పాఠక మహాశయులకు, తెలంగాణ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కాలచక్రంలో మరో ఏడాది గడచిపోయింది. ఇది కాలగమనంలో సహజమే అయినా, మనని వదలివెళ్ళిన 2014 సంవత్సరానికి ఓ ప్రత్యేకత వుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సంవత్సరం అది. అందుకే 2014 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఓ చెరిగిపోని తీపిగుర్తుగా చిరకాలం మిగిలిపోతుంది.
కొత్త ఏడాది రాగానే సహజంగా మనలో ఏవేవో కోరికలు, మరెన్నో ఆశలు పురివిప్పుకుంటాయి. వాటిని సాధించాలన్న ఆరాటంలో ఎన్నో బాసలు, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాం. మరికొందరు తమ దురలవాట్లను వదలి ఈ కొత్త సంవత్సరం నుంచి సన్మార్గంలో పయనిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తుంటారు. అవి వినడానికి చాలా ఆనందంగా వుంటాయి. కానీ, ఆచరణలోకి వచ్చే వరకు ఆ ఆనందం ఆవిరైపోతుంటుంది.
ఎందుకీ వైఫల్యం?
అసలు మనం ఏదైనా కార్యం సాధించాలంటే అందుకు పట్టుదల, శ్రమతోపాటు ముఖ్యంగా మానసిక పరిశుభ్రత అవసరం. ముందు మన మనస్సును ప్రక్షాళన చేసుకుంటే తప్ప ఏ కార్యంలోనూ విజయం సాధించలేం.
బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఓ ప్రభుత్వ అధికారిగా నా విధి నిర్వహణలో ఒక్కోసారి ఏం చేయాలో తెలియని స్థితి ఏర్పడినప్పుడు, గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసిన తరుణంలో నేను నా అంతరాత్మ ప్రబోధాలను, ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాల తోడ్పాటు స్వీకరిస్తాను.
నేటి యువతరానికి నేనిచ్చే సందేశం ఏమిటంటే ` ఈ పవిత్ర భూమిలో నెలకొనివున్న విలువలకు దూరంగా జరగరాదని. విలువలకు, చర్యలకు మధ్య ఉన్న బంధం తెగిపోతే, అది మానసిక ఆందోళనకు దారితీస్తుంది. ఇది నేటి యువతలో స్పష్టంగా కనిపిస్తోంది.
యువత వారి మూలాలను గుర్తెరిగి, స్థిరమైన, వాస్తవమైన ఆలోచనలు కలిగి వుండాలి. మంచి ఆలోచనలే మనిషికి శక్తినిస్తాయి. అదే విజయానికి సోపానం.
డాక్టర్ ఆర్.వి. చంద్రవదన్, ఐఎఎస్
కమీషనర్ & పబ్లిషర్