vlinamతెలంగాణ సమస్యపై 1969 సెప్టెంబర్‌ 23న రాష్ట్ర శాసన సభ సుదీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్‌, ప్రతిపక్షాలకు చెందిన పలువురు శాసన సభ్యులు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తెలుగు జాతి శ్రేయస్సుకోసం పదవి నుండి వైదొలగాలని, రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం ద్వారా సమస్యను కూలంషంగా చర్చించి రాష్ట్ర సమగ్రతకు నిర్దిష్టమైన పద్ధతులను కనుగొనాలని సూచించారు.

స్వతంత్ర పార్టీ నాయకులు గౌతులచ్చన్న, టి.పురుషోత్తమరావు, టి.లక్ష్మారెడ్డి తెలంగాణ సమస్యపై చర్చకు శాసన సభ 95వ నిబంధన క్రింద ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. టి. పురుషోత్తమ రావు చర్చను ప్రారంభిస్తూ… ”ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల సమస్యలను, కష్టనిష్టూరాలను గమనించలేకపోయినందున అధికారంలో వుండే అర్హతను కోల్పోయింది” అన్నారు. తొమ్మిది నెలలుగా తెలంగాణలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమం చారిత్రాత్మకమైన ఉద్యమమని, పోలీసుల ద్వారా కాంగ్రెస్‌ నాయకులు ఎంతో కాలం పరిపాలన చేయలేరని పురుషోత్తమ రావు అన్నారు. ఆయన ఎంతో ఉద్వేగంతో మాట్లా డుతూ.. ”వందలమందిని జైళ్లకు పంపి, లెక్కలేనన్ని సార్లు కాల్పులు జరిపించి, లాఠీ చార్జీలు చేయించి, అరాచకానికి తోడ్పడిన ప్రస్తుత ప్రభుత్వం తన తప్పిదాలను గుర్తించకుండా సమస్యను ఇంకా తప్పుదారిపట్టించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నది” అని అన్నారు.

”తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి, విడిపోవలసిన ఆవశ్యకత గురించి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 17 నెలల్లోనే అప్పటి కేంద్ర హోం మంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌కు, రెండున్నర సంవత్సరాలకు ప్రధాని నెహ్రూకు వినతి పత్రాలను తెలంగాణ నాయకులందించారు”అని పురుషోత్తమ రావు సభకు తెలిపారు.

”ఉద్యమం అన్ని రంగాల్లోకి ప్రాకింది. స్త్రీలు, పురుషులు, పాపలు, వృద్ధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు,ఉద్యోగులు వేలాదిగా కదలివచ్చారు. జైళ్లకు వెళ్లారు. క్రమశిక్షణతో నడుచుకున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కొనసాగిన ఉద్యమాన్ని అణచడం కోసం ప్రభుత్వం క్రూరమైన, నికృష్టమైన పద్ధతులను అనుసరించింది”అని పురుషోత్తమరావు అన్నారు. రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించబడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ మాట్లాడుతూ, ”తెలంగాణకు రాజకీయ పరిష్కారం కనుగొనడంలో శాసన సభ విఫలమైతే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పోతుంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందో ప్రస్తుత శాసన సభ్యులు చాలా మందికి తెలియదు. తెలుగు జాతి అంతా ఒక్క రాష్ట్రంలో ఉండాలని కోరుకున్న వాళ్లలో నేనూ ఒక్కడిని. ఆనాడు ప్రజల సందేహాలు నిరాధారమనుకున్నాను. అవి నిజమని 13 ఏళ్ల తర్వాత ధృవపడింది” అని అన్నారు.

”తెలుగు జాతి ఎన్ని రాష్ట్రాలలో వున్నా తెలుగు జాతి ఔన్నత్యానికి కృషి చేయవచ్చు. తెలంగాణ ఇబ్బందులు తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు హృదయపూర్వకంగా జరిగాయి. కొన్ని లోపాలు ప్రయత్న పూర్వకంగా జరిగాయి. దురుద్దేశ్య పూర్వకంగా అన్యాయాలు జరిగాయి. అన్యాయాలు జరగడానికి అనేకమంది బాధ్యులు. ముఖ్యమంత్రులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రాంతీయ సంఘం ఎప్పటికప్పుడు లోపాలను ప్రభుత్వ దృష్టికి తెచ్చింది. న్యాయం జరగడానికి వారికి శక్తి కలగడం లేదు. అన్యాయం జరిగిందని అంగీకరించబడింది”అని కొండా లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు.

తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ”కర్నూలు వద్ద కాల్పులు జరిగితే న్యాయ విచారణ జరిపించారు. తెలంగాణ ప్రాంతంలో కాల్పులు జరిగితే న్యాయవిచారణ జరిపించలేదు. మంత్రిగా నేను ఇచ్చిన సలహాను కూడా పాటించలేదు. మద్రాసు నుండి వేరు కావాలని ఆనాడు ఆంధ్రులు కోరినట్లుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ నుండి వేరు కావాలని తెలంగాణ వారు కోరుతున్నారు. దౌర్జన్యం వల్ల, ఆధిక్యత, అహంభావం వల్ల, ఎత్తులు కుట్రల వల్ల సమగ్రత కాపాడలేదు. విడిపోవడం వల్ల చిచ్చులు రావు. స్నేహితులుగా విడిపోదాం. అవసరమైతే మూడు తెలుగు రాష్ట్రాలేర్పడినా తప్పులేదు. హృదయాలు కలవాలని కోరేవారు మార్గాలు చెప్పండి, తెలంగాణ వారిని బానిసలుగా చేసి, గోరీలు కట్టి సమైక్యత కోరుతున్నారా? శాసనసభ పరిష్కార మార్గం చూపకపోతే రాజకీయ సమస్యను వీధులలో పరిష్కరించుకునేటట్లు చేసిన వారమవుతాము. ప్రజలకు ప్రజాస్వామ్యంలో విశ్వాసం పోతుంది” అని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సి.పి.ఐ. నేత సి.హెచ్‌. రాజేశ్వర రావు మాట్లాడుతూ ”ఆంధ్రజాతి సమైక్యతను భంగపరిచినట్లయితే చరిత్రలో క్షంతవ్యులం కాకుండా పోతాం. ప్రస్తుత సమస్య పరిష్కారానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా చిత్తశుద్ధితో కృషి చేస్తే ఆంధ్రజాతి మహాగండం నుండి బయటపడగలదు”అని ఆయన అన్నారు.

”పరిస్థితులు చక్కదిద్దడానికి గాను కొంత కాలం పాటు శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలి”అని రాజేశ్వరరావు అన్నారు.

వి.బి. రాజు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన మాటల్లోనే ”ఈ రాష్ట్ర సమగ్రతను కాపాడాలని కోరుతున్న వారిపై విడిపోవాలనుకునే వారికన్నా హెచ్చు బాధ్యత ఉన్నది. విడిపోదామనుకునేవారిని ఒప్పించి దారికి తేవాలి. అంతేకాని ఒకరిపై ఒకరు నిందలు వేసుకో రాదు. లక్ష్యసాధనకు మార్గం చూడాలి. ఒకటిగా ఉండాలని వూరికే మాట అంటుంటే ఉండలేము. భాషాభిమాన బంధంతో జనాన్ని ఒక చుట్టలా చుట్టలేమని తేలిపోయింది. ఆర్థిక సమానత్వం, సంతృప్తి లేకుండా, రాజకీయ భాగస్వామ్యం లేకుండా భాషాభిమానం వల్ల ఒకటిగా ఉండడం సాధ్యంకాదు.

”రాష్ట్ర సమగ్రత ఉండాలి. విశాలాంధ్ర ఏర్పడడానికి కారకులలో నేనూ ఒకడిని. అందుకే విడిపోతామనే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు. ‘వారి వెంట గాలి పడగ మాదిరి మీరు పోతున్నారు’ అనవచ్చు. నిజమే. ప్రాధాన్యత ఇది. విడిపోవడమే మంచి విధానమని నమ్ముతున్న వారిని విడిపోవడం మంచిది కాదని ఒప్పించాలి. ఏకంగా ఉన్న రాష్ట్రాన్ని తునకలు కావాలని ఎందుకంటున్నారనేది అర్థం చేసుకోవాలి.

”ప్రత్యేక తెలంగాణ వాదులను ఎన్నికల్లో ఓడిద్దాం, నోరుమూయించాలి, అపనిందల పాలు చేయాలి, బలహీనపర్చాలి అంటే సమస్యలు పరిష్కారం కావు. కోపాన్ని అవమానభావాలను వదిలి తృప్తితో ముందడుగు వేస్తే ఈ ఉద్యమం ఆగవచ్చు.

”ఉద్యమంలో ఇప్పుడిక స్తబ్దత వచ్చింది. ఏ ఉద్యమం గానీ సమరేఖలో హిమాలయోన్నతంగా పోదె. ఆటు పోటులు ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు 35 రోజులు ఉద్యమం నడిపారు. విద్యార్థులు తొమ్మిది మాసాలు నడిపారు. ప్రజల్లో ఇది లేకుండా ఇన్నాళ్ళు ఎలా నడిచింది. ఏ ఒకరిద్దరి వ్యక్తుల వల్లనో ఇదంతా నడిచిందంటే ఆ వ్యక్తికి బ్రతికి ఉండగానే విగ్రహం నిర్మిద్దాం. ఒక్కరిద్దరి వల్ల నడిచిందంటే నమ్మదగ్గదేనా?

”దేశంలో ఈ మధ్య ఇతరత్రా వింటున్నాం. ‘తెలంగాణ పద్ధతి అవలంభిస్తాం” అని నిఘంటువులోకి వచ్చేసింది ఈ పదం. నక్సల్బరీలాగా తెలంగాణ మార్గం అనేది వచ్చింది. తెలంగాణ పదం అసంతృప్తి వ్యక్తీకరణకు రూపం అయ్యింది. రాష్ట్ర సమగ్రతను కాపాడాలని కోరేవారు త్యాగం చేయాలి. తెలంగాణా సమస్యకు పరిష్కార మార్గం ఇదొక్కటే.”

బ్రహ్మానంద రెడ్డి పదవి నుండి వైదొలగాలని తన ప్రసంగంలో వి.బి. రాజు పరోక్షంగా ప్రస్తావించారు.

కార్మిక మంత్రి జి. సంజీవరెడ్డి మాట్లాడుతూ, స్వార్థపరులైన కొందరు నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. వాంఛూ కమిటీ నివేదికను ఆమోదించి అమలు చేయడం ద్వారా, తెలంగాణా ప్రాంతీయ సంఘానికి హెచ్చు అధికారాలు ఇవ్వడం ద్వారా, మిగులు నిధులను నిర్ణయించి తెలంగాణా అభివృద్ధికి ఖర్చు పెట్టడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సంజీవరెడ్డి అన్నారు. ‘గత తొమ్మిది నెలలుగా సాగిన తెలంగాణా ఉద్యమం ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయాలను అందరి దృష్టికి తీసుకురావడానికి తోడ్పడిందని, ఇప్పుడు ఈ అన్యాయాలను సరిదిద్ధి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను పటిష్టం చేసుకోవాలని’ అన్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన కార్మిక మంత్రి జి. సంజీవ రెడ్డి సమైక్యవాదం వినిపించగా, సీమాంధ్ర శాసన సభ్యులు బుచ్చి అప్పారావు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే మంచిదన్నారు. ఆయన తన ప్రసంగంలో ‘విశాలాంధ్ర భగ్నమవ్వబోతున్నందుకు ఎవరూ బాధపడనక్కరలేదన్నారు. ప్రత్యేక తెలంగాణను వీలైనంత త్వరలో ఇచ్చివేయడం మంచిది. ఈ విషయంలో ఆలస్యం చేస్తే ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రులకు తీరని అన్యాయం చేసినవారవుతారని ఆయన అన్నారు.

‘ముఖ్యమంత్రి జాతకం బాగుండి లోగడ హిందీ వ్యతిరేక ఉద్యమం, ఉక్కు కర్మాగార ఉద్యమాల నుండి గట్టెక్కినట్లే తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ప్రస్తుత పదవిలో కొనసాగవచ్చేమో గానీ, ఉభయ ప్రాంతాల ప్రజల భావాలు వేరయినప్పుడు, మళ్ళీ ఎప్పుడైనా ఉద్యమం తలెత్తే ప్రమాదం ఉన్నదని బుచ్చి అప్పారావు హెచ్చరించారు.

కార్మిక మంత్రి సంజీవ రెడ్డి తెలంగాణ నేతలపై విషం చిమ్మడాన్ని తీవ్రంగా విమర్శించారు శాసనసభ్యులు కోవాటి రాజమల్లు. ‘తెలంగాణ ప్రజల్లో వచ్చిన రాజకీయ చైతన్యం త్వరలోనే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు గట్టి బుద్ధిచెబుతారని అన్నారు.

తెలంగాణలో ఒకవైపు ప్రజాఉద్యమం నడుస్తుండగా ప్రజలు బ్రహ్మానంద రెడ్డిని త్యాగం చేయమని అడిగినపుడు కూడా రాజకీయపుటెత్తులతో ఆయన పదవిలో కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజమల్లు విమర్శించారు.

ఒకవైపు తెలంగాణ ప్రజలు పోలీసు కాల్పులలో మరణిస్తూ వుండగా కొందరు తెలంగాణ నాయకులు మంత్రి పదవులను ఆశించి, ప్రజలకు, తెలంగాణాకు తీరని ద్రోహం చేశారని రాజమల్లు అన్నారు.

ఈశ్వరీ బాయి ‘అన్నదమ్ములుగా విడిపోవడం అందరికీ శ్రేయస్కర’మన్నారు.

‘ప్రత్యేక తెలంగాణ కోరడం వితండవాదంకాద’ని పాల్వాయి గోవర్ధన రెడ్డి అన్నారు.

జిడిగ సత్యనారాయణ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి మారినంత మాత్రాన తెలంగాణ సమస్య పరిష్కారం కాదని, గాంధీ సిద్ధాంతాలపై ఈ ప్రభుత్వానికి విశ్వాసం ఉంటే వెంటనే రాష్ట్రపతిపాలన, జనవాక్య సేకరణ జరపాలని సూచించారు.

తెలంగాణ శాసనసభ్యులు పి. నరసారెడ్డి మాట్లాడుతూ ‘ప్రత్యేక రాష్ట్రం వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత తెలంగాణలోని అనేక రంగాలలో వృద్ధి జరిగింది. మిగులు నిధులు, ఉద్యోగావకాశాల విషయంలో పరిష్కారానికి దృఢనిశ్చయంతో కృషి జరగాల’ని అన్నారు.

మజ్లీస్‌ సభ్యుడు అహ్మద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, తెలంగాణా ఉద్యమం వల్ల మిగులు నిధులకంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని, ఉంటే కలిసి మెలిసి ఉండాలని, విడిపోయినట్లయితే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్‌ సభ్యులు ఎ.పున్నారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే కమ్యూనిస్టు రాజ్యం వస్తుందన్నారు.

ప్రత్యేక తెలంగాణా మాత్రమే సమస్యను పరిష్కరిస్తుందన్నారు బాగారెడ్డి.

దౌర్జన్యం ద్వారా సమైక్యత రాదని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎం.ఎం. హషిం అన్నారు.

సెప్టెంబర్‌ 24న రెండో రోజు కూడా తెలంగాణపై చర్చ కొనసాగింది.

సమాచార శాఖా మంత్రి అక్కరాజు వాసుదేవరావు మాట్లాడుతూ ‘వీరొక జాతి, వారొక జాతి. వారు వీరిపై దండయాత్ర జరుపుతున్నారనే అభిప్రాయాలు కలగడం విచారకరం’ అన్నారు.

‘తెలంగాణ వేర్పాటును అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నప్పుడు వారి అభిప్రాయాన్ని గౌరవించి రాష్ట్రాన్ని విభజించడం భావ్యమని కర్నూలు జిల్లా శాసన సభ్యుడు చప్పిడి వెంగయ్య అన్నారు.

‘కాంగ్రెస్‌లోని ముఠా రాజకీయాల ఫలితంగానే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంద’ని సిపిఎం నేత రజబ్‌ అలీ అన్నారు.

తెలంగాణ వాదాన్ని బలపరుస్తూ భీమారావు, కె.ఎస్‌. నారాయణ, కుముదినీ దేవి, బద్రీవిశాల్‌ పిట్టీ, శివారవు షేట్కార్‌ తదితరులు ప్రసంగించగా, సమైక్య వాదాన్ని ఎస్‌. జైపాల్‌రెడ్డి, ఆంధ్రనాయకులు వినిపించారు.

మూడవరోజు సెప్టెంబర్‌ 25న కూడా తెలంగాణపై శాసన సభ చర్చించింది.

మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సమస్య పరిష్కారాన్ని ప్రభుత్వం దాటవేస్తే దుష్పరినామాలకు దారితీయగలదని, అప్పుడు వేర్పాటు తప్పనిసరి పరిస్థితి ఏర్పడవచ్చని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అచ్యుతరెడ్డి మాట్లాడుతూ ‘ఇంత జరిగిన తర్వాత కలిసి ఉండడం కష్టం. మనసు కాలింది. గౌరవంగా ,స్వతంత్ర పౌరులుగా బ్రతుకుదాము. చిన్నరాష్ట్రమైనా ఫరవాలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు మినహా గత్యంతరం లేదు’ అని అన్నారు.

శాసనసభలో మూడు రోజులు జరిగిన తెలంగాణ చర్చకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి జవాబిచ్చారు.

గంటన్నరకు పైగా సాగిన ప్రసంగంలో ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాయకుల నిరాశా నిస్పృహల వలన, కోపోద్రేకాల వలన తలెత్తిన వాదం మాత్రమేనని, తెలంగాణకు అన్యాయం జరిగిందని అందరమూ ఒప్పుకున్నప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి కృషి చేయకుండా ప్రజలను పెడదారి పట్టించడం గర్హనీయమని ముఖ్యమంత్రి అన్నారు.

”తెలంగాణ రక్షణల గడువు ఐదేళ్ళు మాత్రమే వున్నప్పుడు, ప్రాంతీయ సంఘం కాలపరిమితి పది సంవత్సరాలు మాత్రమే అయినప్పుడు ఆ కాలాన్ని పొడిగించినప్పుడు ఏ మంత్రి, ఏ సభ్యుడు కాదన్నారు” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

‘ఇప్పుడు ప్రత్యేక తెలంగాణను కోరుతున్నవారు రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రస్తుత సమస్యలను పది సంవత్సరాలలో పరిష్కరించేవి అయిదు సంవత్సరాలలోనే పరిష్కరించగలమని అంటే సస్యశ్యామలం చెయ్యగలమని ఎవరైనా చెప్పగలరా?” అని ప్రశ్నించారు. ‘ఈరోజున క్రింది ఉద్యోగాలలో 1 లక్షా 75 వేల మంది తెలంగాణ వారు ఉన్నారు. ఏవైనా లోపాలు ఉంటే ఉండవచ్చు. వాటిని సరిదిద్దు కొనగూడదా? అంతమాత్రానికే విడిపోవాలనడం నిరాశావాదం.

‘ఉద్యమం విరమించినా, శాసన సభా పార్టీ కోరినా రాజీనామాకు సిద్ధమేనని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

(శాసన మండలిలో తెలంగాణ చర్చ..

వచ్చే సంచికలో)

Other Updates