కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

సంఘర్షణ.. ఒక విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంఘర్షణ. కుటుంబంలో ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు సంఘర్షణ. అమ్మానాన్నదొకమాట, పిల్లలదొకమాట అయినప్పుడు సంఘర్షణ. పిల్లల మాట పెద్దలు మన్నించనప్పుడు సంఘర్షణ.. పాత అకడమిక్‌ ఇయర్‌ పూర్తయింది. కొత్త విద్యాసంవత్సరంలో ఏ కోర్సులు చేయాలి? ఏ కాలేజీలో జాయిన్‌ కావాలి ఇలా ఎన్నో సంఘర్షణలు. ఇలాంటి సందర్భంలో సంఘర్షణలు ఎన్ని రకాలో.. దేనినెలా నివారించవచ్చో ప్రముఖ క్లినికల్‌ సైకాలజిస్ట్‌ల విశ్లేషణ తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం..

ప్రభాకర్‌ తాను డిగ్రీ చదవాలో లేక ఇంజినీరింగ్‌ చెయ్యాలో నిర్ణయించుకోలేక పోతున్నాడు. అతనికి ఈ రెండింటిపైన అంతే మక్కువ. డిగ్రీ ఎంచుకుంటే అయ్యో! ఇంజినీరింగ్‌కు దూరమైపోతున్నానే అని అతని బాధ. ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటే, డిగ్రీ వదులుకోవలసి వస్తుంది. అందుకే ఏదీ నిర్ణయించుకోలేక పోతున్నాడు. త్రినాథ్‌ వాళ్ళ నాన్న అతన్ని ఎం.కామ్‌. లేదా ఎంబీఏ చెయ్యమంటాడు. మధుకు మాత్రం సి.ఏ. చెయ్యాలన్న తపన. వాళ్ళనాన్న ఎంత మాత్రం తన పట్టు విడువడం లేదు. అతనికి ఇష్టంలేని ఈ రెంటిలో ఏదో ఒకటి చదవమంటాడు. మధు మనస్సులో బాధ. కానీ తండ్రిని ఎదిరించలేడు.

సంఘర్షణ-మానసిక స్థితి

– విద్యార్థి తాను ఏర్పరుచుకున్న గమ్యం స్పష్టంగా, ఇష్టంగా ఉండి, పరిస్థితులు కూడా తనకు సహకరిస్తే చిక్కే లేదు.కానీ ఈ స్పష్టత లోపించినా, లేదా తనకు ఇష్టంలేని లక్ష్యాన్ని కుటుంబం వాళ్ళపైన రుద్దినా, విద్యార్థికి ఏమి చెయ్యాలో తెలియక కంగారు పడతాడు . తనకు ఎంత మాత్రం ఇష్టంలేని స్నాక్స్‌ను అతనికి తినమని ఇస్తే దాన్ని నములుతూ, మింగలేక, కక్కలేక ఇరకాటంలో పడినట్టు బాధపడతాడు. ఈ సంఘర్షణ వలన చికాకు, వ్యాకులత, ఏం చేయాలో తోచని అయోమయస్థితి, ఏమీ చేయలేని నిస్సహాయతను విద్యార్థి అనుభవిస్తాడు. ఈ సంఘర్షణ సాల్వ్‌ చేసేవరకు అతని మానసిక స్థితి ఇదే విధంగా కొనసాగుతుంది.

ఈ సంఘర్షణలను మొదట్లో కుర్ట్‌ లెవిన్‌ అనే సైకాలజిస్ట్‌ వివరించాడు. ఆ తర్వాత నెయిల్‌ మిల్లర్‌ అనే సైకాలజిస్ట్‌, వీటిపైన విస్తృతంగా పరిశోధనల్ని జరిపాడు. ఇతని పరిశోధనలు సంఘర్షణల్ని మూడు రకాలుగా విభజించాయి.

1. అప్రోచ్‌-అప్రోచ్‌ కాన్‌ప్లిక్టు: ఈ సంఘర్షణలో వ్యక్తికి రెండు గమ్యాలుంటాయి. ఆ రెండూ అతనికి ఇష్టమే. మొదట్లో వివరించిన ప్రభాకర్‌ సమస్య ఇదే కోవకు చెందినది. ఇతనికి డిగ్రీ, ఇంజినీరింగ్‌ రెండూ ఇష్టం. ఒక గోల్‌ను ఎంచుకుంటే రెండవ గోల్‌కు తిలోదకాలు ఇవ్వాల్సిందే. అందుకే రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోవడంలో నానా తంటాలు పడతాడు.

2. అవాయిడెన్స్‌-అవాయిడెన్స్‌ : ఈ సంఘర్షణలో కూడా రెండు గోల్స్‌ ఉంటాయి. కానీ ఈ రెంటిలో అతనికి ఏదీ ఇష్టముండదు. తనకు ఇష్టం లేకున్నా రెంటిలో ఒకటి ఎంచుకోవాలి. మొదట్లో మనం చర్చించుకున్న మధు సమస్య ఇదే. వాళ్ళ నాన్న అతన్ని ఎం.కామ్‌ లేదా ఎంబీఏ చెయ్యమంటాడు. ఈ రెండింటిలో అతనికి ఏదీ ఇష్టం ఉన్న బ్రాంచ్‌ కాదు.

3. అప్రోచ్‌-అవాయిడెన్స్‌:

ఈ సంఘర్షణలో విద్యార్థికి ఒకటే గమ్యం

ఉంటుంది. ఆ గమ్యం అతన్ని ఆకర్షిస్తుంది, కానీ అదే అతన్ని భయపెడుతుంది కూడా. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఇంజినీరింగ్‌ చదవాలనే మక్కువ ఎక్కువ. రోగులను ట్రీట్‌ చేయాలనే తపన. కానీ ఇంజినీరింగ్‌ చెయ్యాలంటే చాలా కష్టపడి చదవాలి. పైగా 4 ఏండ్లు చదవాలి కూడా. ఇంజినీరింగ్‌ సరిపోదు. ఆ తర్వాత ఎంటెక్‌/ఎంఎస్‌ కూడా చెయ్యాలి. అమ్మో! ఇన్ని ఏళ్ళు నేను చదవగలనా అన్న అనుమానం విద్యార్థి మనసులో మెదులుతుంది. నైల్‌ మిల్లర్‌ అభిప్రాయం ప్రకారం ఇలాంటి సంఘర్షణలో విద్యార్థి నెగటివ్‌ పాయింట్స్‌కు తక్కువ. పాజిటివ్‌ పాయింట్స్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడు దీన్ని సులువుగా సాల్వ్‌ చెయ్యగలుగుతాడు అని అంటాడు.

ప్రతి విద్యార్థికి ఎన్నో రకాల సంఘర్షణలుంటాయి. సమస్యలు లేని వ్యక్తులే ఉండరు. ఉదాహరణకు ఏ కాలేజ్‌లో చేరాలి? ఏ కోర్స్‌ చెయ్యాలి? చదువు ముగించాక ఇండియాలో ఉండాలా? అమెరికా వెళ్ళాలా? ఇలా సాగుతాయి వాళ్ళ ఆలోచనలు, ఇలా మొదలౌతాయి వాళ్ళ సంఘర్షణలు. ఈ సంఘర్షణలను రిసాల్వ్‌ చెయ్యడంలో కొందరు విద్యార్థులు అపసవ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి నిర్ణయాలు వాళ్ళ ఎదుగుదలకు, సర్దుబాటుకు అడ్డంకులుగా మారుతాయి. ఇర్వింగ్‌ జనీస్‌, లియోన్‌మాన్‌ అనే సైకాలజిస్ట్‌లు సంఘర్షణల పరిష్కారానికి సాధారణంగా విద్యార్థులు తీసుకునే కొన్ని అపసవ్యమైన నిర్ణయాలపై పరిశోధనలు జరిపారు. వాటిలోంచి కొని ముఖ్యమైన వాటిని గమనిద్దాం.

సంఘర్షణల నివారణ-అపసవ్య ప్రవర్తనలు

ఢిఫెన్సివ్‌ అవాయిడెన్స్‌: సాధారణంగా చాలామంది విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు ఉపయోగించే పద్ధతి ఇదే. ఈ పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకోకుండా నిర్లిప్తంగా ఉండడం, సమస్యను పోస్ట్‌ పోన్‌ చెయ్యడం, ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత ఇంకెవరికో వదిలేయ్యడం, ఇది నా ఒక్కడి సమస్యకాదు, దీన్ని ఎవరూ సాల్వ్‌ చెయ్యలేరు అనే ఆలోచనలతో తనను తాను సమర్ధించుకోవడం చేస్తూ, సంఘర్షణను రిసాల్వ్‌ చేయకుండా ఒదిలేస్తారు.

హైపర్‌ విజిలెన్స్‌: సంఘర్షణ ఎదురైతేనే కొందరు కంగారు పడిపోతారు. ఏదో ఒక విధంగా, అతి త్వరగా ఈ సమస్య నుంచి బయట పడాలనే తాపత్రయంతో, ఏమీ ఆలోచించకుండా, గుడ్డిగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం సరైనదా, కాదా అని ఆలోచించే ఓపిక వీళ్ళకుండదు.

అన్‌కాన్‌ఫ్లిక్టెడ్‌ అడహరెన్స్‌: సామాన్యంగా ఒక సమస్యను రిసాల్వ్‌ చెయ్యడానికి మనం కొన్ని విషయాలను మనల్ని నమ్మకుమున్న వాళ్ళను అడిగి తెలుసుకుంటాం. పెద్దల సలహా తీసుకుంటాం. కానీ ఈ కోవకు చెందినవాళ్ళు, ఎవరినీ కన్సల్ట్‌ చెయ్యకుండా, తాను ఇంతక్రితం ఏమీ చేస్తున్నాడో అదే పని మళ్లీ, మళ్లీ చేస్తూ పోతాడు. ఫలితాలు నెగటివ్‌గా ఉన్నా పెద్దగా పట్టించుకోడు.

అన్‌ కాన్‌ఫ్లిక్టెడ్‌ ఛేంజ్‌: ఈ కోవకు చెందిన వ్యక్తులకు ఎవరైనా ఒక సలహా ఇస్తే, ఇది సరైన సలహానా కాదా దీని వలన ఉపయోగాముందా, లేదా అని ఆలోచించరు. తన సొంత తెలివితేటలను, విచక్షణను ఉపయోగించకుండా ఇతరులు చెప్పిన సలహాను తూ.చా. తప్పకుండా పాటిస్తారు. సాధారణంగా ఇలాంటి అపసవ్య పద్ధతులవల్ల సమస్య మరింత జఠిలంగా మారుతుంది.

సమస్య పరిష్కారానికి సరైన పద్ధతిః  సంఘర్షణలను పరిష్కరించడానికి కాగ్నిటివ్‌ సైకాలజీ ఒక సింపుల్‌ పద్ధతిని సూచించింది. ఈ ప్రయత్నంలో విద్యార్థి ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకోగల పెద్ద వాళ్లతో చర్చించి అవగాహన చేసుకుంటాడు. ఆ తర్వాత మొదటి గమ్యంలోని పాజిటివ్‌, నెగెటివ్‌ పాయింట్స్‌ను నోట్‌ చేస్తాడు. అదే విధంగా రెండవ గమ్యం లోంచి కూడా పాజిటివ్‌, నెగెటివ్‌ పాయింట్స్‌ను నోట్‌ చేసి, పాజిటివ్‌ నుంచి నెగటివ్‌ మైనస్‌ చేస్తాడు. ఈ రెండింట్లో దేనికి ఎక్కువ పాజిటివ్‌ పాయింట్స్‌ ఉన్నాయో దాన్ని ఎంచుకుంటాడు. ఈ పద్ధతినే బ్యాలెన్స్‌ షీట్‌ మెథడ్‌ అని అంటారు. ఈ సంఘర్షణ కాస్త తీవ్రంగా ఉంటే కౌన్సిలింగ్‌, కాగ్నిటివ్‌ థెరపీ, సైకోడ్రామా లాంటి పద్ధతులు అవసరమౌతాయి. అప్పుడు విద్యార్థి ఒక క్లినికల్‌ సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. సంఘర్షణ మనసును చికాకు పరచడమే కాకుండా, వ్యాకులత, ఆందోళన కలిగించి, విద్యార్థి ఏకాగ్రతను భంగపరుస్తుంది. మనశ్శాంతిని హరిస్తుంది. అందుకే విద్యార్థులు దీన్ని సత్వరమే పరిష్కరించుకోవాలి.

Other Updates