mla-campరాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మానసపుత్రిక అనదగ్గ నిర్మాణాలలో శాసనసభ్యుల వసతి, కార్యాలయ నిర్మాణం ఒకటి. క్షేత్రస్థాయిలో శాసనసభ్యులు తమతమ నియోజకవర్గాలలో ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండేవిధంగా ముఖ్యమంత్రి రూపకల్పన చేసిన పథకం ఇది. ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గాలలోనే శాసనసభ్యులకు వసతి, కార్యాలయాల నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

తదనుగుణంగా రోడ్లు, భవనాలశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర రహదారులు, భవనములశాఖ 104 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో శాసనసభ్యులకు వసతి, కార్యాలయాల నిర్మాణం చేపట్టింది.

104 నియోజకవర్గాలు

2800 చదరపు గజాల ఖాళీస్థలం

4533 వైశాల్యం చదరపు అడుగులు

1,00,00,000 ఒక్కో భవన అంచనా వ్యయం కోటి రూపాయలు

రెండవ అంతస్తులో మాస్టర్‌ బెడ్‌రూమ్‌, పిల్లల బెడ్‌రూమ్‌, డైనింగ్‌-కం-లివింగ్‌ హాలు, స్టోర్స్‌, టాయిలెట్స్‌, సిట్‌-అవుట్‌, పూజ గది, వంట గది, అతిథి బెడ్‌రూమ్‌, డ్రాయింగ్‌ రూమ్‌, వరండా

హైదరాబాద్‌ (15) మినహా, తక్కిన 104 నియోజక వర్గాలలో ఈ నిర్మాణానికి రాష్ట్ర రహదారులు, భవనముల శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ప్రతి వసతి, కార్యాలయం నిర్మాణానికి కోటి రూపాయలు అంచనా వ్యయంగా నిర్మాణ డిజైన్‌లు సిద్ధం చేశారు. ప్రస్తుతం 65 నియోజకవర్గాలలో ఈ నిర్మాణాలు మొదలై వివిధ దశలలో ఉన్నాయి. వీటిలో వరంగల్‌ (రూరల్‌) జిల్లా పరకాల నియోజకవర్గం పరకాలలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యింది. మార్చి 2న ప్రారంభోత్సవం కూడా జరిగింది.

మొదలుపెట్టిన 6 నెలలలోనే నిర్మాణం పూర్తి

చల్లా ధర్మారెడ్డి, శాసనభ్యునిగా ఉన్న పరకాల నియోజకవర్గంలో పరకాల పట్టణం నడిబొడ్డున వసతి, కార్యాలయ నిర్మాణం చేపట్టారు. 2800 చదరపు గజాల ఖాళీ స్థలంలో ఈ భవన నిర్మాణం చేపట్టారు. రెండు అంతస్తులుగా తీర్చిదిద్దిన ఈ నిర్మాణం వైశాల్యం 4533 చదరపు అడుగుల (2266.70 చ.అడుగులు ప్రతి అంతస్తులో) ప్లింత్‌ ఏరియాతో అద్భుతంగా నిర్మించారు. ఈ భవనంలోని మొదటి అంతస్తులో మీటింగ్‌ హాలు, శాసనసభ్యుని కార్యాలయం, వి.ఐ.పి. లాంజ్‌, అతిథులు వేచి ఉండే గదులు, పి.ఎ., పి.ఎస్‌.లకు గదులు, రిసెప్షన్‌, భద్రతా అధికారులకు గదులు ఉంటాయి.

రెండవ అంతస్తులో మాస్టర్‌ బెడ్‌రూమ్‌, పిల్లల బెడ్‌రూమ్‌, డైనింగ్‌-కం-లివింగ్‌ హాలు, స్టోర్స్‌, టాయిలెట్స్‌, సిట్‌-అవుట్‌, పూజ గది, వంట గది, అతిథి బెడ్‌రూమ్‌, డ్రాయింగ్‌ రూమ్‌, వరండా ఉంటాయి.ఈ నిర్మాణాన్ని ఆగస్టు 30న ప్రారంభించారు. ఈ నిర్మాణాన్ని ఎస్‌ఈ నరసింహ, ఈఈ యాదగిరి, గణపతిరెడ్డి పర్యవేక్షణలో పూర్తి చేశారు. 9నెలల నిర్ధారిత కాలపరిమితితో మొదలుపెట్టి, 6 నెలల కాల వ్యవధిలో ముందుగానే పూర్తి కావడం విశేషం. ఈ నిర్మాణానికి వెచ్చించిన ఖర్చు. రూ. 68,92,448/- మాత్రమే. ఇది అంచనా వ్యయం కంటే ఎంతో తక్కువ.

Other Updates