ఈ పేరెత్తగానే ‘మీరజాలగలడా నాయానతి…’ ఇత్యాది చందాల కేశవదాసు పాట మన మదిలో నిలుస్తుంది. చాలా కాలంనాడే మరింగంటి వెంకట నరసింహాచార్య కవి (క్రీ.శ. 1770) తన బహురచనలలో నొకటిగా ఈ కథను సుమారు 1040 ద్విపదలలో రచించారు. ప్రబంధకవితేతరులైన జానపద- గ్రామీణ జనులు చదివి-చదివించుకొని ఆనందించే విధంగా దీన్ని రచించటం ఒక విశేషం. కవి కృతులన్నీ ప్రబంధాలే – అందుకొరకే దీన్ని సరసమై పరగిన జానుతెనుగులో రచించి ఒక పురాణ కథను ప్రజల మధ్యన వ్యాప్తి చేసినాడు.
డాక్టర్ శ్రీరంగాచార్య
సుప్రసిద్ధమైన పారిజాతాపహరణ ప్రబంధంలో ‘పుణ్యక వ్రతము’ పేర ఈ కథ (54-90 పద్యాలు) కలదు. కాని దానిలో తులాభార ప్రసక్తిలేదు. ఆనాడు శ్రీకృష్ణ దేవరాయల ‘తులాభార’ములు తెలిసిన ముక్కు తిమ్మన-పారిజాత… కథకు ముఖ్యుడైన రాయల వారిని ‘పుణ్యక వ్రతము’లోనే చూపినాడు. తులాభార ప్రసక్తి లేదు. అనంతరకాలంలో ఇది ఆనందావహంగా వుండటాన్ని ఇట్లా తులాభారమై వ్యాప్తి చెందింది. ప్రప్రథమంగా ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారనాటకం వ్రాసినాడు (ము. 1922) ఆనాడే దీనికి చందాల కేశవదాసు 22 పాటలను వ్రాసి గణనీయుడైనాడు. వాటిలోనిదే ‘బలేమంచి చౌక బేరము…’ అనే పాట ఒకటి. తరువాత వివిధ కంపెనీలు 1935, 1955, 1966 సం.ల్లో సినిమాలు తీస్తే అన్నిట్లోను చందాల వారి పాటలు యధాతథంగా వున్నాయి. ఇట్లా అనేక రూపాలుగా ప్రఖ్యాతిగాంచిన ‘శ్రీకృష్ణతులాభారము’ ఎందరెందరో నటీనటులు – రచయితలను కూడా వ్యాప్తిలోనికి తెచ్చింది.
పారిజాతాపహరణ ప్రబంధంలోని కథను – తిమ్మనకవి సంస్కృత హరివంశాధారంగా గ్రహించి సంక్షేపించినా ‘తులాభార’ ప్రసక్తిలేదు. ప్రస్తుత ద్విపద కృతి కర్త కొంత వరకు ముక్కుతిమ్మన కృతిని అనుకరించినా వర్ణనలు – కల్పనలతో కథను పెంచి ‘తులాభారము’ను వేయించినాడు. పారిజాతాపహరణంలోని కొన్ని సన్నివేశాలను మార్చి ఔచిత్యం పాటించిన ద్విపద కావ్యకర్త కథాకథనంలో శ్రద్ధకన్పరచినాడు – ఈయన మార్పుల్లో నారదుడు విచ్చేసి ఏకాంతంలో వున్న సత్యభామకే తులాభారం విషయం వివరిస్తాడు. చైత్రమాసం బదులు – ఈ వ్రతాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశినాడు మాత్రమే చేయవలెనని – మార్గశీర్ష ప్రాముఖ్యాన్ని తెల్పుతాడు. మహర్షి ఆనతి ప్రకారం మార్గశీర్షంలో సత్యభామ వ్రతాన్ని చేస్తే – నారదుడే అష్టదిక్పాలకులకు పతిదాన వ్రత విశేషాలను చెప్పి ఆహ్వానిస్తే వీరితో పాటు మునిజనం, బ్రాహ్మణ బృందం విచ్చేస్తుంది. ఒక వైపు కౌరవులు వస్తే శ్రీ కృష్ణుడేవారికి తగిన పనులప్పగిస్తాడు (రాజసూయయాగంలోవలె) వీరే గాక – కుబ్జ. ద్రౌపది, రాధ, ప్రద్యుమ్నుడు, సాత్యకి విచ్చేసి వ్రత సంబంధ కార్యాలను చేస్తారు. ఇట్లా వీరి వర్ణన కార్యక్రమాలు మొదలగు వాటితో కథ పెరిగింది. పతిదానవ్రత సమయానికి ‘రుక్మిణి’ రాకపోవటం సవతులకయ్యమే ప్రధానమని రేవతీ ద్రౌపదులు భాషించుకోవటం జానపదుల యధార్థకథనంవలె కలదు.
”నోరు పంతములాడె నొసటిపైవ్రాత
తీరు తప్పియుజనుల తిరిపెంబులడుగ
పాలాయె” నిక దూఱబనియేమి ఒకరి
జోలిగైకొననేలజోకతో మిగుల
నీరాడు కడవయు నెఱిముంతమఱుగు
దూరినకైవడి దూరమెంచకను…”
అని సవతులరీతిని తెల్పినాడు. వ్రతోద్యాపన తరువాత శ్రీకృష్ణుని దానముగా గ్రహించిన దేవర్షి శ్రీకృష్ణుని పుష్పమాలికతో కట్టివేసి విక్రయింప నుద్యుక్తుడు కాగా – అప్పుడు సత్యభామ తన భర్తను ఎవరైనా కొంటారేమో! అని గ్రహించి భర్తయెత్తు బరువు ధనమిచ్చి పరిగ్రహించటానికి యత్నిస్తే ఎంతకూ త్రాసు మొగ్గు చూపకపోవటంతో ఎంతో బంగారం, మణులు మొదలైనవన్నీ తెప్పించి వేస్తుంది. ఐనా మార్పు లేకపోవటంతో నారదుడే సత్యభామతో నీవు రుక్మిణిని తీసుకవస్తే ఆమెవేసే తులసీ దళమే వీటన్నిటిని మించుతుంది. ఆమె భక్తి ఆ విధమైనది. అని చెపితే ఎంతో బాధతో సత్య, రుక్మిణిని తీసుకురావటం ఆమె భక్తితో వేసిన తులసీ దళంతో తరాజు మొగ్గుచూపటం ఇది దీని ఫలితం. అందుకే పారిజాత కర్త ఇందిరా ప్రతినిధి రుక్మిణీ రమణి వచ్చినట్లు తెల్పుతాడు ద్విపదకర్త
యుక్తులేటికిచాలనుపమింపగాను
భక్తితోగలతులసి పత్రితోసమము
తగవవిత్రంబన్యతరముగా దంచు
పొగడొందెతులసి నాభూజరాజంబు
సిరితోడదీటుగా శ్రీహరియురము
నిరవుగచెలువొందు నెపుడెదలేక
సిరివరుమహిమయు శ్రీతులసిమహిమ
నరసి చూసిన నొక్కటది నిజంబనుచు…
అని తులసీ మాహాత్మ్యాన్ని, రుక్మిణి భక్తిని గొప్పగా తెల్పినాడు. అందుకే కవి ‘పారిజాత…’ వలె చైత్రమాసాన్ని చెప్పకుండా మార్గశీర్షాన్ని చెప్పి ‘మాసానాం మార్గశీర్షోహం’ అనే గీతాసూక్తి నిదర్శనంగా చూపి మనకున్న చతుర్వింశతి ఏకాదశుల్లో మార్గశిరశుద్ధ ఏకాదశికి కామిన్యైకాదశియని పేరు. హరివాసరం. హరిమాసం, శ్రీహరి వీటిని ఎన్నుకొని కవి కామిన్యైకాదశిని సార్థకం చేయటం – ద్విపదకృతిలోని ఒక ముఖ్యమైన మార్పు. నందితిమ్మన పుణ్యక వ్రత కథామూలం తెల్పలేదు. కాని ద్విపద కావ్యకర్తయైన ఆచార్యుల వారు ‘భార్గవాదిస్మృతుక పలికిన విధము”గా తాను ప్రవచిస్తున్నాను అని తెల్పినా మనకున్న 360 వ్రతాల్లో పుణ్యకవ్రతమనేది లేదు. దీన్ని తిమ్మన కల్పించటంలో నాటి విజయనగర కాల తులాదాన ప్రచారం తెలస్తున్నది. మనకవులు దీన్ని గ్రహించి జనరంజకార్థం పతి విక్రయం చేయించినారు. దీన్నే వెంకటనరసింహాచార్య కవి ద్విపదలో రసవంత మొనర్చినాడు. కవి తెల్పిన భార్గవస్మృతి ఎట్లున్నా యీ కథను సూతుడు చెప్పినట్లు జనక మహారాజునకు శుక్రుడు చెప్పును. ఇక్కడ జన శుకులకు సంబంధమేలేదు. అందున కృష్ణ కథను జనకునకు చెప్పటం ఎట్లాకుదురుతుంది. వీటిని కవి చెప్పటం కేవలం జానపదులను ఆకర్షించటానికి, వారికి ఆనందం కల్గేవిధంగా కథా చిత్రణ చేయుటమే ముఖ్యమని భావించవలెను.
వెంకటనరసింహాచార్య కవి తన యితర కృతులలో వలె వంశావతారాదులను వివరించలేదు. సంప్రదాయుల ప్రకారం దైవస్తుతులు – సిరిసెనగండ్ల నృసింహులు స్వప్పంలో కన్పడి –
విను వత్స భువిలోనవిఖ్యాత మొదవ
మును సత్యభామయు ముదము నొందుచును
జనులెన్ననారద సంయమీంద్రునకు
తన కూర్మి ప్రాణేశుదానం బొసంగి
యెతి వరునర్ధించియెలమితోపతిని
యతివ తులాభారమలర తూగించి..
నట్టి సత్కథమాకు నంకితముగాను
పట్టిరో నావాక్య పద్ధతీ కృతిని…’
గరిమమీరద్విపద కృతిగాగ
రచియించి అంకితం చేయుచున్నాడు. దానికి కవిగారు ముదమంది.
సరసిజాతనివాసి చనుబాల పుష్టి
విరచింతు తత్కధా విధమెట్టిదనిన…’ అని కథను ఆరంభించినాడు. చివర్లో
‘నరనుత వేంకటనారసింహార్య
విరచిత కావ్యమై వెలయు శ్రీకృష్ణ
వరతులాభార సద్వ్రత మహత్య్రంబు’
అని తెల్పుకున్నాడు. తాటాకు పుస్తకంలోని చిట్ట చివరి పత్రాలు కొంత భంగమయినందున ముగింపు పూర్తిగా తెలియటం లేదు. కవి దీనిని తన యితర కృతులకన్న భిన్నంగా – సామాన్య జన వ్యవహార రీతి కథా కథనం చేసి సంఘంలో వుండే సవతుల కయ్యం, ద్వేష భావనలు, స్త్రీ సహజ సంభాషణలు, సామెతలు జనవ్యవహృత పదప్రయోగంలో పురాణ, ప్రబంధ, లౌకిక పద్ధతుల సమ్మేళనంగా శ్రీకృష్ణ తులాభారాన్ని రచించినాడు. ఇప్పటి వరకీ ద్విపద కృతి పరిశోధకుల చూపులో పడలేదు. కవి ఇతర రచనల వలెనే దీనిలోను జనవ్యవహార పదాలను యతి స్థానాల్లో చేర్చి వాటికి ప్రామాణికత కల్పించినాడు
ఉదా :- యలమినేతెంచెటియతి సమూహంబు (ఎలమి)
సరసలతోద్యానచంగల్వకొలను
వనితలు తానును వకవింతగాను
జెగముల ప్రఖ్యాతి చేనొందుగాన
తన ప్రబంధంలో కవి నారదమహర్షికి ”పొలుపొందగా నూర్థ్వపుండ్రములు” దిద్దటంతో బాటు తులసీ మహత్త్వాన్ని చెప్పించినాడు. ఇదొక విచిత్ర రీతి.
ద్విపద కృతిలో జోలి, సుద్ది, గుసగుస, కోకిలవాణి, చల్లమిరప, ఆవ, పూరీలు, బత్తీసాలు, శేనెలు, బబ్బట్లు, మణుగు పువ్వులు, సొజ్జ, పుళియోగిరం, కర్జకాయలు, మలికలు, మామిడి పండ్లు (మార్గశిరంలో మామిడి?) సంతకరం, కుదువ, గుత్త, అగడు, సంచకరి, తిరుమణి, ఎక్కసాలు, తరువుకాడు – మొదలైన పదాలు ప్రయోగించబడినవి. ఈ ద్విపదకృతిని ప్రత్యేక పరిశీలన చేసినచో భాషా విషయకంగా ఎన్నో నూతన పద ప్రయోగాలు లభ్యం కాగలవు. ఇవన్నీ ఒకనాడు మన తెలంగాణం. అందున మిర్యాలగూడెం తాలుకా ప్రాంతంలో వాడుకలోవున్న పదాలు. వీటిని మహా కవిత్వదీక్షా విధి గల వెంకటనరసింహా చార్య కవి యథాతథంగా తన కృతియందు చేర్చటం కవికి గల పద ప్రయోగ పరిశీలన రీతి తెలుస్తున్నది. కవులు ప్రకృతికి భాష్య ప్రణేతలు గదా!