tsmagazineకాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మంచినీటి పథకమైన ‘మిషన్‌ భగీరథ’ పనులు చేపడుతున్నందున, ఆ పనులు చాలా వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించడంతో పాటు, మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూరస్తున్నామని సిఎం వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగా, తక్కువ వ్యవధిలో అనుమతులు సాధించడానికి కషి చేసిన అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బ్యారేజీ లు, కాలువలు, టన్నెళ్లు, పంప్‌ హౌజ్‌లు, సబ్‌ స్టేషన్లు, స్విచ్‌ యార్డులు తదితర పనులన్నీ ఒక్కొక్కటిగా సిఎం సమీక్షించారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్‌ సహా 7 పాత జిల్లాలకు సాగునీరు, మంచినీరు అందిస్తున్నామని సిఎం చెప్పారు.

విద్యుత్‌ శాఖకు సిఎం ప్రత్యేక అభినందనలు
”తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ సిబ్బంది పరిస్థితిని అద్భుతంగా మెరుగు పరిచాం. జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం. తెలంగాణలో ఇకపై ప్రతీ రంగానికి 24 గంటలూ నాణ్యమైన కరెంట్‌ అందిస్తాం. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ గా వున్నాం. ఇప్పటికే 3 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. మరో నెలన్నరలో ఇంకో 500 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ ఇవ్వడానికి విద్యుత్‌ శాఖ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అనుకున్నదాని కంటే నెల ముందే విద్యుత్‌ శాఖ పని పూర్తి చేస్తున్నది. జెన్‌ కో- ట్రాన్స్‌ కో సిఎండి ప్రభాకర్‌ రావు ఇతర అధికారులు, సిబ్బంది చాలా బాగా పనిచేసి, విద్యుత్‌ విషయంలో రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. విద్యుత్‌ శాఖకు ప్రత్యేక అభినందనలు. విద్యుత్‌ శాఖ పని తీరుపై నేను చాలా తప్తిగా వున్నాను” అని ముఖ్యమంత్రి అన్నారు. పంప్‌ హౌజ్‌ ల వద్ద, ఇతర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను సిఎండి ప్రభాకర్‌ రావు, ఇతర అధికారులు వివరించారు.

హరీశ్‌పై కోటి ఆశలు: కేసీఆర్‌
”నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావుపై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని, తమకు నీళ్లు అందిస్తారని మంత్రి హరీశ్‌, నీటి పారుదల శాఖ అధికారులపై ఎంతో ఆశతో, నమ్మకంతో వున్నారు. దానికనుగుణంగానే వారు పని చేస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో మంత్రి బాగా పనిచేశారు. సిఇ వెంకటేశ్వర్లు కూడా మహారాష్ట్ర అధికారులతో ఎప్పటి కప్పుడు మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి కూడా ఇదే పట్టుదలతో పనిచేయాలి. ఇకపై మంత్రి హరీశ్‌ ప్రతీ 10 రోజులకోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలి. ప్రతీ నెలకోసారి నేను, సిఎస్‌ కూడా కాళేశ్వరం పనులు చూస్తాం. మేడిగడ్డ నుంచి మిడ్‌ మానేరు వరకు నీరు తీసుకరావడం చాలా ముఖ్యం. ఈ పనులు చేయడానికి ఇప్పుడు 200 రోజులు చేతిలో వున్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సత్వరం పనులు చేయాలి ” అని సిఎం చెప్పారు.
tsmagazine

నెలన్నరలో మిషన్‌ భగీరథ నీళ్లు : కేసీఆర్‌
”మిషన్‌ భగీరథ పథకం గొప్పగా నడుస్తోంది. మరో నెలన్నరలో 98 శాతం గ్రామాలకు నీళ్లు అందుతాయి. కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల ద్వారా మిషన్‌ భగీరథకు అవసరమైన నీరు అందించాలి. మిషన్‌ భగీరథకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఇతర రాష్ట్రాలు కూడా మిషన్‌ భగీరథ లాంటి పథకం అమలు చేస్తున్నామం టున్నారు. మన సహకారాన్ని కోరుతున్నారు. మనం కూడా అవసరమైతే ఆ రాష్ట్రాలకు మన అధికారులను పంపుతాం. మిషన్‌ భగీరథకు కాళేశ్వరం ద్వారా నీరు అందించాలి” అని సిఎం కేసీఆర్‌ చెప్పారు.

  • ”దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం అవసరమయ్యే నీటిని అందిచడానికి కొత్తూరు వద్ద నిర్మిస్తున్న బ్యారేజి పనుల్లో వేగం పెంచాలి. మంత్రి హరీశ్‌, ఇ.ఎన్‌.సి మురళీధర్‌ ఈ పనులపై ప్రత్యేక దష్టి పెట్టాలి” అని సిఎం సూచించారు.

మిడ్‌ మానేరు డ్యామ్‌ నిర్మాణంపై సిఎం సమీక్ష
డ్యామ్‌ నిర్మాణం పూర్తయిందని, రివిట్‌ మెంట్‌ చేస్తున్నా మని, 25 గేట్లకు గాను 10 గేట్లను బిగించామని, బండ్‌ పై రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్పారు. జనవరి నెలాఖరుకల్లా మిడ్‌ మానేరుకు సంబంధించిన పనులన్నీ వందశాతం పూర్తి కావాలని సిఎం చెప్పారు. 25 టీఎంసిల నీటిని నిల్వ చేయడానికి సిద్ధం కావాలని చెప్పారు.

మిడ్‌ మానేరు నుంచి గౌరవెల్లికి వెళ్లే కాలువ నిర్మాణం కూడా పూర్తి అయిందని, గౌరవెల్లి వరకు 80 వేల ఎకరాలకు నీరివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గౌరవెల్లి వరకు ఆయకట్టుకు నీరివ్వడానికి డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం కోసం అవసరమయిన భూసేకరణ కోసం వెంటనే 80 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సిఎం ఆర్థిక శాఖను ఆదేశించారు. మిడ్‌ మానేరు నుంచి గౌరవెల్లి దాకా 4200 క్యూసెక్కుల ప్రవాహ ఉధతికి తగ్గట్లు కాలువ, టన్నెల్‌ నిర్మించినట్లు అధికారులు చెప్పారు. 8.25 టిఎంసిల సామర్థ్యం కలిగిన గౌరవెల్లి రిజర్వాయిర్‌ నిర్మాణం వెంటనే నిర్మించా లని, నిర్మాణం పూర్తయ్యే లోపు అక్కడికి చేరే నీటిని వాడుకునేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని నీటి పారు దల శాఖ అధికారులను సిఎం ఆదే శించారు. గౌరవెల్లి ద్వారా 80వేల ఎకరాలకు నీరందించేందుకు నిర్మాణాలు చేపట్టాలన్నారు.

మిడ్‌ మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్‌ వరకు వెళ్లే టన్నెల్‌ నిర్మాణ పనులను, రిజర్వాయర్‌ పనులను సిఎం సమీక్షించారు. ఆగస్టు నాటికి టన్నెల్‌ నిర్మాణం పూర్తి చేస్తామని, సెప్టెంబర్‌ నాటికి రిజర్వాయర్‌ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. 55 మీటర్ల ఎత్తుకు గాను 12 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మించా మని, అక్కడి వరకు వచ్చే వర్షాకాలంలో నీరు నింపవచ్చని అధికారులు చెప్పారు. మల్కపేట రిజర్వాయర్‌ భూసేకరణ పూర్తయిందని, అటవీ అనుమతులు కూడా వచ్చాయని చెప్పారు. అటవీ ప్రాంతంలో చెట్ల గణన పూర్తి చేసి, రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరించాలని అటవీశాఖను సిఎం కోరారు.

హుస్నాబాద్‌, సిరిసిల్ల ప్రాంతాలు తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలని, మిడ్‌ మానేరు నుంచి గౌరవెల్లి, మల్కపేటకు త్వరగా నీళ్లివ్వడం వల్ల అక్కడి రైతులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాల్సి వస్తే, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కొత్త చట్టం (2017) ప్రకారమే చేయాలని సిఎం చెప్పారు. 2013 చట్టం కన్నా 2017 చట్టం వల్ల ఎక్కువ మేలు కలుగుతుందని వెల్లడించారు. నిర్వాసితుల భవనాలు, షెడ్డులకు ధర నిర్ణయించినట్లే బోర్లకు కూడా ధర నిర్ణయించాలన్నారు. బోర్లకు ఆర్‌ డబ్ల్యుఎస్‌, చెట్లకు అటవీశాఖ ధర నిర్ణయించాలని సిఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే అనంతసాగర్‌, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, తదితర రిజర్వాయిర్లపై సమీక్ష జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతిభవన్‌ లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు టి.హరీష్‌ రావు,ఈటల రాజేందర్‌, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, నీటి పారుదల అభివద్ధి సంస్థ చైర్మన్‌ శంకర్‌ రెడ్డి, ఎంపి బాల్కసుమన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు రామకష్ణారావు, పి.కె.ఝా, ట్రాన్స్‌ కో డైరెక్టర్లు సూర్యప్రకాష్‌, జగత్‌ రెడ్డి, నర్సింగ్‌ రావు, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఇ.ఎన్‌.సి మురళీధర్‌, సిఇ వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నతాధికారులు, వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
tsmagazine
కాళేశ్వరం పనుల పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగలకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు హెలికాప్టర్లలో పర్యటిస్తూ తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బ్యారేజీలు, పంప్‌ హౌజ్‌లు, కాలువల నిర్మాణాలను పరిశీలించారు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం, రాంపూర్‌, పోతారం పంప్‌ హౌజ్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పంప్‌ హౌజ్‌ పనులు జరుగుతున్న తీరును సీఎం కేసీఆర్‌ ఇరిగేషన్‌ అధికారులను, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను లోతుగా అడిగి తెలుసుకున్నారు. పంప్‌ హౌజ్‌ స్థలం వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో రైతులు ఇక భవిష్యత్‌లో వర్షానికి ఎదురుచూసే పరిస్థితి ఉండకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఇరిగేషన్‌ మంత్రి టి. హరీశ్‌రావును, అధికారులను ఆదేశించారు.

రోహిణి కార్తెలోనే నాట్లు పడే విధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. డిసెంబర్‌ మార్చి లోపే యాసంగి పంటల ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా రైతులకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్‌ హౌజ్‌ లు అన్ని పూర్తి కాగానే వచ్చే జూన్‌ నుండి గోదావరి బేసిన్‌ లోని అన్ని జిల్లాల్లో ఉన్న చెరువులు, కుంటలు అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన నింపడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడ కూడా సాగునీరు అందని భూములు లేకుండా ఉండేలా గోదావరి బేసిన్‌ లోని నదులు, కాల్వలు అన్నిటిపై చెక్‌ డ్యాంలు ఏర్పాటు చేయడానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మానేరు నదిలో నాలుగు నుండి అయిదు, మూలవాగు నదిలో రెండు నుండి మూడు వరకు ఇంకా అవసరం అనుకున్న ప్రతిచోట చెక్‌ డ్యాం ల నిర్మాణానికి ప్రణాళిక తయారు చేయాలని సీఎం సూచించారు. ముందుగా దీనికి అవసరమయ్యే సర్వే నిర్వహించాలని ఆదేశించారు. దేవాదుల నుండి వరంగల్‌ జిల్లా మొదలుకొని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు సాగునీటిని అందించే విధంగా చూడాలని చెప్పారు. వ్యవసాయం తరువాత అతిపెద్ద వ్యాపారంగా చేపల పెంపకం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

సమీక్షలో ముఖ్యమంత్రి చేసిన సూచనలు, అభిప్రాయాలు

  • అటవీ శాఖ అనుమతులు త్వరగా సాధించేందుకు పిసిసిఎఫ్‌ పి.కె.జా తో పాటు ఇతర అధికారులు బాగా శ్రమించారు. ఇదే స్పూర్తితో ప్రాజెక్టు పనులు చేయడానికి, విద్యుత్‌ టవర్లు, లైన్లు నిర్మించడానికి అటవీ శాఖ సహకరించాలి.
  • కాళేశ్వరం నుంచి ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి., సింగూరు, మిడ్‌ మానేరుకు నీరు అందితేనే మంచినీటి పథకం అమలు చేయగలం. కాబట్టి ఈ విషయాన్ని ద ష్టిలో పెట్టుకోవాలి.
  • ప్రతీ బ్యారేజిపైన డబుల్‌ లేన్‌ రోడ్డు నిర్మించాలి. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, కాల్వలు, పంప్‌ హౌజ్‌ లకు శాశ్వత ప్రాతిపదికన రహదారులు నిర్మించాలి.
  • ప్రతీ పంప్‌ హౌజ్‌ వద్ద ఒక విద్యుత్‌ ఉద్యోగిని ప్రత్యేకంగా నియమించి, నీటి పారుదల శాఖతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి.
  • ప్రతి బ్యారేజి వద్ద మంచి అతిథి గహం నిర్మించాలి.
  • బ్యారేజీలు, పంప్‌ హౌజ్‌ లు, కరకట్టలు, కాలువలు, రిజర్వాయర్లు తదితర పనులన్నీ సమాంతరంగా జరగాలి.
  • బ్యారేజీల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. నిరంతర నిఘా కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతీ ప్రాజెక్టు వద్ద కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి.
  • ప్రతీ బ్యారేజి వద్ద శాశ్వత ప్రాతిపదికపై హెలిప్యాడ్‌ లను ఏర్పాటు చేయాలి.
  • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ వద్ద 365 రోజులు నీరు అందుబాటులో వుంటుంది. కాబట్టీ ఎప్పుడు ఎంత పని జరిగితే, అంతమేర నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టు వందశాతం పూర్తయ్యే దాకా ఆగాల్సిన పనిలేదు.
  • తుపాకులగూడెం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల వద్ద గేట్లు ఆపరేట్‌ చేయడానికి అవసరమైన విద్యుత్‌ అందించాలి. జనరేటర్లు కూడా అందు బాటులో వుంచాలి.”లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం 400 కెవి లైన్లను సిద్ధం చేశాం. కేవలం ఒకే కేంద్రం నుంచి కాకుండా వేర్వేరు జనరేషన్‌ స్టేషన్ల ద్వారా విద్యుత్‌ అందించడానికి ఏర్పాట్లు చేశాం. లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ఏమాత్రం అంతరాయం కలగకుండా విద్యుత్‌ సరఫరా చేస్తాం” అని సిఎండి ప్రభాకర్‌ రావు చెప్పారు.
  • పంపు హౌజుల్లో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లతో కూడిన ప్యానెల్‌ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నియమించారు. ఈ ప్యానెల్‌ లో నీటిపారుదల శాఖకు చెందిన 16 మంది, విద్యుత్‌ శాఖకు చెందిన 10 మంది ఇంజనీర్లు వుంటారు.
  • రైతుల సమన్వయంతో విద్యుత్‌ లైన్లు వేయాలని, దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో కరీంనగర్‌ లో సమావేశం నిర్వహించాలని మంత్రి ఈటెల రాజేందర్‌ ను సిఎం కోరారు.
  • రామడుగు నుంచి వచ్చే నీటిని వరద కాలువలో కలిపే ప్రదేశంలో నీటి ప్రవాహ ఉధతిని తట్టుకునే పటిష్ట నిర్మాణం చేయాలని, ఇందుకోసం డిజైన్లు తయారు చేయాలని సిఎం చెప్పారు. మిడ్‌ మానేరుకు, ఎస్‌.ఆర్‌.ఎస్‌.పికి నీరు పంపేందుకు అనువైన డిజైన్లు రూపొందించాలన్నారు. మిడ్‌ మానేరు నిండిన తర్వాత బ్యాక్‌ వాటర్‌ మేనేజ్‌ మెంట్‌ కూడా ముఖ్యమని సిఎం చెప్పారు. వరద కాలువలోకి కాళేశ్వరం నీరు వచ్చిన తరువాత ఉండే పరిస్థితిని అంచనా వేసి, డిజైన్లు రూపొందించే బాధ్యతను ఇఎన్సీ మురళీధర్‌ కు ముఖ్యమంత్రి అప్పగించారు.

Other Updates