నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా
విభజన బిల్లులో ఇచ్చిన హామీ విధంగా తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను కోరారు. జూలై 2వ తేదీన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సిఎంను కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే బాధ్యతను కూడా నీతీ ఆయోగ్ తీసుకోవాలని, వాటిని తిరిగి చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సిఎం ఆకాంక్షించారు. గతంలో నీటి ప్రాజెక్టులకు ప్రణాళికా సంఘం నిధులు మంజూరు చేసిందని, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు నిధులు ఇచ్చి వాటిని వడ్డీతో రాష్ట్రాల నుంచి తీసుకోవాలన్నారు. దీని వల్ల నీతి ఆయోగ్ బలోపేతమవుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, హరిత హారం, నీటి పారుదల ప్రాజెక్టులు, నూతన పారిశ్రామిక విధానం, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. కేంద్రం వద్ద మూలుగుతున్న ‘కాంపా’ నిధులను వాటా ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాని సీఎం, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను కోరారు. అంతకు ముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాతో పాటు రాష్ట్ర అధికారులు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కిషన్‌నగర్ గ్రామాన్ని, నందిగామలోని మిషన్ కాకతీయ పనులు, రాయికల్‌లో పాలీహౌస్‌ను పరిశీలించారు. కొత్త పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలను అరవింద్ పనగారియా అభినందించారు.
ఈ సమావేశంలో మంత్రులు కేటిఆర్, జగదీశ్‌రెడ్డి, ప్రణాళికాబోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు జీఆర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ ఐఎఎస్ అధికారులు, నీతిఆయోగ్ అధికారులు తపస్య, అశోక్ జైన్ పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్దరణ, భారీ రాయితీలతో రైతులు ఏర్పాటు చేసుకున్న పాలీహౌస్ అబ్బురపరుస్తున్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ, సూక్ష్మసేద్యం, వాటర్ గ్రిడ్, తెలంగాణకు హరితహారం, స్వచ్ఛ భారత్‌ను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో పనగారియా పరిశీలించారు. కొత్తూరు మండలం నందిగామ పరిధిలో చేపట్టిన మిషన్ కాకతీయ పనులను, ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్‌లో ప్రభుత్వ రాయితీతో రైతు యాదయ్యగౌడ్ ఏర్పాటు చేసుకున్న పాలీహౌస్‌లోని పూలసాగును రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ టికే శ్రీదేవి, సమాచారశాఖ రాష్ట్ర కమీషనర్ బీపి. ఆచార్యతో కలిసి అరవింంద్ పనగారియా పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా రైతేనని పనగారియాకు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివరించారు.