book-2ఎంత ఎత్తు ఎదిగినా, తన కాళ్ళూ, కనులూ నేలమీదే ఉండాలని, అలా ఉండలేని సమయంలో ఎదుగుదలే వద్దనే మానవతా మూర్తి అటల్‌ బిహారీ వాజ్‌పేయి. భారత ఉపఖండానికే అధినాయకుడై, అధికార కిరీటాన్ని తలదాల్చికూడా, తలక్రిందికి వంచి సామాన్య మానవుడి సంక్షేమానికి ‘పెద్దపీట’వేసిన దార్శనికుడు. శిఖరంలా ఎత్తు ఎదిగినా, ఎత్తుతోపాటు విశాలంగా విస్తరించాలనుకునేవారు ఆయన.

లక్ష్యం కళ్ళకు కనిపించని క్షణాన ‘రండి దీపాలు వెలిగిద్దాం’ అనే ఆశావాది. ‘లాభనష్టాల ఒడిదుడుకుల్లో జీవన సరళి వ్యాపారమైంది’ అంటూ వాపోయే మానవతామూర్తి. తన అభిమానులు తన జన్మదినాన్ని వేడుకగా చేసుకుంటున్న సమయాన ‘నిన్న/నిన్న అని అనుకొంటూ వుండగానే! నేడు చేతినుంచి జారిపోయింది!’ అంటూ మూల్యాంకనం చేసుకునే మహనీయుడు అటల్‌.

‘నేను ఆనందంగా జీవించాను/నవ్వుతూ చనిపోతాను… ఎవరితో నాకెందుకు భయం’. ‘ఓ మృత్యువా…! రా ఎదురెదురుగా రా! నా ధైర్యాన్ని పరీక్షించు’ అని చావునే ఛాలెంజ్‌ చేసిన ధీరుడు వాజ్‌పేయి.

రాజకీయ నాయకుడిగా అనంత శిఖరాలను అధిష్టిస్తాడు. సామాన్యుడిలా దు:ఖిస్తాడు (సామూహిక అత్యాచారం). బస్సులు ఆగాల్సినచోట ఎందుకు ఆగవు?! జనం వరుసక్రమంలో ఎందుకు నిలబడరు (నేను ఆలోచిస్తూ ఉంటాను) అంటూ సగటు భారతీయుడి తత్వానికి వేదన చెందుతారు.

అటల్‌బిహారీ వాజ్‌పేయి కవిత్వాన్ని వెలిగించిన జలజం సత్యనారాయణ, మూలంలోని భావార్థాన్ని భగ్నం చేయకుండా, ‘ప్రతిపదార్థ తాత్పర్యం’లా కాకుండా, అనుసృజన గావించారు.

‘అనలి కవితా సంకలనం, మానవుడే మా సందేశం (కవిత్వం)కు సంపాదకత్వం వహించిన సత్యనారాయణ వ్రాసిన ఈ ‘శిఖరం’ నిజంగా శిఖరాయమానం!

శిఖరం: కవిత్వం,

హిందీ మూల రచన,

అటల్‌ బిహారీ వాజ్‌పేయి,

అనువాదం: జలజం సత్యనారాయణ,

పేజీలు: 100,

వెల : రూ. 100,

ప్రతులకు: ధ్వని పబ్లికేషన్స్‌, 2-5-297, లక్ష్మీనగర్‌ కాలనీ, మహబూబ్‌నగర్‌.

Other Updates