tsmagazine‘యాదగిరి’ తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రము. ఇక్కడి మూల విరాట్టు ‘స్వయంభువు’. నాటి ప్రహ్లాదుని కాచిన విధంగా ఆర్తితో వేడిన భక్తులకు అండయై నిలుస్తాడంటారు. ధర్మపురి లక్ష్మీ నరసింహుడిపై శతకము వెలువడింది, కాని యాదాద్రీషుడిపై ఇరువయ శతాబ్దము వరకు, సంపుటీకరించినట్లు సంకీర్తన కవి ఈగ బుచ్చిదాసు (1907-1957) పూనుకున్నారు. వీరు వరంగల్లు వాసిగా, తల్లికి మరియు తనకు అనారోగ్యకారణమువల్ల గుట్టపైన కోనేటి దగ్గర నివాస మేర్పరుచుకుని నిత్యము తన కీర్తనలతో స్వామిని కొలిచేవారట. గురువు చెన్నదాసువల్ల ఉపదేశంపొందిన వీరికి కాలక్రమేణ ఎందరో శిష్యులు ఏర్పడినారు. వీరిలో బుచ్చమ్మ (బుచ్చమాంబ) ప్రముఖురాలు ప్రాథమిక అక్షర జ్ఞానం కలిగిన బుచ్చమాంబ. ఆశువుగా ఆలాపించిన తనగురువు రచనలను గ్రంధస్థం చేసేదట. ఇలా గ్రంధస్థం చేయబడిన భక్తి గీతాలను ప్రపంచ తెలుగు మహాసభలు (2017) సందర్భముగా భాస్కర యోగి ‘పరిష్కరించి’ మన ముందుకు తెచ్చారు. 156 పేజీల ఈ సంకలనమును నాలుగు భాఆలుగా వాగడించి, చివరి భాగములో కీర్తనలతో బాటు, యాదగిరి నరహరి శతకము మరియు బతుకమ్మ పాటను కూడా చేర్చినారు.

ఈ కీర్తనలలో భక్తి, జ్ఞానము, తత్త్వము ఇమిడి ఉంటాయి. సారళ్యత, దేశి పదాల వాడుక బుచ్చిదాసు కీర్తనల ప్రత్యేకత. ఎన్నో చోట్ల తెలుగు జాతీయాలు, నుడికారాలు, బుగులు జోడు చాతగాదు కొండ పొడుగు లాంటి దేశిపదాలతో అలంకరించి సామాన్య ప్రజల ఆదరణ చూరగొన్నారు. తాళానికి అనుగుణంగా ఎన్నో చోట్ల దీర్ఘాన్ని హ్రస్వంగాను, హ్రస్వాన్ని దీర్ఘంగాను చేయటం మనం గమనిస్తాము.

తెలంగాణ సాహిత్య గనుల్లో మరుగుపడిన మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. వాటి త్రవ్వితీసి, జనావళికి అందించిన తెలంగాణ సాహిత్య అకాడెమీ వారిని ప్రత్యేకంగా సంస్థ ఛైర్మెన్‌ కవి డా|| నందిని సిధారెడ్డి అభినందనీయులు.

యాదగిరి క్షేత్ర సంకీర్తన కవి ఈగ బుచ్చిదాసు
సంకీర్తనలు, శతకము బతుకమ్మ పాట.
పరిష్కర్త డా|| పి. భాస్కర యోగి
పేజీలు : 156
వెల: రూ. 70/-
ప్రతులకు :తెలంగాణ సాహిత్య అకాడమీ,
రవీంద్ర భారతి ప్రాంగణము,
హైదరాబాద్‌ – 4
– కూర చిదంబరం

Other Updates