విజ్ఞానం, విద్య తరగని గనులు. ఈ రెండు గ్రంథాలయంలో లభిస్తాయని. రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శాసనసభ గ్రంథాలయ కమిటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాసనసభ గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు, సభ్యులకు అభినందనలు తెలిపారు. మిగతా అన్ని రంగాల కమిటీల కంటే గ్రంథాలయ కమిటీ భిన్నమైనదని స్పీకర్‌ చెప్పారు.

లైబ్రరీలోని పుస్తకాలలో పొందుపరచిన గనిని పొందిన వారికి అపారమైన జ్ఞానం లభిస్తుందని, సబ్జెక్టుపై విస్తృతమైన అవగాహనతో మాట్లాడే వారు అందరి అభిమానాన్ని, గౌరవాన్ని పొందుతారని స్పీకర్‌ చెప్పారు. 42,000 పుస్తకాలు ఉన్న శాసనసభ గ్రంథాలయం అద్భుతమైనదని, గతంలో శాసనసభలో వక్తలుగా ప్రసంగించిన గొప్ప సభ్యుల ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయని, నూతన సభ్యులు వారి ప్రసంగాలను చదివి, విని స్ఫూర్తి పొందవచ్చునన్నారు.

తాను మొదటిసారి శాసనసభ్యుడుగా సభలో ఉన్నప్పుడు సీనియర్‌ సభ్యుల అద్భుతమైన ప్రసంగాలను ఆసక్తిగా విని ప్రేరణ పొందానని, సభ్యులు సమయం లభించినప్పుడు గ్రంథాలయాన్ని సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, శాసనసభ లైబ్రరీలో సమాచారం ఎంతో ఉంటుందని దానిని నేర్చుకోవడం వల్ల ప్రజా ప్రతినిధులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. నైజాం కాలం నాటి నుంచి దేశ స్వాంతంత్య్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ప్రస్తుత తెలంగాణ వ్యవహారాలు అన్నిటి గురించి లైబ్రరీలో సమాచారం ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమాచారం అసెంబ్లీ లైబ్రరీ లోనే లభించిన విషయాన్ని గుర్తు చేశారు. శాసన సభలో జరిగిన చర్చలు, అదే విదంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చట్టాల్లో జరిగిన మార్పులు, న్యాయ వ్యవస్థలో వచ్చిన మార్పులు గ్రంథాలయాల్లో ఉంటుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు సమాచార అవగాహన కోసం లైబ్రరీని ఉపయోగించుకోవలన్నారు.

చాలా మంది ప్రజాప్రతినిధులు జిల్లాలో జరిగే సమావేశాలకు రావడం లేదని, అదే విదంగా సమాచారాన్ని కూడా ఉంచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం ఎజెండాను చదివి అవగాహన చేసుకుంటే అధికారులు కూడా పూర్తి సమాచారంతో వస్తారన్నారు.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సమస్యలను తీర్చడానికి చట్టసభలలో చట్టాలను రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించే సభ్యులకు ఈ గ్రంథాలయాలు అవగాహన కల్పిస్తాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పుస్తకాలను డిజిటలైజేషన్‌ చేసి సభ్యులకు అందుబాటులో ఉంచాలని, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించే క్రమంలో అవసరమైన సమాచారం అందిండం ద్వారా శాసనసభ లైబ్రరీ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించిందని గుర్తు చేశారు.

కమిటీ అధ్యక్షులు యస్‌. రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ అనుభవజ్ఞుల సలహాలు, సూచనలతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసి సభ్యులకు మరింతగా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

సమావేశానికి ముందు స్పీకర్‌, ఛైర్మన్‌, మంత్రి, కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యులు అసెంబ్లీ ఆవరణలోని లైబ్రరీని, రిసెర్చ్‌ సెంటర్‌ను సందర్శించారు. కమిటీ సభ్యులు కందాల ఉపేందర్‌ రెడ్డి, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, నవీన్‌ కుమార్‌, జనార్ధన్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Other Updates