tsmagazine
ఉగాది,
దసరా, శివరాత్రి మొదలైన పండుగ సమయాలలో, స్థానిక దేవతల ఉత్సవాలలో, ఊరంతా కలిసి చందాలు వేసుకొని పురాణ ప్రవచనం జరిపించడం నేటికీ మనం చూస్తున్నాం. సరియైన సమయంలో వర్షాలు పడక, వ్యవసాయానికి ఇబ్బంది కలిగిన సందర్భాలలో విరాటపర్వం చదివిస్తే వర్షం కురుస్తుందని మనవారి నమ్మకం.

రోగగ్రస్తుల కాలక్షేపానికి శ్రీమంతులు నలచరిత్రను, దీర్ఘకాల రోగుల కైవల్యప్రాప్తికి గజేంద్ర మోక్షం ఘట్టాలను పురాణంగా చెప్పిస్తుంటారు.

పృథు చక్రవర్తి యాగం చేసినప్పుడు యాగపురుషునివలె పుట్టిన సూతుడే మొట్టమొదటి పౌరాణికుడనీ, విష్ణువే సూతుని రూపంలో అవతరించాడనీ మహర్షులు అన్నారు.

”శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం”

అని భాగవతం భక్తిని 9 విధాలుగా వర్గీకరించింది. ఇందులో శ్రవణం అనే ప్రక్రియ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. శ్రవణనాడులకు, హృదయనాడులకు దగ్గరి సంబంధం ఉండడంవల్ల విన్నది తొందరగా హృదయానికి హత్తుకుంటుంది.

”విస్తరమాధుర్య మనోజ్ఞ సత్కథలు విస్పష్టంబు
గా జెప్పవే”

అని జనమే జయుడు వైశంపాయనుని అడుగుతాడు. ఆనాటి పాలకులు ఇష్టకథలు చెప్పించుకొని వినేవారని శాసనాలూ, సాహిత్యమూ చెబుతున్నాయి.

భట్టుమూర్తి వారి ఇంటిపేరు ప్రబంధం వారు. ఆనాడు రాజా స్థానాలలో కావ్య ప్రబం ధాలను చదివి వినిపించేవారిని ప్రబం ధం వారనేవారు. వారి తాతలు, తండ్రులు పురాణ ప్రవచనం చేయడం వల్ల వారికాపేరు వచ్చి ఉంటుంది.

ఆ కాలంలో చాలామంది పండితులు ఈ పురాణ ప్రవచనాన్నే జీవనా ధార వృత్తిగా స్వీకరించినారు. గద్వాల, చల్లపల్లి, పిఠాపురం, బొబ్బిలి, విజయనగరం మొదలైన సంస్థానాలలో ఇటువంటి పౌరాణికులుండేవారు.

ఈ పురాణ ప్రవచనం అనేక కళారూపాలకు మాతృక. దీనికి ప్రక్కవాద్యాలు తోడయితే హరికథ అవుతుంది. వాద్యాలవారు ప్రవచ నంలో పాలుపంచుకుంటే బుర్రకథ అవుతుంది. ప్రయోగంలో ఆహార్యం ధరించి మరింతమంది నటీనటులు తోడయితే రూపకమవుతుంది. అదే మరికొన్ని మార్పులు సంతరించుకుంటే వీధినాటకంగానూ, యక్షగానంగానూ రూపుదిద్దుకుంటుంది.

‘హరి’ అనే శబ్దానికి విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, యముడు మొదలైన అనేక అర్థాలున్నప్పటికీ ‘విష్ణువు’ అనే పదమే అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది. తక్కిన అర్థాలు అల్ప ప్రసిద్ధాలు.

‘కథ’ అంటే ప్రదర్శించు, ప్రకటించు, భావించు, వర్ణించు, వ్యాఖ్యా నించు అనే నానార్థాలున్నాయి. కథ అనే శబ్దానికి ”కథ్‌” మూల ధాతువు.

హరి సంబంధమైన కథను ‘హరికథ’ అంటున్నాం. మరి శివ సంబంధమైన కథను ‘శివకథ’ అనవలెనా? అంటే అవసరం లేదు. ఎందుకంటే ‘హరి’ అనేది దేవతా సామాన్య వాచకం. అందుకే అన్ని దేవతలకు సంబంధించిన కథలనూ ‘హరికథ’లుగా చెప్పవచ్చు. తొలుత కేవలం విష్ణు సంబంధమైన ‘కథ’లనే చెప్పడంవల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. కానీ నేడు ‘హరికథ’ అనేది ఒక సంజ్ఞ. పారిభాషిక పదం. ఒక కళారూపం.

హరికథ మొదట విష్ణువుకు మాత్రమే పరిమితమైనా కాలక్రమాన బ్రహ్మాది దేవతలు, స్థానిక దేవతలు, మహాపురుషులు, జాతి నేతలు, చారిత్రక వీరులు, పతివ్రతా శిరోమణులు మొదలుకొని బాబాలు, స్వాముల వరకూ వ్యాపించింది.

”ఆస్తిక్యమును, ధర్మాధర్మములను సర్వజనమనో
రంజకముగా, నృత్య, గీత వాద్యములతో నుపన్యసిం
చుట హరికథ యన బరగు -” అని ఆదిభట్ట నారాయణదాసు వివరణ.

”భక్తిరస ప్రధాన పురాణగాథలలో ఏదైనా ఒకటి ఎత్తుకొని-దానిని శ్రోతల మనస్సుల నాకర్షించునట్లు గద్యములు, పద్యములు, గానములు, మొదలగు వాని సమ్మేళనముతో, ప్రవచించుట హరికథా కాలక్షేప మందురు”-అని జయంతి రామయ్య పంతులు నిర్వచించారు.

హరికథ ఈనాటిదికాదు. పురాణకాలంలోని నారదుడు మొట్టమొదటి హరిదాసు. అటు తర్వాత ఐతిహాసిక యుగంలోని కుశలవులకు నారదుడే గురువై వారితో హరికథలు చెప్పించినాడు.

ఆదిభట్ల నారాయణదాసుకు పూర్వంకూడా హరికథ ప్రచారంలో

ఉండింది. కానీ దాసు తమ అభినయ నృత్య గానాలతో సంగీత సాహిత్యాలను మేళవించి, సునిశితహాస్య చతురతతో కథను నడిపిస్తూ హరికథకు ఒక నిర్దిష్టమైన రూపాన్నీ, విశేష ప్రచారాన్నీ కల్పించారు.

క్రీ.శ. 1880 ప్రాంతంలో ఈ హరికథాగానం తెలుగులోకంలో ఆవిర్భవించిందని కొందరు స్థూలంగా నిర్ణయించారు. ఐతే దాసు గజ్జెకట్టి హరిదాసుగా గొంతువిప్పిందీ 1883లోనే.

హరికథ అన్నపేరుతో ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్న కళారూపానికి మరిన్ని పర్యాయపదాలున్నాయి. కథ, కథాగానం, కథా కాలక్షేపం, కథా ప్రవచనం, కథా ప్రసంగం, సత్కథాగానం, సత్కథా కాలక్షేపం, హరికథా కాలక్షేపం, హరికథాగానం, హరికీర్తన అని దక్షిణభాషలోని వ్యవహారాలు.

కీర్తన్‌-సంకీర్తన్‌ అని ఇతర ప్రాంతాల వాడుక. ఇందులో అచ్చ తెనుగు పదం ఒక్కటీలేదని నారాయణ దాసు ముచ్చ టగా హరికథను ”వేల్పు ముచ్చట” అని పేరు పెట్టినారు. ”హరికథ”కు 19వ శతాబ్దం నుంచి యక్షగానం అన్నపేరు పర్యాయ వాచకంగా కన్పిస్తున్నది” అని తెలుగు హరికథా సర్వస్వమును రచించిన తూమాటి దోణప్ప వివరించారు.

దాసు రచించిన ఎన్నో హరికథలకు యక్షగానమనే పేరు పెట్టినారు.

హరికథకుడు సాధారణంగా పురాణంలోని ఏదో ఒక సంఘటననో లేదా ప్రముఖులు రచించిన ఏ కావ్య ఘట్టాన్నో తీసుకొని దానికి తగిన సంగీతాన్ని సమకూర్చుకొని కథనం సాగిస్తాడు.

మామూలు కథకుడైతే మూలకథను మాత్రం ఒప్పజెప్పుతాడు. ప్రతిభావంతుడైన కథకుడైతే స్థూలంగా మూలకథను అనుసరిస్తూ ఆయా సమయాలలో ఇతర కవులు రచించిన పద్యాలను, కీర్తనలను చేర్చి, వాటికి కొంత స్వంత కల్పనను జోడించి అనువైన చోట్ల హాస్య చతురతను మేళవించి, అవసరమైనచోట్ల లయబద్ధంగా నర్తిస్తూ తన హావభావ విలాసాలతో ప్రేక్షకుల నలరిస్తాడు.

కథకుడు ప్రేక్షకుల స్థాయినిబట్టి తన కథాస్థాయి గూడా మారుస్తుం టాడు. ప్రేక్షకులలో పండితులున్నప్పుడు అనేకానేక శాస్త్రోదా హరణలతోనూ, సందర్భోచిత ఇతర కవుల చాటువులతోనూ, ప్రసిద్ధ వాగ్గేయకారుల కీర్తనలతోనూ కథను పండితప్రియంగా నడిపిస్తాడు. అదే సంగీతజ్ఞులున్న సభలో అనేక క్లిష్టరాగాలతో, సంక్లిష్ట తాళ, జాగాలతో, సంకీర్తనలు, కృతులు, తరంగాలతో స్వరాభిషేకం చేస్తూ రసరమ్యంగా లయాత్మకంగా కథను నడిపిస్తాడు.

”ఉత్తముల ప్రతిభ నీటికొలది తామర” కదా. హరికథను పూర్వరంగ మనీ, ఉత్తరరంగమనీ 2 భాగాలుగా విభజించవచ్చు. పూర్వరంగాన్ని బ్రహ్మ నిరూపణమనీ, పీఠిక అనీ అంటారు. ఇది నాటకానికి నాంది వంటిది. కథయందు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించడం దీని ఉద్దేశ్యం.

ఉత్తర రంగమంటే అసలు కథ. కథా పీఠమైన పూర్వరంగం పరమ లౌకికం. కథా ఘట్టమైన ఉత్తరరంగం పార లౌకికం. ఈ రెండూ కలిసి కథకునికీ, ప్రేక్షకునికీ ఐహిక ఆముష్మికముల నిస్తాయని మనవారి విశ్వాసం.

సాధారణంగా కథకులు 3 రకాలు
1. కులవృత్తిగా కలవారు.
2. ఉపవృత్తిగాగలవారు
3. ఔత్సాహికులు

నేడు కులవృత్తిగాగల అనేక కథకులు తమకు ఎదురవుతున్న అనాదరణవల్లా, ఆర్థిక ఇబ్బందులవల్లా ఇతర వృత్తులలోకి వెళ్ళిపోతున్నారు. పూర్వంనుండీ మామూలుగా కథకునికి ఇచ్చే నూటపదహార్లూ, వెయ్యినూట పదహార్లూ నేడు సరిపోవడంలేదు. కథకుడూ, వాయిద్యాలవారూ అందులోనే పంచుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఒప్పందం చేసుకున్న మొత్తంకంటే, చదివింపులద్వారా, హారతిపళ్ళెం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తమే రావచ్చు. కానీ అది ఆ కథకుడి అదృష్టం మీదా, ఆ వూరి ప్రజల కళాభిమానం మీదా, వారి ఔదార్యంమీదా ఆధారపడి వుంటుంది.

కథకునికీ, వాయిద్యాలవారికీ ఒద్దికలు ఉంటే ఆ కథ మరింత రంజుగా ఉంటుంది. కానీ మామూలుగా కథకు నికి వచ్చే కొంతమొత్తంలోనే వాయిద్యాలవారిని వెంట తీసుకుపోవడం సాధ్యంకానిపని. అందుకే కొందరు వాయిద్యం లేకుండానే కథనం సాగిస్తున్నారు.ఇంకొంతమంది ఆ గ్రామంలోనే ఎవరైనా వాయిద్యాలవారుంటే వారితో సరిపెట్టుకుంటారు. శృతి పెట్టెతో సరిపెట్టుకునేవారు కొందరు.

కొంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని కథ ఏర్పాటు చేసుకునే వారు వాయిద్యాలను వెంట తీసుకుపోతున్నారు. ఇంకా రంజుగా కథ చెప్పాలనుకునేవారు హార్మోనియం, తబలా, వయొలిన్‌, మృదంగం, ఘటం ఇన్నింటిని ఏర్పాటు చేసుకుని మరీ కథ చెబుతున్నారు.

హార్మోనియంతో ప్రావీణ్యంగల కథకులు కొందరు కీర్తనగానీ, పద్యంగానీ వచ్చినపుడు బల్లమీద పెట్టుకున్న హార్మోనియం వాయిస్తూ కథ చెప్పడం కూడా జరుగుతున్నది.

తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచార పరిషత్‌ వారు హరికథలను, హరిదాసులను పరిరక్షించడంలో తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ మధ్యన ఈ ప్రాచీన కళారూపాన్ని కాపాడుకోవాలని కృషి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. రాష్ట్ర సాంస్కృతిక శాఖవారు ఈ మధ్యన ”మహిళా హరికథా వారోత్సవాల”ను ఘనంగా నిర్వహించడం ముదావహం. ఈ క్లిష్ట రూపక ప్రక్రియను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ముందు తరాలవారికి దీనిని అపురూపంగా అందించడం మన కర్తవ్యం.

హరికథ ఒక నూతన విద్యా ప్రదర్శనం. దీనికి ప్రశస్తమైన సంగీతం,సాహిత్యం, చక్కని నృత్యం, అభినయం, శ్రోతల మనస్సులకింపైన మాటలు, సందర్భానుసారమైన ఛలోక్తులు, హాస్య ధోరణి, దేశకాల పరిస్థితులకు అవసరమైన సామాజిక చైతన్య ధోరణి-అన్నింటికన్నా రసరమ్యమైన రూపము కావలసిన అంగములు.

హరికథాగానం యుగయుగాలనుండీ, తరతరాలనుండీ ప్రజానీకానికి భక్తిభావ ప్రబోధకంగా ప్రచారితమవుతున్న ఒక ఆధ్యాత్మిక లలితకళా సందేశము.

ఇది ఒక సారస్వత విజ్ఞాన సర్వస్వము.

ఇతర కళారూపాలైన నాటకమునుగానీ, యక్షగానమునుగానీ, బుక్రథనుగానీ రక్తికట్టించుట అంత కష్టమైన పనేమీకాదు. వీటిలో ఇతర నటీనటుల తోడ్పాటు-రంగాలంకరణ-ఆహార్యం తోడుగా ఉంటుంది. వీటి సాయంతో నవరసాలను సులభంగా మెప్పించవచ్చు.

కానీ హరికథలో అన్ని పాత్రలనూ ఒక్కడే ధరించాలి. అవిశ్రాంతంగా మూడు గంటలపాటు ఒక్కడే ప్రజలను రంజింపజేయాలి.

సంగీత సాహిత్యాలనే రెండు ప్రధానచక్రాలమీద హరికథ అనే బండిని నడుపుతూ-ప్రేక్షకులకు వేసరిక రాకుండా నృత్యం, హాస్యం అనే ప్రదేశాలవద్ద ఒకింత మజిలీ నిర్వహిస్తూ, సామాజిక చైతన్యం కలిగిస్తూ, వేదాంతమార్గంలో ప్రయాణం చేస్తూ, భక్తి అనే గమ్యాన్ని తాను చేరి, ప్రేక్షకులను గూడా తనతోపాటూ తీసుకెళ్ళేవాడే హరిదాసు.

ఐతే-మారుతున్న కాలానికి అనుగుణంగా హరిదాసులం మేమూ కొంత మార్పులూ-చేర్పులూ చేసుకొని కథనాన్ని నడిపించవలసి ఉంది. పూర్వపు పరిస్థితులువేరు. ఇప్పటి సామాజిక సమస్యలు వేరు. సమాజానికి ఉపయోగపడితేనే కళలకు విలువ పెరుగుతుంది.నేటి సామాజిక అంశాలను చర్చిస్తూ హరిదాసులూ స్పందించడం అవసరం.

విద్యార్థుల ఆత్మహత్యలమీద, రైతుల ఆత్మహత్యలమీద, పెడదోవలు పడుతున్న యువత వ్యసనాలమీద, సోమరితనం మీద, మితిమీరుతున్న అంతర్జాల వ్యామోహంమీద,వృద్ధులపై చూపుతున్న నిర్లక్ష్యం మీద, జల సంరక్షణమీద, వన సంరక్షణమీద, కరెంటు పొదుపుమీద, బాలికా వివక్షమీద, భ్రూణ హత్యలమీద, మాదక ద్రవ్యాల సేవనంమీద, అతివేగంమీద, స్థూలకాయంమీద, ఇలా సమాజానికి శాపంగా మారుతున్న ఏ అంశంమీదనైనా నేటి హరిదాసులు తీవ్రంగా స్పందించవలసిన అవసరం ఉంది.. బాధ్యత వుంది.

నిజంగా ఒక హరిదాసుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. నాటకంలోని ఒక నటుడి లాగా పరిమిత భావాలకు తాను కట్టుబడి ఉండనవసరం లేదు. నమ్మిన సిద్ధాంతాన్ని సమాజానికి అత్యవసరమైన సందేశాన్ని హరిదాసు ఒక పాట రూపంలో, పద్య రూపంలో, నృత్య రూపంలో, వచన రూపంలో, హాస్య రూపంలో తనకున్న నైపుణ్యాన్ని బట్టి, తనకు నచ్చిన, వచ్చిన రూపంలో ఇవ్వాలి.

మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులూ-చేర్పులూ చేసుకొని హరికథను రసరమ్యంగా నడిపించినప్పుడు-ఆదరించే ప్రేక్షకులకు కొదువ ఉండదు. అప్పుడే మళ్ళీ హరికథ బ్రతికి బట్ట కడుతుంది.

ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వహించిన డా|| కె.వి. రమణాచారి (ప్రస్తుత తెలంగాణ సాంస్కృతిక సలహాదారు) హరికథలను ఏర్పాటు చేయడంలోనూ, హరికథా భాగవతారులను ప్రోత్సహించడంలోనూ విశేష కృషి చేస్తున్నారు.

పద్మాలయ ఆచార్య
tsmagazine

Other Updates