మన తెలంగాణ
రాష్ట్రంలోని నేటి జనగామ జిల్లా పాలకుర్తి గ్రామంలో 1160-1240 మధ్య కాలంలో జీవించిన మహాకవి మన పాల్కురికి సోమనాథుడు. శ్రీనాథకవి కంటే వందరెట్లు ఎక్కువ పాండిత్యం కలిగిన వాడుగా కీర్తింపబడినవాడు. ఈయన మహాకావ్యాలు, లఘు కృతులు, స్తోత్రాలు మొత్తం ముప్ఫై గ్రంథాలు రచిం చాడు. ద్విపదలో మొదటి మహాకావ్యం వ్రాశాడు. సర్వలక్షణ సంపూర్ణ మైన మొదటి శతకం వ్రాశాడు. ఉదాహరణమనే ప్రక్రియను మొదటిసారి తెలుగులో ప్రవేశపెట్టాడు. స్తుతిపరమైన రగడలు, గద్యాలు వ్రాశాడు. వైవిధ్య భరితమైన తన రచనలలో తెలుగు సాహిత్య ఆకాశంలో ఇంధ్రధనుస్సుగా శోభించాడు.
తెలుగు పదాలకు సాహిత్యంలో విలువ పెంచడం, దేశీయతకు ప్రాధాన్య మీయటం, వివిధ సాహిత్య ప్రక్రియలను ప్రారంభించడం పాల్కురికి సోమనాథుని సాహసోపేతమైన పనులు. దేశికవి. ప్రజా జీవితాన్ని సాహిత్యంలో చిత్రించిన ప్రజాకవి. ప్రజల క్షేమం కోసం కవిత వ్రాస్తున్నానని ప్రకటించిన మహాకవి. సామాన్య ప్రజానీకానికి దూరంగా ఉంచబడిన వేదాన్ని సూక్తుల రూపంలో ప్రజలకందించిన మహో న్నతుడు పాల్కురికి సోమనాథుడు.
తెలుగు పదాలను వెలుగుపీఠం మీద కూర్చుండబెట్టిన సాహసికుడు పాల్కురికి. ”తెలుగు మాటలనంగవలదు, వేదముల కొలదియగా జూడుడు” అని వ్రాసిన మాట పాల్కురికి చేస్తున్న సాహసాన్ని తెలుపు తుంది. సంస్కృతపదాలకే అత్యధిక ప్రాధాన్యమివ్వటాన్ని, తెలుగుపదాలు చిన్నచూపుబడటాన్ని ఈ మాట తెలుపుతుంది.
”ఆరూఢ గద్యపద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠరచన
మానుగా సర్వసామాన్యంబుగామి
జాను తెనుగు విశేషము ప్రసన్నతకు”
అని పాల్కురికి చేసిన ప్రకటన తాను నెలకొల్పబోతున్న కొత్త మార్గాన్ని స్పష్టం చేస్తుంది.
తనకు ముందున్న నన్నయ కవితామార్గాన్ని దృష్టిలో ఉంచుకొనియే సోమన ఈ మాట చెప్పినట్టు స్పష్టం. సంస్కృత భారతాన్ని తెనిగించి రెండున్నర పర్వాలను వ్రాశాడు. సంస్కృత పదాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన రచన ఇది. ఇందలి కథ దేశీయం కాదు. ఉత్తర భారతదేశానికి చెందిన పురాణకాలంనాటి రాజుల కథ. ఈ భారతం పంచమ వేదంగా చెప్పబడింది. ఇది గద్య పద్యాల్లో సాగిన రచన. ఇది నన్నయ కవితా మార్గం. ఈ మార్గానికి పూర్తి భిన్నమైనది పాల్కురికి మార్గం.
కవిత్వం సామాన్య జనులందరికీ అందుబాటులో ఉండాలన్నది సోమన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సోమన స్వతంత్ర మార్గాన్ని అనుసరించాడు. కావ్య కథాంశం కొత్తది. బసవేశ్వరుణ్ణి నాయకునిగా చేసుకొని బసవపురాణం వ్రాయబూనుకొన్నాడు. బ్రాహ్మణుల్లోని కర్మ మార్గాన్ని వ్యతిరేకించిన వాడు బసవన. బజ్జలుడనే రాజు దగ్గర దండనాయకునిగా బసవన పనిచేసి సామాన్య ప్రజలకు ఆరాధ్యుడైన వాడు. మహిమాన్వితుడు. అగ్ర, నిమ్న కులాలకు చెందిన యువతీ యువ కులకు పెండ్లిచేసి కుల నిర్మూలనకు పాటుపడిన వాడు. శివభక్తి ఆధారంగా అన్నికులాల ప్రజలందరినీ ఒక్కటిగా చేశాడు. సమకాలికుడైన ఈ బసవనను కావ్య కథానాయకునిగా చేయడం సోమన స్వతంత్ర బుద్ధిని తెలుపుతుంది. ఇది సోమన సాహసం. ఈ కావ్యంలో అతి సామాన్యులను ఉప కథానాయకులుగా చేసుకోవటం ఆ సాహసాన్ని సుస్థిరం చేస్తున్న అంశం. ‘లోక హితార్థంబుగాగ” కావ్య రచన చేయాలన్న లక్ష్యానికి ఇది అనుగుణమయింది.
తెలుగు మాతృభాషగాగల ప్రజలకు ‘సంస్కృత భూయిష్ఠ రచన’ సరి అయిందికాదు కాబట్టి సరళమైన తెలుగుపదాలనే వాడబూనుకొన్నాడు. ప్రజలు తన కావ్యకథను గానం చేసుకోవటానికి అనుకూలమైన ద్విపద ఛందస్సును ఎన్నుకొన్నాడు. జానపదులు పాడుకొనే పాటలకు దగ్గరగా ఉండే ఛందస్సే ఇది. అందువల్ల తన కావ్యం సామాన్య ప్రజలకు దగ్గరవుతుందన్న స్పష్టమైన అభిప్రాయంతో సోమన ద్విపద నెన్నుకొన్నాడు. ‘ద్వి-పద అంటే రెండు పాదాలు కలది. ఐహిక ఆముష్మిక వేదాలు అని ద్విపదకు కొత్త అర్థాన్ని చెప్పినాడు సోమన.
”తిన్నని సూక్తుల ద్విపద రచింతు
నదియునుగా కైహికా ముష్మిక ద్వి
పద హేతువగుట ద్విపదనాబరగు”
ద్విపదపట్ల సోమనకుగల గౌరవాన్ని తెలిపే మాట ఇది.
సమకాలికుడైన బసవనను కథా నాయకుని చేసుకొని తెలుగు మాటలకు ప్రాధాన్యమిస్తూ, దేశీయమైన ద్విపద ఛందస్సులో కావ్య రచన చేయడమన్నది సోమన మార్గం. ఇది దేశీయం. ఇది స్వతంత్రం. అక్కడ నన్నయ మార్గానికి భిన్నమైన మార్గాన్ని ఇక్కడ పాల్కురికి సోమనాథుడు నెలకొల్పినాడు. సోమన ప్రవేశపెట్టిన ద్విపద కావ్యమార్గాన్ని అనంతర కవులు అనుసరించడం సోమన విజయాన్ని తెలుపుతుంది. ఇదేవిధంగా సోమన ప్రారంభించిన శతకం నేటి వరకు అనుసరింపబడుతూనే ఉంది. సోమన ప్రారంభించిన ‘ఉదాహరణం’ నేటి వరకు నిరంతరంగా సాగివస్తున్న ప్రక్రియ. సోమన సాహసించి ప్రారంభించిన కవితామార్గం నేటి వరకు కొనసాగుతూనే రావడం ఆయన ప్రతిభకు, దార్శనికతకు నిదర్శనం. ప్రాచీన కవుల్లో ప్రాచీనుడు, ఆధునిక కవుల్లో ఆధునికుడైన పాల్కురికి సోమనాథుడు తెలుగు వారికి, తెలంగాణ ప్రజలకు గర్వకారణం.
ఆచార్య అనుమాండ్ల భూమయ్య