‘‘శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు వేగంగా విస్తరిస్తాయి. నిరుద్యోగ సమస్య ఉండదు . విద్య, వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతి కనబడుతుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో నూతనత్వం వెల్లి విరుస్తుంది. అందుకోసం, న్యూయార్క్, లండన్ తరహాలో మన పోలీస్ వ్యవస్థ పనిచేయాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని విశ్వ వ్యాప్తం చేయాలి.’’ 2 జూన్, 2014న రాష్ట్ర ముఖ్యమంత్రి గా కె.సి.ఆర్ ప్రమాణం చేసిన అనంతరం తన మొట్ట మొదటి ప్రసంగం లో చేసిన వ్యాఖ్యలు ఇవి.
రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 56వేల మంది పోలీసు సిబ్బందికి కె.సి.ఆర్. మాటలు ఒక్క సారిగా ఉత్తేజాన్ని, ఒక కొత్త స్పందనను ఇచ్చింది. 12 ఆగస్ట్, 2014న తెలంగాణా రాష్ట్ర పోలీస్ లోగో ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి 14 ఆగస్ట్, 2014 న, అంటే, ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండున్నర మాసాలలో చేశారు. సుమారు 300 కోట్ల వ్యయంతో పోలీసులకు నూతన వాహనాలను మంజూరు చేసింది.
ఉన్నతాధికారులకు ఫార్చూనర్ వాహనాలను సమకూర్చడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఈరోజు కొత్త వాహనాలు ఉన్నాయి. ఇందువల్ల హైదరాబాద్ నగరంలో ప్రతి సందు గొందుల్లో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, గల్లీ గస్తీ పేరుతో ఇద్దరు కానిస్టేబుళ్లు మోటార్ సైకిళ్ళపైన తిరుగుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న వైనం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి పోలీస్ స్టేషన్‌కు నిర్వహణ చార్జీల కింద ఇచ్చే సొమ్మును రెట్టింపు చేసింది. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి పోలీస్ స్టేషన్‌లకు 25, 50, 75 వేల రూపాయల చొప్పున ప్రతి నెల ఇవ్వడం వలన పోలీసుల్లో ఆత్మస్థైర్యం వచ్చింది. అమరులైన పోలీసులకు ఎస్.ఐ. స్థాయి అధికారికి ఇచ్చే 25 లక్షలను 40 లక్షలకు పెంచడం, ఆపై స్థాయి అధికారికి 45 లక్షలకు, ఐ.పి.ఎస్. అధికారులకు ఒక కోటి రూపాయలవరకు పెంచడం వలన పోలీసుల్లో మనో ధైర్యం ఏర్పడిరది. పోలీసుల కరువు భత్యాన్ని 90 నుండి 250 రూపాయలకు పెంచడం, ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటుగా, వారి మెడికల్ సీలింగ్ ను ఏడున్నర లక్షలకు ప్రభుత్వం పెంచింది. హోం గార్డుల వేతనాలు 12 వేలకు పెంచడం జరిగింది. ఇవన్నీ నూతన తెలంగాణా ప్రభుత్వం పోలీసులకు ఇచ్చ్చిన వరాలు.
షీ టీమ్స్ పేరుతో మహిళల రక్షణకోసం పోలీస్ శాఖ నడుం బిగించింది. బస్సు స్టాండులలో, పాఠశాల, కళాశాలల ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్‌లలో ఆడపిల్లలను వేధించకుండా ఆరుగురు సభ్యులతో కూడిన పోలీస్ బృందం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, లేదా కౌన్సిలింగ్ ఇవ్వడం, నేరం పెద్దదిగా వున్నపుడు నిర్భయ చట్టాన్ని ఉపయోగించడం జరుగుతున్నది. సంఘ వ్యతిరేక శక్తుల ఆటలు కట్టించడానికి జంట నగరాలలోని వివిధ ప్రాంతాల్లో రాత్రికి రాత్రి పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం వలన నేరాలకు పాల్పడుతున్న వందలాది మంది యువత పట్టు పడుతున్నారు. వీరిలో అనేక మంది గొలుసు దొంగలు కాగా, రౌడీలు, గుండాలు ఎంతోమంది పట్టు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మైనర్ పిల్లలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానులు కూడా ‘కార్డాన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ లో బయటపడ్డారు.
గత ఏడాది కాలంలో పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసుకోడం జరిగింది. సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయం లో కూర్చుని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం ద్వార ఊరేగింపులను, ర్యాలీలను ప్రశాంతంగా జరుపుకునే వీలు కలిగింది. ఎవరు ఎక్కడ విధుల్లో ఉన్నారు, ఏ వాహనం ఎక్కడ ఉన్నది తెలుసుకునే వీలు కలిగింది. కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ – ఛాలన్ ద్వార ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కంట్రోల్ చేయడం, వాట్ట్స్ ఆప్ 9490617444 ద్వార పోలీసులకు ప్రజలకు మధ్య వేగవంతమైన సమాచార వ్యవష్టను నెలకొల్పడం, డయల్ 100 సిస్టం అనుసంధానం చేస్తూ. ఫస్ట్ ద్వార ఆధునికరించడం జరిగింది. అంతేకాదు తెలంగాణ స్టేట్ పోలీస్ పేరుతో ఫేస్‌బుక్‌ని ప్రవేశపెట్టడంతో పాటుగా నగరంలోని సుమారు 60 పోలీస్ స్టేషన్ లను అనుసంధానం చేస్తూ వై-ఫై సౌకర్యం తదితర సోషల్ నెట్ వర్క్ తో ప్రజలకు పోలీస్ లకు మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం జరుగుతున్నది. పాస్ పోర్ట్ కావాలంటే, వెరీ ఫాస్ట్ యాప్ ద్వార ఐ ప్యాడ్‌లను ఉపయోగిస్తూ వారం రోజుల వ్యవధిలో ఇచ్చే ఏర్పాట్లు చేశారు. గచ్చిబౌలి ఐ.టి. క్యారిడార్‌లో మహిళల భద్రత కోసం అత్యాధునిక సి.సి. కెమరాలు, షి టాక్సీలను అందుబాటులోకి తెచ్చారు. ఏవైనా వస్తువులు పోగొట్టుకుంటే పోలీసులకు తెలియడం కోసం, తిరిగి ఆ వస్తువులను స్వంత దారులకు చేర్చే విధానంలో కూడా పోలీసులు ఐ.టీ సాధనాన్ని కనుగొన్నారు. డి.జి.పి కార్యాలయంలో కే.ఎం. ఆటం యాప్‌తో పేపర్ లెస్ విధానాన్ని రూపొందించడం జరిగింది.
గత ఏడాదికాలంలో కొన్ని కొత్త పోలీస్ స్టేషన్లను ప్రారంభించుకోవడం జరిగింది. పూర్తిగా మహిళా సిబ్బందితోనే వుండే పోలీస్ స్టేషన్ ఐ.టీ. క్యారిదార్ ఆదిభట్లలో ప్రారంభించుకుంటే, రాజేంద్రనగర్, మీర్‌పేట్ , కాటారం,. కేతేపల్లి, సిద్ధిపేటలలో ప్రారంభించుకున్నాం.
శాంతి భద్రతలే కాదు, సామాజిక పరిరక్షణలో కూడా మేము ముందుంటాం అంటూ పోలీస్ శాఖ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ మరియు స్వచ్ఛ భారత్, స్వచ్ఛతెలంగాణ కార్యక్రమాల్లో పోలీసు సిబ్బంది చురుకైన పాత్రను పోషిస్తునారు. తెలంగాణా లోని ప్రతి జిల్లాలో 4 నుండి 5 లేదా అంతకు ఎక్కువగానే చెరువులని పోలీసులు దత్తత తీసుకున్నారు. ఎస్.పి స్థాయి అధికారి నుండి కానిస్టేబుల్ వరకు చెరువుల్లో మట్టిని తీయడం, ఆసుపత్రుల్లోని చెత్త చెదారాన్ని తొలగించడం చేస్తున్నారు. మేక్ ఏ- విష్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు మనో ధైర్యాన్ని అందిస్తున్నారు. ప్రమాదాల్లో చనిపోయిన వారి అవయవాలను మరొకరికి అందించడంలో ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ నిలిపి వేసి ఉదారతను చాటుకుంటున్నారు.