షీ టీమ్స్ మాదిరాగానే హైదరాబాద్ నగర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భరోసా’ కేంద్రం మహిళలకు అండగా నిలుస్తుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కష్టాలకు, వేధింపులకు గురైన మహిళలు, పిల్లలకు అండగా నిలిచి ఆదుకునేందుకు దేశంలో మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హాకా భవన్‌లో మే 7వ తేదీన ‘భరోసా’ కేంద్రాన్ని హోం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తున్నారని, పోలీసులు కూడా సీఎం నమ్మకానికి తగ్గట్టు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ రెండేండ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి ఘటనలు జరుగలేదని, ఇటు వంటి పోలీసు శాఖకు మంత్రిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నాని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు మనల్ని చూసి నేర్చుకుంటున్నారన్నారు.
డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా సిబ్బంది ఉండాలని, పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వడానికి అంగీకరించారని, ఆర్మ్‌డ్ రిజర్వు ఫోర్స్‌లలో కూడా పది శాతం కోటా కల్పిస్తున్నామని చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన ‘భరోసా’ కేంద్రం పనితీరును బట్టి ప్రతి జిల్లా కేంద్రంలో భద్రత సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ‘వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లను’ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు డిజిపి తెలిపారు. ఈ సెంటర్లలో ఒక లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్లను కాంట్రాక్టు పద్దతిలో నియమిస్తామన్నారు. ఇందుకు హోం మంత్రి, హోం శాఖ కార్యదర్శి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, స్వచ్చంద సంస్థల సహకారం కావలని కోరారు.
నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, షీ టీమ్స్ స్ఫూర్తితో ఈ ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. గృహహింస నుంచి మొదలు అక్రమ రవాణా, లైంగిక దాడుల వరకు సమజంలో రకరకాల వేధింపులకు గురైన మహిళలు, పిల్లలను ఆదుకోవడానికి అవసరమైన పోలీస్, న్యాయ, విచారణ, కౌన్సిలింగ్, వైద్యం తదితర అన్ని రకాల సేవలు ఇక్కడ ఒకేచోట లభిస్తాయన్నారు. ఇది నిరంతరం పనిచేసే విధంగా హోం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఓ సొసైటీని ఏర్పాటు చేశామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దీనికి రూ.2 కోట్ల నిధులను కేటాయించిందన్నారు.
ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాముఖ్యం ఇస్తోందనడానికి భరోసా కేంద్రం ఏర్పాటే నిదర్శనమని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. భరోసా సెంటర్ పనితీరుపై షీ టీమ్స్ ఇన్‌చార్జ్, నగర పోలీస్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, అదనపు కమిషనర్లు, అంజనీకుమార్, నాగిరెడ్డి, సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, రవీందర్, సత్యనారాయణ, తరుణి స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు మమత రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.