– బుక్కా అశోక్‌
tsmagazine
‘మల్కాపూర్‌’ మారుమూల కుగ్రామం. ఈ ఊరు పేరంటేనే అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లిప్తంగా ఉండేవాళ్లు. ఆ ఊరుకు వెళ్లాలంటేనే భయపడేవారు. అధికారులయితే ఆ ఊరు ముఖమే చూసేదికాదు. ఇందుకు గ్రామంలో ఆనాటి తీవ్రవాద ప్రాబల్యమే కారణం. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఊరును చూసేందుకు జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కదిలి వస్తున్నాయి. అందుకు కారణం గ్రామ యువత కృషితో చేపట్టిన అభివృద్ధి. మల్కాపూర్‌ను 13 రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి అభివృద్ధి చూసి అబ్బుర పడ్డారు. మల్కాపూర్‌ అభివృద్ధికి నిధులకు కొదవ రావద్దంటు మంత్రి హరీష్‌రావు సూచించడమే ఆకట్టుకున్నందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ గ్రామం సందర్శనకు విచ్చేసి, ప్రతిష్టాత్మక ‘కంటి వెలుగు’ పథకం ‘మల్కాపూర్‌’లోనే ఆగస్టు 15న ప్రారంభించారు. మల్కాపూర్‌లో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌ ”మల్కాపూర్‌కు నేను చెప్పేదేమీ లేదు.. నేను నేర్చుకొని పోవాల్సి ఉంది” అంటూ వాఖ్యానించడమే ‘మల్కాపూర్‌’ అభివ ద్ధికి నిదర్శనం. మల్కాపూర్‌ యువత చేసిన కృషికి అభివృద్ధికి నిదర్శనం.

తెలంగాణ రాష్ట్రంలో మెదక్‌ జిల్ల్లాోని తూప్రాన్‌ మండలంలో చివరగా ఉన్న మారుమూల కుగ్రామం మల్కాపూర్‌. అధికారిక లెక్కల ప్రకారం 501 పెంకుటిళ్లు ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 2,059 మంది జనాభా ఉన్నారు. వ్యవసాయాధారిత కుటుంబాలున్న మల్కాపూర్‌లో 1987 నుంచి 2002 వరకు తీవ్రవాద ప్రాబల్యం అధికంగా ఉండేది. మల్కాపూర్‌ గ్రామం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో దొమ్మాట నియోజకవర్గంలో ఉండగా, మండల పరిధి గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మండల పరిధిలో ఉండేది. రెండు నియోజకవర్గాల మద్య నలగడం, తీవ్రవాద ప్రాబల్యం అధికంగా ఉండటంతో కనీసం రోడ్డు కూడా సక్రమంగా ఉండేది కాదు. 44 (7)వ జాతీయ రహదారికి సమీపంలో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని పట్టించుకునేవారే కాదు. తీవ్రవాద ప్రాబల్య సమయంలో గ్రామానికి బీటీ రోడ్డెయ్యాలని గ్రామస్తులు ప్రజాప్రతినిధులను వేడుకున్నా పట్టించుకోలేదు. పోలీసులు దత్తత గ్రామంగా మల్కాపూర్‌ను స్వీకరించి, ప్రకటలనకే పరిమితం చేశారు. యువత ఐక్యంగా చేపట్టిన కార్యక్రమాలతో మల్కాపూర్‌ రూపురేఖలు మారిపోయాయి. 2015లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం మల్కాపూర్‌ను అభివృద్ధివైపు మలుపుతిప్పింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేటలను దత్తత తీసుకోగా, ఇదే నియోజకవర్గంలోని తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ను గఢ ప్రత్యేక అధికారి హన్మంతరావు సూచనతో అప్పటి ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ దత్తత తీసుకున్నారు. 2015 ఆగస్టు 25న మల్కాపూర్‌లో నిర్వహించిన ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి కలెక్టర్‌ చొరవ తీసుకోవడంతో గ్రామ యువత తోడయ్యారు.

100శాతం మరుగుదొడ్ల నిర్మాణం..
మల్కాపూర్‌లో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేసేందుకు దృష్టి పెట్టారు. అందుకు మరుగుదొడ్లు నిర్మించుకోని కుటుంబాలను గుర్తించారు. గ్రామంలో 322 కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం అవసరమని గుర్తించారు. ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 12వేలుగా రూ. 38.64 లక్షలు మంజూరు చేయగా, ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణం చేశారు. నిర్మాణం చేసేందుకు 30 మంది అధికారులను ఇన్‌చార్జులుగా నియమించారు. నిర్మాణం చేసిన మరుగుదొడ్లను వినియోగించుకోవాలని చెప్పినా కొందరు గ్రామస్తులు పట్టించుకోలేదు. అందుకు యువత, మహిళా సంఘాలు ఎంతో కృషి చేశాయి. తెల్లవారు జామున మేల్కొని ప్రజలను చైతన్యపరచి మరుగుదొడ్లు వినియోగించుకునేలా చేశారు.

ఇంకుడుగుంతల నిర్మాణంపై దృష్టి..
100శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేయడమేకాదు, వినియోగంలోకి తీసుకొచ్చారు. ఓడీఎఫ్‌ గ్రామంగా ప్రకటించుకున్నారు. మల్కాపూర్‌లో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి విజయం సాధించడంతో ఇంకుడుగుంతలపై ద ష్టి పెట్టారు. గ్రామస్తులను యువకుల సహాయంతో ప్రొత్సహించి ఇంటింటా ఇంకుడుగుంతను నిర్మాణం చేశారు. రూ. 9.22 లక్షల వ్యయంతో ఇంకుడుగుంతలను నిర్మాణం చేపట్టారు. గ్రామంలో వినియోగించిన నీరు ఇంకుండుగుంతలోని వెళ్లేట్లు చేశారు. దీంతో భూగర్భ జలాలు పెరిగిపోయాయి.

118 మంది యువకులతో ‘మేకిన్‌ మల్కాపూర్‌ యూత్‌’
మల్కాపూర్‌లోని ఐదు యువజన సంఘాలు ఒక్కటై ‘మేక్‌ ఇన్‌ మల్కా పూర్‌ యూత్‌’గా ఏర్పాటైంది. మల్కా పూర్‌లోని సక్సెస్‌ యూత్‌, జీనియస్‌ యూత్‌, వివేకానంద యూత్‌, అంబేద్కర్‌ యూత్‌, సిద్ధివినాయక యూత్‌లు కలిసి 118 మంది యువకులు ఏకమై ‘మేక్‌ ఇన్‌ మల్కాపూర్‌ యూత్‌’గా ఏర్పాటు చేసు కున్నారు. వీరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు మల్కాపూర్‌ గ్రామస్తులు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేట్టారు. 2015 డిసెంబర్‌ 6న స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో శ్రమదానం మొదలు పెట్టారు. ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్‌ నిర్వహించి యువకులు, చిన్నారులు శ్రమదానం చేస్తున్నారు. ఒకటి, రెండు ఇలా 2017 అక్టోబర్‌ 29 నాటికి 100రోజుల మైలు రాయిని దాటిపోయారు. 31న 100రోజుల స్వచ్ఛభారత్‌ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రస్తుతం 142 వారాలు ద్విగ్విజయంగా నిర్వహించుకొని, 200 వారాల స్వచ్ఛభారత్‌ వైపు అడుగులు వేస్తున్నారు. 2019 అక్టోబర్‌ 2 నాటికి మల్కా

పూర్‌ను స్వచ్ఛతకు మారుపేరుగా నిలిపాలని యువత ఆశయం. యువత మల్కాపూర్‌లో రాళ్లతో ఉన్న గుట్టను రాక్‌గార్డెన్‌గా ఏర్పాటు చేసుకున్నారు. మల్కాపూర్‌లోని ఆరు వీధులకు ప్రముఖుల పేర్లు పెట్టుకున్నారు. ఏపీజే అబ్ధుల్‌ కలాం, అంబేద్కర్‌, తుర్రేబాజ్‌ఖాన్‌, ప్రొ. జయశంకర్‌, మహత్మాగాంధి, స్వామి వివేకానందల పేర్లు పెట్టుకున్నారు.
tsmagazine

100శాతం అక్షరాస్యత గ్రామం..
మల్కాపూర్‌ 100శాతం అక్షరాస్యత గ్రామంగా ప్రకటించడానికి గ్రామ యువకులు కృషి చేశారు. గ్రామంలో ఉన్న 250 మంది నిరక్షరాస్యులను గుర్తిం చారు. వారందరిని అక్షరాస్యులుగా ప్రకటించడానికి నిర్ణయించారు. 2016 మార్చి 28న జరిగిన ఎన్‌ఐఓఎస్‌ పరీక్ష హాజరయ్యేలా కృషి చేశారు. నిరక్షరాస్యులైన 250మంది పరీక్ష రాసి రికార్డు సష్టించారు. సాక్షరభారతి సహాకారంతో గ్రామస్తులు 100 శాతం అక్షరాస్యత గ్రామాల జాబితాలో చేరిపోయారు.

ఒకేరోజు ఊరంతా భగీరథ పైపులైను..
మల్కాపూర్‌ మిషన్‌భగీరథలో ఒకేరోజు శ్రమదానంతో ఇంట్రాపైపులైను వేసి చరిత్ర సష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకంలో మల్కాపూర్‌ గ్రామ యువత రికార్డు స ష్టించారు. 2016 ఏప్రిల్‌ 5న గ్రామమంతా శ్రమదానం చేసి మిషన్‌భగీరథ పథకంలో ఇంట్రాపైపులైను 3.8 కిలోమీటర్లు వేశారు. ఒకేరోజు 324 నల్లా కనెక్షన్లు అందజేసి చరిత్ర స ష్టించారు. 8గంటలు శ్రమించి పైపులైను వేసి, నల్లా కనెక్షన్లు పొందారు. మల్కాపూర్‌ను స్పూర్తిగా తీసుకొని వెంకటాయపల్లిలో శ్రమదానంతో ఇంట్రాపైపులైన్‌ వేసుకొని, నల్లాకనెక్షన్లు తీసుకున్నారు.

ఇంటింటా చెత్త సేకరణ..
స్వచ్ఛమల్కాపూర్‌.. శుభ్రత మల్కాపూర్‌ చేసేందుకు రాజేశ్వరీ మహిళా గ్రామైక్య సంఘం ముందుకు వచ్చింది. చెత్త సేకరణకు రిక్షాను వినియోగించుకోడానికి నిర్ణయించారు. రిక్షాతో చెత్తను సేకరించిన వ్యక్తికి గ్రామైక్య సంఘమే వేతనం చెల్లిస్తుంది. అందుకు ఇంటింటా రూ. 10లు వసూలు చేసింది. చెత్తను సేకరించిన వ్యక్తికి వేతనం చెల్లించే బాధ్యతను తీసుకుంది. చెత్తను సేకరించిన వ్యక్తికి ఒకేసారి చెల్లింపులు చేస్తున్నారు. ఈ విధానం ఇతర గ్రామాల్లో అమలు చేసేందుకు అధికారులు నిర్ణయంచారు.

మల్కాపూర్‌లో యువత, మహిళలు, పెద్దలు మద్యపాన నిషేదం అమలు చేస్తున్నారు. ఎవరైనా మద్యం సేవిస్తే భారీ జరిమాన విధించాలని కట్టుబాటు చేసుకున్నారు. పట్టణాలకు ధీటుగా ఒక చిన్న పల్లెటూరు అయిన మల్కాపూర్‌లో ప్రతి రోజు తడి పొడి చెత్తను వేరుచేసి నూతనంగా నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణ రిసోర్స్‌ పార్క్‌ లో వర్మీ కంపోస్ట్‌ తయారీ చేస్తూ జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గ్రామంలో సోలార్‌ వెలుగులు..
మల్కాపూర్‌లో చేపట్టిన అభివ ద్ధికి సహకరిస్తున్న ‘గడ’ ప్రత్యేక అధికారి హన్మంతరావు గ్రామానికి 100 సోలారు వీధి దీపాలు మంజూరు చేయించారు. ఓ సంస్థ సోలారు వీధి దీపాలు ఏర్పాటు చేయగా, శ్రమదానంతో గ్రామ యువకులు బిగించుకున్నారు. గ్రామంలో సోలారు వీధి దీపాలు ఏర్పాటుతో విద్యుత్‌ ఆదా చేస్తున్నారు.

హరితహారంలో 1.10 లక్షల మొక్కలు నాటారు..
మల్కాపూర్‌ గ్రామంలో పచ్చదనం నింపేందుకు 500 మొక్కలు నాటడంతో ఆరంభమై 1.10 లక్షల మొక్కలు నాటి చరిత్ర సష్టించారు. హరితహారంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటి రికార్డు నెలకొల్పారు. 2017 జూలై 29న డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ ముఖ్యఅతిధిగా హాజరై హరితహారం చేపట్టారు. ఒకేరోజు 1.05 లక్షల మొక్కలు నాటారు. హరితహారంలో నాటిన మొక్కలతో మల్కాపూర్‌ గ్రామం పచ్చదనం నింపుకుంది.

రాక్‌గార్డెన్‌ ఓ ప్రత్యేక ఆకర్షణ..
మల్కాపూర్‌ యువత శ్రమకు ప్రతిఫలం రాక్‌గార్డెన్‌గా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నోటి వెంట అది రాక్‌గార్డెన్‌ కాదూ.. ‘గొల్డెన్‌ రాక్‌గార్డెన్‌’గా వర్ణించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. రాళ్లు, ముళ్ల కంపలతో నిండిపోయిన ఎత్తయిన ప్రదేశంను శ్రమదానంతో నందనవనం చేశారు. గడ ప్రత్యేక నిధులు రూ. 6లక్షలతో రాక్‌గార్డెన్‌ రూపురేఖలు మార్చేశారు. ఇదీ మల్కాపూర్‌ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మల్కాపూర్‌కు అవార్డుల పంట..
అభివ ద్ధి చెందిన మల్కాపూర్‌కు అవార్డుల పంట పండింది. యువత సహకారంతో అభివృద్ది చెందిన మల్కాపూర్‌కు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2016లో రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డును ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందిన మల్కాపూర్‌కు రూ. 1.10లక్షల నగదు లభించింది.

2017 లో జిల్లాస్థాయి ఉత్తమపంచాయతీగా అవార్డు, రూ. 50వేల నగదును దక్కించుకుంది. చెత్త సేకరణ చేపట్టి గ్రామాన్ని ఉత్తమంగా నిలిపిన రాజేశ్వరీ గ్రామైక్య సంఘంకు ఆగస్టు 2017లో ఉత్తమ అవార్డు దక్కింది.

మేక్‌ఇన్‌ మల్కాపూర్‌ యూత్‌కు వివేకానంద జయంతి సందర్బంగా సిద్దిపేట నెహ్రూ యువ కేంద్రం ఉత్తమ యూత్‌గా ప్రకటిస్తు రూ. 25వేల నగదును అందజేసింది. గతనెలలో పంచాయతీ దివస్‌ పురుస్కరించుకొని ఉత్తమ పంచాయతీగా రూ. 10లక్షలు, ఉత్తమ పంచాయతీ అవార్డును అందజేశారు.

సందర్శకులతో మల్కాపూర్‌..
మల్కాపూర్‌ ఉత్తమ గ్రామంగా తయారు కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. అభివృద్ది చెందిన మల్కాపూర్‌ను సందర్శించడానికి వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాల ప్రజా ప్రతినిధులు విచ్చేశారు. సుమారు 800 మంది గ్రామాన్ని సందర్శించి అబ్బురపడ్డారు. మల్కాపూర్‌ను రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఎస్పీ సింగ్‌ మిషన్‌భగీరథ ఇన్‌చార్జిగా సందర్శించారు. మంత్రి హరీష్‌రావు, హరితహారంలో ఎస్పీ సింగ్‌, రేవంత్‌ పీటర్‌, 1.10 లక్షల మొక్కలు నాటేందుకు హరితహారంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం అడిషనల్‌ సీఎస్‌ స్మితా సభర్వాల్‌, నిజామాబాద్‌ జిల్లా, అధిలాబాద్‌ జిల్లా కలెక్టర్లు యోగితారాణా, జగన్‌మోహన్‌, ట్రైనీ అడిషనల్‌ కలెక్టర్లు, ఆలేరు ఎమ్మెల్యే సునీతా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, యూనిసెఫ్‌ ప్రతినిధి మార్గరేట్‌ అల్‌బర్ట్‌, అండమాన్‌ నికోబార్‌, దేశంలోని 13 రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మల్కాపూర్‌ను సందర్శించారు.

వ్యవసాయ ఆధారంగా జీవనం సాగించే మల్కాపూర్‌లో కుటుంబాల ఆర్థికాభివృద్ధికి అధికారులు బాటలు వేస్తున్నారు. రైతుల జీవన స్థితుల్లో మార్పులు తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. మల్కాపూర్‌లో 100 మంది రైతులతో పందిరి సాగు వ్యవసాయం చేయించేందుకు నిర్ణయించారు. ఈమేరకు 72 మంది రైతులను ఎంపిక చేశారు. మొదటి విడుతగా 25 మంది రైతుకు స్త్రీనిధి నుంచి రూ. లక్ష రుణం ఇప్పించి పందిరిసాగు పద్దతిలో వ్యవసాయం చేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పందిరి సాగు వ్యవసాయం మల్కాపూర్‌లో ఆరంభమైంది. రానున్న కొద్దిరోజుల్లో వ్యవసాయంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

సహకారం, వ్యవసాయం, సామాజికాభివృధ్ది..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లుగా ముల్కనూర్‌లో సహకారం, అంకాపూర్‌లో వ్యవసాయం, గంగదేవ్‌పల్లిలో సామాజికాభివృద్ధి ఉంది. ఈ మూడింటిని కలిపిన ‘సమ్మిళిత అభివృద్ధి’ మల్కాపూర్‌లో కనిపిస్తుంది.

నిస్వార్ధం పెరిగితే గ్రామాల అభివృద్ధి..
గ్రామాల్లో నిస్వార్ధం పెరిగితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. స్వార్థంతో గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. మల్కాపూర్‌లో యువత, గ్రామస్తులు స్వార్థం వదిలి గ్రామాభివృద్ధికి కృషి చేయడంతో ఎంతో అభివృద్ధి సాధిస్తోంది. మల్కాపూర్‌ యువత చేపట్టిన స్వచ్చభారత్‌ పలు గ్రామాలకు ఆదర్శగా నిలిచింది. మల్కాపూర్‌ స్పూర్తిగా తూప్రాన్‌, మనోహరాబాద్‌, శివ్వంపేట, సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలాలలో యువత స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తు, పరిశుభ్ర గ్రామాల రూపకల్పనలో కీలకపాత్ర వహిస్తున్నారు. నిస్వార్థంగా పని చేసే యువత నుంచి గ్రామానికి నాయకత్వం వహించే నాయకులు వస్తే ప్రతి గ్రామం ఆదర్శ గ్రామం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామాభివృద్ధికి కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ చొరవ తీసుకోవడంతో గ్రామ యువత తోడయ్యారు. ఈ క్రమంలో మల్కాపూర్‌ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించడం కోసం తూప్రాన్‌ ఎంపీడీవో చెన్నమనేని శ్రీనివాస్‌రావు గత రెండున్నర సంవత్సరాలుగా మల్కాపూర్‌ యువతకు స్నేహితునిగా, తత్వవేత్తగా, మార్గదర్శకుడిగా ఉంటు వారిలో ఎప్పటికప్పుడు స్పూర్తినింపుతు ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

పుస్తకాలలో చదువుకు మా గ్రామంలో వ్యత్యాసం ఉండేది !
చదువుకున్నపుడు పుస్తకాలలో పాఠాలకు మా గ్రామ అభివృద్ధి చూస్తే పొంతన ఉండేదికాదు. పత్రికలు, సినిమాలు, టీవీల్లో చూస్తున్న అభివృద్ధి ఎక్కడ కనిపించేదీకాదు. ఆ గ్రామాల్లో చూపించే అభివృద్ధి, పరిశుభ్రత మా గ్రామంలో చూడాలని భావించాం. ఐదేళ్లకోమారు వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి చేస్తామంటు హామీ ఇచ్చి ఎవరో సర్పంచుగా గెలువడం రొటిన్‌గా మారిపోయేది. యువకులం కలిసి అభివృద్ధిపై చర్చించుకునే వాళ్లం. గ్రామంలో సంఘాలుగా ఏర్పాటు చేసుకొని గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లేవాళ్లం. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమానికి అప్పటి ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ మా గ్రామం రావడం, మా గ్రామం దత్తత తీసుకోవం జరిగిపోయింది. రొనాల్డ్‌రోస్‌ మల్కాపూర్‌ గ్రామాభివృద్ధికి యువత, మహిళలను ప్రొత్సహించి ముందుకు నడిపించారు. గ్రామంలోని ఐదు యూత్‌ సంఘాలను కలిపి మేక్‌ ఇన్‌ మల్కాపూర్‌ యూత్‌గా ఐక్యం కావాలని సూచించారు. కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సూచించినట్లు వెళ్లడంతో గ్రామంలో మేము ఊహించినంత అభివృద్ధి జరిగిపోయింది. మల్కాపూర్‌ గ్రామం అంటే భయపడే రోజుల నుంచి ఆదర్శంగా నిలిచి పలు గ్రామాలకు రోల్‌ మోడల్‌గా మారిపోయింది. మల్కాపూర్‌ అంటే అన్నింటికి మార్గదర్శకంగా చూపాలని ఆశతో మేక్‌ ఇన్‌ మల్కాపూర్‌ యూత్‌ పనిచేస్తుంది.
– రవి, మేక్‌ ఇన్‌ మల్కాపూర్‌, మాజీ అధ్యక్షుడు

Other Updates