ugadhiగన్నమరాజు గిరిజామనోహర బాబు

అవును ఉగాది వచ్చు సమయంబున వెచ్చని వేపపూల, మాధవుడరుదెంచినాడు. బహుధా పరిరమ్య వసంత శాంత సాం ధ్యవికచ మల్లికా మధురహాస విలాసవికాస భావసం భవరస నవ్య భవ్య గరిమానత నూతన వర్షరాజుగా (దాశరథి) 

భారతీయ సంప్రదాయంలో పర్వదినాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు వాళ్ళకయితే మరింత మక్కువ ఉంటుంది. సంవత్సరం మొత్తంలో వచ్చే ప్రతి పండుగను తెలుగు వాళ్ళు పరమవైభవంగా నిర్వహించుకుంటుంటారు.

కాలాన్ని దైవంగా భావించే సంస్కృతి ఉన్నవాళ్ళం కాబట్టే దాన్ని ‘కాలపురుషుని’గా పూజించుకుంటాం. సంవత్సరకాలంలో ప్రకృతిలో ఏర్పడే మార్పులను ఋతువుల పేరుతో పిల్చుకుంటూ తొలి ఋతువుగా వసంత ఋతువును చెప్పుకుంటుంటాం! వసంత ఋతువు వచ్చే రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దాన్నే ఉగాదిగా భావిస్తున్నాం.

కాలం చలన శీలం కలిగి ఉండేది కాబట్టే భారతీయులు కాలాన్ని సంవత్సరాలుగా, నెలలుగా, పక్షాలుగా, వారాలుగా, రోజులుగా, గంటలుగా, నిమిషాలుగా విభజించి ప్రకృతికి ఉన్న నియమాల్ని గౌరవించి పూజించారు. కాలాన్ని పూజించడమంటే ప్రకృతిని పూజించడమే. అందులోని భాగమే ఉగాది, దాన్నే ‘యుగాది’ అనికూడా అంటుంటారు.

”చైత్రే మాసే జగద్బ్రహ్మ ససర్జప్రథమేహని
శుక్లపకూేజు సమగ్రంతు తథా సూర్యోదయే సతి
వత్సరాదౌ వసంతాదౌ రవి రాజ్యే తదైవంచ”

అని ‘ధర్మ సింధువు’ చెబుతున్నది. దీన్ని బట్టి సంవత్సరం మొదట్లో వచ్చే వసంత ఋతువులో చైత్రమాసం, శుక్లపక్షం మొదటి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినట్లు తెలుస్తున్నది అంటే ఇది సృష్టికి తొలిరోజు కనుకనే ఇది ‘యుగాది’ కాలక్రమంలో ఇదే ఉగాదిగా మారిందన్నది పెద్దల మాట.

కాలాన్ని మనవాళ్ళు కాల చక్రంగా అభివర్ణిస్తుంటారు. చక్రం తిరిగే గుణం కలది కాబట్టే కాలం కూడా తిరుగుతూ ఉంటుందని, కాబట్టి ప్రతి ఋతువు మళ్ళీ మళ్ళీ వస్తుందన్న వాళ్ళ ఆలోచనకు ఋతువులే సాక్ష్యం. కాలానికి కట్టిన లెక్కలు గుర్తుంచుకోవడాని మన పూర్వులు పూజాదికాల్లో సంకల్పం చెప్పుకుంటుంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాదులనే కాలానికి సంబంధించిన అయిదు అంశాలను చెప్పే పంచాంగాన్ని ఉగాది రోజు పఠించడానికి మూల కారణం కాలాధ్యయనమే.

భాగవతం వంటి పలు గ్రంథాలు కాలం లెక్కలను ఎంతో విపులంగా వివరించాయి. భారతంలోని ఉదంకోపాఖ్యానంలో కూడా కాలచక్రం ప్రసక్తి వస్తుంది. కాలానికి సంబంధించిన పండుగ కనుకనే దీన్ని సంవత్సరాది అనికూడా పలు చోట్లవ్యవహరిస్తుంటారు. అయితే తెలుగేతర ప్రాంతాలలో సంవత్సరాది ఇతర మాసాల్లో నిర్వహించుకుంటుంటారు.

ఉగాది పర్వదినాన చేయాల్సిన కార్యక్రమాల్ని గురించి కూడా అనేక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. ”అబ్దాది తైలాభ్యంగం నూతన వస్త్రా భరణ ధారణం నింబకునుమ భక్షణం పంచాంగ శ్రవణం” మొదలైనవి ముఖ్యమైనవి. ఉదయాన్నే లేచి తలంటుకొని స్నానాదులాచరించి, నూతన వస్త్రాభరణాదులు ధరించి నింబకుసుమ (వేప పువ్వు) భక్షణ చేసిన పిదప పంచాంగ శ్రవణం చెయ్యాలనడంలో ఉగాదిప్రాశస్త్యం తెలుస్తూ ఉంది. ఇప్పటికి తెలుగులో ఉగాదిని ఒక పవిత్ర పర్వదినంగా భావించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవిస్తుంటారు. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం అనే ఆరింటితో యీ పచ్చడి చేస్తుంటారు.

తీపికొరకు కొత్త బెల్లాన్ని, పులుపు కొరకు కొత్త చింతపండును, వగరు కొరకు కరక్కాయముక్కను, చేదు కొరకు వేప పూతను, కారం కొరకు మిరియాలను ఉపయోగించి చేసే ఈ ఉగాది పచ్చడి ఆరోగ్య ప్రదాయినియైన ఒక ఔషధము. ఇందలి వస్తువులన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదించే దినుసులే కావడం విశేషం. కొత్త పుల్లటి మామిడి కాయల తురుమును కూడా యీ ప్రసాదంలో వినియోగిస్తుంటారు. ఋతువుల మార్పుల్లో వచ్చే కఫ, పిత్త, వాతాది అనారోగ్యాలకు ఇదొక ప్రత్యేకమైన ఔషధంగా పనికొస్తుందన్నది పూర్వుల అభిప్రాయం.

ఉగాది నాడు పంచాంగ శ్రవణం మరో ప్రత్యేకత కలిగిన అంశం. తిథి వార నక్షత్ర యోగ కరణాలనే అయిదు అంశాలను చెప్పే గ్రంథమే పంచాంగం. సంపద కోరుకునే వ్యక్తి ‘తిథి’ విషయంలో జాగ్రత్త వహించాలని, దీర్ఘాయువుకోరుకునే వారు ‘వారం’ విషయంలో మెలకువలు పాటించాలని, పాపవిముక్తిని కోరుకునేవారు ‘నక్షత్రం’ విషయంలోనూ, రోగ రక్షణకై ‘యోగం’, కార్యసిద్ధి, విజయ ప్రాప్తికొరకు ‘కరణం’ గురించి తగు జాగ్రత్తలు వహించాలని తెలియజెప్పేది పంచాంగం. సంవత్సరం ప్రారంభంలోనే ఈ విషయాల్ని తెలుసుకొని మసలు కోవడం వల్ల ఆ యేడాదంతా ఆనందంగా సాగిపోతుందన్నది మన వారి విశ్వాసం. ఉగాది వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది. ఇక్కడి నుండి (పాడ్యమి నాటి నుండి) తొమ్మిది రోజులు వసంత నవ రాత్రులుగా భావించి ఈ రోజుల్లో అతి పవిత్రతతో భగవదర్చన చేసి తొమ్మిదవ రోజున (నవమి) శ్రీరామనవమిగా చేసుకొని ఆ శ్రీరామ చంద్రుని కల్యాణం చేసి ధన్యులవుతుంటారు మన తెలుగువారు.

జీవితంలో కష్టం, సుఖం, దుఃఖం, బాధవంటి ఎన్నో అంశాలు తటస్థిస్తుంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోగలిగే మానసిక ధైర్యాన్ని పొందాలన్న దానికి ప్రతీకగా భావించే ఉగాది పచ్చడి చేదు, తీపి మొదలైన రుచుల సమాహారంగా భావించి సేవిస్తుంటాం. దేన్నైనా సరే ఆస్వాదించాలన్న ఒక సందేశం దీని నేపథ్యంలో మనకు అర్థం అవుతుంది.

మన సంస్కృతిలో ప్రకృతికి పెద్ద పీట ఉంది. సంక్రాంతి ఉగాది, దసరా, దీపావళి వంటి అన్ని పర్వదినాలకు కూడా ప్రకృతిలోని మార్పులతో, మనిషి అవసరాలతో గాఢమైన సంబంధం ఉంది. ప్రతి అంశాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి మానవుని ధర్మమార్గ ప్రవర్తకునిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వచ్చిన యీ పండుగల్లో ‘ఉగాది’ని మరింత ఉత్సాహంగా, అర్థవంతంగా నిర్వహించుకొని ఆనందిద్దాం.

దుర్ముఖీ! మమ్మల్ని మురిపించు!

ఆగమేఘాలపై
అరుదెంచే ‘దుర్ముఖీ’!
అరిష్ట నామధేయ,
అరిషడ్వర్గ షణ్ముఖీ!
ఎందుకో నీపేరు వింటేనే
అందరికీ అనుమానం వేస్తోంది!
నీ తీరు ఎలా వుంటుందోనన్న భయం కలుగుతోంది!

నూతన సంవత్సరమా!
అనేక ఆశల రమా!
మాకు నీటినింకా కరువు చేసి
కన్నీటిని పెంచకు సుమా!

‘గండిపేట’కు ఎప్పుడో గండి కొట్టించావు!
‘సింగూరు’ ముఖం చిట్లించావు!
అయినా మంతనాలతో
‘మహారాష్ట్ర’ మైత్రితో
‘మన్మథ’ మాత్రం మాకు గోదావరినదిపై గొప్ప ప్రాజెక్టులకో దారి చూపింది!

అమ్మా దుర్ముఖీ!
ఆ మాత్రం మేలు నువ్వు చేసినా చాలు,
అనరాశీవలు చేయకుంటే అదే పదివేలు!

మధుమాస వసంతుడు
నీ పేరు విని, నీ ముఖం చూడడానికి
వెనుకాడుతున్నాడేమో?
ఆలస్యంగా అడుగుపెడుతున్నాడు!
అందు తన ఆగమనాన్ని
‘మార్చి’లో కాక ‘ఏప్రిల్‌’కు మార్చుకున్నాడు.
ఈసారి
వేపూడ వేడుకగా పూచినట్లులేదు
మామిడి బాగా కాచినట్లు లేదు
కుహూ రాగాల కోయిల కూడా
జనారణ్య నగరంలో కూత వేసినట్లు లేదు
ప్రకృతి పరిసిశీవతి ఎలావున్నా
మాకు వికృత పరిసిశీవతి కలిగించకు!
మా నేల సస్యశ్యామలమయ్యేలా
సమవృష్టిని కురిపించు!
ప్రజల్ని, ప్రభుత్వాల్నీ
న్యాయంగా నడిపించు!
మహదానందం మాలో వెల్లివిరిసేలా
ఇక పరిపాలించు!
మమ్మల్ని మురిపించు!
– డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ

 

Other Updates