యావత్ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రపంచ పటంలో ప్రత్యేకంగా కనపడేలాగా తయారు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ఆచరణలో చూపించిన తర్వాత, అంతటా అమలు జరిగేలా చేద్దామన్న ఉద్దేశంతో, మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాలను స్వయంపాలిత, స్వయం సమృద్ధి, స్వయం ఆధారిత గ్రామాలుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం. ఈ విషయాలనే రెండు గ్రామాల ప్రజలకు సవివరంగా అర్థమయ్యేలా ముఖ్యమంత్రి తెలియచెప్పారు.
జూన్ 10న రెండు గ్రామాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఇతర అభివృద్ధి పనులను, స్వయంగా పరిశీలించారు. ఆయా పనులను పరిశీలించడంతో పాటు తాను రూపొందించిన, ఏ ఒక్క కుటుంబం పనిలేకుండా ఉండకూడదు అనే ప్రణాళికలో భాగంగా నిరుపేదలైన 42 మందికి 3.36 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 42 ట్రాక్టర్లను అందజేశారు. అలాగే ఎంపిక చేసిన 20 మందిని డ్రిప్ ఇరిగేషన్ పంప్‌హౌజ్ ఆపరేటర్లుగాను, మరో ఇద్దరిని ఎరువుల గోదాం ఇన్‌చార్జీలుగా నియమించారు. లబ్దిదారులకు ట్రాక్టర్ల తాళాలను అందించిన ముఖ్యమంత్రి, ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేసి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రసంగించారు.
సంఘటిత శక్తి చాలా గొప్పది
సంఘటిత శక్తి చాలా గొప్పది, ఆ శక్తితో కొండనైనా బద్దలు కొట్టవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ”నేను దత్తత తీసుకున్న గ్రామ ప్రజలుగా ఈ శక్తిని మీరందరు చాటిచెప్పి దేశానికే మార్గదర్శకులుగా మారబోతున్నారు. నాలాంటి వారు వచ్చినపుడు ప్రత్యేక రక్షణగా వెంట పోలీసులు ఉంటారు. దీన్ని గన్ ఫెన్సింగ్ అంటరు. దీనికన్న బలమై నది సోషల్ ఫెన్సింగ్. ఇది మిలటరీ కంటే పవర్‌ఫుల్. ఎందుకంటే ఇందులో ఒకరికి ఒకరు ఆసరాగా వుంటరు. ఇది ఎంతో ధైర్యాన్ని, బలాన్ని, మాకు ఏమీ కాదనే భరోసాను ఇస్తుంది. మన ఊరిని మనమే బతికించుకోవాలి. ఊళ్ళో ఏ ఒక్క కుటుంబం కూడా పనిలే కుండా వుండొద్దు. గ్రామాల్లో ఏ పని జరిగినా అది అందరికీ తెలియాలి. ఒకవేళ ఆ పని గురించి అర్థం కాకపోతే యింకొకరిని అడిగి తెలుసుకోవాలి” అని సిఎం వివరించారు.
”వరంగల్ జిల్లా గంగదేవిపల్లి మాదిరిగా, గ్రామాలను ఆదర్శవంతంగా వుండేటట్లు మలచుకోవాలి. హైదరాబాద్‌లో వుండే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్ళు కట్టుకుందామని అనుకోవాలి. ఈ శ్రావణమాసం తర్వాత అట్ల జరుగుతది” అని పేర్కొన్నారు. ఊళ్ళో వున్నవాళ్ళెవరు కూడా పనిలేకపోవడం కారణంగా ఉపవాసం ఉండొద్దు. స్వయం ఉపాధికోసం చెప్పుల దుకాణం, హెయిర్ కటింగ్ సెలూన్, బట్టల దుకాణం, హోటళ్లను పెట్టిస్తం. ఈ కాణ్ణుంచి అందరూ మన ఊళ్ళెవున్న దుకాణాలల్లనే బట్టలు, చెప్పులు కొనాలె, ఇక్కణ్ణే కటింగ్ చేయించుకోవాలె, అట్ల అని అందరు ప్రమాణం చేసుకోవాలి. కూరగాయలు కూడా మన మార్కెట్ యార్డ్‌లనే అమ్ముకునేటట్టు చూసుకోవాలి. ఇక ముందు పంటలకు కావల్సిన ఎరువులు ఇక్కడికే వస్తాయి. వాటిని గోదాముల్లో వుంచుకుని తక్కువ ధరకే అందరికీ అందేటట్లు చూసుకుందాం. చిల్లర పంచాయితీలు బంద్ చేసుకోవాలె, మనసులల్ల నుంచి కోపాలు తీసేసుకోవాలె, గ్రామా లల్ల వున్న అక్క చెల్లెళ్ళు కొట్లాటలు, జగడాలు జరుగనీయకుండ చూసుకోవాలె” అని ముఖ్యమంత్రి కెసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
వ్యవసాయానుబంధ ఆదాయం
”ఇంట్లో వుండే ఆడవాళ్లుకూడా ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్రతి ఇంటికి రెండు పాడి బర్రెలు, 10 కోళ్లు అందిస్తం. సాదగలిగే వాటిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వీటిని వచ్చే శ్రావణమాసంలో డబుల్ బెడ్‌రూం గృహప్రవేశాల సందర్భంగా, అదే రోజు దేశవాళి కోళ్ళు, బర్రెలను అందించే ఏర్పాట్లు జరుగుతున్నయి. ఇవన్నీ కూడా ప్రభుత్వమే కొని ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో ఇంట్లో వుండే ఆడవాళ్ళు కూడా కోడిగుడ్లు, కోళ్ళు, పాలు అమ్ముకుని సంపాదించుకోవచ్చు. దీన్నే వ్యవసాయా నుబంధ ఆదాయం అంటారు. ప్రతి మనిషి ఏదైనా పని చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నం” అని ముఖ్యమంత్రి గ్రామస్తులకు వివరించారు.
ప్రతి ఇంటికి ఇంటర్నెట్
”మన రెండు గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం రాబోతున్నది. రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు నా సూచనల మేరకు ఈ గ్రామాల్లో తిరిగి సర్వే చేసిపోయిండ్రు. రెండు గ్రామాల్లో అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి వాళ్ళు ఒప్పుకున్నరు. అది జరిగిన తర్వాత ఈ గ్రామాల ప్రజలందరూ ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్ ద్వారా అమెరికాలో వున్న వాళ్లతో మాట్లాడుకోవచ్చు” అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ గ్రామాలకు నర్సరీల నుండి మొక్కలు తెప్పిస్తున్నం. ప్రతి ఇంట్లో నిమ్మ, కొబ్బరి, కరివేపాకు చెట్లు పెట్టుకోవాలి, అట్లాగే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను వివిధ జోన్లుగా విభజించి వాటికి ప్రత్యేక రంగులు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు గ్రామాలు కూడా సింగపూర్ మాదిరిగా మారిపోవాలని కేసిఆర్ అన్నారు. ”నా జాతకంలో ఒకటున్నది నేను ఏపని చేయాలనుకున్నా ఇప్పటి వరకు ఓడిపోలేదు. నేను జరగాలనుకున్నవన్నీ ఇప్పటివరకు జరిగాయి. అందుకే నా జాతకం ప్రకారం ఎర్రవల్లి, నర్సన్నపేటలు అద్భుతంగా తయారవుతాయి” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జేసీ వెంకట్రామిరెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, ఆగ్రానమిస్ట్ ప్రవీణ్ రావు, గ్రామ వీడీసి ఛైర్మన్ కృష్ణారెడ్డి, పంబరి రాంచంద్రం, సర్పంచ్‌లు భాగ్యబాల్‌రాజు, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.