పాటు మలంగూరుగా పిలవబడి అదే కాలక్రమంలో మొలంగూరుగా ప్రసిద్ధి పొందింది అని అంటారు.
గ్రామం ప్రాచీనతను సంతరించుకున్నా మిద్దెమేడగా పిలువబడే చెక్కు చెదరని ప్రాకారం చక్కటి కమానుతో నేటికీ శిథిలావస్థలో మనకు కనిపిస్తుంది. దాని ముందు భాగంలో ఒక రాతిచే నిర్మించబడిన బావి వుంది. దీనిని ‘గాడిచాని’ అంటారు.
ముప్ప భూపాలుని మంత్రి కేసన పూర్వీకులది మొలంగూరుగా, పద్మ పురాణోత్తరఖండం ద్వారా తెలుస్తుంది. కేసన, కందన తండ్రి ఔబళార్యుడు లేక అబ్బయామాత్యుడు, వీరి పూర్వీకులు మంత్రులుగను, దండాధీశులుగను ఉన్నట్లు ఈ కృతి వల్ల తెలుస్తున్నది. కందన మంత్రికి అంకితం గావించబడిన ఈ పద్మ పురాణోత్తరఖండంలో వారి వంశజుల చరిత్ర ఉటంకించబడిరది. వాణస వంశాన్వయులైన వీరి మూల పురుషుడు రుద్ర మంత్రి మొలంగూరు నేలినట్లు ఈ పద్యం వల్ల తెలుస్తున్నది.
ఇల వాణస వంశంబున జలరుహభవ నిభుడు నీతి చాణుక్యుడు నా
జెలువమరు రుద్ర సచివుడు
మొలగూరేలుచును సౌఖ్యమున జెలువొందున్
ఈ రుద్రమంత్రి కుమారుడు గన్నయ మంత్రి, కాకతీయ ప్రభువైన గణపతి దేవ చక్రవర్తి మన్ననకు పాత్రుడైనట్లును, తండ్రి పేరిట ‘రుద్ర సముద్రము’ అను బావిని తవ్వించినట్లు తెలుస్తున్నది.
గన్నయ మంత్రి కుమారుడు మల్లన మొలంగూరులో రామేశ్వరాలయము కట్టించినట్లు ఈ కృతివల్ల తెలుస్తున్నది కానీ ఇప్పుడు కోటలో ఎక్కడా మచ్చుకైనా మనకు రామేశ్వర ఆలయపు ఆనవాళ్ళు కనిపించవు.
గన్నయ మంత్రి నిర్మించిన గోపినాథుని ఆలయం ఉన్నా అందులో ఎలాంటి మూల మూర్తి కనిపించదు. అట్లే గణపేశ్వరుని గుడి కూడా ఈయన కట్టించినదే. బహుశా మహ్మదీయ రాజుల దండయాత్రల సమయంలో ఈ కోటలోని మందిరాలు కూడా ధ్వంసం చేయబడి ఉండవచ్చు.
కందన వంశీయులు మొలంగూరు వారగుటచే వారు దాన ధర్మ నిరతుగుటచే వారి వల్ల మొలంగూరు ప్రశస్తిని కలిగియున్నది. కేసన మంత్రి కూడా ధర్మపురి నారసింహక్షేత్రంలో అన్న సతమ్రు నెలకొల్పినట్లు, రామగిరిలో విష్ణు దేవాయము నిర్మించినట్లు పద్మ పురాణోత్తరఖండం ద్వారా తెలుస్తున్నప్పటికీ వాటి ఆనవాళ్ళు మచ్చుకైనా ఇప్పుడు దొరకవు.
ముసునూరి కాపయ నాయకుడు ఓరుగల్లును పాలించిన సమయంలో రేచర్ల సింగమ నాయకుడు సేనానిగా వుండేవాడు. అతనికి కాపయ నాయకత్వం ఇష్టం లేక అధికార విస్తరణలో జిల్లపల్లి కోటను ముట్టడించి భీకరంగా జరిగిన యుద్ధంలో సోమ వంశ క్షత్రీయుల చేత మరణించాడు. సింగమ నాయకుని కుమారులు అనపోతనాయకుడు, మాదానాయకుడు తమ తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి జిల్లపల్లి కోటను పెద్ద సైన్యంతో ముట్టడిరచగా, ఆ యుద్ధంలో అనేక మంది సోమ వంశ క్షత్రీయులు మరణించారు. కొందరు సోమవంశ క్షత్రీయులు యుద్ధం నుండి తప్పించుకొని శత్రుదుర్భేద్యమైన మొలంగూరు కోటలో తలదాచుకున్నట్లు చారిత్రకాధారాలున్నవి.
అసఫ్‌జాహీల కాలంలో ఎలగందుల కోట, రామగిరి కోటతో పాటుగా ఈ మొలంగూర్ కోట కూడా వారి ఆధీనంలోనే ఉండేది. ఎలగందుల పాలకులు పాలనలాగా మొలంగూర్ పాలకుల పాలన కూడా ప్రజారంజక ప్రాధాన్యత కలిగి ఉండేది అని చరిత్రకారుల అభిప్రాయం.
ఈ గ్రామానికి అత్యంత ప్రాచుర్యాన్ని కలిగించిన ఈ ఊరిలోని దూద్‌బౌలి అనే పేరుగల బావి, కొండ కింది భాగంలో ఇప్పటికీి ఉంది. ఇందులోని నీరు పాలవలె తెల్లగా వుండి, స్వచ్ఛంగా, తియ్యగా ఉంటాయి. అప్పట్లో ఈ బావిలోని నీటిని ఇక్కడి నుండి నిజాము కొరకై ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళే వారని చెబుతారు. కోటపైన వున్న కోనేరు నుండి కొంత నీరు కింది బావిలోనికి చేరుకోవటం వల్ల ఈ నీటికి ఔషధ లక్షణాలు ఉన్నాయని స్థానికుల విశ్వాసం. బావిలోకి నీరు చేరగానే రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలు బారులు కట్టి నీరు తీసుకొని పోవటం ఇప్పటికీ కొనసాగుతుందని స్థానికులు అంటున్నారు. ఈ నీటికి ఇంతటి ప్రాధాన్యత ఒనగూరటం వల్లనే నిజాం ప్రభువు కోసం ఈ నీటిని తీసుకెళ్ళేవారట.
ప్రకృతి సహజంగానే పటిష్టమైన, శత్రుదుర్భేద్యమైన కోటగా ఒకప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్న మొలంగూర్ కోట ఈనాడు నిరాదరణకు గురవుతోంది. దీని పైభాగాన గల శ్రీ ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేయడానికి ప్రతి శ్రావణ మాసంలో కొందరు భక్తులు అతి ప్రయాసతో తమ మొక్కు చెల్లించుకోవడానికి కొండ ఎక్కుతుంటారు. కానీ కోటపైకి వెళ్ళడానికి సరైన మెట్లు లేక చాలామంది పూర్తిగా పైకి ఎక్కలేక కొండ మధ్య నుండే నిరాశగా పైకి చూసి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటారు.
కొండ చివరి భాగంలో జారుడు భాగంలో ఆంజనేయస్వామి పాదాలుగా కనిపించే పాదముద్రలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. ఆంజనేయస్వామి పాదముద్రను ఉపయోగించుకుని భక్తులు కొండపైకి అడుగు వేస్తూ అతి జాగ్రత్తగా పైకి వెళ్ళాలని చెబుతారు. తమ కోరికు నెరవేరితే భక్తులు ఆంజనేయ స్వామికి మొక్కు చెల్లించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. నాటి రాజు నిర్మించిన రాతి దీపం పంక్తిని ఈనాటికీ శ్రావణ మాసంలో భక్తులు వెలిగించి ఊరికి ఏ అరిష్టం వాటిల్లకుండా కాపాడమని ఆ స్వామిని వేడుకుంటారు. ఈ రాతి దీప పంక్తిలో నేటికీ నాటి చమురు ఆనవాళ్ళు కనిపించడం గొప్ప విశేషం. నాడు ఈ దీప పంక్తిలో ప్రతినిత్యం వెలిగించే దీపాలు సుదూర ప్రాంతంలో మైళ్ళ దూరం వరకు కనిపిస్తూ భక్తులకు కనువిందు చేసేవి. చీకట్లో బాటసారుకు దిక్సూచిగా కనిపించేవని చెబుతారు.
ఒకప్పుడు అనేక దేవాలయాలతో శోభాయమానంగా వెలిగిన మొలంగూర్ కోట నేడు దైన్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ కోటని ప్రభుత్వ అధికారులెవరూ పట్టించుకోకపోవడం తమకెంతో బాధాకరంగా ఉందని ఈ మొలంగూర్ కోటను అభివృద్ధి పరచి ప్రజలకు సందర్శనాయోగ్యంగా మారిస్తే కోట పూర్వ వైభవం సంతరించుకోవడమేగాక, చారిత్రక సంపదను కాపాడుకున్నవాళ్ళమవుతాం అని స్థానికుల అభిప్రాయం. కోటను పర్యాటక కేంద్రంగా మారిస్తే గ్రామ ప్రజలకి ఉపాధి కల్పన పెరిగి గ్రామానికి బంగారుబాట పడుతుందని స్థానికు అభిప్రాయం. మనకున్న అత్యంత విశిష్టమైన, అద్భుత చారిత్రక ప్రాధాన్యం కల్గిన మొలంగూర్ కోట కూడా ప్రభుత్వ గుర్తింపు పొంది త్వరలోనే అభివృద్ధి చెందుతుందని మనం ఆశిద్దాం.
చెల్లాచెదురుగా కోటలో అక్కడక్కడా పడి ఉన్న చారిత్రక అవశేషాలను ఒక క్రమమైన పద్ధతితో మ్యూజియంలో పొందుపరచి వాటి విశేషాల సమాచారాన్ని కూడా తెలియజేసే విధంగా తగిన శ్రద్ధ వహిస్తే అటు పర్యాటకులకేగాక ఇటు ప్రాంతీయంగా కూడా ఎంతో మేలు చేసిన వారమవుతాం. చరిత్ర అనేతి జాతి పుట్టు పూర్వోత్తరాల వేలాది సంవత్సరాల మానవుని నాగరికత, సంస్కృతుల పురోగమన, ప్రక్రియను కార్య కారణ సమన్వయంతో వివరించే తాత్విక విధానం. తాత్విక జ్ఞానాన్ని బోధించి మనిషిని విజ్ఞానయుతుణ్ణి చేసే చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మొలంగూర్ కోటను దర్శించాలని మీరనుకుంటే కోట గురించి బాగా తెలిసిన గైడుతో పాటు కనీసం ఐదారుగురు బృందంగా మాత్రమే బయలుదేరండి. తగినన్ని మంచినీళ్ళు, స్నాక్స్ వెంట తీసుకుపోవడం మీకే మంచిది. కోట మొత్తం ఎక్కిన తరువాత శారీరక శ్రమను మరిచిపోవటమే కాదు అనాటి గొప్ప చరిత్రను చవిచూసిన గొప్ప అనుభూతి తప్పకుండా కలుగుతుంది.