సంక్షేమానికి-ప్రథమస్థానంప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో సంక్షేమానికి ప్రథమస్థానం కల్పించింది. నిరుపేద షెడ్యూల్డు కులాల కుటుంబాలకు సాగుభూమి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోంది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఎస్‌.సి. కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమిని పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

2015 జనవరి దాకా రాష్ట్రవ్యాప్తంగా 1,132 ఎకరాల ప్రయివేటు భూమిని, 270 ఎకరాల ప్రభుత్వ భూమిని 525 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలలో రూ. 2లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ విలువైన సాగుభూమిని కొనుగోలుచేసే అధికారాన్ని ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.2015`16లో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ఈ బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లు ప్రతిపాదించారు.

శ్రీ షెడ్యూల్డు కులాల సంక్షేమంకోసం రూ. 5,547 కోట్లు ప్రతిపాదించారు.
శ్రీ గిరిజన సంక్షేమానికి రూ. 2,878 కోట్లు
శ్రీ షెడ్యూల్డు కులాల ఉప ప్రణాళికకు రూ. 8,089 కోట్లు
శ్రీ షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళికకు రూ. 5,036 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల జనాభా పెరుగుదలను, వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనాన్ని అధ్యయనం చేసి ‘వాల్మీకి బోయ’, ‘కాయితీ లంబాడా’ కులాలను షెడ్యూల్డు జాతుల జాబితాలో చేర్చే విషయం పరిశీలించేందుకు ఒక సమగ్ర నివేదిక రూపొందించేందుకు ప్రభుత్వం ఒక విచారణా సంఘాన్ని నియమించింది.
సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా గిరిపుత్రులలో నూతనోత్సాహం నింపి, వారి అభివృద్ధికి తోడ్పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది.

బంజారాలకు, ఆదివాసులకు భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది.
బి.సి.ల సంక్షేమం : రాష్ట్ర జనాభాలో అధికశాతం వున్న వెనుకబడిన తరగతుల సంక్షేమంకోసం, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోంది. ఈ బడ్జెట్‌లో బి.సి.ల సంక్షేమానికి రూ. 2,172 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయమే ముఖ్య ఆలంబనమై ఉన్న వెనుకబడిన జాతులవారికి సూక్ష్మసేద్యం వంటి ప్రణాళికలలో ప్రత్యేక కేటాయింపులు చేశారు.

మైనారిటీ సంక్షేమం

రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు ఆర్థిక, సాంఘిక, విద్యా రంగాలలో ఎదుర్కొంటున్న స్థితిగతుల్ని అధ్యయనం చేసి, వారిని ఇతర సామాజిక వర్గాలతో సమానస్థాయికి తీసుకురావడానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని నియమించింది.

అలాగే, హైదరాబాద్‌ నగరంలో క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణానికి భూమి కేటాయించడంతోపాటు 10 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయించింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌దర్గా దగ్గర రూ. 5 కోట్ల వ్యయంతో రుబాత్‌ (వసతి గృహం) నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.

ఎస్‌.సి., ఎస్‌.టిలతో సమానంగా ముస్లిం, సిఖ్‌, దళిత క్రిస్టియన్‌ వర్గాలకు చెందిన ఆడపిల్లల పెళ్ళిళ్ళకోసం ప్రభుత్వం ‘షాదీ ముబారక్‌’ పథకం అమలు చేస్తోంది. రంజాన్‌, క్రిస్టమస్‌ పర్వదినాల సందర్భంగా రెండు రోజుల సెలవును కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమం కోసం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల క్రింద రూ. 1,105 కోట్లు ప్రతిపాదించారు.

మహిళా, శిశు సంక్షేమం : మహిళలు, పిల్లలు మన సమాజంలో చాలా ముఖ్యమైన భాగం. సామాజికాభివృద్ధికి తోడ్పాటునిచ్చేవారు మహిళలైతే, పిల్లలు మన సమాజపు భవిష్యత్తుగా ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపట్ల వివక్షచూపే సమాజాన్ని, వారికి భద్రతను కల్పించలేని సమాజాన్ని నాగరిక సమాజంగా భావించలేం.
మన రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం ఒక కమిటీనివేసి, ఆ కమిటీ సిఫార్సు చేసిన సూచనల ఆధారంగా భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే షీ`టీమ్స్‌ ఏర్పాటు చేసింది. ఈవ్‌టీజర్స్‌ను, మహిళల వెంటపడి వేధించేవారి భరతం పట్టే పనిలో ‘షీ`టీమ్స్‌’ పురోగతిని సాధించాయి.

గర్భిణులకు, బాలింతలకు,శిశువులకు అంగన్‌వాడి కార్యకర్తలు, సహాయకులు అందిస్తున్న సేవలు ఎంతో ముఖ్యమైనవి. వీరి సేవలను, ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన ప్రభుత్వం అంగన్‌వాడి కార్యకర్తల వేతనాన్ని రూ. 4,200 నుంచి రూ. 7000కు, అంగన్‌వాడి సహాయకుల వేతనం రూ. 2450 నుంచి రూ. 4500కు హెచ్చించింది. ఇది 2015 మార్చి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, వంటపాత్రల కొనుగోలుకోసం ప్రతి అంగన్‌వాడి కేంద్రానికి ‘వన్‌టైమ్‌ గ్రాంట్‌’గా ఒక్కో కేంద్రానికి రూ. 1,000 ఇవ్వాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి సేవలు (ఐ.సి.డి.ఎస్‌.) స్కీమ్‌ క్రింద కేంద్రంనుంచి ఇచ్చే తోడ్పాటు గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది సగానికి పైగా తగ్గింది. దీనివల్ల మన రాష్ట్రంపై మరింత భారం పెరిగింది. అయినప్పటికీ ఈ బడ్జెట్‌లో ఐ.సి.డి.ఎస్‌. స్కీముకు రూ. 771 కోట్లు ప్రతిపాదించారు.

ఆహారభద్రత

ప్రతి వ్యక్తికి చాలినంత ఆహార ధాన్యాన్ని అందించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకే బియ్యం రాయితీ పొందే కుటుంబాల ఆదాయ పరిమితిని పెంచి ఎక్కువ కుటుంబాలకు అర్హత కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో రూ. 60,000గా ఉన్న ఆదాయ పరిమితిని రూ. 1,50,000కు, పట్టణ ప్రాంతాలలో రూ. 75,000గా ఉన్న పరిమితిని రూ. 2 లక్షలకు పెంచారు. భూకమత పరిమితినికూడా పెంచారు.
దీనితోపాటుగా, గతంలో మనిషికి ఒక నెలలో 4 కిలోల బియ్యం చొప్పున, కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల బియ్యంమాత్రమే ‘రూపాయికి కిలో బియ్యం’ పథకం క్రింద అందించేవారు. దీనిని ఇప్పడు మనిషికి ప్రతి నెలా 6 కిలోల చొప్పున పెంచి, కుటుంబ గరిష్ట పరిమితిని తొలగించారు. దీనివల్ల కుటుంబంలో ఎంతమంది వుంటే అంతమందికి ఈ ఏడాది జనవరి 1నుంచి బియ్యం లభిస్తున్నాయి.

వసతి గృహాలకు, పాఠశాలలకు ‘సన్నబియ్యం’ సరఫరా చేయాలని మరో విప్లవాత్మక నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2015 జనవరి 1 నుంచి రాష్ట్రంలోని వసతి గృహాలకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ‘సన్నబియ్యం’ సరఫరా చేస్తోంది.

ఆహారభద్రత, ఆహార సబ్సిడీ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 2,200 కోట్లు ప్రతిపాదించారు.

ఉగ్యోగుల సంక్షేమం

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులదే కీలకపాత్ర ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలన్నది ప్రభుత్వ విధానం. ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా వేతనాలను సవరిస్తూ, గతంలో ఎన్నడూ లేనంతగా, 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

ఉద్యోగుల జీతాలు, భత్యాలకోసం ఈ బడ్జెట్‌లో రూ. 22,889 కోట్లు ప్రతిపాదించారు.

Other Updates