తెలంగాణా కేంద్రంగా ఆంధ్రదేశాన్ని కాకతీయ రాజులు క్రీ.శ. 1050 నుండి 1350 వరకు పరిపాలించారు. శాతవాహన యుగం తరువాత ఆంధ్రుల చరిత్రలో ఇదొక స్వర్ణయుగం. కాకతీయ రాజులు అంతకు పూర్వం రాజుల వలె పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. రాజ్య కాంక్షచే రాజ్యాలు స్థాపించిన వాళ్ళు కాదు. ప్రజలలో పుట్టి, నిరంతర కలహాల ఫలితంగా ఆంధ్ర ప్రజలు అనుభవిస్తున్న బాధలను వీరు స్వయంగా చూశారు. ఉత్తర హిందూ స్థానంలో అప్పటికే ముస్లిం దండయాత్ర ముంచుకు వస్తున్నది. ఈ ప్రమాదాన్నుంచి రక్షించుకోవాలంటే ఆంధ్రులందరినీ ఒకే సుస్థిర ప్రభుత్వం కిందికి తీసుకురావడం అవసరమని వారు గుర్తించారు. ఉత్తర భారతంలో రాజ పుత్రుల మాదిరిగా దక్షిణాన తురుష్క సేనా వాహినులను అరికట్ట్టి హైందవ స్వాతంత్య్ర సంస్క ృతులను రక్షించడానికి కాకతీయులు తమ సర్వస్వాన్ని ధారపోశారు. వీరి దేశభక్తి, స్వాతంత్య్ర కాంక్ష వారి అనంతరం ఆంధ్రదేశాన్ని పాలించిన రెడ్డి, విజయనగరాధీశులకు ఆదర్శమైంది. దక్షిణాపథంలో హైందవ సంస్క ృతి రక్షణకు వారి చేత కంకణం కట్టుకునేటట్లు చేసింది. కనుకనే కాకతీయ యుగాన్ని స్వర్ణ యుగంగా భావించవచ్చు.
కాకతీయ రాజులలో గణపతి దేవుడు సుప్రసిద్ధుడు. ఇతని కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్త్తరాన గోండ్వానా నుండి దక్షిణాన కాంచీ వరకు, తూర్పున బంగాళా ఖాతం నుంచి పశ్చిమాన బీదరు వరకు విస్తరించింది. నెల్లూరు సీమను పరిపాలించిన, మనుమసిద్ధి, కోల్పోయిన తన రాజ్యాన్ని గణపతి దేవుని సహాయంతోనే తిరిగి సంపాదించుకోగలిగాడు. ఈ చక్రవర్తి ఓరుగల్లు పట్టణాన్ని అభివృద్ధి పరచి దాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. అంతవరకు హనుమకొండ రాజధానిగా ఉండేది.
నెల్లూరు జన్మ స్థలమైన తిక్కన సోమయాజి ఓరుగల్లు వెళ్ళి కాకతీయ గణపతి దేవుని ఆస్థానంలోనే తన మహా భారత రచన పూర్తి చేశాడు. గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు. ఆయన తరువాత ఆయన కుమార్తె రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యపు రాణి అయింది. రుద్రమదేవి అనంతరం ఆమె దౌహిత్రుడు ప్రతాపరుద్రుడు 1296లో రాజ్యాని కొచ్చాడు. ఇతడు వీరుడు. విద్యుత్కవిపోషకుడు. ఇతని కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం పతనం కావడం విధి వైపరిత్యం. 1320లో కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.
కాకతీయుల కాలంలో దేవాలయ నిర్మాణం విరివిగా కొనసాగింది. తెలుగు వారి శిల్ప కళా విన్యాసం ఆ నల్లని కఠిన శిలలపై వెన్నెలలా ప్రవహించింది. రామప్ప గుడిలోని ప్రతి భాగమూ ఒక అపురూప శిల్ప కళా ఖండం కాకతీయుల నృత్య కళాభిమానానికిది పరాకాష్ట. ఆనాటి కవులు ఉదర నిమిత్తం గ్రంథ రచన చేయలేదు. నాటి కవులు మంత్రులు, రాజ తంత్రజ్ఞులు. కళలు, సాహి త్యం, తెలుగు భాషా వికా సాం కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందినంతగా మరే రాజుల కాలంలోనూ అభి వృద్ధి చెందలేదు. సూటిగా, తేటగా కవిత్వం చెప్పాలంటే జాను తెనుగుకు దీటు లేదని చాటినవాడు పాల్కురికి సోమనాథుడు. వీధి మానసి మాట్లాడుకునే తెనుగును అపౌరు షేయాలైన వేదాల సరి బంతిలో నిలపడం పాల్కురికి గుండె ధైర్యా నికి నిదర్శనం. పాల్కురికి సోమనాథునికి ముందు తెలుగులో వెలసిన గ్రంథాలు ప్రాయకంగా సంస్క ృత మూలకాలు, ఇతని బసవ పురాణం వీరశైవ మతోద్ధారకుడైన బసవేశ్వరుని జీవితం అభివర్ణించే గ్రంథం. ఇది సంస్క ృత గ్రంథానికి అనువాదం కాదు.
నన్నయ్య, నన్నెచోడులు ఇద్దరూ ఆంధ్ర సాహిత్య చరిత్రల్లో రెండు మార్గాలకు దారి తీసిన వారు. ఒకరిది పురాణ కవిత. మరొకరిది వస్తు కవిత, ప్రబంధ కవితా మార్గం. ఆంధ్ర సాహిత్యానికి ఆదిలోనే రెండు భిన్నమైన శాఖలకు అంకురార్పణం జరిగిందని చెప్పవచ్చు.
కాకతీయులు ఏ రంగాన్ని కదిలిస్తే ఆ రంగం కోటి ప్రభలతో వెలుగొందింది. కాకతీయులు ఎంతో ప్రణాళికా బద్ధంగా నిర్మించిన లక్నవరం, గణపురం, పాకాల, రామప్ప చెరువుల నీటితో వరంగల్ జిల్లా ప్రజలు నేటికీ భూములను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈనాడు తెలంగాణాలో ప్రతి గ్రామంలో 2,3 చెరువులు ఉండడం గ్రహిస్తాము. వీటిలో కొన్నైనా కాకతీయులకు ముందూ, ఆ తర్వాత, కూడా నిర్మించి ఉండవచ్చు. కాకతీయులు తలపెట్టిన తెలుగుదేశం పునర్నిర్మాణం, దీనికి అనుసరించిన రాజనీతి, ఎంతో ప్రశంసనీయమైనది. అడ్డూ, అదుపూ ఒక విధానం లేక అనేక విడివిడి భాగాలుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ సవిూకృత పరచి వీటిని ఒక ఆంధ్రదేశంగా నిలిపి జాతి గౌరవాన్ని నిలబెట్టిన పరాక్రములు కాకతీయులు. వరంగల్లునేలిన కాకతీయులు తెలుగు పతాకాన్ని ముందుకు తీసుకు పోయి దాన్ని రెడ్డి రాజులకు, విజయనగరాధీశులకు అందించారు.
పద్మ నాయకులు :
కాకతీయుల పతనానంతరం రాచకొండ రాజధానిగా తెలంగాణాలో రేచర్ల వంశం వారు పద్మనాయక రాజ్యాన్ని స్థాపించారు. వీరు వెలమలు. దేవర కొండ రాజ్యాన్ని పాలించిన వారు కూడా వెలమలే. వీరు మొదట శైవులు. తరువాత వైష్ణవులుగా మారారు. 1335-36 కాలంలో దక్షిణాపథంలో ఆరు ముఖ్యమైన రాజ్యాలు స్వతంత్ర ప్రతిపత్తితో వెలసిన సంగతిని గుర్తుంచుకుంటే, ఆనాటి రాజకీయ స్వరూపం వెల్లడవుతుంది.
1. తీరాంధ్రాన్ని పాలించిన వారు ముసునూరి పాలకులు.
2. వరంగల్‌ను స్వాధీన పరుచుకున్న కాపయ నాయకుడు.
3. ప్రోలయ వేమారెడ్డి స్థాపించిన రెడ్డి రాజ్యం.
4. పద్మనాయకులు స్థాపించిన రాచకొండ, దేవరకొండ రాజ్యాలు.
5. హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించిన విజయనగర రాజ్యం.
6. స్థానిక గవర్నరు తిరుగుబాటు జరిపి దక్కనులో స్థాపించిన బహమనీ రాజ్యం.
పద్మనాయకులు కాకతీయ రాజుల సామంతులు. గణపతి దేవుని కాలం నాటి నుంచి వారి అభ్యున్నతి ప్రారంభమైంది. వీరు రాజకీయాలలో ఉత్సాహంగా పాల్గొంటూ కాకతీయ సామ్రాజ్య విస్తరణకు దోహద పడ్డారు. పద్మనాయకుల జన్మస్థలం నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు. పద్మనాయకులు స్వతంత్రు లైన తరువాత రాచకొండ, దేవర కొండలను రాజధానిగా చేసుకొని అక్కడ బలిష్ఠమైన దుర్గాలను నిర్మించుకు న్నారు.
రాచకొండ పట్టణం నల్లగొండ జిల్లా నారాయణపురం మండలంలో ఉంది. రాచకొండలో అన్ని మత సంప్రదాయాలకు చెందిన వారుండేవారు.
రాచకొండ పట్టణం సాహిత్యానికి, సంగీతానికి, నాట్యశాస్త్ర రంగానికి పెట్టింది పేరు. వీరి కాలంలో సంస్క ృత భాషకు ఎంతో విలువ లభించింది. పద్మ నాయకుల ఆస్థాన కవి శాకల్య ఆయ్యలార్యుడు. ఇతడు భాస్కర రామాయణం పూర్తి చేశాడు. రాచకొండ ప్రభువుల ప్రాపు పొందిన తెలుగు కవులలో గౌరన, పోతన ప్రసిద్ధులు, రాచకొండ రాజులలో సర్వజ్ఞసింగ భూపాలుడు సంగీత సాహిత్య కళా విశారదుడు, మంచి రసికుడు. గ్రంథకర్త. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాచకొండను దర్శించాడు.
ఆనాడు రాజులు నీచులైనారు. మంత్రులు స్వార్థపరు లైనారు. ప్రజలు అవినీతి పరులై లంచాలకు మంచాలు వేశారు. మహ్మదీయుల సంపర్కంతో, సంఘర్షణలతో హిందూ సంఘం నీరసించింది దేశం అభ్యున్నతికి రావడానికి ఆధ్యాత్మిక చింత గాని, పదార్థ చింతగాని లేదు అప్పటికే ఉత్తరాన విదేశీయుల శతఘ్నుల తాకిడికి సోమనాధ దేవాలయం, ఇతర వైష్ణవ దేవాలయాలు కూలిపోతున్నాయి. దక్షిణాదికి కూడా ఈ దండయాత్రల ప్రమాదం వ్యాపించుతోంది.
భక్తాగ్రేసరుడైన బమ్మెర పోతన తన భక్తి లహరిని కవితా స్రవంతిగా ప్రవహింపజేసి, తెలుగు వారి హృదయాల విూద చెరగని ముద్ర వేశాడు. ఆయన రాసిన మహా భాగవతం భక్తి రసపూర్ణమైన మ¬త్క ృష్ట గ్రంథం. ఆయన వరంగల్ వాడైనా ఆయన భక్తి ప్రపత్తులు నలుమూలాల వ్యాపించాయి. మతపరమైన కవిత్వంలో ఇంతగా ప్రభవిల్లిన కాలం ఆంధ్రుల మూడు శతాబ్దాల కవిత్వ చరిత్రలో మరొకటి లేదు.
కాకతీయులు పతనమైన తరువాత ముసునూరు, రేచర్ల పద్మనాయకులు తెలంగాణాను దాదాపు 150 సంవత్సరాలు పాలించినప్పటికీ సమర్థవంతమైన, స్థిరమైన పాలనను అందించ లేకపోయారు. వారి జీవిత కాలమంతా యుద్ధాలలో గడవడం-బహుమనీ సుల్తాన్లతో, ఢిల్లీ సుల్తాన్లతో వైరం, విజయనగర, గజపతుల ప్రాబల్యం పెరగడం వంటి ఎన్నో కారణాల వల్ల క్రీ.శ 1475 నాటికి కాకతీయుల పాలన క్షీణించింది. సంస్క ృత పండితుడైన మల్లినాథ సూరి ఈ కాలంలోని వాడే. ఆయన మెదక్ జిల్లా కొలచారం నివాసి.
(సశేషం)