తెలంగాణ సాగునీటి రంగం ఖాతాలో మరో విజయగాథ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యామ్ లోకి వస్తోంది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. కాకతీయ కాలువ స్టేజ్ -1 కింద 9 లక్షల 68 వేల 600 ఎకరాల ఆయకట్టు ఉంది. స్టేజ్-2కింద వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మరో 4 లక్షల 40వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎల్‌ఎండీ రిజర్వాయర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన ప్రతిసారీ చివరి ఆయకట్టుకు నీరు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాలువ మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు.
ఉత్తర తెలంగాణ రైతాంగం కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.గత పాలక పక్షాల నిర్లక్ష్యానికి ఈ ప్రాజెక్టు దుస్థితి నిలువెత్తు సజీవ సాక్ష్యం. నిజామాబాద్, నిర్మల్,జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల వ్యవసాయానికి ఏకైక సాగునీటి పెద్దదిక్కు శ్రీరాంసాగర్. దీనిపై ఆధారపడిన ఆయకట్టు దాదాపు 9లక్షల 68 వేలఎకరాలు. మొత్తం 280 కిలోమీటర్ల దూరం కాకతీయ కాలువ విస్తరించి ఉంది. సంవత్సరాల తరబడి మరమ్మతులు లేక ప్రధాన కాలువ శిధిలావస్థకు చేరుకుంది. కాలువ మొత్తం పూడిక పేరుపోయి,చాలాచోట్ల లైనింగ్ చెదిరిపోయి,గేట్లు, చానళ్లు అధ్వాన్న స్థితికి చేరి ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చీ రాగానే శ్రీరాంసాగర్ పై దృష్టి సారించారు. మొత్తం తెలంగాణను కోటి ఎకరాల మాగాణం గా మార్చాలంటే ఇదివరకే ఉన్న శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టులకు వైభవం తీసుకు రావాలని ఆయన నిర్దేశించారు. దానికనుగుణంగానే శ్రీ రాంసాగర్ ఆధునీకరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శ్రీ రాంసాగర్ కాలువల పూర్తి సామర్ధ్యం 8,500 క్యూసెక్కుల ప్రవాహానికి గాను తీసుకోవలసిన చర్యల కోసం ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్.ఆర్.ఎస్.పి ఆధునీకరణ పనులు ప్రారంభం అయినవి.ఈ ప్రాజెక్టు చరిత్రలో డిస్ట్రిబ్యూటరీలను పట్టించుకున్న నాధుడే లేడు. మన ప్రభుత్వం 21 కోట్లు ఖర్చు చేసి డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులు చేస్తున్నది. కేసీఆర్ ఆలోచన, ఇరిగేషన్ మంత్రి నిరంతర సమీక్షలతో ఈ ప్రాజెక్టు దశ తిరిగింది. దీని రూపురేఖలు మారిపోతున్నవి.
కాకతీయ ప్రధాన కాలువలో పేరుకు పోయిన పూడికను తొలగిస్తూ, లైనింగ్ చెదిరిపోయిన చోట్ల లైనింగ్,మరమ్మతులు చేస్తున్నారు. పలుచోట్ల కాలువ కట్ట ఎత్తును,అప్రోచ్ రోడ్డు ఎత్తును కూడా పెంచుతున్నారు. ఈ పనులు పూర్తవుతున్నవి. కాలువకు మళ్లీ పూర్వవైభవం వస్తున్నది. ఆయకట్టుకు నీళ్లొస్తాయని ఎదురు చూడటం, నిరాశతో కాలం వెళ్లదీయడం శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులకు సాధారణ విషయం. ఇన్నాళ్లు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ స్వరాష్ట్రంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్పి ప్రాజెక్టు కింద రబీ సీజన్లో 8 లక్షల 78 వేల 560 ఎకరాలకు సాగునీరం దించడం ఒక రికార్డు. మధ్యప్రదేశ్ లో అమలు చేస్తున్న ‘టేల్ టు హెడ్’ పద్ధతిన సాగునీటి పంపిణీని ప్రయోగాత్మకంగా కొన్ని డిస్ట్రిబ్యూటరీలు, లేదా మైనర్ కెనాల్ లలో అమలుకు ప్రయత్నాలు జరిగినవి. ఈ విధానం వల్ల ఆయకట్టు చివరి రైతులకు నీరందకుండా పోయే సమస్యలు రావు.గత ఖరీఫ్ లో ఎస్‌ఆర్‌ఎస్పి కింద 5 లక్షల 39 వేల ఎకరాలకు సాగునీరందించడమూ కొత్త రికార్డే.
ఎస్‌ఆర్‌ఎస్‌పికి చెందిన లక్ష్మి, సరస్వతి, కాకతీయ కాల్వలు, కడెం పరిధిలో ఖరీఫ్ లో జరిగిన ఆయకట్టుతో పాటు రబీకి సాగునీరందించేం దుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడంతో ఆశించిన ఫలితాలు వస్తున్నవి.ప్రధాన కాలువతోపాటు ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటరీల వారీగా వాటి పరిస్థితిని సమీక్షిస్తూ అవ సరమైన నిధులను మంజూరు చేస్తుండడం వల్ల ఫలితాలు వస్తున్నవి. ఆయా కాలువల వెంట ఇంజనీర్లు నడిచి పరిశీలించాలని, ఎక్కడెక్కడ లీకేజీలున్నాయో, బాటిల్ నెక్స్ సమస్యలు ఎక్కడున్నాయో, ఏ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన
మరమ్మతులు చేపట్టాలో వివరంగా వ్యయ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు పంపించాలన్న మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు అనుసరించడంతో సత్ఫలితాలు వస్తున్నవి. నీటి లభ్యతపై రైతాంగానికి సరైన సమాచారం ముందుగానే ఇవ్వాలని, ఏ పొలమూ ఎండిపోకుండా చర్యలు తీసుకోవా లన్నది హరీశ్ రావు లక్ష్యం. గ్రామ పంచాయతీల ఆఫీసుల నోటీసు బోర్డులపై తప్పనిసరిగా ఆ ప్రాంతానికి చెందిన జె.ఇల పేరు, మొబైల్ ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలని మంత్రి ఆదేశాలు ఇవ్వడం వల్ల రైతులకు, అధికారులకు మధ్య సమన్వయం పెరిగింది. సాగునీటిని సమర్ధంగా మేనేజ్ చేయాలని, చుక్కనీరు కూడా వృధా కాకుండా చూడాలని మంత్రి పలు సమీక్ష సమావేశాల్లో చెబుతూ వస్తున్నారు. 2017 డిసెంబర్ కల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీరందించే ప్రణాళిక సిద్ధమైంది. ఈ నేపధ్యంలో ఎల్‌ఎండికి ఎగువ, దిగువ ప్రాంతాలలో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కాలువలలో క్యారీయింగ్ కెపాసిటీ సవ్యంగా వుండేలా చూడాలని, సాగునీటి క్రమబద్ధీకరణ సమర్ధంగా జరిగేలా పనులు చేపట్టారు.
ఎస్ ఆర్ ఎస్ పి కాలువల చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు అందించాలని ఇరిగేషన్ మంత్రిహరీశ్ రావు అదేశించారు.
కాకతీయ కాలువకు మంచి రోజులు వచ్చాయి. సమైక్య పాల కుల నిర్లక్ష్యంతో సగం కుంచించుకుపోయిన కాలువకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ జీవం పోసింది. నీళ్లు వస్తాయని ఇన్నాళ్లు ఎదురు చూసి, కన్నీళ్లతో కడుపునింపుకున్న రైతుల కష్టాలు తొలగిపోతున్నవి. కాకతీయ కాలువను బ్రతికించుకోవాలని, 9 జిల్లాల రైతులకు సాగునీరు అందించి తీరాలన్న సి.ఎం ఆదేశాల మేరకు కాలువ అభివద్ది,మరమ్మతులు, లైనింగ్ సహా ఇతర పనుల కోసం ఏకంగా వివిధ దశలలో ఇప్పటివరకు 630 కోట్లకు పైగా కేటాయించారు. గత సంవత్సరం ఎల్.ఎం.డి ఎగువ ప్రాంతాల్లో మరమ్మతులు, ఇతర పనుల కోసం రూ. 61 కోట్ల 54 లక్షలు మంజూరు చేయగా ఎల్.ఎం.డి దిగువన రూ. 124 కోట్ల 50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక ఈ యేడాది ఎల్.ఎం.డి ఎగువన పనులకు గాను రూ. 66 కోట్లు, దిగువన రూ.350 కోట్లు కేటాయించడం విశేషం. మానాల దగ్గర దెబ్బతిన్న కట్ట మరమ్మతు పనులు రూ. 51కోట్ల వ్యయంతో జరుగుతున్నవి. గత సంవత్సరం జరిగిన పనుల వల్ల ఎల్.ఎం.డి ఎగువన కాల్వల సామర్ధ్యం 7 వేల క్యూసెక్కులకు పెరిగింది. అలాగే దిగువన కూడా 5 వేల క్యూసెక్కులకు పెరుగుతున్నది.
అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడ పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కాకతీయ కాలువ పనుల పై వరుస సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. కాకతీయ కాలువ పొడవునా పర్యటించారు. మొన్నటికి మొన్న వరంగల్ నుంచి మరిపెడ దాకా కాకతీయ కాలువ వెంట తిరిగారు. మరమ్మతులు, ఇతర పనుల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.