నాలుగువందల

సంవత్సరాలు తెలంగాణాను పరిపాలించిన కుతు బ్‌షాహీల కాలంలో సంగీత, సాహిత్య, నృత్యాలు బాగా పరిఢవిల్లినట్లు చారిత్రకాధారాలున్నాయి. పెద్దగా ప్రచారంలోనికి రాలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొనిఉన్న ప్రాంతమంతా మహాలఖాబాయి చందా జాగీరు. ఆమె సంగీత సాహిత్య, నృత్యాల్లో ప్రవీణు రాలిగా పేరుగాంచింది. అసలు హైదరాబాదు నగర స్థాపనకు మూలకారకురాలైన భాగమతి సంగీత నాట్యాల్లో ఆరితేరిన విదుషి. ఆమెపేరుమీదుగానే భాగ్యనగరం పొందింపబడింది.

చివరి నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌ తమ దర్బారులో సంగీత విద్వాంసులను, గాయకులను నిలిపి ఆదరించకపోయినా అతని దర్బారులో ఆర్బాబెనిషాత్‌ అనే ఒక శాఖ వుండేది. అందులో గాయకులు, నాట్యాచార్యులు మాసవేతనంపై వుండేవారు. నిజాం రాజ్యానికి అతిథులుగా వచ్చే ఇతర సంస్థానాధీశులను, బ్రిటిష్‌ ఉన్నతాధికారులను ఆహ్లాదపరిచే కార్యక్రమాల్లో వీరు గానా బజానా చేసేవారు. రేడియో స్టేషన్లలో నిలయ విద్వాంసులవలె అన్నమాట.

అంతేగాక నిజాం రాజ్యానికి ప్రత్యేకాహ్వానితులుగా వేంచేసిన గాయికా గాయకుల వాదకుల సంగీతాన్ని విని వారిని ఉచితంగా గౌరవించేవారని, సత్కరించేవారని ‘దర్బారె దుర్బార్‌’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రాసిన సిద్క్‌ జాయెసి పేర్కొన్నారు.

ప్రఖ్యాత సంగీత విశ్లేషకులు డా|| సామల సదాశివ చివరి నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌కున్న సంగీత అవగాహన గురించి, రాగ్‌ రాగిణిల గురించి, అవి గానం చేసే సమయా సమయాల గురించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గజల్‌ గాయకులు విఠల్‌రావు నోట చెప్పించినారు.

హైదరాబాదులో బాయీ శంకరాబాయి, బాయీ బంగారీబాయి అనే గాయనీమణులుండేవారు. శంకరాబాయి గజల్‌ గానంలో ప్రసిద్ధి పొందింది. ఆమె గజల్‌ గానం బేగం అఖ్తర్‌కంటే ఉత్కృష్ఠమైనదని ప్రముఖ పత్రికాధిపతి జిగర్‌సాహెబ్‌ పేర్కొన్నారు. కానీ బేగం అఖ్తర్‌కు వచ్చిన పేరు ఆమెకు రాలేదు.

ఈటీవీ ఉర్దూ ఛానల్‌లో మహ్మద్‌ వకీల్‌ అనే అబ్బాయి చేత గజల్‌ కార్యక్రమాలను ప్రసారం చేసినారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖ గజల్‌ గాయికా గాయకులు న్యాయ నిర్ణేతలుగా వేంచేసేవారు. తద్వారా గజల్‌ సంగీతంపట్ల ఆసక్తిగల శ్రోతలు ఆనందాన్ని పొందేవారు.

హైదరాబాదుకే చెందిన విఠల్‌రావు కూడా కొన్ని సందర్భాలలో ఆ కార్యక్రమంలో పాల్గొని వర్ధమాన కళాకారులకు సూచనలందించేవారు. విఠల్‌రావు గజల్‌గానం గురించి చెప్పవలెనంటే ప్రత్యేకంగా ఒక వ్యాసం రాయవలసి వుంటుంది.

అమిరెపాయెగా నవాబ్‌ జహీర్‌యార్‌జంగ్‌ సంపన్నుడేగాక సంగీత రసజ్ఞుడు. ఉస్తాద్‌ బడేగులామలీఖాన్‌ సాహెబ్‌ అంటే అతనికి చాలా అభిమానం. అతని ఆహ్వానంపై ఉస్తాద్‌ బడేగులామలీఖాన్‌ తరచుగా ప్యాలెస్‌లో వుండేవారు. ఆ సమయంలో ప్రతినిత్యం సంగీత సభలు జరిగేవని వేరుగా చెప్పవలసినపనిలేదు. బడేగులామలీఖాన్‌ అనారోగ్యానికి గురయితే నవాబు జహీర్‌యార్‌ జంగ్‌ ఎంతో ఖర్చుచేసి చికిత్స అందించినారు. కానీ ఉస్తాద్‌, స్వర్గస్థులైనారు. ఉస్తాద్‌ బడేగులామలీఖాన్‌ సాహెబ్‌ సంగీత యాత్ర హైదరాబాదులోనే ముగిసింది. హైదరాబాదులోని దాయెరామీర్‌ మోమిన్‌వద్దగల ఉస్తాద్‌ సమాధిమీద నవాబ్‌ జహీర్‌ యార్‌ జంగ్‌ అందమైన కట్టడాన్ని నిర్మింపజేసినారు.

కాసూర్‌ పాటియాలా ఘరానాకుచెందిన గొప్ప గాయకుడు ఉస్తాద్‌ బడేగులామలీఖాన్‌ సాహెబ్‌ హైదరాబాదులోని సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నారంటే తెలంగాణాలో సంగీతం ఏ విధంగా పరిఢలివ్లిందో ఊహించుకోవచ్చు.

నవాబు జహీర్‌యార్‌ జంగ్‌ కాక ఆనాటి ధనికులలో చాలామంది సంగీత ప్రియులుండిరి. నవాబ్‌ కాజిమ్‌ నవాజ్‌ జంగ్‌ (ఇతన్ని అలీపాషా అని పిలిచేవారు. నిజాం అల్లుడు) రాజా ధన్‌రాజ్‌గిర్‌జి – రాజా ప్రతాప్‌ గిర్‌జీ.. మూడవ సాలార్‌జంగ్‌ ఎల్‌.ఎన్‌.గుప్తావంటి వారు గొప్పగొప్ప గాయికాగాయకులు వాదకులను ఆహ్వానించి సంగీత సభలు జరిపేవారు.
tsmagazine

మేవాతీ ఘరానాకు చెందిన పండిత్‌ మోతీరాం సంగీతం గురించి విన్న చివరి నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌ పండిత్‌ మోతీరాంను ఆస్థాన గాయకునిగా నియమిస్తూ ఫర్మానా జారీ చేయించినారు. 1934లో రాజా కిషన్‌ ప్రసాద్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో చౌమొహల్లాలో నిజాం ఫర్మానాను అమలుపరిచే కార్యక్రమం కూడా జరిగింది. కానీ విధి చేసిన విచిత్రం వలన పండిత్‌ మోతీరాం హఠాత్తుగా మరణించినారు. తండ్రి మరణించేనాటికి పండిత్‌ జస్‌రాజ్‌ మూడున్నరేండ్ల పసివారు. తన అన్న పండిత్‌ మణిరాంవద్ద మేవాతి ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకొని విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా ప్రతి సంవత్సరం తమ తండ్రి పండిత్‌ మోతీరాం తమ అన్న గురువు అయిన పండిత్‌ మణిరాంల జయంతులు, వర్ధంతులు హైదరాబాదులో జరుపుతూ భారతదేశంలోని గొప్పగొప్ప సంగీతజ్ఞులను ఆహ్వానిస్తూ సభలు జరుపుతున్నారు. ఇవీ తెలంగాణాలో జరిగే సంగీత సభలే కదా!

ఈ సంగీత సభలను విజయవంతంగా నిర్వహించేవారు హైదరాబాదులోని మరాఠీ మండల్‌ సభ్యులు. తెలంగాణాలో విద్యావ్యాప్తికి సంగీతానికి వారు చేస్తున్న సేవ గొప్పదే. వివేకవర్ధని పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యాగంధాన్ని వెదజల్లడంతోపాటు సంగీత మహావిద్యాలయాన్ని బడీచౌడీలో స్థాపించి హిందుస్తానీ సంగీతానికి ఇతోధిక సేవ చేస్తున్నారు. అఖండ భారతదేశమంతటా హిందుస్తానీ సంగీతాన్ని వ్యాపింపజేయడానికి కంకణం కట్టుకున్న పండిత్‌ వి.డి. పలూస్కర్‌ దేశంలోని ముఖ్య నగరాలలో గాంధర్వ మహావిద్యాలయాలను ఏర్పాటుచేస్తూ హైదరాబాదులోని గాంధర్వ విద్యాలయానికి తమ శిష్యుడు పండిత్‌ వినాయక్‌రావు పట్వర్ధన్‌ను నియమించినారు.

వివేకవర్ధని సంగీత కళాశాలలో వి.బి. దేశ్‌పాండే కరాడే, మీరాపాన్సేవంటివారు సంగీత శాస్త్రాన్ని బోధించినారు. కరాడే పుత్రిక, ఆరాధనా కరాడే ఈనాడు పేరెన్నికగల గాయిక. అంతేగాక యూట్యూబ్‌లో కూడా సంగీత పాఠాలు నేర్పుతున్నది.

హైదరాబాద్‌ రాంకోట్‌లో త్యాగరాజు సంగీత కళాశాలను స్థాపించి దానికి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన గోవిందరావు దంతాళే, వారి సతీమణి వసుమతీ దంతాళే హైదరాబాదులో హిందుస్తానీ సంగీత వ్యాప్తికి కృషిచేసినారు. వారి ఏకైక పుత్రిక లలితకురూల్‌కర్‌ ప్రస్తుతం ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని సంగీత పాఠాలు బోధిస్తున్నది.

ప్రముఖ తబ్లా వాదకులు అహ్మద్‌ జాన్‌ తిరఖ్వా, ఉస్తాద్‌ షేక్‌ దావూద్‌లు హైదరాబాదు వాస్తవ్యులే. అహ్మద్‌ జాన్‌ తిరఖ్వా పుణే వెళ్లిపోయి గొప్ప తబ్లా విద్వాంసుడుగా పేరు పొందినారు.

కానీ షేక్‌ దావూద్‌ మాత్రం హైదరాబాదును విడిచి వెళ్లలేదు. కనుక అతనికి రావలసినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. అయినా ఎందరో తబ్లా విద్వాంసులను తయారు చేసిన ఘనత ఆయనది. షేఖ్‌ దావూద్‌ కొడుకు ఉస్తాద్‌ షబ్బీర్‌నిసార్‌ తండ్రి బాటలో నడుస్తూ తండ్రంతటి తబ్లా వాదకునిగా పేరు పొందినాడు. తండ్రిపేరు ‘తబ్లానవాజ్‌ ఉస్తాద్‌ షేక్‌ దావూద్‌ ట్రస్ట్‌’ను స్థాపించి కళాసేవ చేస్తున్నారు. షేఖ్‌దావూద్‌ మనుమలు షహబాజ్‌ నాజర్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లిద్దరూ తబ్లా వాదనంలో మంచి పేరు సంపాదించుకుం టున్నారు. 2016వ సంవత్సరంలో షేఖ్‌ దావూద్‌ శత జయంతి వేడుకలు హైదరాబాదు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి.

హైదరాబాదులోని సురమండల్‌ సంస్థవారు, చార్మినార్‌ సంస్థవారు సంగీతోత్సవాలు జరుపుతూనే వుంటారు. ఈ మధ్య తెలంగాణా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఓంకార్‌ దాదర్‌కర్‌ గాత్రకచేరీ ఏర్పాటు చేసినారు. పండిత్‌ భీంసేన్‌ జోషి గాత్ర కచేరీలు జరగుతూనే వుండేవి. పండిత్‌జీ సంతవాణి కార్యక్రమాలు కూడా జరిగినాయి హైదరాబాదులో.

త్యాగరాయగానసభ, రవీంద్రభారతిలో తరచుగా కర్ణాటక సంగీత సభలు జరుగుతాయి. ప్రభుత్వ సంగీత కళాశాలద్వారా శ్రీరంగం గోపాలరత్నం, కోవెల శాంతవంటివారు కర్ణాటక సంగీతాన్ని బోధించినారు. ఆకాశవాణి హైదరాబాదు కూడా సంగీతానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. తొలిసారి మరాఠీ గీత రామాయణాన్ని థోండూశాస్త్రి గానం చేయగా ఆకాశవాణి భక్తిరంజనిలో ప్రసారమయింది.

మరాఠీ కవి గ.ది. మాడ్గుళ్‌కర్‌ మరాఠీలో రాసిన గీత రామాయణాన్ని వానమామలై వరదాచార్యులు తెలుగులో అనువదించగా జక్కెపెల్లి సోదరులు గానం చేయగా ఆకాశవాణి నుండి ప్రసారమైనాయి.

ఆదిలాబాదు జిల్లా చెన్నూరుకు చెందిన జక్కెపెల్లి కిష్టయ్య హిందుస్తానీ కర్ణాటక సంగీతంలో పండితులు. వారి సంతానం జక్కెపెల్లి నాగేశ్వర రావు, జక్కెపెల్లి హిమాకర్‌లు మంచి గాయకులుగా పేరు పొందినారు. వారి సోదరి రేగళ్ల శ్యామల కూడా గాయనిగా పేరు పొందినారు కానీ అకాల మరణం చెందినారు.

ఆదిలాబాదు నగరంలో హిందుస్తానీ సంగీతాన్ని విని ఆనందించే శ్రోతలున్నారు. ఆదిలాబాదు తొలి ఎమ్మెల్యే దాజీ శంకర్‌కు హిందుస్తానీ గాయకుడుగా పేరుండేది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు రామకృష్ణశాస్త్రి పుత్రులు రమేశ్‌శాస్త్రి సంగీతంలో చాలా పరిశ్రమ చేసినవారు. హిందుస్తానీ సంగీతంలో వారిని నడిచే విజ్ఞాన సర్వస్వమని భావించేవారు. సంగీతానికి సంబంధించిన ఏ విషయాన్నయినా రమేశ్‌శాస్త్రి చెప్పినారంటే అదే గీటురాయి. అతను కూడా అకాల మరణం చెందినందున అతని సంగీత సర్వస్వం అతనితోనే వెళ్లిపోయింది.

ఆదిలాబాదులోని రాజేశ్వరరావు అడ్వొకేటు ఇంట్లో కొన్నాండ్లు పండిత్‌ జస్‌రాజ్‌ బాల్యాన్ని గడిపినారని ప్రముఖ సంగీత విశ్లేషకులు డా|| సామల సదాశివ యాది గ్రంథం ద్వారా తెలుస్తున్నది. గొట్టిముక్కుల వామనరావు కారణంగా ఆదిలాబాద్‌లో ప్రభా ఆత్రే-పర్వీన్‌సుల్తానా, పండిత్‌ జస్‌రాజ్‌ వంటి గాయికా గాయకుల పాట కచేరీలు జరిగినాయి. అంతేగాక నాగపూర్‌కు చెందిన ప్రముఖ గాయని ఉషాపారిఖ్‌ హైదరా బాద్‌కు చెందిన మీరా పాన్సేవంటి వారిక్కడ పాటకచేరీలు చేసినారు.

ఉస్తాద్‌ బడేగులామలీఖాన్‌ సాహెబ్‌ తమ చికిత్సకోసం బోధ్‌కు వచ్చినారు. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌లోకూడా సంగీత రసజ్ఞులున్నారు. ఆ సమయంలోనే ఉస్తాద్‌ ఆదిలాబాదులో ఒక సభ జరిపి తద్వారా వచ్చిన డబ్బులను ఇక్కడి హాస్పిటల్లో పిల్లలవార్డు కొరకు విరాళంగా ఇచ్చినారు.

ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కర్ణాటక హిందుస్తానీ గాయకులు, వాదకులున్నారు. అక్కడి ప్రధానోపాధ్యాయిని మాలిని అరవింద్‌ చందూర్‌కర్‌ (బడీ ఆంటి) ఆధ్వర్యంలో తరచుగా సంగీత సభలు జరిగేవి. ఆ పాఠశాలలోనే సంగీతాచార్యులుగావున్న ఎన్సీహెచ్‌వీ రంగనాథ్‌ మంచి గాయకుడేగాక నాట్యాచార్యులు కూడా. రామాచారి గాయకుడేగాక సంగీత పాఠాలు బోధించేవారు. రకరకాల వాయిద్యాలు వాయించేవారు. కృష్ణాకట్టి మంచి గాయకుడుగాపేరు పొందినారు. కల్లోల్‌ భట్టాచార్య ఉషాపారిఖివద్ద సంగీతం నేర్చుకున్నారు. కచేరీలు కూడా చేస్తున్నారు.

ఆదిలాబాదు జిల్లా భైంసా ప్రాంతంలో హిందుస్తానీ సంగీతం అధికంగా వినిపిస్తుంది. ప్రముఖ గాయకుడు జితేంద్ర అభిషేకి భార్య, భైంసా ఆడబడుచు. కుమురం భీం ఆసిఫాబాదు జిల్లాగా మారిన ఆదిలా బాదు తాలూకాయైన ఆసిఫాబాదులో వసంతారావు మసాడే, మధూకర్‌రావు ఆచార్య శ్రీరాం ఆచార్య, వఝల మనోహరరావు మొదలైన హిందుస్తానీ సంగీత పండితులుండేవారు. ప్రముఖ హిందుస్తానీ వయోలిన్‌ విద్వాంసులు వి.జి.జోగ్‌ భార్య ఆసిఫాబాదు ఆడపడుచే!

భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని సంగీత సభలు జరుగుతాయి. వరంగల్‌ సంగీత సాహిత్యాలకు కాణాచి. అక్కడ కర్ణాటక హిందుస్తానీ సంగీతాలున్నాయి. వరంగల్‌లో రామచంద్రయ్య ప్రముఖ సితార్‌ వాదకులున్నారు. అతని శిష్య ప్రశిష్యులు అనేకులు. ఉజ్జాయింపుగా వరంగల్‌లో రెండువందల వరకు సితార్లున్నాయట. రామచంద్రయ్య కుమారులు విద్యాసాగర్‌ మంచి గజల్‌ గాయకునిగా పేరు తెచ్చుకున్నారు. రామచంద్రయ్య శిష్యుడు జనార్ధన్‌ సితార్‌తోపాటు తబ్లా కూడా వాయిస్తారు. విద్యార్థులకు బోధిస్తారు కూడా. ఈ సితార్లపై ఉస్తాద్‌ అబ్దుల్‌ హలీ జాఫర్‌ఖాన్‌ ప్రభావమున్నది. వారి శైలి జాఫర్‌ఖానీబాజ్‌.

వరంగల్లులోనే మీరా సంగీత మండలివారు ఇతోధికంగా సంగీత సేవ చేస్తున్నారు. వరంగల్లుకు చెందిన ‘యోష’ మంచి గాయికగా పేరు సంపాదించింది.

తెలంగాణాలోని సంగీతం విస్తారమయిందేకానీ ప్రచార్భాటాలకు దూరంగా వుంటారు కనుక చాలామంది సంగీతజ్ఞులు అజ్ఞాతంగా వుండిపోయినారు. ఇదే ప్రామాణికం కాదు. ఇంకా ఎందరో విద్వాంసులు మరుగునపడి వుండిపోయినారు. వారందరినీ స్మరించుకుంటే గ్రంథమే అవుతుంది.

తెలంగాణాలోని సంగీతజ్ఞులు ఎందరో మహానుభావులున్నారు. వారందరికీ వందనాలు అర్పిస్తూ ఎవరైనా పరిశోధనకు పూనుకుంటే చాలా విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశమున్నది.

సామల రాజవర్ధన్‌
tsmagazine

Other Updates