tsmagazine
పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా పెద్దపల్లి ఆవిర్భవిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. పారిశ్రామిక జిల్లాగా పేరుగాంచిన పెద్దపల్లికి పునర్‌వైభవం తేవడమే లక్ష్యంగా రామగుండంలో పునర్నిర్మిస్తున్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్‌సీఐ) పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మొత్తం రూ. 5254 కోట్ల 28 లక్షల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ పనులను డిసెంబర్‌ 2018 చివరి నాటికి పూర్తిచేసి జనవరిలో ఉత్పాదన ప్రారంభించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పునర్నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనులు పూర్తయితే ప్రతిరోజూ 3850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి అవుతుంది. మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1970లో బొగ్గు ఆధారితంగా యూరియా తయారీ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రామగుండం ఎరువుల కర్మాగారంలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి సాధించలేకపోవడంతో 19 సంవత్సరాల తరువాత మూసివేశారు. బొగ్గు గనులతోపాటు వెలుగులు నింపే ఎన్టీపీసీవంటి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉండడంతో రామగుండానికి మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు వచ్చింది. 1999లో రామగుండంలోని ఎరువుల కర్మాగారం మూతపడి నందున, ఈ ఎరువుల కర్మాగారాన్ని మళ్లీ పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, స్థానిక ఎంపీల నిరంతర కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునఃనిర్మాణానికి అడుగులుపడ్డాయి. మూతపడ్డ 20 ఏళ్ళ తర్వాత ‘రామగుండం ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ స్థానంలో కొత్తగా ‘రామగుండం ఫర్టిలైజర్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌’ పేరును 17 ఫిబ్రవరి 2015న నామకరణం చేసి 2016లో కొత్త యూనిట్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనులు 68 శాతం పూర్తి చేసినట్లు కర్మాగారం నిర్మాణ ప్రతినిధులు తెలిపారు.
tsmagazine

వాటాల విక్రయం ప్రక్రియ పూర్తి

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూనిట్‌లో వాటాల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. మొత్తం రూ. 5254 కోట్ల 28 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ యూనిట్‌లో ఇప్పటికే వాటాల నిర్ణయం జరిగింది. ప్రభుత్వరంగ సంస్థలైన నేషనల్‌ ఫర్టిలైజర్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌)కు 26 శాతం, ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌)కు 26 శాతం, మూతపడిన రామగుండం ఎఫ్‌సీఐ ఆస్తులు బదలాయించిన క్రమంలో వాటి ఫలితంగా 11 శాతం వాటాను ఎఫ్‌సీఐకి, మరో 11 శాతం వాటాను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. దీంతో మరో 26 శాతం వాటాకు ఎస్‌బీఐ ఫెసిలిటీ ఏజెన్సీగా వుంటుంది.

కొనసాగుతున్న గ్యాస్‌లైన్‌ పనులు

గ్యాస్‌ ఆధారితంగా నడిచే ఎరువుల కర్మాగారం కావడంతో అందుకు కావల్సిన గ్యాస్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి. వాస్తవానికి కాకినాడ నుంచి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌, ఫైజాపూర్‌ వరకు 1881 కిలో మీటర్ల పైప్‌లైన్‌ సహజవాయువును సద్వినియోగం చేసుకోవాలని 2011లో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు రెగ్యులేటరీ బోర్డు నిర్ణయించింది. కాకినాడ నుంచి భోపాల్‌, ఫైజాపూర్‌లైన్‌ మన రాష్ట్రంనుంచి వెళుతున్న నేపథ్యంలో ఆ గ్యాస్‌ను రామగుండం ఎరువుల కర్మాగారం పనులకు ఉపయోగించు కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకినాడనుంచి రామ గుండానికి 362 కి.మీ. పైప్‌లైన్‌ నిర్మాణం చేస్తుండగా, ఇందులో ఏపీలో 67 కి.మీ., తెలంగాణలో 295 కి.మీ. వేస్తున్నారు. పైప్‌లైన్‌ నిర్మాణం కొరకు కేవలం 147 ఎకరాల 6 గుంటల భూమిని ఆర్‌వోయూ అనగా భూ యజమాని నుంచి పీ అండ్‌ ఎంపీ యాక్ట్‌ 1362 ప్రకారం పెట్రోలియం అండ్‌ మినరల్స్‌ యాక్ట్‌ 1962కు అనుగుణంగా భూసేకరణ చేశారు.
tsmagazine

గ్యాస్‌తోపాటు ఇతర అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ టీఎస్‌ఐపాస్‌లో భాగంగా యూనిట్‌ విద్యుత్‌కు రూ. 100 రాయితీ ప్రకటించింది. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి 0.55 టీఎంసీ నీరు అందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. పనిచేసే కార్మికులకు తాగునీటి కోసం మిషన్‌ భగీరథనుంచి పైప్‌లైన్‌ వేసేందుకు సైతం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ జరుగుతున్న పనులలో టెక్నాలజీ టెండర్లు పూర్తి చేయడం జరిగింది. అమ్మోనియాకు సంబంధించి డెన్మార్క్‌కు చెందిన హల్టర్‌టాప్స్‌, యూరియాకు సంబంధించి స్టెమి కార్బన్‌లకు టెండర్లు ఖరారై పనులు సాగుతున్నాయి. ఈ రెండు సంస్థలకు ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లిం చింది. పరిపాలన భవనంతోపాటు ఇతర అవసరాల కోసం వినియోగించే భవనాలు, ఇతర సదుపాయాల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. కర్మాగారానికి అవసరమైన అనేక యంత్రాలు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడుగా కర్మాగారానికి అవసరమైన నీటి కొరకు పనులు జరుగుతున్నాయి. ఫర్టిలైజర్‌ కాంప్లెక్స్‌లో ద్రవాల శుద్ధీకరణ కోసం ప్రతిపాదించిన సమగ్ర వ్యర్థ నీటి నిర్వహణ వ్యవస్థను రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు పరిధిలో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రకాల కంప్రెషర్లను, సీపీపీలోని జీటీఎస్‌ల డ్రైవింగ్‌కోసం అత్యంత సమర్థ వంతమైన గ్యాస్‌ టర్బైన్లను నిర్మిస్తున్నారు.
tsmagazine
ఉత్పాదన ప్లాంట్లనుంచి వెలువడే పదార్థాలను శుద్ధి చేసేందుకు పనులు సాగుతున్నాయి.అమ్మోనియా నిల్వ చేసేందుకు నిర్మాణాలు సాగుతున్నాయి. దాదాపు 20,000 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా, 40,000 మెట్రిక్‌ టన్నుల యూరియాను నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పూర్తయితే 500మందికి ప్రత్యక్షంగా, 2000మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

మొత్తం వ్యయం రూ. 5254 కోట్లు
ప్రతిరోజు ఉత్తత్తి యూరియా 3850 మెట్రిక్‌ టన్నులు
అమ్మోనియా 2200 మెట్రిక్‌ టన్నుల ప్రస్తుతం పూర్తయిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పనులు

జీ వీరయ్య, పెద్దపల్లి

Other Updates