magaశ్రావణమాసం చేన్లు చెలకలు పచ్చపచ్చగుంటయి. అంతకుముందు కొట్టినవానలకు వాగులు, వంకలు, చెర్లు నిండుగ ఉంటయి. ఏడ సూసినా పచ్చని ప్రపంచమే. ఇన్నొద్దులోలెకాలం ఎద్దడి, ఎద్దడి లేదు. జర వానలత్తన్నయి. పంటలు సుత పండుతున్నయి. ఊర్లు కళగున్నయి. ఈ కాలంలనే చెట్ల తీర్థం పోవుడు ఉంటది. ఇంకో ఊర్లె దీన్ని వంటలకు పోవుడు అంటరు. ఓ కాడ చెట్లల్లకు పోవుడు అంటరు. ఇంక శానిగ చెప్పెటోల్లు వనభోజనాలకు పోతన్నం అని చెప్పుతరు.

ఇది మన ఊర్లల్ల ఎన్కటినుంచి ఉన్న సంప్రదాయం. రేపటి ఎల్లుండి చెట్లల్లకు పోతన్నం అనంగనే ఇంట్ల అందరికి సంబురం ఉంటది. ఎవలు చేసే పనులు వాల్లు చేస్తరు. సాధారణంగా ఎవల బాయికాడికి వాల్లు పోతరు. ఒక్క వాడోల్లు ఒక్క దగ్గరికి పోతరు లేదా ఒక్కకులపోల్లు ఒకతానికి పోతరు. ఊర్లె ప్రఖ్యాతి గాంచిన గుట్టకిందికి లేకపోతే తాళ్ళల్లకు, చింతలల్లకు కాపోతే మామిడి చెట్లల్లకు కల్సిపోతరు. కులం తలం అందరు కల్సి మ్యాకపోతునో లేదా గొర్రెపోతునో కోసుకుంటరు. పెద్ద బలగం ఉన్నవాల్లు యాటపిల్లను కోసుకుంటరు. బిడ్డలను, అల్లున్ని, ఇయ్యం అందుకున్నోల్లను పిల్సుకుంటరు. అందరు కల్సి పొద్దుగాలనే బియ్యం, మసాల, కారంపొడి, నూనె, కుడుక, వక్కలు, టెంకాయ, మిరపకాయలు, వంటకు అవసరం అయ్యే సామాను అంత తీసుపోతరు.

దగ్గర ఉండి నడిచిపోయేవాళ్లు అయితె గంపల సామను పెట్టుకోని గంపకు సున్నం బొట్లతో పుదిస్తరు. అందరు తానం చేసి కాళ్ళకు పసుపురాసుకొని ఆ వాడ కట్టంత బయలుదేరుతరు. బోల్లు, ముకుడు, గిన్నెలు, నూనెసీస, మొగోల్లు పట్టుకొని పోతరు. అప్పటికే అక్కడ చెట్లల్ల మూడు పొయ్యిరాల్లు పెట్టి, కట్టెలు తయారుచేసి ఉంచుతరు. కోడిపిల్ల, యాటపిల్ల ఎవలు ఏది కోసుకుంటే అది సై చేసి పెడుతరు. సాధారణంగా చెట్లల్లకు పోతె ఉప్పలమ్మకు పుదిస్తరు. అక్కడే ఉన్న ఉప్పలమ్మకు సున్నం బొట్లు బెట్టి అక్కడ కొబ్బరికాయ కొడుతరు. అక్కన్నే కోడిపిల్లను కోస్తరు. అటెన్క వంట మొదలుపెడుతరు. సాధారణంగా ఇండ్లల్ల ఆడోల్లు వంటలు చేస్తరుగని చెట్ల తీర్థంకాడ మొగోల్లు ఎక్కువ పనిచేస్తరు. అన్నం, కూర పప్పు, పులుసు, గారెలు, పురీలు చేసుకుంటరు. ఈ కాలంల వాతావరణం కూడా మంచిగ ఆహ్లాదంగ ఉంటది.

సంటి పిల్లగాండ్లు సుత చెట్లల్ల నీళ్ళకాడ ఆడుకుంటరు. చెల్కకు పోతరు. చెట్లు ఎక్కుతరు. రకరకాల పక్షులను చూస్తరు, ఆడుకుంటరు. అట్లనే తాళ్ళల్ల కల్లు చెప్పి ఉంచుతరు. ఈ కాలంల పండు తాటి కల్లు పారుతది. కల్లు గుడాలు తెచ్చుకొని పొద్దటిపొంటినే గారెలు సోర్వపెట్టుకొని ఒక్క దగ్గర కూసోని తింటరు. కల్లు తాగుతరు. ఇగ మధ్యాహ్నం సమయానికి అందరూ కల్సి ఇస్తరాకులు కుట్టుకుంటరు. ఇస్తార్లల్ల తింటరు.

వాడకట్టోల్లు అంత కల్సివచ్చి వండుకుంటరు. కాబట్టి అందరి కూరలు అన్నాలు అయినంక అన్ని కుటుంబాలు కల్సి ఉంటయి. అందరు ఒక్కసారే తింటరు.

శ్రావణమాసంల వరి కలుపులు అయిపోతయి. వరికి నీళ్ళు పెట్టుడే ఉంటది. పచ్చగ పెరిగిన వరిమల్లను సూస్తేనే కడుపు నిండుతది. మక్కజొన్న అయితది. ఏడ సూడబోయిన పచ్చని పంటపొలాలు. బాయిలు, చెర్లు, కుంటలు నిండి కనపడుతయి. చెరువు పారకం పొలాలు సూస్తే, పచ్చని మైదానం లెక్క కండ్ల సంబురం అయితది. ఇగ అందరు కల్సి అన్నం తిన్నంక చెట్లకింద కూసుంటరు. ముచ్చట పెట్టుకుంటరు. కొందరు అట్ల ఒరుగుతరు. వదినె, మరదండ్లు, బావ బామ్మర్థులు పరాశ్కం ఆడుకుంటరు. అటుఇటు కంచెల్లు గుట్టలు, బోర్లు ఎక్కి తిరిగి వస్తరు. చెట్ల తీర్థం పోతేె ఎవలకైన మనసు నిమ్మలం అయితది.

వనభోజనాలు అనేది ఒక పండుగ. ఇండ్లు, వాడలు, కులాలు ఎవలకు వాల్లే పోయినా సోపతిగాల్లను కూడా పిల్సుకుంటరు. కమ్మగ వండుకొని తినుడు అదొక సంబురం లెక్క జరుపుకుంటరు. అయితే కోల్లు ఇండ్లల్ల పెంచుకున్నయే. వ్యవసాయదారులకు యాట పిల్లలకు కూడా ఒకటి రెండు కొని మందల ఏస్తరు. వాటిని అక్కెర ఉన్నవారు తెచ్చుకుంటరు. అల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, టమాటలు, కోతిమీర, పుదీన, చింతపండు, అరొక్కటి అక్కడ చేనుకాడ పండినయ్‌. రోజు బాయికాడికె సద్ది పట్టుపోయి వరి మల్లె ఒడ్డుమీద కూసోని తినే అలవాటు ఉన్నా వంటలకు వచ్చిన కుటుంబంలోని సుట్టాలతోని కల్సి మోత్కు ఆకుల్ల తినుడు, ఎవసాయదారులకు, ఇతరులకు ఒక సంబురం. ఇది తెలంగాణ సాంప్రదాయం.

అన్నవరం దేవేందర్‌

Other Updates