తెలుగుజాతి
ఎంత ప్రాచీనమైనదో, తెలుగువారి శాస్త్రీయ నృత్యకళ కూడా అంతే ప్రాచీనమైనది. ముఖ్యంగా తెలంగాణా సంస్కృతీ చరిత్రలో లలితకళలలోని సాహిత్య, నృత్య కళలు పూర్వంనుండి బహుముఖంగా పోషింపబడిన వనటానికి దేవాలయాలు, దేవాలయ శాసనాలు, దేవాలయాల శిల్పాలు, ఈ ప్రాంతంవారు రచించి నవిగా గుర్తించిన శాస్త్ర గ్రంథాలు, తెలుగు సాహి త్యంలో వర్ణింపబడిన నృత్య ప్రక్రియలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
పురాతన గుహలు, సొరంగ మార్గాల తవ్వ కాలలో వివిధ జిల్లాలలో దొరికిన అలంకరణ సామగ్రి, ఇతరత్రా వస్తువులనుబట్టి తెలంగాణ ప్రజలు క్రీ.పూ. 5000 సంవత్సరాలనాటికే చక్కటి నాగరికతను అలవరచుకొన్నారని పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రా యం. ఈ మేరకు లలితకళలు కూడా ఇక్కడి మానవ జీవన స్రవంతిలో భాగంగా వృద్ధి చెందాయన్నది నిర్వివాదాంశం.
క్రీ.పూ. సంస్కృతి-చరిత్రలో పై వివరణకు ఆధారాలు లేకపోయినా, క్రీ.శ. 2వ, శతాబ్దిలో శాతవాహన చక్రవర్తి, హాల శాతవాహనుడు రచిం చిన గాథా సప్తశతిలో తొలిగా తెలంగాణ ప్రాంతం లోని ప్రజల జీవన విధానం, ఆటపాటలు, అలంకరణల గురించి తెలుస్తున్నది. గాథాసప్త శతిలోనే నర్తకీమణులు లత్తుకపూసి కొన్న విధానం, ఆహార్యం గురించి వర్ణనలున్నవి.
శాతవాహనుల తర్వాత తెలంగాణమును పాలించి నవారు విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, వారి సామంతులు వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యుల సామంతులే తొలి కాకతీయులు. క్రీ.శ. 1158లో రుద్రమదేవునితో వీరి పరిపాలన ఇక్కడ ఆరంభమైంది. ఆ తర్వాతివారు ముసునూరి నాయకులు, పద్మ నాయకులు, ఆ తర్వాత నాలుగువందల సంవత్సరాలు పరిపాలించిన ముస్లిం రాజులలో, మొదటివారు కుతుబ్ షాహీలు-మొఘల్ చక్రవర్తులు, నిజాం నవాబులు.
కాకతీయుల తర్వాతికాలంలో ఏర్పడిన జమిందారీ వ్యవస్థలో కూడా లలితకళలకు చక్కటి ఆదరణ లభించిందనటానికి సాహిత్య నిరూపణలున్నవి.
తెలంగాణ ప్రాంతంలో నృత్యకళాభివృద్ధి చారిత్రకంగా శాతవాహనుల నుండి గోల్కొండ ప్రభువుల పాలన వరకు వివిధ ప్రక్రియలలో సమున్నతంగా ప్రజల జీవన స్రవంతిలో భాగంగా, శాస్త్రీయ పద్ధతిలో దేవాలయాల లోనూ, రాజాస్థానాలలోనూ గొప్పగా ఆదరణ పొంది ప్రచారంలో ఉండింది.
సకల కళా సమాహారమైన నృత్యకళ ప్రతి దేశంలోనూ సాధారణంగా ఐదు విధాలుగా పెంపొందింది.
అవి, ఆరాధనా నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, ఆటవికుల నృత్యాలు, ప్రచార నృత్యాలు. ఆరాధనా నృత్య కళలో ఆగమ నర్తన విధానం పూర్తిగా శాస్త్రబద్ధమై, మార్గ పద్ధతిన వృద్ధి చెందింది. ఈ ఆరాధనా నృత్యకళ ఆగమశాస్త్రానుసారం దేవాలయాలలో దక్షిణ భారతదేశంలోని ప్రస్తుత రాష్ట్రాలన్నింటిలో దేవాలయాలకు అంకితమీయబడిన దేవగణికలు ప్రదర్శించింది.
భారతదేశంలోని నాట్య ప్రక్రియలకు సంబంధించి భరతుడు నాట్యశాస్త్రంలో భారతదేశాన్ని దక్షిణాపథం, పూర్వదేశం, పశ్చిమదేశం, ఉత్తరభూమి అని నాలుగు విధాలుగా విభజించటంతోపాటు ఆయా ప్రాంతీయ చిత్త వృత్తుల సామ్యాన్నిబట్టి ఏఏ వృత్తులను ఆశ్రయించి వీరి నృత్య శైలులున్నవో చెప్పాడు. ఈక్రమంలో ”తత్ర దాక్షిణాత్యాస్తావత్ బహు నృత్త గీత వాద్యాః కైశికీ పోయా, చతుర మధుర లలితాం గా భిననయాశ్చ తద్యథా”-ఈ శ్లోకంలో దాక్షిణాత్యులతో నృత్యగీత వాద్యాల ఉపయోగం అధికంగా ఉంటుందని వీరిలో కైశికీ వృత్తి ప్రయోగం కూడా అధికమని, వీళ్ళ ఆంగికాభినయం నేర్పుతో మధురంగా, లలితంగానూ ఉంటుందని భరతుడు చెప్పాడు.
భరతుడు చెప్పిన విధంగానే దక్షిణాపథంలోగల తెలుగు, తమిళ, కన్నడ దేశాలలోని నాట్య ప్రక్రియలలో, ప్రయోగాలు కైశికీ వృత్తి ప్రధానంగా గల శృంగార రస పోషణలో కూడినవై, నృత్త అభినయాలతో పోషింపబడుతున్నాయి.
తెలుగు ప్రాంతంలోని తెలంగాణా సంస్కృతిలో శాస్త్రీయ నృత్యకళ ఆలయ ఆరాధనా విధిలోనూ, రాజుల ఆస్థానాలలోనూ అత్యద్భుతంగా ఆదరణ పొంది ప్రచారంలో ఉండేవనటానికి తార్కాణాలు బౌద్ధారామారా లలో దొరికిన శిల్పాలు, అనేక ఆలయాలలో చెక్కబడిన నృత్య శిల్పభంగి మలు, దేవాలయాల నిర్మాణ, నిర్వహణ, 72 నియోగాల వివరణతో వారికి ఏర్పరచిన జీతభత్యాలను నిర్దేశిస్తూ లిఖించబడిన శాసనాలు.తెలంగాణాలోని ఆలంపురంలో బాదామ చాళుక్యుల కాలంలో నిర్మించబడిన 6వ శతాబ్దికి చెందిన శ్రీసంగమేశ్వరాలయంలోనూ, నవబ్రహ్మ దేవాలయాలలో అనేక శివ, నటరాజ మూర్తుల శిల్పాలే కాకుండా సప్తమాతృకల శిల్పాలు ఆనాటి శిరోజాలంకరణ వైవిధ్యాన్ని, ఆనాటి స్త్రీల ఆహార్యం విధానం తేల్చేవిగా ఉంటాయి.
తర్వాత కళ్యాణి చాళుక్యుల కాలంలో, కాకతీయుల కాలంలో తెలంగాణలో ఎక్కువగా దేవాలయాల నిర్మాణం జరిగింది. తెలంగాణా జిల్లాలను అన్నింటినీ పర్యటిస్తే కనీసం వేయి చారిత్రక స్థలాలు, 500 చిన్నా పెద్దా ప్రాచీన దేవాలయాలుంటాయని డా. జైశెట్టి రమణయ్య వ్రాశారు.
అందరికీ సుపరిచతమై, ప్రచారం పొందిన ముఖ్య ఆలయాలు వరంగల్‌లోని వేయిస్థంభాలగుడి, పాలంపేటలోని రామప్ప దేవాలయం. ఇవి 12వ శతాబ్ది కాకతీయరాజుల కళాపోషణకు తార్కాణాలుగా నిలిచి ఉన్నాయి. వీరి కాలంలోనే దాదాపు అన్ని శైవాలయాలలో రంగమంటప నిర్మాణం జరిగింది. ఈ విధంగా రంగమంటపాలు భారతదేశంలోని మరే ప్రాంత దేవాలయాలలోనూ కన్పించవు. కాకతీయుల కాలంలో ఆలయ ఆరాధనా నృత్యాల ప్రాధాన్యతను ఈ రంగమంటపాలు తెలుపుతుంటాయి.
ఇక సాహిత్యాధారాలను గమనిస్తే 2వ శతాబ్ది వాడైన హాలశాత వాహనుడి ‘గాథాసప్తశతి’లోని వర్ణనలు ఆనాటి తెలంగాణా జనజీవన స్రవంతిలో కళల ప్రాముఖ్యత ఎంత ఉండిందో తెలుపుతున్నవి.
కాకతీయుల నాటి శాస్త్ర గ్రంథం జాయస వ్రాసిన ‘నృత్తరత్నావళి, రాచకొండ ప్రభువు సర్వజ్ఞ సింగ భూపాలుని ‘రసార్ణవ సుధాకరం’, పాల్కురికి సోమనాథుని ‘బసవ పురాణం’, పండితారాధ్య చరిత్ర, పోతన వ్రాసిన ‘భోగినీ దండకం’, ఇంకా నవాబుల పాలనలో కూడా లలితకళల పోషణ బాగా జరిగిందని చెప్పటానికి సాక్ష్యాలుగా సారంగు తమ్మయామాత్యుడు రచించిన వైజయంతీ విలాసం, గోల్కొండ పాదుషాను సందర్శించి మెప్పుపొందిన ‘క్షేత్రయ్య’ పదసాహిత్యం ఇలా ఎన్నో తార్కాణాలు 15వ శతాబ్దినాటికే గాక 20వ శతాబ్ది వరకు కూడా సాహిత్య వర్ణనల్లో కన్పిస్తాయి.
అన్నింటికి మించి తెలంగాణ దేవనర్తకినులు అత్యుత్తమంగా గౌరవింపబడ్డారని చెప్పే సాక్ష్యం ఒరిస్సాలోని పూరి జగన్నాథాలయ శాసనం. ఈ విషయాన్ని డా. ఆరుద్ర వారి సమగ్రాంధ సాహిత్య చరిత్రలో వ్రాశారు. దాని పాఠ్యం యధాతథంగా:-
‘గజపతులు తెలుగువారికి వంశపారంపర్యంగా వస్తున్న హక్కులను సంరక్షిస్తూ వాటికి సముచిత స్థానాన్ని ఇవ్వడమేకాక అవి శాశ్వతంగా ఉండేటట్టు శాసనబద్ధం చేయడం కనీసం ఒక విషయంలో స్పష్టంగా కనబడుతుంది. జయదేవుని గీతగోవిందం జగమెరిగిన శృంగార గేయ ప్రబంధం. దీనిని పూరి జగన్నాథుని ఆలయంలో నేటికీ గానం చేసి అభినయిస్తారు. ఆదిలో ఈ రసమయ శేఖరాలయిన అష్టపదులను గానం చేసే హక్కు తెలంగాణ నుండి వచ్చి పూరీలో స్థిరపడ్డ నట్టువమేళం ఆటగత్తెలకే ఉండేది. దీనిని ప్రతాపరుద్ర గజపతి గుర్తించి మన్నించాడు. అది వారికే కలకాలం చెందాలని ఆజ్ఞాపిస్తూ పూరీ ఆలయంలో ఒక శాసనాన్ని ఒరియా భాషలో, ఒరియా లిపిలో వేయించాడు-(సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర-నాల్గవ భాగంలో పద్మ నాయకులు-శాసనం కొరకు చూడండి) ఈ శాసనం ప్రతాపరుద్ర గజపతి 1499లో వేయించాడు. గీత గోవిందం రచించిన జయదేవుని భార్య నల్గొండ జిల్లాలోని పేరూరు గ్రామానికి చెందినదని, దేవనర్తకినులను ఆనాడు అంకితమిచ్చే క్రమంలో ఈమెనుకూడా దేవగణికను చేయబోతుండగా జయదేవుడు వివాహమాడాడని, ఈమె నాట్య సంగీత విద్యావిశారద కాబట్టే జయదేవ కవి ప్రబంధ పూరణమ్ స్ఫూర్తిగా నిల్చిందని పండితుల అభిప్రాయం. ప్రాయికంగా ఈమె తెలంగాణ ఆడపడచు అవటంచేత వారి హక్కుగా తెలంగాణా నట్టువమేళం (స్త్రీలు మాత్రమే పాల్గొనే నృత్యకళ) వారికి చెందేటట్లు శాసనం చేశాడు ప్రతాపరుద్ర గజపతిరాజు.
కాకతీయులనాటి ఆస్థాన నర్తకీమణుల శిక్షణా విధానం, వారి ప్రదర్శ నకు సంబంధించిన హంగు, ఆర్భాటాలతోపాటు రాజుగారు, సభలోని పెద్దలు నృత్య ప్రదర్శన సమయంలో పాటించవలసిన నియమాలగురించి, రాజుగారు ప్రదర్శన తర్వాత నర్తకిని గౌరవించవలసిన విధానం, ఆ గౌరవప్రదానం నర్తకి స్వీకరించవలసిన పద్ధతిని ఎంతో చక్కగా దృశ్యాయమానంగా వివరించినవాడు జాయపసేనాని. నృత్తరత్నావళిలో దేశీ నృత్య శైలులను వివరించిన నేపథ్యంలో ఎనిమిదవ అధ్యాయంలో చాలా చక్కగా వివరణ ఉంది.
స్త్రీల నృత్య విద్యతోపాటు అనేక ఇతర దేశీ నృత్య ప్రక్రియలను వివరించే నేపథ్యంలో ‘పేరణి’ అనే పురుష నర్తనరీతిని, శైవమతావలంబకులు వంటినిండా బూడిద పూసికొని, గుండు గీసికొని, తొడల క్రింది భాగంలో పిక్కలకు గజ్జెలు కట్టుకొని, చేతిలో వింజామరను పామును పట్టుకొని ‘పేరణి’ అనే నర్తకుడు రంగ ప్రవేశం చేసి మిగతా తన బృందంతో పేరణి-పంచ అంగాలుగా ప్రదర్శించాలని చెప్పాడు. ఇది 700 సంవత్సరాల తర్వాత 1972లో ప్రముఖ నాట్య గురువు కీ.శే. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ వేషధారణను మార్చి శైవాగమం, భారతార్ణవం, నృత్య రత్నావళీ గ్రంథాల ఆధారంగా పునః సృష్టి చేశారు.
తెలంగాణాలో స్త్రీ కళావేత్తలు నట్టువమేళ నర్తనంగానూ, దేవాలయాలలో ఆలయ ఆగమనర్తన విధానంలో, రాజా స్థానాలలో అతి ప్రాచీన కాలంనుండి 20వ శతాబ్ది వరకు నృత్య కళను ఆరాధించి పోషించారనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. స్త్రీ కళామూర్తుల నర్తనమే తమిళనాడులో భరతనాట్యంగానూ, తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమలలో ఆంధ్ర నాట్యంగానూ, కర్ణాటకలో మైసూర్ భరతనాట్యంగానూ, కచ్చేరి, కర్ణాటకం, దర్బార్ ఆట, దాసి ఆట్టం, మొదలైన ప్రాచీన నామాలకు పర్యాయంగా 20వ శతాబ్దిలో గుర్తింపబడి ప్రచారం చేయబడుతున్నాయి.
డా|| కె. సువర్చలాదేవి