సంక్షేమ రంగంలో  తెలంగాణా రాష్ట్రం దేశంలోనే ముందున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఇతర వర్గాల వారి సంక్షేమానికి 28 వేల కోట్ల రూపాయలతో వివిధ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

సంక్షేమ౦లో మనమే నంబర్ వన్చారిత్రక గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించిన 69వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రాభవానికి చిహ్నమైన గోల్కొండ కోటలో గతేడాది నుంచి స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటున్నామని, కొత్త రాష్ట్రంలో తొలి ఏడాదిలోనే ఎంతో ప్రగతిని సాధించామన్నారు.

తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని సమైక్యవాదులు చేసిన విష ప్రచారాన్ని ఏడాదిలోనే తలక్రిందులు చేశాం. విద్యుత్‌ కోతలులేని తెలంగాణను చేతల్లో చూపించాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడిన చిక్కుముడులను విప్పుకుంటూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం. వచ్చే మార్చి నుంచి రైతాంగానికి పగటిపూటే 9 గంటల విద్యుత్‌ అందిస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని, గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం 25 వేల కోట్ల రూపాయలతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని సి.ఎం చెప్పారు. సంక్షేమం, విద్యుత్‌, వ్యవసాయం, నీటిపారుదల రంగాల అభివృద్ధికి బృహత్‌ ప్రణాళికలు రూపొందించామని, సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్‌ లో 28 వేల కోట్ల రూపాయలు కేటాయించి, దేశంలోనే నంబర్‌ వన్‌ గా రాష్ట్రాన్ని నిలిపామని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి సంక్షేమంలో భాగంగా విద్యార్థులకు సన్నబియ్యం, ఫీజు రీ ఇంబర్స్‌ మెంట్‌, బీడీ కార్మికులకు జీవనభృతి, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, దళితులకు భూ పంపిణీ, తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రైతాంగానికి ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, 17 వేల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేశాం. అందులో రెండు విడతులుగా 8,500 కోట్ల రూపాయలను చెల్లించాం. పెండింగ్‌లో వున్న 480 కోట్ల రూపాయల ఇన్‌ పుట్‌ సబ్సిడీని అందించాం. గోదాములు లేక ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకొని 380 గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వాటి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌ కు వంద కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌ హౌజ్‌ కల్టివేషన్‌ కోసం రూ.400 కోట్లు, ఫాం మెకనైజేషన్‌ కోసం రూ.400 కోట్లు, మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.402 కోట్లు ఖర్చు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ చెప్పారు.

విద్యుత్‌ లో స్వయం సమృద్ధి

విద్యుత్‌ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టాలు పడ్డాం. రైతులు, విద్యార్థులు, పరిశ్రమలు, ప్రజల ఇబ్బందులు మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వస్తే చిమ్మచీకట్లు వస్తాయని, అంధకారం నెలకొంటుందని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని తలలక్రిందులు చేస్తూ, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. మార్చి నుంచి రైతాంగానికి పగటిపూటే 9 గంటల విద్యుత్‌ ను ఇవ్వనున్నామని తెలియజేసేందుకు సంతోషంగా వుంది. విద్యుత్‌ లో స్వయంసమృద్ధి సాధించేందుకు 91,500 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇప్పటికే సమీకరించుకున్నాం. రాబోయే నాలుగేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను స్థాపించబోతున్నాం, అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు.

మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వ వైభవం తెస్తున్నాం. ఈ ఏడాది 8 వేల చెరువులను పునరుద్ధరించాం. రాబోయే నాలుగేళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మిషన్‌ కాకతీయను హైకోర్టు సహా అందరూ ప్రశంసించారు. వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ ఈ కార్యక్రమాన్ని కొనియాడారు. వరంగల్‌ జిల్లా నెక్కొండ చెరువుకట్టపై ఆయన తన పుట్టినరోజును జరుపుకున్నారు, అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో విశిష్టతలతో కొత్త పారిశ్రామిక విధానాన్ని చేపట్టాం. దీనిని అసెంబ్లీలోనే చట్టంగా చేశాం. టిఎస్‌-ఐపాస్‌ చట్టం క్రింద పరిశ్రమకు రెండు వారాల్లోనే అనుమతులిస్తున్నాం. ఇప్పటికే 3,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకొచ్చిన 38 పరిశ్రమలకు రెండు విడతల్లో అనుమతులిచ్చాం. పరిశ్రమల కోసం లక్షా 50 వేల ఎకరాల భూమిని సిద్ధంచేసుకున్నాం. నూతన పారిశ్రామిక విధానం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధితోపాటు యువతకు అపార ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని కె.సి.ఆర్‌ చెప్పారు.

వాటర్‌ గ్రిడ్‌ కి ప్రశంసల వెల్లువ

ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని నల్లా ద్వారా అందించాలనే లక్ష్యంతో వాటర్‌ గ్రిడ్‌ కార్యక్రమం అమలుచేస్తున్నామని, ఈ పథకాన్ని ప్రారంభించక ముందే హడ్కో ప్రశంసలు కురిపించిందని, ఢిల్లీలో అవార్డు కూడా ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కలను మనం నిజం చేసుకోవాలి. నీటి వనరుల విషయంలో మనం దగా, మోసానికి గురయ్యాం. గోదావరిలో 90 టి.ఎం.సిలు, కృష్ణా నదిలో 360 టి.ఎం.సిల హక్కు ఉన్నా నీళ్ళు మాత్రం మనకు రాలేదు. ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించినా అరకొర పనులే చేశారు. నీటి వనరుల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేసి ఒక ప్రణాళిక ప్రజల ముందుకు తెచ్చాం.. అని కె.సి.ఆర్‌ వివరించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయం ప్రస్తావిస్తూ, పోలీసులకు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశామని, మొత్తం పోలీస్‌ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టినట్టు, అంతర్జాతీయ స్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను, షీ టీములను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు పోలీసులు కూడా సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో పేకాటను నిషేధించామన్నారు.

గోదావరి లాగే కృష్ణా పుష్కరాలు

ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడ అనేవారు. కానీ, 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలను తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించాం. పుష్కరాలలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలీసులు, అధికార యంత్రాంగం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. వచ్చే ఏడాది రానున్న కృష్ణా పుష్కరాలను కూడా అంతే ఘనంగా నిర్వహిస్తామని సి.ఎం కె.సి.ఆర్‌ చెప్పారు.

రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున 200 దావతే ఇఫ్తార్‌ ను ఏర్పాటు చేశాం. బోనాల పండుగకు 10 కోట్ల రూపాయలు కేటాయించాం. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని సి.ఎం చెప్పారు.

విశ్వనగరంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. 21 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికలు చేపట్టాం. చారిత్రిక నగరంలో ప్రస్తుతం హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ తప్ప మరో రిజర్వాయర్‌ లేదు. దీనిని అధిగమించేందుకు 30 టి.ఎం.సి నీటి నిల్వ సామర్థ్యంతో మరో రెండు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. లక్షా 28 వేల మంది లబ్దిదారుకు 10 వేల కోట్ల రూపాయల విలువైన ఇంటిస్థలాల పట్టాలు ఉచితంగా ఇచ్చామన్నారు.

గ్రామజ్యోతి

భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం గ్రామజ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం ప్రతి గ్రామానికి రిక్షాలు అందిస్తాం. రాబోయే నాలుగేళ్ళలో 25 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి గ్రామాలలో సమస్యలు పారద్రోలుతామని ఆయన చెప్పారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతోపాటు యువత, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాలు రెండో ఏడాది ఘనంగా నిర్వహించారు. కోటను ప్రత్యేకంగా సుందరంగా అలంకరించారు. జెండా ఆవిష్కరణ జరిగిన రాణిమహల్‌ పరిసరాలను పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన కళాబృందాలు కోట గోడలపై ప్రదర్శించిన కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒగ్గు కళాకారులు, గిరిజన లంబాడా మహిళలు, చిందు, యక్షగాన కళాకారులు, పలు పాఠశాలల విద్యార్థులు తమతమ కళా ప్రదర్శనలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల నుంచి ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంత్రివర్గ సహచరులతో పాటు, అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు.

పలువురికి సత్కారం

ఈ వేడుకలలో భాగంగా ఉత్తమ సేవలందించిన పలువురిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వయంగా సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి బి.వి.ఆర్‌ చారిని సత్కరించి రూ. 1,00,116 నగదు పారితోషికాన్ని సి.ఎం అందించారు. కరాటేలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి సయేదా ఫాలక్‌కు 1,00,116 రూపాయల పారితోషికాన్ని అందించి సత్కరించారు. ముఖ్యమంత్రి పి.ఏ వెంకటనారాయణ, వేములవాడ దేవస్థానం అసిస్టెంట్‌ కమీషనర్‌ రాజేశ్వర్‌, పలువురు పోలీసు అధికారులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ స్వీకరించారు. నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ముష్కరుల తూటాకు బలైన ఎస్‌.ఐ సిద్దయ్యకు ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల రూపాయల ఎక్స్‌ గ్రేషియా చెక్కును సిద్దయ్య సతీమణి కి ముఖ్యమంత్రి అందజేశారు.

గోల్కొండ కోటకు వచ్చేముందు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో కార్గిల్‌ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నివాళుర్పించారు. స్థూపం వద్ద పూలుచల్లి జ్యోతి వెలిగించారు. సైనికాధికారులతో కరచాలనం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్రంగా 69వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన, వాడవాడలా మువ్వన్నెల జాతీయ పతాకం రెపరెపలాడింది. వివిధ జిల్లా కేంద్రాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాలలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వరంగల్‌ లో డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఖమ్మంలో రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కరీంనగర్‌లో ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్‌, సంగారెడ్డిలో భారీ నీటి పారుదల శాఖామంత్రి టి. హరీష్‌ రావు, నల్లగొండలో విద్యుత్‌ శాఖామంత్రి జగదీశ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ లో అటవీ శాఖామంత్రి జోగు రామన్న, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గచ్చిబౌలి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రవాణా శాఖామంత్రి మహేందర్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌లో భారీ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు పతాకావిష్కరణ జరిపారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు సారథ్యంలో, అందరం కలసికట్టుగా ముందుకు సాగి బంగారు తెలంగాణ సాధించుకుందామని మంత్రులు పిలుపునిచ్చారు.

Other Updates