రాష్ట్ర శాసన సభ ఎన్నికల నాటినుంచి ఈమధ్యనే ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల వరకూ సుదీర్ఘకాలం ఎన్నికల నిబంధనల కారణంగా రాష్ట్రంలో కొద్దిగా మందగించినట్టు కనపడిన అభివద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జూలువిదిల్చిన సింహంలా వేగంగా ముందుకు సాగిపోతున్నాయి. ముఖ్యంగా జూన్‌ మాసం ప్రత్యేకత మనకు తెలియంది కాదు. ఈ మాసంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అనూహ్యంగా ఈ మాసంలోనే మరికొన్ని ముఖ్యఘట్టాలకు తెరలేవడం యాదచ్ఛికమే అయినా, అవి రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన అంశాలు కావడం విశేషం. అందులో ఒకటి తెలంగాణ వరదాయినిగా భావిస్తున్నకాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కాగా, రాష్ట్రానికి ఐకానిక్‌గా నిలవబోతున్న నవ నిర్మాణాలు సచివాలయం, శాసన సభా భవనాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శంకుస్థాపన జరపడం రెండవది.

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళదశల ఎత్తిపోతల పథకం, మహా ఇంజనీరింగ్‌ అద్భుతం కాళేశ్వరం. మరెన్నో విశిష్టతలున్న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్‌ 21న జాతికి అంకితం చేశారు. ఈ వేడుకకు గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌తోపాటు మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్నోహన్‌ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యఅతిధులుగా హాజరుకావడం మరో విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు మంచినీరు, వందలాది పరిశ్రమలకు అవసరమైన నీరు అందుతుంది.

ఇంతటి మహోన్నతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్ళ అతి స్వల్పకాలంలో నిర్మించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. దేశ చరిత్రలోనే ఇంతటి మహోజ్వలఘట్టానికి తెరలేపిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ సంకల్పబలం, కార్యదక్షత, కార్యదీక్షలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనం. ఇది తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేసి, అభివద్ధి పధంలో రాష్ట్ర రూపురేఖలనే మార్చనుంది.

ప్రస్తుత సచివాలయం ప్రాంగణంలోనే కొత్త సచివాలయ భవనం నిర్మించడానికి జూన్‌ 27న ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ భూమిపూజ చేశారు. రూ. 400 కోట్ల రూపాయల వ్యయంతో సకల సౌకర్యాలతో, సువిశాలంగా, ఆధునిక హంగులతో ప్రభుత్వ పాలనలో కీలకమైన ఈ భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. అదే రోజున ఎర్రమంజిల్‌ లో రూ.100 కోట్లతో తెలంగాణ తలమానికంగా నిర్మించదలచిన అసెంబ్లీ భవన సముదాయానికి కూడా ముఖ్యమంత్రి భూమిపూజచేసి శ్రీకారం చుట్టారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాటి తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి స్వయంగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి, కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చలకు శ్రీకారం చుట్టడం కూడా ఓ శుభసంకల్పమే.

సంకల్పం మంచిదైతే ఎంతటి అవరోధాలనైనా అధిగమించి లక్ష్యం చేరుకోగలమనడానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకమే చక్కటి ఉదాహరణ. దీని స్ఫూర్తితో ప్రభుత్వం చేపట్టే శుభ సంకల్పాలన్నీ నెరవేరాలని ఆశిద్దాం.

Other Updates