tsmagazine
రాధకాదు, రుక్మిణికాదు, సత్యభామ కూడా కాదు. ఆమె పేరు-సరస్వతి. మరి ఆమె బుర్ర నిండా శ్రీకృష్ణుడి తాలూకు ఆలోచనలే. ఆమె వేసే వన్నీ ఆ దేవదేవుడికి సంబంధించిన బొమ్మలే. ఒకసారి ఒకే ఒక నల్లనయ్య వేస్తే, మరొకసారి- గోవర్థనగిరి ధారిని వేస్తుంది. ఇంకొకసారి- కాళీయమర్థనుని గీస్తుంది. వేరొకసారి-రాధాకృష్ణుల రాసలీలకు సృజన జోడిస్తుంది.

ఏమైనా, ఆమె ఏ చిత్రం గీసినా అందులో ఆ నల్లనివాడు, ఆ పద్మనయనమ్ములవాడు, ఆ కృపారరసముపై చల్లేవాడు తప్పక ఉండితీరుతాడు. సంప్రదాయ, సమకాలీన ధోరణుల సమన్వయంతో తనదైన చూడచక్కని శైలిలో సరస్వతి గీసే ఆక్రాలిక్‌ వర్ణచిత్రాలు చూసినవారు ‘వహ్వా’ అనకపోరు.

ఇంతకాలం ఆ శ్రీకృష్ణుని, ఆయదుభూషణుణ్ని, వివిధ ఘట్టాలలో ఘనంగా చూపిన సరస్వతి ఇకపైన ఆ నరసఖుని తీరుతెన్నులను జనసామాన్యానికి చేరువచెయ్యాలనే సంకల్పంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘భగవద్గీత’ను బాగా ఆకళింపు చేసుకుంటున్నది. ఇకపై ఆమె మనోవీధిలో మెదిలే ఆ గీతారహస్యాలనే గీతలలో పొందుపరిచి, రంగురంగుల రమణీయ చిత్రాలుగా సిద్ధపరిచేందుకు సరస్వతి ప్రయత్నిస్తున్నది.

ఎక్కడో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్‌లో దాదాపు నాలుగు దశాబ్దాలక్రితం జానకమ్మ, పరంధాములు దంపతుల కడుపున పుట్టిన సరస్వతివాళ్ళ వంశంలోనే చిత్రాకారులు లేరు. కానీ ఆ ఆశ సరస్వతిలో మెండుగా ఉంది. స్థానిక పాఠశాలలో ప్రాథమిక తరగతులు చదువుతున్న రోజులలోనే చిన్నచిన్న బొమ్మలు వేయడం ఆమెకు సరదాగా ప్రారంభమైంది. అది గమనించిన సాంఘికశాస్త్రం బోధించే సత్యనారాయణసారు, ఆమెను బొమ్మలు వేయడంలో నిష్ణాతుడైన యాదగిరి మాస్టారుకు పరిచయం చేశాడు. యాదగిరివద్ద కొన్ని మాసాలు డ్రాయింగ్‌ వేయడంలో సరస్వతి మెళకువలు నేర్చుకున్నది. విడవకుండా చిత్రాలు వేస్తూనే పోయింది. ఇట్లా ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. అయిపోయాక హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తాలూకు లలితకళల కళాశాలలో చదవాలని విఫల ప్రయత్నం చేసింది. ఇంటర్మీడియట్‌ చదివింది. ఆ తర్వాత ఆమెకు వివాహం జరిగిపోయింది. పాప పుట్టింది. డ్రాయింగ్‌లో టీటీసీలో ఉత్తీర్ణురాలైంది. అయినా పట్టువిడవకుండా చిన్నపాపను పట్టుకుని ప్రవేశ పరీక్షరాసి బి.ఎఫ్‌.ఏ.లో పెయింటింగ్‌లో చేరిపోయింది. 2002లో పూర్తి చేసింది. ఆ తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ వాస్తు-లలితకళల విశ్వవిద్యాలయంలో ఎం.ఎఫ్‌.ఏ. పెయింటింగ్‌ రెండేండ్లు చదివి కృతార్థురాలైంది. మొదట్లో తెలంగాణ మహిళల చిత్రాలెన్నో ఆమె గీసింది. గణపతి, హనుమాన్‌లాంటి చిత్రాలు వేసింది. అంతలోనే ఆమెకంటూ ఒకానొక శైలి అబ్బింది. ప్రస్తుతం ఆమె వేసే చిత్రాలు చూస్తుంటే-శీర్షిక చూడకండానే గోపాలుడనీ, మురళీగానలోలుడనీ, గోపీమానసచోరుడనీ, ఇట్టే చెప్పవచ్చు. ప్రతి చిత్రం నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అలంకరిస్తున్న ఆకులు అలములలో అనితరసాధ్యమైన ఆమె శ్రద్ధ, ఓర్పు, పనితనం, కళాహృదయం ద్యోతకమవుతున్నది. ప్రతి బొమ్మను సరస్వతి మెరుగులు దిద్దుతున్న తీరుతెన్నులు సౌందర్యానికి ఆమె ఇచ్చే ప్రాధాన్యతను ప్రస్ఫుటం చేస్తుంది. ఆమె చిత్రాల్లో అలంకరించే ఆభరణాలు, వస్త్రాలు చూడచక్కగా ఉంటాయి.
tsmagazine

ఒక సమకాలీన చిత్రకారిణిగా ఆమె 2007లో తొలుతొలుత హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో వ్యష్టి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసింది. దాదాపు పాతిక చిత్రాల్లో తెలంగాణ మహిళలను ఆమె ప్రతిఫలించింది.

మరుసటి యేడాది అలంకృత ఆర్ట్‌ గ్యాలరీలో రెండవ పర్యాయం వ్యష్టి చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసే నాటికి సరస్వతికంటూ ఒక వస్తువు పట్టుపడింది. వరుసగా ఆమె మరో ఐదు వ్యష్టి చిత్రా కళా ప్రదర్శనలు గత యేడాది వరకు హైదరాబాద్‌ నగరంలో నల్లని దేవుడిపై నిర్వహించింది.

స్కూటర్‌పై పాలడబ్బాలు తెచ్చేవాడు పరంధాముడే అని ఆమె ప్రతిపాదించినతీరు విశేషమైంది. ఇటీవల అసలుసిసలు స్కూటర్‌నే ఆమె చిత్రాలతో అలంకరించి ప్రదర్శనకు పెట్టింది. ఇకపై ఫైబర్‌తో చిత్రాల స్కూటర్‌ రూపొందించే ఆలోచనలో ఆమె ఉంది. సమతలంపై ఉబ్బెత్తయిన చిత్రాలు రూపొందించడంలోనూ ఆమెకు అనుభవం ఉంది.

ఇంకా లోగడ రూపొందించినట్టుగా సింథటిక్‌ వస్త్రంపై చక్కనయ్య చిత్రాలు వేయాలనుకుంటున్నది. కొంతకాలం క్రితం ‘కల్పవృక్షం’ శీర్షికన ఆమె రూపొందించిన ‘ఇన్‌స్టలేషన్‌’ ప్రత్యేకమైంది. దాదాపు ఏడువందల యాభై రావి ఆకులతో ఆమె అల్లినతీరు బాగుంది. వేర్లు పెళసు ఊడకుండా, వాస్తవానికి దగ్గరగా ఉండాలని రాతి వెండి తీగలు వాడింది. అదే శీర్షికన మూడువందల యాభై ఆకులతో మరొకటికూడా ఆమె చేసింది.
tsmagazine
ఇవికాకుండా వివిధ ఆకృతులతో ఆమె తయారుచేసిన అట్టచెక్కబొమ్మలు చెప్పుకోదగినవే.కొంతకాలం క్రితం ఆమె ‘తంజావూరు’ ఫక్కీ చిత్రాలు కూడా కొన్ని వేశారు. ఇప్పటివరకు 5 I 5 చిత్రాల ప్రయాణంనుంచి ఒక్క అడుగు చిత్రాల దాకా మూడు నాలుగువందల చిత్రాలు వేసిన సరస్వతి కేవలం వ్యష్టి చిత్ర కళా ప్రదర్శనలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా హైదరాబాద్‌, కేరళ, న్యూఢిల్లీ, కోల్‌కత్తా, బెంగుళూరు, ముంబై లాంటి చోట్ల పలు సంస్థలు నిర్వహించిన సమష్టి చిత్రకళా ప్రదర్శనలలో పాల్గొని తన ఉనికిని చాటారు. హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘బతుకమ్మ’పై ఏర్పాటు చేసిన శిబిరంనుంచి ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్‌ మ్యూజియం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికశాఖ, హైదరాబాద్‌లోని కళాకృతి ఆర్ట్‌ గ్యాలరీ, కేరళలో నిర్వహించిన జాతీయ చిత్రకళా శిబిరం, విఘ్నమంచు ఆర్ట్‌ ఫౌండేషన్‌, ముక్తవారు ఏర్పాటు చేసిన చిత్రకళాకారిణుల శిబి రంలో, డా|| రెడ్డి ఫౌండే షన్‌ తదితరులు నేతృ త్వం వహించిన శిబిరా ల్లో పాల్గొని, వారికి పలు చిత్రాలు గీసిచ్చారు.
tsmagazine
వీటితోపాటుగా పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం నిర్వ హించిన పోటీ చిత్రకళా ప్రదర్శనల్లో, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ పారిశ్రామిక ప్రదర్శనల్లో ఏర్పాటు చేసే పోటీ ప్రదర్శనల్లో లోగడ పాల్గొన్నారు. ప్రశంసలు, అవార్డులు పొందారు.

లోగడ డ్రాయింగ్‌ అధ్యాపకురాలిగా ఉన్న అనుభవం వల్ల, పలు పర్యాయాలు చిత్రకారులకు నిర్వహించే వేసవి శిబిరాల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పాల్గొన్నారు. ఏది ఏమైనా సరస్వతి సదా ఆ గోరుముద్దలుతినే గోపాలుణ్ణి, వటపత్రశాయిని, త్వరలో గీతా బోధకుడిని చిత్రించడంలోనే నిమగ్నమై ఉంటుంది.

టి. ఉడయవర్లు

Other Updates